Menu Close
Kadambam Page Title
ఇంకెవరు ....
డి. నాగజ్యోతిశేఖర్

నేనో దుఃఖరాత్రిని మోస్తున్నప్పుడల్లా...
నాలో నిండిన వెన్నెల మడుగును తోడుకుంటూ ఉంటాను!
తోడుగా వేల స్థైర్యపునక్షత్ర లతలు నన్నల్లుకుంటాయి!

నేనో శూన్య ఆకాశాన్ని చేతులతో ఎత్తుకున్నప్పుడల్లా...
నాలో దాగున్న చంద్రశిలలు
నన్ను హత్తుకుంటాయి!
అనుభవాల పాలపుంతలు
నా పాదాలకు సత్తువ నిస్తాయి!

నేనో నవ్వుల వానై కురిసినపుడల్లా....
నా చుట్టూ కలల పడవలు
నాట్యమాడుతుంటాయి!
ఆనంద భాష్పపు నదులు
నా విజయాలను ముద్దాడుతాయి!

నేనో శిఖరపు అంచునై
మెరిసినపుడల్లా...
రెండు చేతులు పచ్చటి వేర్లయి
నన్ను ఆలింగనం చేసుకుంటాయి!

నేనో మనిషినై వ్యక్తిత్వ గాలిపటపు అంచుల్లో
తన పేరును పొదగగానే...
తన ఉత్తరీయపు కొసలు
గర్వపు జరీతో మెరుస్తాయి!

అరిగిన కిర్రుచెప్పులు
అలసిన వాలుకుర్చీతో
బిడ్డ భారతం ముచ్చటిస్తూనే ఉంటాయి!
బొడ్డు పేగు ముడేసుకున్న
బంధాల పారాయణం చేస్తూనే ఉంటాయి!

నన్నో పూలనదై పరిమళింపచేసిన ఆ ఇగిరిపోని సుగంధం
నాన్న కాక ఇంకెవరూ...!
నా బ్రతుకు ప్రతి మలుపులో
గెలుపు జెండా ఎగరేసిన
ఆ గుండె నాన్న కాక ఇంకేది...!

Posted in July 2021, కవితలు

8 Comments

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!