సామెతలతో చక్కని కధలు
- ఆదూరి హైమావతి
యధారాజా తధాప్రజ
అనగనగా అవనీపురం అనే రాజ్యాన్ని అఘోరవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన చాలా శూరుడూ, ధీరుడూనూ. చుట్టుపక్కల రాజ్యాలవారిని తన శౌర్యంతో భయపెట్టి ఎవ్వరినీ తన రాజ్యం చాయలకు చూడనే సాహసించని విధంగా చేశాడు. ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే కఠినంగా దండించేవాడు. అతడిని చూసి మంత్రులూ సేనాధిపతులూ, వారిని చూసి సేవకులు కూడా స్వంత దేశపు ప్రజలపట్ల కఠినంగా ఉండేవారు. రానురానూ జనం సేవకులు, రాజోద్యోగులూ బయట తిరిగేప్పుడు బయటికి రానే భయపడసాగారు. కనిపించినవారినంతా 'ఇక్కడ ఎందుకున్నావ్? ఎవరితోపని? ఎవరి కోసం?’ అంటూ వేధించసాగారు. జనం బయట ఎవ్వరూ రాజోద్యోగులు లేని సమయంలోనే బయటికి వచ్చి తమ పనులు చక్కబెట్టుకుని వెళ్లసాగారు. ఆలయాలకు సైతం వెళ్లను ప్రజలు భయపడసాగారు. వ్యాపారం చేసుకునేవారు రాజోద్యోగులకు భయపడి, వారు లేనపుడు జనం రాగానే వారికి కావలసిన సరుకు ఆలస్యంకాకుండా ఇచ్చి పంపసాగారు. ఆ సమయంలో రాజోద్యోగులు వస్తే జనాలను కూడా తమ అంగళ్ళ లోనికి రానిచ్చి తలుపులు వేసేసి ఉద్యోగులు కనుమరుగయ్యాక, గవాక్షాల్లోంచీ చూసి వారికి సరుకులిచ్చి పంపసాగారు. నగరంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా ఉండసాగాయి. ఎవ్వరూ ధైర్యం చేసి మహారాజుకు తమ ఇబ్బందులు చెప్పుకోను ముందుకు రావడంలేదు. వ్యాపారాలు తగ్గిపోయాయి. ఆలయాలు ఇంచుమించు మూతబడ్దాయి. సరుకులూ, కూరగాయలూ, పండ్లూ అమ్ముకునేవారు తమ వస్తువులు అమ్ముకోను ఎప్పుడు బయటికి రావాలో తెలిక రాజోద్యోగులకు ఝడిసి దొరికిన కాడికి కనిపించిన వారికి అమ్మేసి వెళ్ళిపోసాగారు. అలాంటి సమయంలో దేశవిదేశాల్లోని పురాతన ఆలయ దర్శనాలకు వెళ్ళిన కులగురువు తిరిగి తమ ఆశ్రమానికి వచ్చారు. కొత్తగా రాజ్యపాలన చేపట్టిన తన శిష్యుడైన మహారాజును చూడను ఆయన తమ శిష్యగణంతో నగరంలోకి వచ్చారు. ఎక్కడ చూసినా రహదారులన్నీ నిర్మానుష్యంగా ఉండటం ఆయన్ని ఆశ్చర్యపరచింది. ఏ ఒక్కరూ తమను చూడను, ఆశీర్వచనాలు అందుకోనూ రాకపోవడం మరింత ఆశ్చర్యపరచింది. నగరంలోని ఆలయాలన్నీ మూసి ఉండటం ఆయన్ను మరింత శంకకు గురిచేసింది. మహారాజుకు ఏమీ కాలేదుకదా! వేరే రాజులు రాజ్యాన్ని ఆక్రమించలేదుకదా!' అని అనుకుంటూ గబగబా రాజభవనంలోకి వెళ్లాడు. అక్కడ వున్న ద్వారపాలకులు "మీరెవరు? ఏరాజ్యం? ఎందుకొచ్చారు? అనుమతిపత్రం ఉందా?” అంటూ వారిని ఎంతో సేపు నిలువరించి అనేక ప్రశ్నలు వేయసాగారు. వారిని పై ఉద్యోగులవద్దకూ, ఆపైన వారు ఆపై ఉద్యోగులవద్దకూ, సేనాని వద్దకూ, ఆ తర్వాత మంత్రి వద్దకూ, వారు ప్రధాన మంత్రివద్దకూ పక్కన శూలాలు ధరించిన కాపలావారు వెంటవస్తుండగా తీసుకెళ్లారు. కులగురువు వారికి కొద్ది కొద్దిగా ఈ రాజ్య పాలన అర్ధంకాసాగింది. ప్రధానమంత్రి కులగురువులను చూసి ఆదరంగా ఆహ్వానించి, కాపలావారిని గద్దించి "వీరేవరనుకుని ఇలాతెచ్చారు? మన రాజ్యకులగురువులు. వీరికి ఎదురేగి ఎంతో గౌరవంగా ఆహ్వానించి తేవలసిన వారు" అంటూ "మన్నించండి దేవా!! వీరు కొత్తవారు. మీ గురించి తెలీదు. మన్నించండి" అంటూ వేడుకుని మహారాజు మందిరానికి తోడ్కొనిపోయాడు ముఖ్యమంత్రి.
మహారాజు కులగురువులను చూసి నమస్కరించి ఆదరంగా ఆహ్వానించి, ఆశ్చర్యంగా "తమరెప్పుడు విచ్చేశారు గురుదేవా!" అంటూ అర్ఘ్యపాద్యాలు సమర్పించుకుని అడిగారు. కులగురువులు "మహారాజా! మీతో కాస్త ఏకాంతంగా మాట్లాడాలి.” అని ప్రత్యేకమందిరంలో కెళ్ళి తాను చూసినదంతా, రాజమందిరంలో ప్రవేశించగానే తమకు జరిగిన తమ అనుభవమంతా వివరించి “కుమారా! నీవు పొరుగురాజ్యాలపట్ల ఎలా వున్నా మీ రాజ్యంలోని, నగరంలోని ప్రజలను భయపెడితే వ్యాపారాలు ఎలా జరుగుతాయి? ఆలయాలన్నీ మూతపడి పోయాయి. ప్రజల అన్ని రకాల కార్యకలాపాలూ కుంటుపడ్దాయి. జనం బయటికి రానే ఝడుస్తున్నారు. ఇదా పరిపాలనంటే?” అంటూ చాల సేపు అనేక విషయాలు బోధించి రాజ్యపాలనలో జరగాల్సిన మార్పులూ, చేర్పులూ బోధపరచాడు. సెలవుతీసుకుని తన ఆశ్రమానికి వెళ్లాడు. రాజు ప్రవర్తనలో మార్పు వచ్చిన కొద్ది రోజుల్లోనే మంత్రులు, సేనాధిపతులూ, సైనికులూ రాజోద్యోగులంతా మారిపోయారు. జనమంతా యధావిధిగా వ్యాపార కార్యకలాపాలు రోజంతా నిర్భయంగా చేసుకోసాగారు. మరుసటి మాసంలో తిరిగి కులగురువు నగరంలోకి అడుగుపెట్తగానే జనం పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ నమస్కరిస్తూ ఆశీస్సులు పొందుతూ ఎదురొచ్చారు. తన బోధ పనిచేసినందుకు కులగురువు సంతసిస్తూ 'యధారాజా తధాప్రజా’ అని మనస్సులో అనుకున్నాడు.