Menu Close
నాదీ ఆడజన్మే...
-- డా. శ్రీసత్య గౌతమి --

అది శానిఫ్రాన్సిస్కో లో యు.సి.ఎస్.ఎఫ్ మెడికల్ సెంటర్. హాస్పిటల్ బెడ్ మీదున్న కార్లా అప్పుడే చిన్నగా కదులుతోంది. అది గమనించి నర్సు కార్లాను సమీపించి ఆమె పల్స్ ను పరీక్షించింది. తృప్తిగా తల పంకించింది.

కార్లా మెల్లగా కళ్ళు విప్పి చూసింది నర్సు ఎలెన్ ని. ఎలెన్, కార్లాను సావధాన పడమని కళ్ళతోనే సౌంజ్ఞ చేసింది. ఎలెన్ డాక్టర్ ఆఫీసుకి ఇంటర్నల్ ఫోన్ చేసింది. డా. మాధవీలత కార్లాను చూడడానికి లోపలికి ప్రవేశించిది.

మాధవిని చూడగానే కార్లా ధు:ఖాన్ని ఆపుకోలేక ముక్కుపుటాలు ఎరుపెక్కి ఎగిసిపడుతుంటే కళ్ళనుండి కన్నీటిని జల జలా రాల్చింది. మాధవి మనసు విలవిల్లాడింది.

"కార్లా...ఆత్మహత్య మహాపాపమని బైబిల్ లో కూడా వుంది. ఇది రెండవసారి నువ్విలా చెయ్యడం. సమస్యను పరిష్కరించుకోవాలే తప్ప, దానికి తలవంచి దేవుడిచ్చిన ప్రాణాన్ని తీసేసుకోవడం నిన్ను నువ్వే కాదు, ఆ దేవుడ్ని కూడా అవమానించినట్టే. నీ హార్మోన్సు సమతుల్యంగా లేవు. నీ సైకాలజీ మారాలి. జీవితం మీద ప్రేమను పెంచుకో, భావోద్వేగాల వెంటపడకు. కొన్నాళ్ళపాటు నువ్వు నా పర్యవేక్షణలోవుండాలి. అలాగేవుంటానని మాటిచ్చావు, ఈ దుస్థితిలో హాస్పిటల్ కి వచ్చావు. ఈసారి నిన్ను కాపాడుకోవడము మాకెంత కష్టమయ్యిందో తెలుసా?" మాధవి మృదువుగా మందలించింది.

"సారీ డాక్టర్, మీమాట పూర్తిగా విననందుకు" అంటూ కార్లా మెల్లగా మాధవి చెయ్యి పట్టుకొన్నది.

ఆ చేతి స్పర్శ ద్వారా కార్లా ఎంత నీరసంగావుందో మరింత తెలిసింది మాధవికి.

"ఓకే...నీ మనసుకు విశ్రాంతి అవసరం కార్లా. మేమెంతమంది ఎన్ని చెప్పినా ఇది నీకు నువ్వు సాధన చేసుకోవాలి. మా సహాయం నీకెప్పుడూ వుంటుంది. మరికొంతసేపు నిద్రపో, నీకు ఓపికుంటే సాయంత్రం మాట్లాడుదాము, లేకుంటే రేపు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మాట్లాడుతాను" అంటూ,

"ఎలెన్..." మాధవి పిలిచింది. వీరి మాటలు వింటున్న ఎలెన్ తర్వాత తానేం చెయ్యాలో తెల్సన్నట్లుగా కార్లాకు చిన్న ఇంజెక్షన్ ఇచ్చింది. కార్లా ప్రశాంతంగా నిద్రలోకి జారిపోయింది.

*********** *********** ***********

నర్సింగ్ స్టేషన్ దగ్గిర డిశ్చార్జు పేపర్సు అన్నిటి మీదా సంతకాలు చేసి, అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక, రిసీట్లు తీసుకొని వాటిని మడిచి పర్సులో పెట్టుకొంది కార్లా. పూర్తిగా కోలుకున్న కార్లా డా. మాధవీలత ఆఫీసు వైపుకు నడిచింది.

"కం కార్లా. హౌ ఆర్ యౌ ఫీలింగ్ టుడే?”

కార్లా నవ్వుతూ గడియారంలోని పెండ్యులంలా బుర్రతిప్పుతూ బాగానే వున్నానని తెలియపరిచింది.

“చెప్పు కార్లా, ఎందుకిలా చేసావు? ఆరోజు ఏం జరిగింది? నాతో చెబితే పరిష్కారము దొరుకుతుందేమో?”

"హుం…ఏమని చెప్పను? 15 ఏళ్ళనుండి ఈ సమాజంతో నరకం అనుభవిస్తున్నాను. నన్నెవరూ మనిషిగానే చూడడము లేదు. నేనమ్మాయినో, అబ్బాయినో నాకే తెలియని పరిస్థితి, మన:స్థితి. నా చాయిసెస్ తో నన్ను ఎవరూ బ్రతకనివ్వడంలేదు. నేను చేసే ప్రతి పని మీద స్త్రీ, పురుషులు నిఘా వేస్తున్నారు. నేను కనబడితే పనిగట్టుకొని నన్ను వెంటాడుతున్నారు. వీళ్ళతో నాకు భయమేసి అబ్బాయిలా వుంటున్నాను, కాని నా మనసు అమ్మాయిలా వుండాలనిపిస్తోంది. అమ్మాయినే ప్రేమించాలనిపిస్తుంది. అందుకే నాగురించి తెలిసిన ఏ కొద్దిమందితోనో సన్నిహితంగా వుంటున్నాను. నా శరీరధారుడ్యం అబ్బాయిని తలపిస్తుంది. సమాజానికి భయపడి అబ్బాయిలా తయారయ్యాను. అబ్బాయిలానే అన్ని పనులూ చేసుకుంటున్నాను. ఎవరికీ నేను సమస్యగా మిగలలేదు. ఇంట్లోవాళ్ళు నా ద్వంద్వ పరిస్థితిని అర్ధం చేసుకోలేదు సరికదా అసహ్యాన్ని నింపుకొని నన్ను దూరంగా నెట్టి వేసారు. బయట సమాజంలో నా ద్వంద్వ స్థితికి బొత్తిగా భద్రత లేకపోయింది. జెంట్సు టాయిలెట్లకు వెళ్ళలేక ఆడపిల్లబట్టలు ధరించి లేడీసు టాయిలెట్ కి వెళ్ళితే, ఆడపిల్లలు నన్ను బెదరగొడుతున్నారు. నావల్ల ఏ సమస్యారాదని చెప్పినా వారు నమ్మడము లేదు. మొన్నమాల్ లో నన్ను అవమానించి బయటకు గెంటేశారు. బయటవుండి ఇది గమనిస్తున్న కొద్దిమంది మగవారు నా వద్దకు వచ్చి వాళ్ళతో నన్ను రమ్మని, కారెక్కమని, వాళ్ళు చెప్పిన మాట వింటే కారు, బంగ్లా, డబ్బు ఇప్పిస్తామని మామూలు ఆడవాళ్ళకన్నా నాలాంటివాళ్ళను కోరుకునేవాళ్ళే ఎక్కువ అని, చాలా బాధించారు. నాపై చాలా అసభ్యమైన పలుకులు పలుకుతూ వాళ్ళలో వాళ్ళు ఎంజాయి చేస్తున్నారు. కానీ కాస్తో కూస్తో నాలో కూడా వున్న పురుష అహం నన్ను వూరుకోనీయలేదు. గొడవలకు దిగాను. వాళ్ళింకా నన్ను అసభ్యంగా మాట్లాడుతూ నా పెడరెక్కలు విరిచి బాత్ రూం లోకి తీసుకువెళ్ళి ..." అంటూ కార్లా ఏడ్చేసింది.

"కార్లా, పురుషునిలా శరీరధారుడ్యాన్ని కలిగివున్నందున శక్తివంతమైన పన్లు చేస్తున్నావు. పెద్ద పెద్ద యంత్రాలతో పని చేస్తూ బరువులుకూడా మొయ్యగలుగుతున్నావు. ఆడపిల్లలు చెయ్యలేని ఉద్యోగాలన్నీ నీకే. ఇది నీకు పాజిటివ్ పాయింటు" అన్నది మాధవి.

దానికి చిన్నగా నవ్వింది కార్లా.

"ఈ ద్వంద్వ ఆలోచనలవల్ల రెండు రకాలైన పనులు చేస్తూ సమాజాన్ని నువ్వే కన్ ఫ్యూజ్ చేస్తున్నావు కార్లా. నీ ఆలోచనారీతిని మార్చుకో. నీ యింట్లోవాళ్ళని నీ పనులద్వారా ఆకట్టుకొని దగ్గిరవ్వాలనుకుంటున్నావు. పర్యవసానంగా సమాజ ధోరణులకు గురవ్వుతున్నావు. ఈ ద్వంద్వపు ఆలోచనను మార్చిచూడు. నిన్ను నువ్వు క్రొత్తగా, దైర్యంగా ఆవిష్కరించుకొని చూడు” అని మాధవి దైర్యాన్ని నూరిపోసింది.

“ఇప్పుడిపుడే అర్ధమవుతోంది డాక్టర్ … నా చిన్నతనమంతా ఆడపిల్లగానే గడిచింది. ఆడపిల్ల దుస్తులు, ఆడపిల్ల ఆటలు. నా దోస్తులు కూడా ఆడపిల్లలే. నా గుర్తింపంతా ఆడపిల్లగానే. అందరూ గౌరవించారు, ముద్దాడారు. ఇంట్లో వాళ్ళందరికీ కనులపంటనయ్యాను. నాకు పదేళ్ళనుండే ఏదో తేడా నాలో నాకే కనిపించింది. దాన్ని దాచే మార్గం తెలియక నేను అమ్మాయినా లేక అబ్బాయినా అని ఇంట్లో అన్నయ్యలా మగపిల్లాడి పనులు చేశాను, నన్ను ఆడంగి అన్నారు. పోనీ ఆడపిల్లల్లా వాళ్ళ పన్లూ నేర్చుకున్నాను. ధృఢంగా శరీరం పెరుగుతుండడంతో మళ్ళీ నన్ను ఆడంగి అన్నారు. ఇంట్లో నాకు కాస్త ప్రాధాన్యతనివ్వడం తగ్గించారు. నన్ను పదిమందిలో ఎక్కువగా తిరగొద్దని వారించారు. మా సిస్టర్ కన్నా నన్ను అపురూపంగా చూశారు, సమాజము నుండి ఎక్కువ ప్రమాదము నాకేవుందని. కాలక్రమేణా లెస్బియన్ గా ఆడపిల్లలతోనే సంపర్కమేర్పరచుకున్నాను. దాంతో ఇంట్లోవాళ్ళు నన్నుఆడపిల్లలతో తిరగనివ్వలేదు. హార్మోన్ ట్రీట్మెంటు ఇప్పించినా నా సమస్య తీరలేదు. మగపిల్లాడి బట్టలు ధరించి మగపిల్లడిలా ఆలోచించమని నిర్దేశించారు. స్కూల్ రికార్డ్సు నుండీ కాలేజీ చదువంతా పేరు మార్చారు. ఏడ్రియన్ గా పేరు మారింది.

నాలో జరిగే యుద్ధానికి, ఇంటి వాతావరణానికీ సరిపడడంలేదని అప్పుడొకసారి సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించాను. ఇప్పుడా మాల్ లో జరిగిన పరాభవానికి తట్టుకోలేక మళ్ళీ ఆత్మహత్యకు పాల్పడ్డాను" అంటూ ధు:ఖించింది కార్లా.

"కార్లా, నీ సమస్యలోనే పరిష్కారం కూడావుంది. పుడుతూనే ఆడపిల్లలా పుట్టిన నువ్వు, ఆడపిల్లగానే వుండలేవా? మళ్ళీ నీ వాళ్ళ కనులపంట కాలేవా? నువ్వు కన్ ఫ్యూజ్ అయి, సమాజాన్ని కన్ ఫ్యూజ్ చెయ్యడమెందుకు?"

"అంటే? ఈసారి సమాజానికి ఆడపిల్లగా చాయిస్ తీసుకోమంటున్నారా డాక్టర్?"

"నో నో ... ఇది చాయిస్ కాదు. లైఫ్ అండ్ డెత్ సమస్య. ఇది జీవన పోరాటం. ఎవరో నిన్నర్ధంచేసుకోవాలనీ, నీపై మమతానురాగాలను కురిపించాలనీ అర్ధించకు, ఆఖరుకి నీ కుటుంబీకులను కూడా. నీకు జరిగిన అవమానాలు నీకు మాత్రమే జరుగుతున్నది కాదు. స్త్రీ, పురుషులకు కూడా ఏదోక అవమానము ఏదోక లెవెల్ లో జరుగుతూనేవుంటుంది. భోజనము చేసేటప్పుడు అందులో రుచికోసం వేసిన మిరపకాయలు అడ్డొస్తే వాటిని పక్కకు తీసేసి ఎలా భోంచేస్తామో, అలాగే జీవితం కూడా. ఇంత చిన్న సమస్యకు ప్రాణం తీసుకుంటావా?" అని మాధవి కార్లా గెడ్డం పుచ్చుకొని ఆమె తల పైకెత్తి అనునయంగా అడిగింది.

"అంటే.. నేను..." నసుగుతూ చూసింది కార్లా, మాధవి కళ్ళలోకి.

"యెస్...ట్రాన్స్జెండర్గా మారు. పూర్తిగా సెక్సు మార్పిడి చేయించుకో. ఒక ప్రామాణికతను సాధించుకో. జీవితం నీది" అని ధృఢంగా చెప్పి, కార్లా కన్నులలో జ్యోతులు వెలిగించింది ఫిజీషియన్ మాధవి.

ముప్ఫైయేళ్ళ వయసులో సెక్స్ మార్పిడికి పూనుకున్న కార్లా ట్రీట్మెంట్ మొదలయిన ఒక్క నెలరోజులనుండే బాహ్యంగా ఆడపిల్లలా మారడము మెల్ల మెల్లగా మొదలు పెట్టింది.

మాధవి మరియు ఇతర డాక్టర్ల పర్యవేక్షణలో వున్న కార్లా సంవత్సరంపాటు హార్మోనుల సమతుల్యానికి ట్రీట్మెంట్లు కొనసాగించి, సర్జరీ చేయించుకొని క్రొత్తగా ఆడజన్మెత్తింది. లీగల్ గా కార్లాగానే మిగిలి, “నేను స్త్రీని” అని గర్వంగా చెప్పుకొన్నది.

“జీవితమంటే తానుగా జీవించడమే, తాను కాని జీవితాన్ని జీవించడం కాదు, అది దుర్భరం. ఆఫ్ట్రాల్, లైఫ్ ఈజ్ ఫర్ లివింగ్!” అని సంతోషంగా చెప్తుంటుంది కార్లా. ఒకప్పటి తనలా భయపడేవాళ్ళకి ఒక స్ఫూర్తిదాయని అయ్యింది కార్లా.

(సమాప్తం)

Posted in March 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!