Menu Close
balyam_main

పంచతంత్రం కథలు

- దినవహి సత్యవతి

నక్క సమయస్ఫూర్తి

Panchatantram

ఒకనాడు ఒక నక్క ఆకలితో ఆహారం కోసం వెతుకుతూ అడవిలో వెళుతుండగా దానికి చచ్చిపోయి పడిఉన్న ఒక ఏనుగు కళేబరం కనిపించింది.

‘అమ్మయ్య’ అనుకుని దాని మాంసం తిని తన ఆకలి తీర్చుకోవాలని చచ్చిన ఏనుగు శరీరాన్ని తన గోళ్లతో చీల్చడానికి ప్రయత్నించింది. కానీ ఎంతో మందంగా ఉండే ఏనుగు చర్మం చీల్చడం ఒకంతట నక్కకి సాధ్యపడలేదు.

ఒకవైపు ఆకలితో కడుపు నకనకలాడుతోంది, మరో వైపు ఎదురుగా ఆహారం ఉన్ననూ తినలేని పరిస్థితి. ఏం చేయలో తోచకదిక్కులు చూస్తున్న నక్కకి ఆ దారి వెంట వస్తున్న ఒక సింహం కనిపించింది.

సింహం దగ్గరకు రాగానే నక్క వినయపూర్వకంగా వంగి ‘ఓ సింహరాజమా! ఇటువైపు వెళుతుండగా కనిపించిన ఈ మృత ఏనుగు శరీరాన్ని ఎవరూ తినకుండా కాపలా కాస్తూ మీకోసమే ఎదురుచూస్తున్నాను’ అంది.

నక్క మాటలకి ‘చాలా సంతోషం కానీ నేను స్వయంగా వేటాడిన జంతువుని తప్ప వేరే జంతువు వేటాడి చంపిన దానిని ఆహారంగా తీసుకోను కనుక ఈ ఏనుగు మాంసాన్ని నీకే విందుగా వదిలివేస్తున్నాను’ అని సింహం అంది.

‘బాగా చెప్పారు సింహరాజా. నావంటి సేవకుల పట్ల మీ ఆదరణ ఎంతో మెచ్చతగినది’ అన్న నక్క మాటలకి తల ఊపి అక్కడినుండి కదిలి వెళ్ళిపోయింది సింహం.

కొంతసేపటికి అటుగా ఒక చిరుత పులి వచ్చింది.

‘సింహం కొన్ని నియమాలు పాటిస్తుంది కనుక దాని వద్ద వినయం ఒలకబోసి ఎలాగో నా ఆహారాన్ని కాపాడుకున్నాను. కానీ, ఈ చిరుత పులికి బొత్తిగా అటువంటివేమీ ఉండవు. దీని బారినుంచి నా అహారాన్ని కాపాడుకోవడమెలా?’ అనుకుంది.

దగ్గరకి వచ్చిన చిరుత పులిని చూసి భుజాలు ఎగురవేసి నక్క కొంచం పొగరుగా ‘అయ్యో! చిరుత మామా! ఏమిటి ఇలా మృత్యుముఖంలోకి వచ్చావు సరాసరి? ఈ ఏనుగును ఇప్పుడే సింహం చంపి స్నానం చేసి శుభ్రమై వచ్చి తిందామని వెళ్ళింది. నన్ను దీనికి కాపలా పెట్టి వెళుతూ జాగ్రత్త దీనిని తినడానికి ఒకవేళ చిరుతపులిగానీ వస్తుందేమో గమనించి నాకు చెప్పు. ఇదివరలో ఒకసారి నేను చంపిన జంతువుని తాను తిందామని చూసింది చిరుత. అప్పటినుండీ నాకు చిరుతల పైన చాలా కోపంగా ఉంది. ఈ అడవిలోని చిరుత లన్నిటినీ సమూలంగా నాశనం చేసేయాలని ప్రతిజ్ఞ పట్టాను అప్పుడే అని హెచ్చరించి వెళ్ళింది’

నక్క మాటలకి భయపడిన చిరుత ‘అల్లుడూ నా ప్రాణాలు కాపాడు. దయచేసి నేను ఇక్కడికి వచ్చిన విషయం మాత్రం ఆ సింహానికి చెప్పకేం’ అని ఒకే పరుగులో అడవిలోకి మాయమైంది.

చిరుత వెళ్లిన కొంతసేపటికి ఆ ప్రదేశానికి ఒక పెద్ద పులి వచ్చింది.

‘ఈ పులికి పెద్దకోరల్లాంటి పళ్ళు ఉన్నాయి. దీని చేత ఈ ఏనుగు చర్మాన్ని చీల్పిస్తాను’ అనుకుని ‘ఓ పులి మిత్రమా చాలా కాలానికి కనిపించావే? అదేమిటీ అలా ఉన్నావు? నిన్ను చూస్తే ఎన్నాళ్ళనుంచో ఆహారం తిననట్లున్నావు? రా ఇక్కడికి. ఇదిగో ఈ ఏనుగు శరీరాన్ని విందుగా ఆరగించు. ఒక సింహం దీనిని చంపి నన్ను కాపలాగా పెట్టి వెళ్ళింది. అది వచ్చేలోగా నువ్వు గబగబా నీకు కావల్సినంత తిని వెళ్ళిపో’

‘అమ్మో అలాగయితే నాకీ ఆహారం వద్దే వద్దు. సింహం నన్ను చూసిందంటే చంపేస్తుంది’ అంది పులి భయంగా.

‘మరీ పిరికిదానిలా మాట్లాడకు. నేను చూస్తుంటాను. భయపడకుండా నీక్కావలసినంత తిను. సింహం అంత దూరంలో కనపడగానే నిన్ను హెచ్చరిస్తానులే. అప్పుడు వెళిపోదువుగాని సరేనా?’

నక్క జిత్తులమారి మాటలకి మోసపోయిన పెద్ద పులి ఏనుగు శరీరాన్ని తన గోళ్ళతో చీల్చి కొంచెం తిన్నదోలేదో అంతలోనే ‘అదుగో సింహం వచ్చేస్తోంది. పరిగెత్తి పారిపో... పారిపో’ అని అరిచింది నక్క.

అంతే. తింటున్నదల్లా వదిలిపెట్టి కాళ్ళకి బుధ్ధి చెప్పి అక్కడనుంచి పారిపోయింది పులి.

అలా సమయస్ఫూర్తితో అన్ని జంతువులనూ బోల్తాకొట్టించి తన పని జరిపించుకుని ఆ రోజు, ఆ తరువాత చాలా రోజులవరకూ కూడ ఆ ఏనుగు మాంసాన్ని తిని తన ఆకలి తీర్చుకుంది నక్క .

నీతి: సమయస్ఫూర్తితో ఎటువంటి సమస్య ఎదురైనా సులభంగా  అధిగమించవచ్చును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *