Menu Close
బావా బావా పన్నీరు!
-- వెంపటి హేమ --

సెలవు రోజు కావడంతో ఆ అపార్టుమెంట్ లోని పిల్లలంతా లాన్ లో చేరి ఆడుకుంటున్నారు. తనకూ సెలవే కావడంతో తన గదిలో లాన్ వైపున ఉన్న కిటికీ దగ్గర నిలబడి వాళ్ళను చూస్తున్న సృజనను ఇంటర్ నేషనల్ ఫోన్ కాల్ ఎలుగెత్తి పిలిచింది. పరుగున వచ్చి ఫోన్ అందుకుని “హలో” అంది సృజన ఇండియన్ స్టైల్లో పలకరింపుగా.

అవతల వ్యక్తి వెంటనే, “హాయ్ సృజనా! మాటాడుతున్నది నీ బావ శివ! నా పరీక్షలు ఐపోయాయి. పేపర్లన్నీ బాగా రాశాను. త్వరలో ఇండియా వచ్చేస్తున్నా. మన వెడ్డింగ్ బెల్సు మ్రోగడానికి ఇక ఎక్కువ సమయం పట్టదు. హేపీ కదూ” అన్నాడు శివ సంతోషంగా.

వెంటనే, "ఏం కాదు. ఈ మాట నీకు ఎన్నోసార్లు సూచనగా చెప్పా. కాని నువ్వు గ్రహించినట్లు లేదు. మళ్ళీ చెపుతున్నా, విను - ఈ పెళ్లి జరగదు“ అంది సృజన ఉక్రోషంతో.

శివ తెల్లబోయాడు. “ఇదేమి మాట! మన పెళ్లి గురించి నువ్వు పుట్టినప్పటినుoడి అంతా అనుకుంటున్నదే కదా, కొత్తగా ఏమొచ్చింది?” ఆశ్చర్యంతో అడిగాడు.

“అదే నాకు నచ్చనిది. పెళ్లి అన్నది ఎవరి ఇష్ట ప్రకారం వాళ్లకి జరగడం బాగుంటుoది. అంతేగాని ఎవరో నిర్ణయిస్తే కాదు,” పెడసరంగా జవాబిచ్చింది సృజన.

శివకి ఆశ్చర్యం ఇనుమడించింది. “ఎవరో - అంటావేమిటి సృజనా? వాళ్ళు మన శ్రేయస్సుకోసం పాటుపడే మన పేరెంట్సు కదా?”

“అయినా సరే! నా కా పధ్ధతి ఇష్టం లేదు. నా పెళ్లి నా ఇష్టప్రకారమే జరగాలి. నచ్చిన వ్యక్తితో నాకు పరిచయమయ్యాక, డేటింగ్ జరగాలి. దానిద్వారా ఒకరినొకరు అర్థం చేసుకున్నాక, పూర్తి ఇష్టంతో నా భర్తను నేనే నిర్ణయించుకున్నాక, అతన్ని పెద్దవాళ్ళకి పరిచయం చేస్తా. అప్పుడు వాళ్లకు ఇష్టమైతే మా పెళ్లి వాళ్ళు చేస్తారు, లేదా అదీ మేమే చేసుకుంటాము. అయినా ఇదంతా నీకు అనవసరం. మన పెళ్ళి జరగదని అర్థం చేసుకో, చాలు” అంది. అంతే కాదు, “తెలిసిందా” అంటూ రెట్టించింది కూడా.

“తెలియకపోడం ఏమీ లేదు. నీ మాట అర్థమయ్యింది.” శివ మనసు గాయపడింది. అయినా శాంతాన్ని కోల్పోకుండా జవాబు చెప్పాడు, “సరేగాని, “డేటింగ్” లాంటి వాటికి మన పెద్దవాళ్ళు ఒప్పుకోరు కదా! అదెలా కుదురుతుంది?”

“ఎందుకు కుదరదు? మనకు అడుగడుగునా ఎలెక్ట్రానిక్ మీడియా తోడుంది. ముందునుండీ అందరికీ ఈ విషయం చెప్పనక్కరలేదు. ఎలెక్ట్రానిక్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తుల్లో, ఈడూ జోడూ బాగున్నవారి ఫోటో చూసి మనకు నచ్చిన వ్యక్తిని ఎంచుకుని, మొదట పరిచయం పెంచుకోవాలి. ఒకరి పద్ధతులు ఒకరికి నచ్చినపుడు వారి మధ్య తప్పకుండా స్నేహం కలుస్తుంది. మనసులు విప్పి మాటాడు కున్నాక, ఇద్దరి అభిరుచులు, ఆలోచనలు ఒకటై, ఒకరికొకరు అర్థమైన పిమ్మట ఇద్దరిమధ్య ప్రేమ దానంతటదే పుడుతుంది. అప్పుడు ఒకచోట కలుసుకుని, మనసువిప్పి మాటాడుకుని  పెళ్ళికి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు చెప్పాలి పెద్దవాళ్ళకు - త్వరలో పెళ్ళికి ముహూర్తాలు పెట్టించమని! ప్రేమికుల వివాహంలో ఎంతో “థ్రిల్“ ఉంటుంది. దానిని ఒదులుకోడం నాకు ఇష్టం లేదు. ఈ రోజుల్లో డేటింగ్ పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ఈ ప్రోసెస్ ని సులభతరం చేస్తూ వెబ్ మీద ఎన్నో డేటింగ్ చానల్సు ఉన్నాయి. వాటిలో ఎన్నో డేటింగ్ రిక్వెస్టులు ఉంటాయి. వాటితో పాటుగా వచ్చిన డేటా నచ్చితే, డేటింగ్ రిక్వెస్టును యాక్సెప్టు చెయ్యోచ్చు. లేదా మనమే ఒక రిక్వెస్టు పెట్టవచ్చు. అలా నీకు నచ్చిన వ్యక్తిని ఎంచుకుని, ఆ పై  ఛాటింగ్ ద్వారా మనసులు విప్పి మాటాడుకుని పరిచయాలు పెంచుకొని, ఒకరినొకరు అర్ధం చేసుకోవచ్చు. ఆ తరవాత ఇకనేముంది - ప్రేమ, పెళ్లీను. నాకదే నచ్చుతుంది. ఇదంతా నీకు ఎందుకు చెపుతున్నానంటే, నీకు కూడా పనికొస్తుంది కదాని. నువ్వుకూడా ట్రయి చెయ్యి” అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది సృజన.

శ్రీమంతులైన తల్లి తండ్రులకు లేకలేక పుట్టున అపురూప సంతానం కావడంతో అతిగా గారాబం చేసి - ఆడింది ఆటగా, పాడింది పాటగా - సృజనను పెంచారు ఆమె తల్లిదండ్రులు. ఆమెకు అక్షరాభ్యాసం “ఆల్ఫాబెట్స్” తోనే జరిగింది. చిన్నప్పటినుండి కాన్వెంట్ లో చదువుకున్న సృజనకు మాతృభాషయైన తెలుగు చదవనూ, రాయనూ రాదు, మాట్లాడడం వరకే చేతనౌను. చదవడం రాకపోడంతో ఆమెకు భారతీయ సాహిత్యంతో ఎంతమాత్రం పరిచయం లేదు. లిటరేచర్ లో డిగ్రీ తీసుకున్న సృజన ఇంగ్లీష్ సాహిత్యoతో పాటు ఇంగ్లీషువారి సంస్కృతిని కూడా ఒంట పట్టించుకుంది. అలాంటప్పుడు ఆమె డేటింగ్ చేసి ప్రేమించి, ఆపై ఆ ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలననుకోడంలో ఆశ్చర్యమేముంది? పెద్దలు కుదిర్చిన సంబంధం కావడం - అన్న ఒక్క కారణంతో అన్ని విధాలా సమర్ధుడైన మేనబావ శివ ఆమెకు నచ్చకుండాపోయాడు. సృజన దృష్టిలో అతడు "జిడ్డు బావ!"

#          #         #

శ్రీనివాసరావు, సృజన తండ్రి, బిజినెస్ లో బాగా సంపాదించాడు. చాలా కాలం వరకూ వారి సంపాదనకు వారసులు కలుగ లేదు. ఎట్టకేలకు ఒక్క కూతురు పుట్టింది. ఆ పసిపాపను ఎత్తుకుని “మా శివకు పెళ్ళాం పుట్టింది” అంటూ మురిసిపోయింది శ్రీనివాసరావు చెల్లెలు కల్యాణి. తల్లి పక్కనే ఉన్న నాలుగేళ్ళ శివశంకరం మనసులో అప్పుడే ఆ మాట ముద్ర పడిపోయింది.

శ్రీనివాసరావు దంపతులకు మేనరికం ఇష్టమే. స్ఫురద్రూపి, తెలివైనవాడు, బుద్ధిశాలి ఐన మేనల్లుడుకి పిల్లనిచ్చి పెళ్ళిచేసి, తన బిజినెస్ కి వారసుణ్ణి చెయ్యాలన్న ఉద్దేశంతోనే, ఇండియాలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉన్న శివను MBA చదవడానికి తన ఖర్చుతో అమెరికా పంపించాడు శ్రీనివాసరావు. శివ చదువు అయ్యి రాగానే వాళ్ళ పెళ్ళి జరిపించే ఉద్దేశ్యంతో ఉన్నాడు ఆయన.

డిగ్రీ పాసైన సృజనకు ఉద్యోగం చెయ్యాలని మనుసు పుట్టింది. ఆమెకు నచ్చిన ఉద్యోగం దగ్గరలో ఉన్న పట్నంలో వచ్చింది. తల్లిదండ్రులకు కూతురు ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేకపోయినా, ఆమె పంతం పట్టి, తన పంతం నెగ్గిoచుకుంది. శని ఆదివారాలు ఇంటికి వచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని, ఎంతో కష్టం మీద వాళ్ళు సృజనను  ఉద్యోగం చెయ్యడానికి  హైదరాబాదు పంపించారు. ఉద్యోగంలో చేరిన సృజన, లేడీస్ హాస్టల్లో మకాం పెట్టింది.

శివకు తన మనసులోని మాట చెప్పేసిన తరవాత సృజనకు తల బరువు సాంతం దిగిపోయినట్లనిపించింది. వెంటనే తీరికైనప్పుడల్లా వెబ్ లోని డేటింగ్ చానల్సు సెర్చి చెయ్యడం  మొదలుపెట్టింది.

ఎలెక్ట్రానిక్ మీడియాలో ఉన్న ఆపర్చ్యూనిటీలు కాక  ప్రత్యేకంగా డేటింగ్ చానల్సు -  టిండర్, ప్యూపెన్ , క్యూపిడ్, హింజ్ - ఇలా ఎన్నెన్నో, చిత్ర విచిత్రమైన పేర్లతో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. సృజన వాటిని బ్రౌజ్ చేస్తూండగా “ఇరాస్” అనే డేటింగ్ ఛానెల్లో ఒక డేట్ ఆమెకు బాగా నచ్చాడు. పేరు మహేశ్! ఊరు - లక్నో. ఆంధ్రప్రదేశ్ నుండి అక్కడకి వలస వెళ్ళిన తెలుగువాళ్ళుట! చదువు - ఎలక్ట్రానిక్సు ఇంజనీర్. ప్రస్తుతం నిరుద్యోగి. వీలయితే పైచదువు చదవాలని ఉందిట అతనికి. ఫోటోనిబట్టి చూస్తే స్ఫురద్రూపి! ఎత్తు ఆరడుగుల రెండంగుళాలట! అతని రూపం కూడా సృజనకు బాగా నచ్చింది. గాలికి ఎగిరే ముంగురులతో చక్కని క్రాపు, సోల్జర్ మీసం, కొద్దిగా పెరిగిన గరుకు గడ్డం. ఒక చెవికి చిన్న లోలాకు, కోఠెరు లాంటి ముక్కు, కళ్ళజోడులోనుండి కూడా గుచ్చిచూసే వాడైన చూపులు, సిక్సు పేక్ బాడీ! "జీన్సు, టీ షర్టులో స్మార్టుగా - బలేగా ఉన్నాడు" అనుకుంది సృజన. అంతేకాదు; ఆమె మనసులోకి మరో ఆలోచన కూడా వచ్చింది ...

“పురిషెడు కొబ్బరి నూనె తలకి పట్టించి, తిన్నగా మధ్య పాపిడి తీసి, నున్నగా తలదువ్వి, మొహమంతా నూనె కారుతూ తిరిగే శివశంకరం బావ జిడ్డు వదిలించుకుని మంచి పని చేశాను” అనుకుని మురిసిపోయింది.

వెంటనే మరేమీ ఆలోచించకుండా- మహేశ్ డేటింగ్ రిక్వెస్టుని యాక్సెప్టు చేసేసింది సృజన. మరుక్షణం అతనికి తన డేటా కూడా పంపించేసింది. అతడు కూడా యాక్సెప్టు చెయ్యడంతో వారిమధ్య ఛాటింగ్ మొదలయ్యింది. ఒకరికొకరు సెల్ఫోన్ నంబర్లు పంపుకున్నారు. సృజన నంబర్ అందిన వెంటనే అతడు ఫోన్ చేశాడు...

ఫోన్ నంబర్ చూడగానే సృజన మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది. ఫోన్ చెవికి ఆనించుకుని, “హలో” అంది లోయెలుగుతో.  ఏదో తెలియని బిడియంతో గొంతు వణికింది.

“హాయ్ సృజనా! హౌ ఆర్ యు?” మహేష్ కంఠం గంభీరంగా ఉంది.

మహేశ్ హస్కీ వాయిస్ ఆమెకు గిలిగింతలు కాగా ఆమె మేను పులకరించింది. “నేను బాగున్నాను. నీ కాల్ కోసమే ఎదురుచూస్తున్నాను మహేశ్” అంది సృజన నునుసిగ్గుతో.

అలా మొదలయిoది వాళ్ళ డేటింగ్. వాళ్లిద్దరూ ఇంగిలీషులోనే మాటాడుకునేవారు. అనతికాలంలో వాళ్ళ మధ్యనున్న పరిచయం ముదిరి స్నేహంగా రూపొందింది. చనవు పెరిగినకొద్దీ వాళ్ళ మధ్య స్వీటీలు, డార్లింగులు పలకరింపులుగా మారాయి. ఏమాత్రం వీలు కుదిరినా తరచుగా ఫోన్లలో మాటాడుకుంటూ, వాట్సాప్ లో పరస్పరం సేల్ఫీలు పంపుకుంటూ, వీడియో కాల్సు చేసుకుంటూ ఆత్మీయతను పెంచుకోసాగారు. మహేశ్ తనకు ఇష్టమని ఏది చెప్పినా, ఆశ్చర్యంగా అది తనకూ ఇష్టమే కావడం అన్నది సృజనకు వింతగా ఉండేది. చివరకు, మహేశ్ తనూ “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అన్న ఆలోచన రావడంతో, ఆమె మనసులో అతనిపైన ప్రేమ పుట్టి, క్రమంగా దినదిన ప్రవర్ధమానమై పెరగసాగింది. అతనిపై ఆమె పిచ్చి పిచ్చిగా ప్రేమను పెంచుకుంది.

మొదట్లో పిచ్చాపాటీగా మొదలైన వారి సంభాషణ క్రమంగా ఊపందుకుంది. తమతమ కుటుంబాలను గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు. మహేశ్ - తనకు తల్లి లేదనీ, తండ్రే తనకు అన్నీ అయ్యి పెంచి పెద్ద చేశాడనీ, తనకోసం ఆయన అవకాశం ఉన్నాకూడా, మరో పెళ్ళిమాట తలపెట్టకుండా ఉండిపోయాడనీ చెప్పాడు. ఆ మరు క్షణంలోనే సృజన మనసు ఆ పెద్దాయన ఎడల ఆర్ద్రతతో నిండిపోయింది.

సృజన కూడా తమ ఊరు గురించి, తన తల్లితండ్రులను గురించి అతనికి వివరించి చెప్పింది. తనొక కోటీశ్వరునికి లేకలేక కలిగిన ఏకైక పుత్రికనీ, తనకు డబ్బుకు కొదువ లేదనీ కూడా చెప్పింది అతనికి.

మహేశ్ వెంటనే తన సందేహాన్ని వెలిబుచ్చాడు, “సామాన్యుడనైన నేను మీవాళ్ళకి నచ్చుతానో లేదో” అంటూ.

ఆ మాటకు  సృజన నొచ్చుకుంది. “అలా అనుకోవద్దు మహేశ్! మా నాన్న కలాంటి పట్టిoపులు లేవు. మేము తప్ప మా కుటుంబంలోని మిగిలిన వాళ్ళంతా మధ్యతరగతి వాళ్ళే. అయినా అదేమీ పట్టిoచుకోకుండా మా నాన్న మా బావకు నన్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు, తెలుసా!”

“హతవిధీ! ఐతే నాకో రైవల్ ఉన్నాడన్నమాట! మరి నువ్వు మీ బావనే పెళ్లి  చేసుకోవచ్చు కదా!”

“ఛ! అదేం కుదిరే పని కాదు. మా బావ స్టయిల్ నా కస్సలు నచ్చదు. ఆ జిడ్డు మొహాన్ని నేనెప్పుడూ రెండుకళ్ళూ తెరిచి చూసిందే లేదు. మా బావతో పెళ్లి ఇష్టంలేకే కదా నీతో ఈ ...”

ఆమెను మాట పూర్తిచెయ్యనివ్వలేదు మహేశ్. “సరి సరి! అర్థమయింది. స్టైల్ మారిస్తే నీకు నచ్చుతాడేమో మీ బావ!”

“మ్చు! నా కలాంటి ఆశలేమీ లేవు. పైగా అది మా పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి. అది నాకు అస్సలు ఇష్టం లేదు. నా పెళ్ళి నేనే నిర్ణయించుకోవాలి. నాపెళ్ళి నేను కోరుకున్న వాడితోనే జరగాలి. అది నా కఠోర నిర్ణయం. ఎప్పటికీ మారదు.”

“భేష్! ఐతే నా రొట్టె విరిగి నేతిలో పడిందన్నమాటే కదా!” ఆనందంగా నవ్వాడు మహేశ్.

ఆ తరవాత మహేశ్ పిలుపు "సృజనా!" నుండి "సజనీ" కి మారింది. “సజనీ! మనం కలుసుకొనేది ఎప్పుడు? ఇంకా ఎన్నాళ్ళు ఆగాలి? ఇలా ఉత్తుత్తి గాలి కబుర్లతోనే కాలం గడిచిపోడం నాకేమీ బాగాలేదు!” మహేశ్ కంఠంలో విసుకు ధ్వనించింది.

“నువ్వు ఎప్పుడంటే అప్పుడే మనం కలుసుకుందాం. నీకు వీలు కుదరగానే ఇక్కడికి వచ్చెయ్యి డార్లింగ్. నేను కూడా ఆఫీసుకి సెలవు పెడతాను.”

“నెక్స్టు వీక్ లాంగ్ వీకెండ్ కదా నీకు! ఆపై ఒక ఐదు రోజులు సెలవు పెట్టు. నీ సెలవు గ్రాంట్ అవ్వగానే రెక్కలు కట్టుకుని ఎగిరివచ్చి నీ పక్కన  వాలిపోతా. నీకు ప్రపోజ్ చేసి, నీ వేలికి - నేను ఆల్రడీ కొని ఉంచిన వజ్రపుటుంగరం తొడిగి, ఆపై హాయిగా నీతో కలిసి  ఎంజాయ్ చేద్దామని ఎంతో ఆశగా ఉంది డియర్! ఐ లవ్ యూ!”

“మీ టూ! ఐ లవ్ యూ మహేశ్! నెక్స్టు వీకెండ్ అంటే ఇంకా వారముంది. క్షణమో యుగంగా మారి కాలం ఒకపట్టాన గడవదు కదా” అంటూ ఉసూరుమంది సృజన. ఫోన్లో అవతలవైపునుండి నవ్వు వినిపించింది. సృజన దాన్ని పాజటివ్ గానే తీసుకుంది.

అంతలో పనిమనిషి రావడంతో సృజన,“బై” చెప్పి ఫోన్ కట్ చేసింది.

(ముగింపు వచ్చే సంచికలో)

Posted in July 2021, కథలు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *