Menu Close
Galpika-pagetitle
"ధన్య జీవి" -- శ్రీముఖి

శ్రీమతీ, పిల్లలు ఊరెళ్ళారు. ఇప్పుడు ఇంట్లో ఒంటరిని. ఆమె వున్నప్పుడు....తను అడిగే పిచ్చిప్రశ్నలు, చెప్పే తిక్క జవాబులు, నన్నూ, నా సమయాన్ని తన ఆధీనం లోనే ఉంచుకోవాలనే ఆమె తాపత్రయం. విసుగ్గా ఉండేది.

కానీ, ఇప్పుడు..ఆమెలేని ఈ నిశ్శబ్దం.. ఇంటిని నన్నూ ఇంత స్తబ్దుగా మారుస్తాయనుకోలేదు. పిల్లలు..చెప్పేదేముంది? సందడికి ...సంతోషానికి చిరునామాలు! ఈ శూన్యాన్ని భరించ లేకపోతున్నాను.

ఆఫీసు నాతో పాటు వర్మ గారి క్కూడా లేదు ఈ వేళ. అవతలి వీధి లో ఉంటున్న వాళ్ళింటి కెళ్ళి ఆయనతో కాసేపు కాలక్షేపం చేస్తే? లేచి తలుపుకు తాళం పెట్టాను.

*****

అలవాటైన ఇల్లే కనుక సరాసరి హాల్లో కెళ్లి పిలిచాను.

ఆయన భార్య వచ్చింది. "లేరండీ..బజారు కెళ్లారు"

"సరేనమ్మా, నేను వచ్చి వెళ్లానని, వీలయితే సాయంత్రం మాఇంటికి రమ్మని చెప్పండి" చెప్పి వెనుతిరిగాను.

ఒక్క అడుగు వేశాను...వర్మ గారి గొంతు వినిపించి తిరిగి చూశాను.

వర్మ గారు, వాళ్ళింట్లో పని అమ్మాయి..వాళ్ళిద్దరి మధ్యలో నెమ్మదిగా నడిపించుకు వస్తున్న వర్మగారి తల్లి!!

"ఇదేమిటి? బజారు కెళ్లారని చెప్పిందామె! ఆశ్చర్యంగా అనుకుంటే వర్మ గారు నన్ను చూశారు.

"ఓ...రాజు గారా? ఐదు నిముషాలు కూర్చోండి...వచ్చేస్తాను" అంటూ తల్లిని ఆప్రక్క గదిలోకి నడిపించారు.

ఆ కొద్ది క్షణాల్లోనే ఆ దృశ్యం నా కళ్ళలో ముద్ర పడింది. అప్పుడే స్నానం చేసి వస్తున్నట్టున్న వాళ్ళమ్మగారి ముఖం లో అలసట...అస్తవ్యస్తం గా ఆమెకు చుట్టిన చీర...నడిపించుకు వస్తున్న వర్మ గారి లుంగీ, బనియన్ సగం పైగా తడిసి ఉన్నాయి. పనమ్మాయి బట్టలు కూడా. అంటే...ఆమెకు వర్మగారే స్నానం చేయించారా? భార్య ఉంది కదా? చెప్పి చేయించలేరా? పైగా ఆడ మనిషికి ఈయన..

లోపల నుండి చిన్నగానే అయినా చిరాగ్గా వర్మగారి భార్య మాటలు వినిపిస్తున్నాయి.

"మొఖాలకు మాత్రమే రాసుకుంటున్నా..నెలకు పౌడరుడబ్బా కొనాల్సి వస్తుంది. ఇంక ఒంటికీ ఇంటికి కూడా రాస్తుంటే..రోజుకో డబ్బా కొనాలి..."

ఆయన నిశ్శబ్దం, ఆమె నిరసన గళం...అర్థమవుతుంది పరిస్థితి. ఈ టైం లో రావటం బాగోలేదు..వర్మ రాకుండా వెళ్లి పోవటం కూడా బావుండదు...చేతిలో పేపరున్నా..దృష్టి దానిమీద లేదు.

"వెళదామా?" నవ్వుతూ వచ్చారు వర్మ. స్నానం చేసినట్టున్నారు..

"ఓ.కె." ఇద్దరం ఇల్లు వదిలి బైటకు వచ్చాము.

"మా మిస్సెస్, పిల్లలు ఊరెళ్లారండీ.. ఏం తోచక వచ్చాను." సంజాయిషీగా అన్నాను.

"ఫర్వాలేదు లెండి..నాకూ పనేం లేదుగా..కాకపోతే అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రం వలన...." ఆగిపోయారాయన.

ఎలా కొనసాగించాలో తెలియక నేనూ మౌనం! కాస్త దూరం అలాగే నడిచాక ఆడిగారాయన
"రాజుగారు, ఇందాక మీరు చూశారు...బహుశా మీకు అనిపించి ఉండవచ్చు... అమ్మకు నేను స్నానం చేయించడం ఏమిటని?"

"అబ్బెబ్బే..అలాగేమి అనుకోలేదండీ"

"........."

ఆయన నామాట వినిపించుకోలేదో..నమ్మలేదో... నడుస్తూనే నెమ్మదిగా చెప్పసాగారు.

"అమ్మకు ఆరోగ్యం సరి లేదండీ..చాలా మందికి చూపించాను...కొంత కుదుట పడింది కానీ..తన పనులు తను చేసుకోగల శక్తి లేదు. ఆఫీసు కు వచ్చేముందు ఆమె అవసరాలు చూసి వస్తాను. తిరిగి వచ్చాక మళ్ళీచూస్తాను. మధ్యలో భోజనం లాంటి వాటిని నా భార్య పెడుతుందనుకోండి...

".........."

"రాజు గారు..ఒక మనిషి అనారోగ్యంతో ఉన్నపుడు ఎదుటి వాళ్ళు ప్రేమగానో బాధ్యత గానో చూస్తే ఓ.కె. అలా గాక 'తప్పని తద్దినం'రా అన్నట్లు చేసే సేవ ఎలా వుంటుందంటారు?"

"చెప్పండి" అన్నట్లుగా చూశాను.

"విసురుకుంటు, కసురు కుంటూ..అటు తోస్తూ,ఇటు లాగుతూ చేసే సేవ కంటే ..అవతలి వాళ్ళకు 'నరకం నయం' అనిపించదు?"

"నిజమేనండీ"

"అదిగో..అందుకేనండీ..సాధ్యమైనంత వరకు..అమ్మ పనులు నేను చూసుకుంటూ ఉంటాను."

".........."

"పనమ్మాయి గంగ సాయంతో అమ్మకు నేనె స్నానం చేయిస్తాను..."

"........."

"మొదటి రోజు నేనందుకు సిద్ధపడగానే..అమ్మ సిగ్గుతో కుంచించుకు పోతూ 'వద్దు వద్దు..' అంటూ తల, చేతులు ఊపుతూ ఏడవ సాగింది..."

మౌనంగా ఆయన చెప్పేవి వింటున్నాను...మనస్సు బరువెక్క సాగింది...

"అమ్మా ఎందుకలా బాధ పడతావ్?" అంటూ అమ్మను గుండెలకు పొదవుకున్నాను.

"మ... మగ...బిడ్డ...వు.." అమ్మ వెక్కి పడుతుంది.

"అయితే ఏం? మగబిడ్డననీ నీవు నాకు పాలు ఇవ్వటం మానేశావా? రోజుకు ఎన్ని సార్లు నాకు అన్నీ కడిగి శుభ్రం చేసేదానివి? ఆడ మగ అనుకుని నువ్వు వదిలేసి ఉంటే.. నేనూ, నా బ్రతుకు కంపు కొట్టుకు పోయేవాడినమ్మా.....తల్లీ బిడ్డలనుకున్నావ్. మరిప్పుడూ మనం తల్లీ బిడ్డలమేగా?
తల్లిదండ్రులు, పిల్లల మధ్య ..ఆడ,మగ.. వయస్సు బేధాలుండవమ్మా.."
రాజు గారూ,.. పదేళ్ల నా కూతురు మారాం చేస్తుంటే ఎలా నా గుండెల మీద వాల్చుకుని బుజ్జగిస్తానో...అలా ఎన్నో విధాల చెప్తే కానీ..అమ్మ సమాధాన పడలేదు."

వర్మ గారు చెప్తుంటే.. వింటూనే వున్నాను. నా గుండె లోతుల్లో సన్నటి సెగ లేస్తోంది...

'అమ్మ కాలం చేశాక ..నా దగ్గరున్న నాన్నను "నా భార్య సరిగా చూడటం లేదు..చూడదు" అనే నెపం ఆవిడ మీదకు నెట్టేశాను. "మగవాడిని నాకెలా కుదురు తుంది"? అనే ముసుగు మాటున దాక్కున్న దరిద్రుడ్ని... చూడటానికి వచ్చిన అక్క తో 'నెలనెలా కొంత మొత్తం పంపుతా' నంటూ నాన్నను ఆమెకు అంటకట్టిన అవకాశవాదిని...వెళుతూ వెళుతూ నాన్న అన్న మాటలు!
"పసితనం లో తల్లి లేకపోయినా...వృద్దాప్యంలో కూతురు లేకపోయినా కుక్క బతుకు బతకాలి" గుర్తుకొస్తున్న ఆ మాటలు గుండెల్లో గుణపాల్లా దిగుతున్నాయి...

"ఓ రోజు ఏమయిందో తెలుసా రాజు గారూ?.." వర్మ మాటలతో వర్తమానం లోకి వచ్చాను.

"ఆఫీసు నుండి రాగానే అమ్మ గదిలోకి వెళ్లి చూడటం అలవాటు. ఆ రోజేమిటో కొత్తగా కనిపించింది....నలుపు తెలుపుల కలయికతో..ఒత్తుగా నిండైన తలకట్టుతో హుందాగా వుండే అమ్మ దైన్యంగా,నిర్లిప్తంగా.. ఒక భిక్షుకి లా..." ఆగిపోయారు వర్మ గారు.

మాటలే కాదు..నడక కూడా...ముని వేళ్ళ తో కనుకొలుకులు.. ఒత్తుకుంటూ...ఆయన దగ్గరగా జరిగాను. భుజం తడుతూ చెప్పాను.

"వర్మగారు.. కూల్ డవున్...ప్లీజ్...కూల్ డవున్..." సంభాళించుకున్నారు.

మళ్ళీ మొదలు..మాటలు...నడక...

"అమ్మకు...నా..భార్య గుండు చేయించిదండీ.."

".........."

"దువ్వుకోలేనామెకు జుట్టు అవసరమా?" ఇదీ ఆమె జవాబు!

"అసలు. అమ్మే కాదు ఏ మనిషి అయినా జుట్టుతో ఉండాలా, గుండుతో ఉండాలా అనేది కాదు సమస్య! ఒక మనిషి నిస్సహాయ స్థితి లో వున్నప్పుడు..వాళ్ళను మరింత నైరాశ్యంలోనికి నెట్టటం మానవత్వమా?"

....నేనేం చెప్పను? చెప్పే అర్హత నాకుందా??

"గంగ పని చేస్తున్నందుకు నా భార్య ఇచ్చేది కూలి. ఆమెకు తెలియకుండా నేను గంగకు కొంత మొత్తం ఇస్తుంటాను...
అమ్మ సేవలో నాకు సహాయపడుతున్నందుకు కృతజ్ఞతతో...ఓసారి అన్నాను
"గంగా...నీవు కూడా అమ్మ కడుపున పుట్టెపని"
"ఇప్పుడు మాత్రం నాకు అమ్మ కాదా అన్నా?"అంది.

...ఎదురు గా వస్తున్న లారీ హారన్ తో ఉలిక్కిపడ్డాము. ఆగి చుట్టూ చూస్తూ అన్నారు వర్మ గారు
" రాజు గారూ.. మాటల్లో పడి చాలా దూరం వచ్చామండీ"

"పరవాలేదు లెండి"

"మీరేదో చూశారని చెప్పటం కాదండీ..మీతో పంచుకోవాలని చెప్పాను.

"ఐ... నో...ఇట్..."

నా గొంతు పెగలటం లేదు. మనస్సంతా తెలియని..దిద్దుకోలేని..ఆందోళన!

"అదిగో..హోటల్..రండి ఓ స్ట్రాంగ్ టీ కొట్టేసి వెళదాం.." వర్మ గారిని అనుసరించా వాళ్ళమ్మ గారిని తలచుకుంటూ మనస్సులోనే అనుకున్నాను
"ఇలాంటి కొడుకుని కన్న నీవు "ధన్య జీవి"వి తల్లీ! అని.

రాధామాధవీయమ్ -- డా. రాయసం లక్ష్మి

రాధామాధవీయమ్ అరుస్తూ వేగంగా లోపలికి వచ్చాడు రామ్.

అబ్బా ఎన్ని సార్లు చెప్పాలి ఆ మాధవుడు ఇక్కడ లేడు. ఉన్నది ఒక్కతే రాధ.

మాధవుడు లేకపోయినా ఉన్నా నీవు రాధామాధవీయమే కదా.. ఉడికించబోయాడు రామ్.

కాదు కాదు నేను నేనే రాధను మాధవుడు లేకపోయినా నేను ఉంటాను ఉంటాను ఉంటాను గొంతులోంచి ఎంత వేగంగా వస్తుందో అంత పదును తేలుతోంది స్వరం..

సమయమిది కాదులే... మంచి కాలం ముందు ముందునా అంటూ రామ్ తప్పించుకుని లోపలికి వెళ్లాడు...

వీని గోల శ్రుతిమించుతోంది విసుగుపై కంబళి పరుస్తున్నాననుకుని రాధ మరుగున ఉన్నవాటిని తోడబోయింది.

•••

రామ్! నువ్వు ఎప్పుడూ రాధను ఇలా పిలుస్తావేమిటి? ఆమె విసుక్కుంటూనే ఉంటుంది... ఇంకా ఏదో అడగబోయిన పవన్కు అడ్డుకట్టవేసి తర్వాతి చెబుతాలే కానీ ఆ సి.ఎ ఇన్స్టిట్యూట్ కి ఒక ఫ్యాకల్టీ కావాల్సి వస్తుంది. ఓ నెలరోజుల్లో వాసన్ వెళ్లిపోతాడట. టాక్స్ క్లాసు చెప్పేవాళ్లు అరుదుగా ఉంటారు. వారిని తప్పక వెతకాల్సిన కాలం వచ్చింది. ఆ పనిపై దృష్టి పెట్టు అనేసి వెళ్లిపోయాడు రామ్.

•••

ఈరోజు రాధతో మాట్లాడుతూ అసలు విషయం కనుక్కోవాల్సిందే..
రోజూ రోజూ వీరిద్దరి మాటలు వింటూ ఉంటే నా మనసు రొద చేస్తూనే ఉంటుంది. ప్రక్కన వాళ్లసోది వినకపోతే తిన్న తిండి అరగదనుకునే పవన్.

•••

రామ్ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇన్నాళ్లు మాధవ్ వేరు... ఈ రాధమాధవీయమ్ వేరు అనుకునేవాణ్ని ఈ రోజు మాధవ్ ఆల్బమ్ చూడకపోయి ఉంటే ఈ రోజు కూడా వృథాగానే మిగిలేది. ఏదైనా చేయాలి అనుకునే నాకు మంచి అవకాశం వచ్చింది. చేయాల్సింది చేసేయాలి లేకపోతే పవన్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.

పాపం రాధ కూడా చెప్పలేక చెప్పింది ఆ పవన్ …పవనుడు గురించి.

నిజానికి ఆడిట్  క్లాసులు పవన్ వల్లే నడుస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఆడిట్ థీయరీ ఎంత బాగా చెప్తాడో మనష్యుల మనసులను కూడా వెతికి వెతికి అట్టడుగున పారేసిన మడతకాగితాన్ని కూడా వెలికి తీయగల సమర్థత ఉన్నవాడు. ఈ ఆడిటింగ్ పవన్కు ఈ మాదిరి కూడా సాయం అందిస్తోందనే చెప్పుకోవాలేమో తన విశ్లేషణకు తానే నవ్వుకున్నాడు రామ్.

•••

వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. చల్లటి గాలి తెమ్మెర మెల్లగాతనువును స్పృశిస్తోంది. ఉన్నట్టుండి మనసులోకి మాధవ్ దూరాడు. ఎంతైనా ‘మాధవుడు’ గదా మరి!

ఈ వాతావరణంలో నేను ఇచ్చే టీకి ఎంతగా ఆనందించేవాడో కదా.. మల్లెపందిరి కింద కూర్చుని టీ తాగాలని తన కోరిక కోసం ఎక్కువ అయినా ఈ స్థలం కొని మరీ కట్టించాడీ ఇల్లు. మధ్యలో ఇల్లు... చుట్టూర చక్కని తోట.. అటు కూరలు, ఇటు పూలు అప్పుడప్పుడు చిన్న చిన్న పండ్లు .... తాను కోరుకున్న జీవితమే... కానీ ఎందుకిలా అర్థరాంతంగా ఆగిపోయింది.. ఒక్కదాన్నే ఎందుకు మిగిలానో..

మా ఇద్దరిలో ఏ అరమరికలు లేవు. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నాం. ఏ అభిరుచులూ వేర్వేరుగా లేవు అయినా ఇందుకీ ఎడబాటు అర్థం అయి కానట్టు మనసు పొరలను తూర్పార పెడుతోంది రాధ.

•••

అదికాదు మాధవ్ నీ కళ్లతో నీవు చూసి విషయం తేల్చుకో.. అంతేకానీ మూడో కన్ను చెప్పింది నీవు పట్టించుకోకు.. జిహ్వకో రుచి పుర్రకో బుద్ధి కనుక నీకు నచ్చే విషయమే అయినా వారికి నచ్చి ఉండకపోవచ్చు. అందుకే నీకు అలా చెప్పి ఉండొచ్చు కదా. నీవొక సారి  పరోక్షంగా కూడా నీవే చూడు. నీకళ్లు వాళ్లు చెప్పేది నిజమంటే మరి నేను ఇంక మాట్లాడను. ఏం అంటావు అన్నాడు రామ్.

ఏమి చెప్పలేక మౌనం వహించాడు మాధవ్...

నిజమే రామ్ చెప్పేది ఒక్కోసారి మనం అనుకున్నట్లు వేరేవారు అనుకోరు కదా. అందుకనే మా అమ్మ రాధపైన అలా చెప్పిందేమో.. కావాలని కాకపోయినా తనకు అన్పించింది చెప్పి ఉండవచ్చు కదా అనుకున్నాడు.పరోక్షంగా అన్నాడు కదా.. చూద్దాం  మనసున అనుకున్నాడు మాధవ్
కాలం ఎవరికోసమూ ఆగదు కదా...

•••

మా అమ్మాయి భోళా మనిషి అండీ తన మనసులో మాట ఏదైనా సూటిగానే చెప్పేస్తుంది. అంత మనసులో పెట్టుకుని మరో మాట మాట్లాడే తత్వం ఉన్న పిల్లలాకాదు. మీరు పెద్దవారు ఒక్కసారి ఆలోచించండి... ఆడపిల్లను ఇలా పుట్టింటికి పంపించేవేసి ఇన్నాళ్లుమీరు పట్టించుకోకపోతే నలుగురూ ఏమనుకుంటారో మాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించండి... ప్రాథేయపడుతున్నాడు రాఘవయ్య. ఆయన మాటల్లో ఆందోళన తన కూతురి భవిష్యత్తు మీద బెంగ...

మేము మాత్రం ఏం చేస్తాం చెప్పండి. ఒకరింటికి వచ్చిన కోడలు. నాకు నా పుట్టింటి వాళ్ల మీద ప్రేమను వదిలిపెట్టను. నేనే వాళ్లకే ప్రాధాన్యాన్ని ఇస్తాను, నాకు వాళ్లు కావాల్సిందే అని అంటుంటే మేం మాత్రం ఏం చేస్తాం అంది సుందరమ్మ.

అదేంటమ్మా అలా అంటారు. పుట్టి పెరిగిందిక్కడే కనుక ప్రేమ ఉందని అని ఉంటుంది. అంతేకానీ వారి పై ప్రేమ వదిలేది లేదని ఎందుకు అంటుంది. చిన్నప్పుడు అమ్మను వదిలి ఉండలేని కొడుకే పెరిగే కొద్దీ ఆ ప్రేమను తన భార్యకు ఆ పై తన పిల్లలకు పంచడా అమ్మా. అట్లా అని తన తల్లిపై ఉన్న ప్రేమను తుంచేసుకుంటాడా చెప్పండి... ఏదో చిన్న పిల్ల మాట్లాడడం ఎలానో తెలియక ఇలా మాట్లాడి ఉంటుంది. నేను చెబుతాను. ఇంకోసారి ఇలా మాట్లాడకుండా నేను చూసుకుంటాను. కడదాక ఆడపిల్లకు మెట్టినిల్లే కదమ్మా... పుట్టిల్లు చుట్టపు చూపే కదమ్మా. మీరు అర్థం చేసుకోండమ్మా బతిమాలుతున్న రాఘవయ్యను మధ్యలోనే ఆపేసి

ఏం చిన్నపిల్ల? సి.ఎ. చేసింది. ఇన్స్ట్యూషన్స్ పెట్టి రెండు చేతులా సంపాదించి మీకు పెడుతోంది. ఇంకా చిన్నపిల్లేమిటి? అత్తగారి గొంతు ఖంగుమంది.

•••

వాకిట్లోకి వచ్చేసరికి మాటలు వినిపించి అక్కడే ఆగిపోయాడు మాధవ్.. అసలు విషయం ఏమన్నా తెలుస్తుందా అని... లోపలికి వచ్చాడు..

అదిగో మా అబ్బాయి వచ్చాడు. వాడికి అసలే ఇష్టం లేదు.. వాడికి అనుకూలమైన భార్య కావాలని మేం కోడలిని తెచ్చుకున్నాం కానీ ఎంతకీ నాన్న తమ్ముళ్లూ అంటూ ఉంటే...  ఇంకా సుందరమ్మ గొంతులోంచి మాటలు వస్తూనే ఉన్నాయి.

‘బాబూ।’ అనగలిగాడు రాఘవయ్య.

‘నేను తర్వాత మాట్లాడుతానండీ’ అనేసి జవాబు కోసం చూడకుండా లోపలికి వెళ్లిపోయాడు.

ఇక దయచేస్తారా.. అన్నట్టు నిల్చుంది సుందరమ్మ.. సుందరయ్య అంతేగా అంతేగా అన్న బ్యాచీ లా ఆయన నిల్చున్నాడు ఆమె పక్కనే. రాఘవయ్య మౌనం వహించి గడప దాటాడు.

•••

ఇంతకీ అమ్మకు రాధ సంపాదన మనకు లభించడం లేదనా కోపం అనుకున్నాడు మనసున మాధవ్
అంతలో ఫోన్ వస్తే... అటు వైపు మరలిపోయాడు.

•••

‘ఎందుకు నాన్నా వాళ్లని బతిమిలాడుతావు. నేను మీకేమన్నా బరువా? నేనూ ఏదో ఒకటి చేస్తునే ఉన్నాను కదా. మీరు ఊరికే వాళ్లదగ్గరకు వెళ్లకండి. ఆమెకు మనం నచ్చం. నేను ఏదీ చేసినా నిన్ను అమ్మను తిట్టకుండా ఉండదు...ఆవేశంగా చెప్పింది రాధ.

చూడమ్మా మీ అత్తగారూ పెద్దామె. ఆమె వాళ్ల అత్తగారి కాలంలో ఇప్పటి కాలంలా లేదు. అప్పుడు ఎన్నో బాధలు పడ్డారు. ఆ కాలం నాటి ఆలోచనలు ఆమెను వదలడం లేదు. నువ్వే కాస్త మనసు చూసి మసలుకోవాలి. ఆవేశంతోనూ అర్థం లేని వాగుడుతోనూ కాపురాలను నాశనం చేసుకోకూడదు.
మనుషుల మధ్య అప్యాయతానురాగాలు, ప్రేమలు ఉంటే ఎదుటివారు ఎంత గయ్యాళులైనా ఒకనాడు వారి ప్రేమ బట్టబయలు అవనే అవుతుంది. అప్పుడు ఈపొరపొచ్చాలు గాలికి పోతాయమ్మా. అప్పటి దాకా నీవే వేచి చూడాలి. కోపం తో పుట్టింటికి రాకూడదు అన్నాడు రాఘవయ్య.

అబ్బా! శకుంతలోపనిషత్తు మొదలెట్టారా విసుగ్గా అంది రాధ.

‘కాకపోతే దుష్యంతోపనిషత్తు చెప్పమంటావా ఏంటి. నీకు ఏదన్నా కావాలంటే నన్ను అడిగితే విషయం చెప్తాను కదా. మరీ నీ సంపాదన నాన్నకు ఇస్తాను అని చెప్తారా అన్నాడు అప్పుడే వచ్చిన మాధవ్.

అయ్యో ఎంత మాట! సంపాదన ఏంటండీ ఎవరికిస్తాను అంది. కంగారుగా అడిగాడు రాఘవయ్య.

నేను సంపాదన ఇస్తానన్నానని ఎవరు చెప్పారు మీకు. మీరెప్పుడూ అవతల వారి మాట వినడమేకానీ నా మాట ఎప్పుడైనా విన్నారా... అందుకే.. లోపలికి వెళ్లిపోయింది రాధ.

కూర్చో బాబూ! ఇంతదూరం వచ్చారు. ఇందాక మీరు అలా వెళ్లిపోతే నేను చాలా కంగారుపడ్డాను. అయితే మీకు రాధపైన కోపం లేదు కదా.. అనుమానం తీర్చుకోవడానికి అడిగాడు రాఘవయ్య.

లేదండీ.. అసలు సంపాదన గురించి నాకు ఏమీ చెప్పలేదు. ఇన్స్టిట్యూట్ రన్ చేస్తాను అంది. సరే అన్నాను. ఆ తర్వాత మా అమ్మతో ఈ డబ్బులు గురించి మీకు ఇస్తానని చెప్పిందట. పెద్దవాళ్లు కదా. వాళ్లూ మా బాగుకోరే కదా చెప్పేది..

అలా అనకుండా ఉండాల్సింది  రాధ.. ఇంకా ఏదో చెప్పబోయే మాధవ్ ను అడ్డుకుంటూ
అసలు నేనేమీ అనలేదు. మీ చెల్లెలు వచ్చి నీ సంపాదన నీకా మీ ఆయనకా అంది. అంతలో మీ పెద్దక్క కష్టపడే వారికే సొమ్ము అందాలి అంది. నేను నవ్వాను. మీ అమ్మ అయితే నువ్వు తీసుకుంటావా.. ఎంత వస్తుందేమిటి? అంటూ ఏదేదో అనేశారు. నేను ఏం చెప్పబోయినా నాకు చెప్పక్కర్లేదు అంటూ వెళ్లిపోయారు అంది రాధ.

రాధ మాటలు వినగానే తన అక్కచెళ్లెల్లు అత్త అమ్మ చెప్పిన మాటలు విని ఉండాల్సింది కాదు. ఏదైనా ఇప్పటి నుంచే నేనే అన్నింటినీ చూడాలి అనుకున్నాడు. దట్టంగా అల్లుకున్న శ్రావణమేఘాలు గట్టిగా వీచిన పవనంతో వీగిపోయాయి. రాధ మొహంలో మబ్బువీడిన సూర్యుడు కనపించాడు.

అప్పుడే వచ్చిన రామ్ ఏం రాధామాధవీయమ్! గమ్మత్తుగా మీరిద్దరూ నాకు ఒకరికి తెలియకుండా ఒకరు స్నేహితులయ్యారు అన్నాడు. రాధతో పాటు మాధవుడు కూడా రాముణ్ణి చూసి అరే.. అవునా ఈ రామ్ మీకు తెలుసా అంటే మీకూ తెలుసా అనుకున్నారు.

తెలియడం కాదు మనకు పట్టిన వర్షాచ్ఛాయా మేఘాలను చెదరగొట్టిన వీరుడు ఈ రాముడే అన్నాడు పవన్.

మంచి పని చేసావని రాఘవయ్య పవన్ను మెచ్చుకున్నాడు. రాధామాధవ్ లు వారింటికి బయలుదేరారు.

అరే నాకు తెలియకుండానే ఏదో జరిగిపోయింది. ఎప్పుడూ కోపంగా చిర్రుబుర్రు లాడే ఈ రాధమ్మ మొగుడితో చిరాకు తగ్గించుకుని వెళ్తున్నట్టుంది అనుకున్నాడు.

అందరి కళ్లూ పౌర్ణమి చంద్రునికి ప్రతీకలయ్యాయి.

తొలి రోజు -- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

చెన్నై రైల్వేస్టేషన్లో ప్లాట్ ఫారాలన్నీ కలియదిరుగుతున్నాడు ముత్తు. సామాన్యులకి అతను పనీ పాటూ లేకుండా కేవలం కాలక్షేపం కోసం తిరుగుతూ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నట్లు కనపడుతుంది. కానీ అతనలా తిరగడం వెనక అతని ప్రయోజనాలతనికి ఉన్నాయి.

అంతలోనే ఏదో ఒక పెట్టెల బండి వచ్చి ఆగింది. అందులోంచీ ప్రయాణీకులంతా ఆగమేఘాల మీద దిగిపోయారు. సరిగ్గా అయిదే అయిదు నిమిషాల్లో బండిలో అన్ని పెట్టెలూ ఖాళీ అయిపోయాయి. ఎంతో దూరం నించి విసుగూ విరామం లేకుండా వేలాదిమందిని మోసుకు వచ్చిన ఆ బండిని ఎంతమాత్రం పట్టించుకోకుండా కనీసం వెళ్ళొస్తామనైనా చెప్పకుండా ఎవరిదారిన వారు హడావిడిపడిపోతూ పరుగులు పెడుతూంటే వాళ్ళని చూసి నవ్వుకుందా బండి. మొదట్లో అయితే కనీసం కృతజ్ఞతయినా లేని మనుషులందర్నీ వెంటపడి తరిమి తరిమి కొట్టాలన్నంత కోపం వచ్చేది. ఆ కోపంతో వాళ్ళందర్నీ పేరుపేరునా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకునేది. క్రమంగా దానిక్కూడా మనుషుల గురించి అర్థం కాసాగింది. ఈ మనుషులింతే.., అవసరం కలిగితే నెత్తినెక్కించుకుంటారు. అవసరం తీరిపోగానే నెత్తెక్కి తొక్కుతారు. ఈ విషయం అవగతమౌతున్నకొద్దీ కోపం తగ్గి, వారి ప్రవర్తనకి విసుగు మొదలైంది. ఆ విసుక్కి కూడా ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టమయ్యాక ఇప్పుడు నవ్వొస్తోంది.

ఆ నవ్వు అర్థం ఏమిటో ముత్తుకి బాగా తెలుసు. రైల్వేవాళ్ళు ఆ నవ్వుని గుర్తించి దాన్ని అక్కడినించి తీసుకువెళ్ళి లూప్ లైన్లో పెట్టేసే లోపుగానే తన పని పూర్తిచేసుకోవాలి. గబగబా లోపలికి ఎక్కి బోగీలన్నింటినీ వెతుక్కుంటూ బయలుదేరాడు. అతని ప్రయత్నం వృధా కాలేదు. మూడో పెట్టెలో ఒక పర్సు దొరికింది. దాన్ని జేబులోకి తోసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఒక పైపడక మీద ఎవరో నిద్రపోతూ కనిపించారు. ఆ మనిషి తలకింద ఓ తోలు సంచి కనపడింది. ఆ పడుకున్న వ్యక్తికి నిద్రాభంగం కలగకుండా మెల్లగా దాన్ని తల కిందనించి తీశాడు. బేతాళుణ్ణి భుజానికెక్కించుకున్న విక్రమార్కుడిలా ఎంతమాత్రం వెనుదిరిగి చూడకుండా ముందుకి వెళ్ళిపోయాడు ముత్తు. మరొకచోట ఓ కాగితం పొట్లం కనిపించింది. దాంట్లో ఏముందో కూడా చూడకుండా దాన్ని జేబులోకి తోశాడు. అప్పటికింకా రైలు కదల్లేదు. కానీ మరి కాసేపట్లో వెనక్కి వెళ్ళిపోతుందని ముత్తుకి తెలుసు. తను గనక ఎవరికైనా కనిపిస్తే చూసినవాళ్ళు వాటాకొస్తారు. అందుకే, ప్లాట్ ఫాం పైకి వెళ్ళకుండా రెండోవైపు కిందికి దిగి పట్టాల్ని దాటుకుంటూ వెళ్ళి అవతలి అరుగు మీదకి ఎక్కాడు. ఆనక ఓ బెంచీమీద కూర్చుని తీరిగ్గా పర్సు బైటకి తీశాడు. అందులో ఏవో రెండుమూడు బిల్లులూ ఓ చిరిగిపోయిన ఐదురూపాయల కాగితమూ తప్ప ఏమీ కనపడలేదు. అంటే అది పోగొట్టుకున్న పర్సు కాదు. పారేసిపోయిన పర్సు. దాన్ని చూడగానే ముత్తుకి ఒళ్ళు మండిపోయింది. కోపంతో ఆ పర్సుని పట్టాలమీదకి విసిరి కొట్టాడు.

తోలు సంచిని తెరిచి చూశాడు. అందులో మూడుజతల బట్టలున్నాయి. వాటిని సెకెండ్ హ్యాండ్ బట్టలమ్మేవాడికిస్తే ఆ రోజు గ్రాసానికి రావచ్చు. ఒక అందమైన కలం కనపడింది. అది అక్క కొడుక్కిస్తే వాడు సంతోషించడం మాటెలా ఉన్నా నాలుగైదు పూటలైనా విసుక్కోకుండా కడుపు నింపుతుందక్క. ఆ సంచికి ఓ జేబుంది. అందులో కొంచెం డబ్బుంది. అది ఓ రాత్రి మందుకి సరిపోతుంది. ఆ సంచి చాలా ఖరీదైనదిలా కనిపిస్తోంది. దాన్ని అమ్మితే ఓ రాత్రి మందుకీ కోడి పలావుకీ ఢోకా వుండదు. అంతలోనే జేబులోకి తోసిన కాగితపు పొట్లం గుర్తొచ్చింది. అందులో కొన్ని పచ్చకాగితాలున్నాయి. వాటిని చూడగానే ముత్తు ముఖం విప్పారింది.

***

నాలుగవ తరగతి రైల్వే ఉద్యోగి ఒకతను పై బెర్తుమీద పడుకుని నిద్రపోతున్న విద్యాసాగర్ని నిద్ర లేపాడు. అతను తమిళంలో ఏదో చెప్పాడు. అతను చెప్పేదేమిటో విద్యాసాగర్ కి అర్థం కాలేదు. అందుకే తెల్లమొగం వేసుకుని చూస్తూండిపోయాడు. విద్యాసాగర్ ముఖంలోని అయోమయాన్ని చూడగానే అతనికి రైలు ప్రయాణం కొత్తనీ, అతనికి తమిళం రాదనీ అర్థమైపోయింది ఆ ఉద్యోగికి.

"ఎన్నడా నీ తెలుగువాడా?" అన్నాడు.

అవునన్నట్లు తల ఊపుతూ తన సంచి కోసం చూసుకున్నాడు విద్యాసాగర్. అది కనపడలేదు. దాంతో కంగారుపడిపోయాడు. బిత్తర చూపులు చూస్తూ,"నా బ్యాగు"అన్నాడు.

ఆ ఉద్యోగికి ఇలాంటివాళ్ళు కనీసం రోజుకి ఇద్దరు ముగ్గురైనా తగుల్తూనే ఉంటారు. అందుకే అతను, "పోచ్చా?" అంటూ కాలజ్ఞానిలా నవ్వాడు.

"నా టిక్కట్టు బాగులోనే ఉంది..,"

"ఓ టిక్కెట్టిరుకుమా" అంటూ మరోసారి నవ్వి, "పరవా ఇల్లె. అంద దారిలో పోతే టీసీ రాదు" అంటూ టిక్కెట్ లేకుండా ప్లాట్ ఫారం నించి బయట పడే దారి చూపించాడు.

డోరు దగ్గరకి వచ్చాడు విద్యాసాగర్. ప్లాట్ ఫారం మీదకి దిగాడు.

అంతలోనే మరో బండి అదే ప్లాట్ఫారమ్మీదకి వస్తున్నట్లు ప్రకటన వెలువడింది. అంతే.., మళ్ళీ ప్లాట్ఫారమ్మీద హడావిడి మొదలైపోయింది.

విద్యాసాగర్ కి అంతా గందరగోళంగా అనిపించసాగింది. ప్రయాణీకులు చక్రాల పెట్టెలు ఈడ్చుకుంటూ సంచులు మోసుకుంటూ పడుతూ లేస్తూ తోసుకుంటూ వచ్చేస్తున్నారు. వారి మధ్యలో ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతెలియక బిక్కుబిక్కుమంటున్న విద్యాసాగర్ని అందరూ తలో వైపునించీ గెంటుతుంటే తనకి తెలియకుండానే వెనక్కి వెళ్ళిపోతున్న విషయం అర్థం అయింది. అందుకే నానా తంటాలూ పడి ఆ జనప్రవాహానికి ఎదురీదుతూ కొంచెం దూరం నడిచాడు. అంతలోనే పక్క ప్లాట్ ఫారం మీదకి మరో రైలు వచ్చి ఆగింది. అందులోంచీ బిలబిలమంటూ దిగిపోతున్న ప్రయాణీకులతో కలిసిపోయాడు. ఫలితంగా ఆ ప్రయాణీకులతోబాటుగా విద్యాసాగర్ కూడా ప్లాట్ ఫారం దాటి తిన్నగా బయట ఉన్న మెట్లమీదకొచ్చిపడ్డాడు.

ఎదురుగా రహదారి మీద క్రమశిక్షణ పాటిస్తూ ఒక దాని వెంట ఒకటిగా పరుగులు తీస్తున్నాయి రకరకాల వాహనాలు. దాని పక్కనే నడకదారి మీద చీమల బారుల్లా పరుగులు తీస్తున్నారు పాదచారులు. ఆడామగా ముసలీ ముతకా పిల్లా పీచూ అనే తేడా లేకుండా అందరూ అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారో ఎందుకలా ఉరుకులూ పరుగులూ పెడుతున్నారో కనుక్కుందామంటే ఎవరూ కనీసం తనవైపు చూడనైనా చూడటం లేదు. వారినలా చూస్తూ ఉంటే.., పోయిన సంచీ బట్టలూ డబ్బులూ ఏవీ గుర్తురాలేదు. అప్పటికే పలహారానికి వేళ దాటిపొతున్నా కనీసం ఆకలి కూడా కాలేదు. ఒక వైపు గుబులు, మరొక వైపు దిగులు. మిగిలిన అన్నివైపులా ఏం చెయ్యాలో ఎక్కడికెళ్ళాలో ఎలా బతకాలో అర్థం కాని అమాయకత్వం. ఏమీ చెయ్యలేని ఆసహాయకత్వం. వీటన్నిటి మధ్యా అయోమయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా దాన్నేం పట్టించుకోకుండా లోపలనించీ తన్నుకొస్తోంది ఉత్సాహం. దాంతో తనకి తెలియకుండానే పాదచారులతో పదం కలిపాడు.

అలా ఎంతసేపు నడిచాడో తెలియదు. ఎంతదూరం నడిచాడో తెలియదు. కానీ అలసటతో నడక ఆపి, తలెత్తి చూస్తే ఎదురుగా ఎగిసెగిసిపడుతున్న కెరటాలు. ఆ వెనుక లుంగలు తిరుగుతూ భూమిని చుట్టెయ్యడానికి పెల్లుబుకుతూ వస్తున్న జలధి తరంగాలు. ఆ వెనుక అపారమైన లవణ జలరాశి. నీలంగా మెరిసిపోతూ ఆకాశాన్ని అందుకోవడానికి చేతులు చాస్తోంది.

ఆకాశం ఆ కడలి అద్దంలో ముఖం చూసుకుంటూ మురిసిపోతోంది.

విద్యాసాగర్ అలాగే చెలియలి కట్టవెంట నడుస్తూంటే అతని పాదాలు వేసే అడుగుల ముద్రలని తుడిచేస్తూ అలలు ముందుకొస్తున్నాయి. వాటివెంట లోపలకి అడుగులు వేస్తూంటే కెరటాలు తనని ప్రేమతో ఆహ్వానిస్తున్నట్లనిపించింది. అలాగే ముందుకి మరింత ముందుకి వెళ్తూంటే ఆ సముద్రం తనని లోపలకి ఇంకా లోపలకి రారమ్మని పిలుస్తున్నట్లుగా అనిపించింది. ఆప్యాయంగా కెరటాల చేతులుచాచి గుండెల్లోకి పొదువుకుంటున్న కన్నతండ్రిలా అనిపించాడు సముద్రుడు.
అలాగే.., ముందుకి మునుముందుకి అడుగులు వేస్తూనే ఉన్నాడు విద్యాసాగర్. కెరటం పైభాగం బయటికి గెంటుతుంటే కిందిభాగం లోపలకి లాగేసుకుంటోంది. అంతలోనే లవణ జలాలు ఉన్నట్టుండి కాళ్ళ కింద ఇసకని తొలిచేస్తూంటే పాదాలమీద అతనికి అమ్మ మునివేళ్ళతో కితకితలు పెడుతున్నట్లుగా అనిపించింది. ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూండగానే ఓ బలమైన కెరటం తననీ తన ఆనందాన్నీ తన పారవశ్యాన్నీ లుంగచుట్టుకుపోయింది. దానితోబాటు తనూ గుండ్రంగా తిరుగుతూ లోపలకి ఇంకా లోపలకి వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఉప్పునీళ్ళు నోట్లోకి ముక్కులోకి వెళ్ళిపోతున్నాయి. ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. ఊపిరి అందడంలేదు. గుండెల్ని ఎవరో బలంగా ఒత్తుతున్నట్లనిపిస్తోంది. ఊపిరి ఆగిపోయినట్లైంది. ఒక్కసారిగా మెదడు మొద్దుబారిపోయింది. కళ్ళు మిరిమిట్లు గొలిపే వాడి అయిన కాంతిపుంజం సూటిగా గుండెల్లోంచి కన్నుల్లోకి పొడుచుకొస్తున్నట్లు అనిపిస్తూండగా మైకం కమ్మినట్లైంది.

తరువాత ఎప్పుడెక్కడనించి ఎలా వచ్చి పడ్డాడో తెలియదుగానీ అతను వచ్చి గట్టున పడ్డాడు. ఆ తరువాత ఎప్పటికో అతనికి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఆకాశం. దాన్ని కమ్ముకున్న మబ్బులు. వాటిని చీల్చుకుంటూ వచ్చి కళ్ళలోకి వేడిగా వాడి అయిన బాణాలు సంధిస్తున్న సూర్యుడు. మెల్లగా లేచి కూర్చుంటే ఎదురుగా సముద్రం. కన్నతండ్రిలా నిలబడింది. తల్లిలా లాలించింది. స్నేహితుడిలా ధైర్యం చెప్పింది. చివరిగా ఒక కెరటం చెలియలి కట్టని దాటి తన దగ్గరకి వచ్చింది.

"అమాయకుడా చచ్చిపోవాలని నువ్వనుకుంటే చాలదు. నీకంటే ముందు నేననుకోవాలి. అలా అనుకోవడానికి బలమైన కారణం ఉండాలి. అప్పుడుగానీ చావురాదు. అయినా చచ్చిపోవడానికి నీకిప్పుడేమైందని? కాలొంకరా కన్నొంకరా? ఒంట్లో శక్తి లేదా మెదడులో తెలివిలేదా? అవన్నీ ఉన్నవాడికి చచ్చిపోయే అర్హత లేదు. అయినా విద్యాసాగర్ అనే పేరు పెట్టుకున్నావు. ఇంత తెలివితక్కువ పని ఎందుకు చేశావు?"అంటూ చీవాట్లేసింది.

దాంతో విద్యాసాగర్ ఖంగు తిన్నాడు. "నేను చావడానికి దూకానని నీకెవరు చెప్పారు?"అని ఎదురడిగాడు. అలా అడుగుతూ పెదాలు తుడుచుకున్నాడు. తియ్యగా అనిపించింది. ఇదేమిటి సముద్రం నీళ్ళు ఉప్పగా ఉండాలి కదా తియ్యగా ఉండటం ఏమిటి అనుకుంటూ ఇసుకలో పరుగులు తీయడం మొదలు పెట్టాడు. అలా పరుగులు తీసీ తీసీ అలిసిపోయాక ఒకచోట ఒగరుస్తూ వెల్లకిలా పడిపోయాడు.

సాగరతీర విహారానికి వచ్చిన లెక్కలేనంతమందిలో ఎంతోమంది అతనిని చూశారు. అతని ఉత్సాహానికి ముగ్ధులైనారు. అతనిలా తాముకూడా సర్వస్వం మరచిపోయారు. అయినా అతన్ని చూస్తే వారందరికీ అసూయ కలిగింది. ఎందుకంటే అతనంత స్వచ్ఛంగా తామెవరూ సముద్రాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. అలా కాసేపు వెల్లకిలా పడుకునేసరికి ఒంటికి పట్టిన చమటంతా ఆరిపోయింది. మరికాసేపటికి నాలుక పిడచకట్టుకుపోయింది. అందుకే నాలుకతో పెదాలు తడుపుకున్నాడు. ఈసారి మాత్రం ఉప్పగానే ఉంది. తీపంతా ఏమైపొయిందో తెలుసుకోవడం కోసం సముద్రంలోకి దిగాడు. గుక్కెడు నీళ్ళు నోట్లో పోసుకున్నాడు.

ఆ నీళ్ళు ఇంకా ఉప్పగా ఉన్నాయి.

అప్పుడా కడలిని పరీక్షగా చూస్తూ,"తెలిసిందిలే నువ్వెందుకు ఉప్పగా ఉన్నావో.., కాసేపు పరిగెత్తేసరికే నాకు చెమట్లు పోసి ఉప్పగా అయిపోయాను. నువ్వు పాపం నేను వచ్చినప్పటినించీ ఉరుకులు పెడుతూ ఉరకలు వేస్తూ క్షణం తీరికలేకుండా ముందుకీ వెనక్కీ పరుగులు తీస్తూనే ఉన్నావు. అందుకే చెమట్లు కక్కీ కక్కీ నువ్వు ఉప్పగా మారిపోయావు కదూ?"అని అడిగాడు.
అప్పుడే ఆ కడలి తీరాన్నించీ వెనక్కి మళ్ళిన ఓ కెరటం ఒక్కసారిగా వెనుదిరిగి అతనివంకే కొరకొరా చూస్తూ." ఏమిటీ..? నేను చెమట్లు కక్కుకుంటున్నానా?"అంటూ తిన్నగా వెళ్ళి తీరానికేసి తల బాదుకుంది.

దాని అవస్థలు చూసి నవ్వుకుంటూ వెనక్కి తిరిగాడు విద్యాసాగర్. అప్పటికే చెన్నపట్టణాన్ని చీకట్లు ముసురుకుంటున్నాయి.

చీకట్లతోబాటు విద్యాసాగర్ గుండెల్ని కూడా గుబులు కమ్ముకుంది.

ఎక్కడికి వెళ్ళాలి ?

ఏమో.. !

ఏం చెయ్యాలి ?

ఏమో.. !

ఎలా బతకాలి ?

ఏమో.. !

ఆకలి ఎలా తీర్చుకోవాలి? ఏమో! నీరసాన్ని ఎక్కడ వదలాలి? ఏమో! కాళ్ళనెప్పులెలా తీర్చుకోవాలి? ఏమో!

అలా ఏమో ఏమో అనుకుంటూ నడుస్తూండగానే కాళ్ళు పీకీ పీకీ అతన్ని వచ్చినదారినే మళ్ళీ రైల్వేస్టేషన్ దగ్గరకి తీసుకువచ్చి దించాయి.

తను మళ్ళీ ఇక్కడికే ఎందుకు వచ్చినట్లు?

ఏమో!

అలాగే నడుచుకుంటూ ప్లాట్ ఫారమ్మీదకి వెళ్ళిపోయాడు. ఆ చివర ఉన్న బల్లమీద ముడుచుకు పడుకున్నాడు. ఎవరున్నా లేకపోయినా నీకు తోడుగా నేనుంటాను అంటూ అతన్ని ఆప్యాయంగా గుండెకి హత్తుకుంది నిద్రాదేవి.

దీపం ఉండగానే -- అత్తలూరి విజయలక్ష్మి

గేటు తెరిచిన శబ్దం, వెంటనే సార్ అన్న పిలుపు వినిపించి లాప్ టాప్ మీద  పని చేసుకుంటున్న మూర్తి ఓ సారి కళ్ళెత్తి చూసి, గట్టిగా పిలిచాడు “స్వప్నా! ఎవరో వచ్చారు చూడు..”

“ఎవరొచ్చారు?” స్వప్న వంట గదిలో నుంచి వచ్చి వీధి వాకిట్లోకి తొంగిచూసింది.

తెల్లటి ప్యాంటులో బూడిద రంగు చొక్కా టక్ చేసి, నల్లటి కోటు, కళ్ళకి కూలింగ్ గ్లాసెస్, కాళ్ళకి నిగ,నిగలాడే బూట్లు, నీటుగా దువ్వుకున్న క్రాఫ్ ... మొహానికి మాస్క్ ...చేతులకి గ్లౌస్ ...చూడ్డానికి క్లాస్ గా ఉన్నాడు.. ఎవరితను.. ఈయన ఆఫీస్ వాళ్ళెవరన్నానా ... అయితే మాత్రం ... లాక్ డౌన్ తీసారు కదా అని ఫోన్ చేయకుండా ఇంటికి రావడం ఏంటి?

కోపం అణచుకుని మొహం చిట్లించి అడిగింది “ఎవరు కావాలి మీకు?"

“నమస్తే అమ్మా.. సార్ లేడా” అడిగాడు అతను.

స్వప్న ఒకసారి లోపలికి చూసి మళ్ళి అతని వైపు తల తిప్పి “ఉన్నారు పని చేసుకుంటున్నారు.. మీరెవరు?” అడిగింది.

“నేనమ్మా ... నన్ను గుర్తుపట్టలేదా!” అడిగాడు.

మాస్క్ తో సగం, కూలింగ్ గ్లాస్సెస్ తో మిగతా సగం కప్పబడిన ఆ మొహం ఎవరిదో, ఎప్పుడు, ఎక్కడ చూసిందో ఆమెకేమి అర్ధం కాలేదు... లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది. ఆ మాటలు వినిపించి మూర్తి అక్కడికి వస్తూ “ఎవరు స్వప్నా! ఎవరొచ్చారు” అన్నాడు.

“ఏమో!” అన్నట్టు పెదవి విరిచింది. మూర్తిని చూడగానే ఆ వ్యక్తీ కూలింగ్ గ్లాసెస్ తీసి “సార్ నమస్తే.. మేడం నన్ను గుర్తుపట్టలేదు నేను సార్ శంకర్ ని మీరన్నా గుర్తు పట్టిన్రా” అన్నాడు.

“శంకర్...”  ఆలోచిస్తూ ఓ సారి ఆ పేరు ఉచ్చరించి... “నువ్వు... మీరు ... శంకర్ అంటే పాత న్యూస్ పేపర్లు కోనేవాడివి ..” అన్నాడు.

అతని మాట పూర్తీ కాకుండానే “అమ్మయ్య ...యాదికోచ్చిందా సార్ ... బాగున్నారా సార్!” కళ్ళనిండా నవ్వు పులుముకుని అన్నాడు.

మూర్తి స్వప్న వైపు చూసి, “మన శంకర్ స్వప్నా... పాత న్యూస్ పేపర్ లు కొనేవాడు కదా మన దగ్గర... అప్పుడప్పుడు వచ్చి ఫాన్స్ తుడవడం, ఇల్లంతా దులపడం చేసేవాడు కదా.. ఈ మాస్క్ ల వలన ఎవరు ఎవరో అర్ధం కావడం లేదు.. ఆ ఏవోయ్ ఎలా ఉన్నావు? ఎక్కడ ఉన్నావు ఈ మూడు నెలలు... పాపం లాక్ డౌన్ టైం లో షాపు క్లోజ్ చేసే ఉంచావుగా ...ఎలా గడిచింది మీకు.. ఇప్పుడు ఏం చేస్తున్నావు?” పరామర్శగా అడిగాడు మూర్తి..

చేతులు నలుపుకుంటూ అన్నాడు శంకర్... “ఆ దందా వదిలేసిన సార్ .... లాక్ డౌన్ టైంల కొత్త బిజినెస్ ఇస్టార్ట్ జేసిన మస్తు నడిచింది సార్ ... మొత్తం అప్పులన్నీ తీర్చేసిన... మెయిన్ రోడ్డు మీద సూపర్ మార్కెట్ పక్కన ఒక షాప్ తీసుకున్న ఇంతకు ముందు ఆడ మాచింగ్ బిలౌసల దుక్నముండే కదా... గది మూత బడింది.. ఆ ఓనర్ కాల్చేసి ఆల్ల సొంత ఊరికి పోయిండు.. నేను తీసుకున్న ...”

“అక్కడ తీసుకున్నావా! ఎందుకయ్యా ఈ టైం లో మెయిన్ రోడ్ మీద ఎందుకు తీసుకున్నావు ... కాలనీలోనే సేఫ్ కదా” అన్నాడు  మూర్తి.

“చెప్పిన కదా సార్ ఆ దందా ఇడిసిపెట్టిన ... కొత్త షాపుల అల్లం, సొంటి అమ్ముతున్న... గాడనే కషాయం లు గూడ చేసి అమ్ముతున్న... మస్తు నడుస్తుంది సార్.. అరె ఏం దందా సార్  అల్లం, సొంటి కిలోలకు కిలోలు కొంచపోతున్నరు ... లాక్ డౌన్ తీసినంక అయితే ఇంకా మస్తు నడుస్తుంది... పక్కనున్న గాజుల దుక్నం గూడ లాస్ ఒచ్చి కాల్చేసి పోయిన్రు .. అది గూడ తీసుకుని ఆడ అల్లం, సొంటి తోని ఓమ, మిరియాలు, వేపాకులు, కర్పూరం అన్నీ పెడుతున్న ... ఇయాల కొత్త దుక్నం ఓపెనింగ్ సార్ ... అప్పుడు లాక్ డౌన్ ల తీసుకుంటి ఓపెనింగ్ చేయలే ఏం చేయలే .. అందుకే ఇయాల ఓపెనింగ్ కార్పొరేటర్ సార్ తోని చేయిస్తున్న .. తమరు ఒక్క ఐదు నిమిషాలు వచ్చి పొండ్రి సార్ ... మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి పొండ్రి”  అని చెప్పి, స్వప్న వైపు తిరిగి “అమ్మా! నీకు అల్లం, మిరియాలు, సొంటి, వేపాకు, ఓమ ఏం కావల్నన్న ఒక్క ఫోన్ కొట్టు  పంపిస్తా ... వస్తానమ్మా.. వస్తా సార్ ... తప్పకుండ వచ్చి పో సార్ పదకొండు గంటలకి ఓపెనింగ్..” మరోసారి ఒంగి, ఒంగి నమస్కారాలు పెట్టి గేటు బయట పెట్టిన కొత్త బండి మీద వెళ్ళిపోయాడు.

దిమ్మేరపోయినట్టు నిలబడిపోయిన మూర్తి భుజం మీద తట్టి “హలో ఏంటి షాక్ కొట్టిందా... దీన్నే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోడం అంటారు... వెళ్లి రండి పాపం ఎన్నో ఏళ్ల నుంచి మన దగ్గర పాత పేపర్ లతో పాటు పాత సామాను ఏమున్న తీసుకుని వెళ్ళేవాడు..” అంది స్వప్న.

ఆనందలత -- కాసాల గౌరి

"ఏవండోయ్ రండి భోజనం చేద్దాం" వంటింట్లోంచి పిలిచింది లత... 

"వచ్చుఁ చుంటిమి..రాజు వెడలె రవి తేజ ము లలరగా" రాగ యుక్తంగా అంటూ వంటింట్లోకి వెళ్ల బోయాడు. 

లత ముసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంది. పెళ్ళై నప్పటి నుంచి చూస్తోంది..ఆనంద్ ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. చేసేది ఓ మోస్తరు ఉద్యోగమే అయినా ఆనందంగానే ఉన్నారు.
తనకంటూ కొన్ని ఆదర్శాలు ఉన్నవాడు ఆనంద్.. అందులో ముఖ్యమైనది "డబ్బు సంపాదనలో పడి జీవితాన్ని కోల్పోకూడదు" అని అతని ధృడ నిశ్చయం. డబ్బు సంపాదించాలని వ్యాపారం మోజు లో పడి... అది తలకిందులు అయిపోవడం వల్ల గుండెపోటుతో మరణించిన తండ్రి జీవితం అతనికి గట్టి పాఠమే నేర్పింది.

ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.

"ఆహో! ఈ సమయమున ఎవరోహా" అని నాటకంగా అంటూ వెళ్ళి తలుపు తెరిచాడు. 

ఎదురుగా ఒక 14 ఏళ్ల కుర్రాడు."సార్ లతమ్మ గారి, దగ్గర మా మేడం బట్టలు కొన్నారట. ఆ డబ్బులు ఇచ్చేసి రమ్మన్నారండి అంటూ కొన్ని నోట్లు అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు.

ఆనంద్ కి ఆశ్చర్యo కోపం రెండు వచ్చేయ్. నిగ్రహించుకుంటూ వంటింట్లోకి వెళ్ళాడు.

"రండి రండి ఈ రోజు మనింట్లో తాజా కూరలలో రాజా....ఓ పట్టు పట్టండి" అంటూ గుత్తి వంకాయ కూర వడ్డించింది ఆనంద్ కంచంలో.

తనూ హాస్యంగా పాట అందుకుంటాడేమో అనుకున్న లతకి ఆనంద్ ముభావంగా ఉండటం చూసి ఆశ్చర్యం వేసింది. పెళ్ళైన ఇన్ని నెలలు లేనిదీ ఆనంద్ చాలా ముభావంగా అన్నం తినేసి లేచి వెళ్లిపోయాడు.

లతకి మొదటిసారిగా బెరుకు అనిపించింది. వంటిల్లు సర్దుకుని బయటకు వచ్చేసరికి ఆనంద్ నిద్ర పోతున్నాడు.

"ఏమై ఉంటుందబ్బా..?. పెళ్లైన యేడాదిలో ఎప్పుడూ ఇలాంటి సన్నివేశం తనకి ఎదురవ్వలేదు.
సాయంత్రం వరకు అన్యమనస్కంగా పుస్తకాలు తిరగేసింది. ఆనంద్ లేచి బయటకు రావటంతో లోపలికెళ్ళి కాఫీ కలిపి తీసుకు వచ్చింది.

ఆనంద్ మొహం తేటగానే ఉంది. "కూర్చో లతా నీతో కొంచెం మాట్లాడాలి" అన్నాడు సౌమ్యంగానే.

ప్రశ్నార్థకంగా చూసింది.. 

"లతా మనం పెళ్లి అయిన వెంటనే నేను నీకు నా పద్ధతి చెప్పాను. జీవితాన్ని అనవసరంగా సమస్యల మయం చేసుకోవటం నాకు ఇష్టం లేదు. మన ఆనందం మన చేతుల్లోనే ఉంది అని నేను గాఢంగా నమ్ముతాను. లేనిపోని ఆశలు కు పోయి సమస్యలు కొని తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు.

"ఏంటండీ అసలు ఇదంతా..... అని లత ఏదో చెప్పబోయే లోపల నన్ను పూర్తి చేసేయనీ" అన్నాడు.
ఇందాక భోజనానికి ముందు. మీ స్నేహితురాలు నౌకరు వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. నీ దగ్గర ఏవో బట్టలు కొన్నదిట కదా.... కరోనా వల్ల మనకి సగం జీవితమే వస్తుందని తెలిసినపుడే నేను నిన్ను అడిగాను కదా "సరిపోతుందా" అని. నువ్వు గూడా "పర్వాలేదండి తగినట్టే వాడుకుందాం అన్నావు కదా." మరి ఏం తక్కువయిందని ఈ బట్టల వ్యాపారం ప్రారంభించావు. నాకు వ్యాపారం అంటే బొత్తిగా కిట్టదని నీకు తెలుసుకదా..  వ్యాపారంలో లౌక్యం పేరిట మోసం తప్పదని నాకు నమ్మకం. మా నాన్న అది చేయలేక జీవితాన్ని నరకం చేసుకున్నారు. అందుకనే నేను నా జీవితాన్ని సాదా సీదా గా గడిపేద్దామనుకొన్నాను.
ఎక్కువ బాదరబందీ లేని ఉద్యోగం లో చేరాను.
"డబ్బు సరిపోదు అన్న ప్రశ్న మనకు రాకూడదు అని కూడా నీకు చెప్పాను ఎంత ఉంటే అంతే  సర్దుకున్నాం అన్నాను కదా."

వింటున్న లత మొహం ఎర్రగా కందిపోయింది. కోపంతో.

ఇంతేనా ఈయన నన్ను అర్థం చేసుకుంది. ఈయన ఆదర్శాలు తెలిసి కూడా ఇలాంటి  లంపటాలు నేను పెట్టుకుంటానా....అందులోను ఈయనకి బొత్తిగా నచ్చని వ్యాపారం ఎందుకు చేస్తాను.. అదీ ఈయనకి తెలీకుండా.. విషయం తెలుసుకోకుండా ఏమిటీ అపవాదు. రకరకాల ఆలోచనలు సుళ్ళు తిరిగాయి లతలో.

అసలు విషయం వివరించాలని కొంచెం విసురుగానే తలెత్తింది.

ఆనంద్  ముఖంలో అదే సౌమ్యత.

లత ఒక్కసారిగా తెలివి లోకి వచ్చింది "మన మధ్యవాగ్వివాదాలు గొడవలు వద్దు లతా... ఆవేశాలు తొందరపాటుతనం తో అరచుకోవడం... అపార్ధాలు తొలిగాక కలసి పోవడం మళ్ళీ దెబ్బలాటలు ఇదేనా జీవితం.. మనమ్ అస్సలు ఆలా  ఉండద్దు... లతా ఒకవేళ మరొకరి మీద కోపం వచ్చిన సామరస్యంగానే మనం అడగాలి. పెళ్లైన కొత్తలోనే తనకి చెప్పి వాగ్ధానం తీసుకున్నాడు ఆనంద్.

ఇప్పుడు తన వ్యాపారం చేసిందేమో అని అనుకున్నా ఎక్కడా ఆవేశం లేదు సౌమ్యంగా అడిగాడు. ఆ మాత్రం పొరపాటును కూడా తను సహించ లేదా..ఆమెలో వివేకంమేల్కొంది.

హాస్య ధోరణిలో “అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా పడ్డావు లే బుల్ బుల్ పిల్లోడా...” అంటూ ప్రారంభించింది. ఆనంద్ కి  అసంకల్పితంగానే  చిరునవ్వు వచ్చింది.

లేచి ఆనంద్ కూర్చున్న కుర్చీ చేతి మీద  కూచుని కొనసాగించింది. పొద్దున నేను పక్కింటావిడ మాట్లాడుకుంటుంటే ఒక అమ్మాయి బట్టలు పట్టుకుని వచ్చింది. సందు చివర చిన్న షాపు ఉంది అమ్మాయికి. షాపు చిన్నదైనా మంచి నాణ్యమైన బట్టలు అమ్ముతుంది. అమ్మాయి అసిస్టెంట్ కి కరోనా రావడం వల్ల షాప్ మూసివేయాల్సి వచ్చింది. అందుకని కొంచెం దగ్గరలో తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో అమ్ముదామని పట్టుకొచ్చింది. వాళ్ళది క్రింది మధ్యతరగతి కుటుంబం. ఈ అమ్మాయి సంపాదనే ఆధారం. నాకు చాలా జాలి వేసింది. బట్టలు కూడా బాగున్నాయి. వరలక్ష్మీ వ్రతానికి పట్టు చీర కొనుక్కోడానికి కూడబెట్టిన డబ్బుతో నాలుగు డ్రెస్సులు  కొనేసాను.. బట్టల మీద కరోనా వైరస్ మూడు రోజులు ఉంటాయి అని ఎక్కడో చదివాను. అందుకని బయట టేబుల్ మీదే ఉంచేశాను.. అంతలోనే మా స్నేహితురాలు వచ్చి వాటి ఖరీదు విని ఆశ్చర్యపోయి తనకి ఇచ్చేయమని బతిమిలాడింది. షాపు దగ్గరే కాబట్టి నన్ను మళ్ళీ కొనుక్కోమంది. ఆ అమ్మాయి మీద ప్రేమతో డ్రెస్సులు కొన్నా... నాకు చీరె  కొనుక్కోవడమే ఉంది. ‘ఆహా మంచితనానికి ఫలితం మంచే’ అని మనసులో గంతులేస్తూ ఇచ్చేశాను. ఇదంతా పొద్దున్నే వెంటనే వెంటనే జరిగిపోయింది  మీకు చెప్పాల్సిన అవకాశం రాలేదు. అవసరమనీ అనిపించలేదు..” ఇదీ విషయం మహాశయా కొద్దిగా వంగి రెండు చేతులు నాటకీయంగా పక్కకి  పెట్టి అంది. 

ఆనంద్ మొహంలో గొప్ప రిలీఫ్ తో పాటు చిన్న పశ్చాత్తాపం....సారీ.. ఏదో అనబోతుంటే అతని నోటి మీద సున్నితంగా చెయ్యి అడ్డు పెట్టి.

సా రీ గ మ.... పా... శారీ కొనాలీ.... రాగయుక్తం గా పాడుతున్న లతను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు ఆనంద్. 

Posted in July 2021, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!