వీక్షణం 87 వ సమావేశం కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ లో నవంబరు 10 వ తేదీన జరిగింది. ఈ సమావేశానికి శ్రీమతి శారదా కాశీవఝల అధ్యక్షత వహించారు. ముందుగా బలివాడ కాంతారావుగారి కథ "అరచేయి" కథ గురించి చర్చ జరిగింది.
అక్కిరాజు రమాపతిరావుగారు కాంతారావు గారి స్నేహితులు. ఆయనను దగ్గరగా చూసిన వ్యక్తి గా కాంతారావు గారి గురించి కొన్ని జ్ఞాపకాలు పంచుకున్నారు.
కాంతారావు గారు సత్యము పలుకు వారు, బంగారం వంటి మనసు గలవారు. పి.వి. నరసింహారావు గారి సంకట పరిస్థితులల్లో కాంతారావు గారి సలహా తీసుకునేవారు. కాంతారావు గారు జాతకాలుకూడ వ్రాసేవారు దాని ప్రభావంతోనే "అర చేయి" అనే కథ వ్రాసి ఉండవచ్చని రమాపతిరావుగారు అన్నారు.
సభలోని ఇతర రచయితలు ఆ కథ గురించి రచనా శైలి గురించి మాట్లాడారు. కొందరు "రచనా శైలి బాగుందన్నారు కాని ముగింపు తమను ఆకర్షించలేదన్నారు", మరి కొందరు "మన జీవితాలను మనం మలచుకుంటాం కాని చేతి గీతల వల్ల జీవితాలు మారవు, మన జీవితాలు మనమే జీవించాలని చెప్పిన సందేశం నచ్చిందనీ" అన్నారు.
తరువాత ఈ సమావేశానికి సభాస్థలిని అందజేసిన శ్రీ కాకర్లముడి సుబ్బారావుగారు తమను తాము పరిచయం చేసుకుంటూ, వారి సాహిత్యాభిలాషను గురించి వివరించారు. ఈ సందర్భంగా తమ పితామహులు సుబ్బారావుగారు చేసిన సత్కార్యాలను తెలియ జేశారు.
ఆ తరువాత వంశీ గారి "పొలమారిన జ్ఞాపకాలు" నుంచి "పాతూరి వెంకట సుబ్బమ్మగారు" అనే వ్యాసాన్ని డా|| కె.గీత గారు సభకు చదివి వినిపించి అందులో "చిన్నా" ఎవరో చెప్పుకోవాలని అన్నారు.
అమ్మ పడిన కష్టాలు, మంచి స్థాయికి చేర్చడానికి ఆమె పడిన తపనలను నెమరు వేసుకుంటూ మనసులో ఏదోతెలియని ఆందోళనతో ప్రయాణం సాగించి ఊరు చేరిన చిన్నాని గుర్తు పట్ట లేని స్థితిలో ఉన్న తల్లిని చూసి తల్లడిల్లిపోయిన చిన్నా మనసు ఎంతటి దుఃఖాన్ని ఎదుర్కొన్నదో అన్న యదార్థ గాథ ను కళ్ళు చెమ్మగిల్లేలా వ్రాశారు వంశీగారు.
ఈ సందర్భంగా ఈ కథలోని చిన్నా అయిన కిరణ్ ప్రభ గారు తనని గురించి వంశీ గారు రాయడం గురించిన కథానేపథ్యాన్ని సభలోని వారితో పంచుకున్నారు.
తరువాత డా|| కె.గీత తన "సిలికాన్ లోయ సాక్షిగా" కథా సంపుటిని సభకు పరిచయం చేశారు. ఈ పుస్తక ఆవిష్కరణ లాంఛనంగా శ్రీ అక్కిరాజు రమాపతిరావు, శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు, శ్రీ వెంకట రమణ గార్ల చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా వెయ్యి చేతులతో పనులు చేసే డా|| కె.గీతను మినీ మిర్చీల కవి శ్రీ బత్తుల అప్పారావు "సకల కళా కౌముది" అని బిరుదుతో అలంకరించి వారి గురించి రాసిన "గీతాశతనామావళి" ని చదివి వినిపించారు.
తర్వాత శ్రీ కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యాన అత్యంత ఆసక్తిదాయకంగా సాహితీ క్విజ్ జరిగింది.
ఆ తర్వాత జరిగిన కవిసమ్మేళనం లో ముందుగా పొద్దుటూరి ఎల్లారెడ్డి గారు స్వీయ పద్యాలను వినిపించారు.
బత్తుల అప్పారావు గారు మినీకవితల్ని, రూపారాణి బుస్సా గారు రాయప్రోలు సుబ్బారావుగారి ఏ దేశమేగిన పాటను స్ఫూర్తిగా తీసుకుని వ్రాసిన కవిత చదివారు.
భాస్కర్ గారు ఆంగ్ల కవిత చదివారు. కె.గీత గారు తన తొలి రోజుల నాటి "రైలు బండి రాగం" కవితను వినిపించారు. ఫణీంద్ర ‘The Intellectual’ అనే కవిత చదివారు.
ఆ తరువాత కథ రచయితలు సుభద్ర వేదుల, వెంకటరమణ గార్లు తమ స్వీయ పరిచయం చేసుకున్నారు. చివరగా సుభద్ర గారు కృష్ణుడి గురించిన లలిత గీతాన్ని పాడి వీనుల విందు చేశారు.