Menu Close
balyam_main

పంచతంత్రం కథలు

- దినవహి సత్యవతి

మిత్ర ద్రోహం

Panchatantram

అనగనగా ఒక ద్వీపం. అందులో ఒక గుహలో ఒక పెద్ద పులి నివసించేది. ఆ దగ్గరలోనే ఒక చెట్టుపై ఒక కొంగ కూడా నివసించేది.

ఒకనాడు పులి ఆహారం కోసమై వేటకు వెళ్లగా దానికి బాగా బలంగా ఉన్న పొట్టేలు కనిపించింది. ఆ పొట్టేలుని చంపి తింటున్నప్పుడు పులి గొంతులో ఒక చిన్న ఎముక ఇరుక్కు పోయింది. ఎంత ప్రయత్నించినా ఆ ఎముకని బయటకు తీయడం పులికి సాధ్యం కాలేదు.

‘ఈ ఎముక ఇరుక్కుని లోపల చాలా నెప్పిగా ఉంది. అది లోపల ఉండిపోతే నేను మరి ఆహారం తినలేనే! ఇప్పుడు నేనేం చేయాలి?’ అని ఆలోచిస్తున్న పులికి ఎదురుగా వస్తున్న కొంగ కనిపించింది.

‘కొంగ బావా! కొంగ బావా!’

పులి జాలి పిలుపు విని ‘ఏమైంది పులి బావా? నిన్ను చూస్తుంటే  ఏదో బాధలో ఉన్నట్లు అనిపిస్తోంది?’ అడిగింది కొంగ.

‘ఏం చెప్పమంటావు కొంగ బావా నా కష్టం? నేను ఈ పొట్టేలు మాంసాన్ని తింటూంటే గొంతులో ఎముక ముక్క ఇరుక్కుపోయింది. బయటకి తీద్దామని శత విధాలా ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు.’

‘అయ్యో అలాగా పాపం!’

‘నువ్వు నాకొక సహాయం చెయ్యగలవా?’

‘ఏంటో చెప్పు.’

‘నీకు పొడవైన ముక్కు ఉంది కదా. దానితో నా గొంతులో ఇరుక్కున్న ఎముకని  తీసెయ్యవా?’

కొంగ అనుమానంగా చూసింది.

‘భయపడకు నేను నిన్నేమి చేయనులే. నన్ను నమ్ము’ దీనంగా బ్రతిమిలాడింది పులి.

పులి బాధ చూసి జాలి కలిగింది  కొంగకి.  పులి నోటిలో తన పొడవాటి  ముక్కు పెట్టి ఎముకను బయటకు లాగేసింది.

బాధ ఉపశమించడంతో కొంగ చేసిన సహాయానికి ఎంతో సంతోషించి  ధన్యవాదాలు తెలిపింది పులి.

ఆనాటినుండీ పులీ, కొంగా మంచి స్నేహితులయ్యాయి.

కొంత కాలం గడిచింది.

ఒకనాడు ద్వీపమంతా తిరిగినా ఎక్కడా ఆహారం దొరకకపోవడంతో ఆకలి బాధ తట్టుకోలేక పులికి నీరసం వచ్చేసింది.

‘వెంటనే ఏదైనా తినకపోతే శోష వచ్చి పడిపోయేలా ఉన్నాను. ఇప్పుడేది దారి?’  అని ఆలోచిస్తున్న పులికి కొంగ జ్ఞాపకం వచ్చింది.

‘అవును అలా చేస్తాను. ఆ కొంగని చంపి తిని నా ఆకలి తీర్చుకుంటాను. కానీ నమ్మిన స్నేహితుడిని చంపడం పాపం కదా! ఆ!! ఏం ఫరవాలేదు. అయినా ముందు నా సంగతి నేను చూసుకోవాలి కదా. ప్రాణాపాయ స్థితిలో ధర్మాధర్మాలు చూడరాదని అంటారు. ఇప్పుడు నాకు వేరే గత్యంతరం కూడా లేదు’ అనుకుని కొంగ నివసించే చెట్టు క్రిందకి వెళ్ళి చెట్టుపైనున్న కొంగకు వినపడేలాగా బాధపడుతున్నట్లుగా పెద్దగా మూలగడం మొదలు పెట్టింది.

చెట్టు పైనుండి పులి మూలుగు విన్న కొంగ ’అయ్యో మళ్ళీ నా మిత్రుడికి ఏం కష్టం వచ్చిందో?’ అని గబగబ క్రిందికి వద్దకు వచ్చి ‘మళ్ళీ ఏమైంది మిత్రమా?’ ఆందోళనగా అడిగింది.

‘ఏం చెప్పను? నువ్వు చేసిన ఉపకారానికి నీకు ప్రత్యుపకారం చేయక ముందే  మళ్ళీ నిన్ను సహాయం కోరవలసి వస్తోంది.’

‘అసలేం జరిగిందో చెప్పు మిత్రమా’

‘మునుపటిలాగానే ఆహారం తింటుండగా మళ్ళీ గొంతులో ఎముక గుచ్చుకుని మహా బాధ పెడుతోందంటే నమ్ము. కొంచం నీ ముక్కుతో దానిని తీసేయవా?’ దీనంగా ముఖం పెట్టి అడిగింది.

మిత్రుడి కపట ఆలోచన తెలియని అమాయకపు కొంగ ఎముక తీయడానికి పులి నోట్లో తల పెట్టగానే చటుక్కున మెడ కొరికి చంపి, దానిని తిని తన ఆకలి తీర్చుకుంది పులి.

నీతి: దుర్మార్గులు మిత్రద్రోహం చెయ్యడానికి కూడ వెనుకాడరు. అందుచేత మిత్రులను ఎంచుకునే ముందు వారి నైజం తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

Posted in May 2019, బాల్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!