Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం- నవమ వార్షికోత్సవం
వరూధిని
vikshanam-109

కాలిఫోర్నియాలో బే ఏరియాలోని వీక్షణం సాహితీ గవాక్షం 9వ వార్షిక సాహితీ సమావేశం సెప్టెంబరు 11, 2021 న ఆన్లైనులో జరిగింది. ముందుగా వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డా||కె.గీత గారు మాట్లాడుతూ తొమ్మిదేళ్ల  క్రితం ఒక చిన్న సమావేశంగా మొదలయ్యి ఇంతలోనే 9 సంవత్సరాలు అయ్యిందంటే ఆశ్చర్యంగా ఉందని అంటూ, తమలో సాహితీ స్ఫూర్తిని నిలబెట్టుకుంటూ, ఉచిత, స్వచ్ఛంద వేదికగా సమావేశాల్ని జరపుకుంటూ వస్తున్న ఉన్నతమైన లక్ష్యానికి తనకు తోడ్పడుతున్న వీక్షణం సభ్యులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. వీక్షణం సభ్యులందరికీ వీక్షణమంటే కుటుంబజీవితం తర్వాత అతి ప్రధానంగా మారిన సాహితీ కుటుంబమని అన్నారు. పక్కా కార్యాచరణతో సమావేశాలు నెలనెలా క్రమం తప్పకుండా, ఆసక్తి కోల్పోకుండా నడపడం వెనక ఎడతెగని శ్రమ ఉన్నా అది చక్కని ఆనందాన్నిచ్చే శ్రమ అని,  గొప్ప బాధ్యత ఉన్నా అత్యంత ఆత్మీయమైన బాధ్యత అని అన్నారు. తర్వాత కిరణ్ ప్రభ గారు మాట్లాడుతూ వీక్షణం ఎప్పటికీ ఇలాగే ఒక ఆత్మీయ వేదికగా కొనసాగుతుందని, నిరంతర విజయానికి తోడ్పడుతున్న  మిత్రులందరికీ పేరుపేరునా అభివందనాలు తెలియజేసారు.  ఆ తరవాత వీక్షణం ప్రత్యేక సంచికల ఆవిష్కరణ  కిరణ్ ప్రభ, కాంతి కిరణ్  గార్ల  చేతుల మీదుగా జరిగింది. వీక్షణం ప్రత్యేక సంచికల పరిచయం వేణు ఆసూరి గారు చేశారు.

తర్వాత సుభాష్ పెద్దు  గారు “ఆమె ఎవరు?” అంటూ రవివర్మ చిత్రాలకు ప్రేరణగా నిలిచిన యువతుల గురించి ప్రసంగించగా,  శ్రీచరణ్ పాలడుగు  గారు  “కిరాతార్జునీయం” గురించి సోదాహరణంగా సంగ్రహ ప్రసంగం చేసారు. మంజుల జొన్నలగడ్డ గారు “తెలుగు కళాత్మక సినిమా కథల” గురించి, వేమూరి వేంకటేశ్వరరావుగారు “అమెరికా ఆంధ్రులు తెలుగు తల్లికి చేసిన సేవ” గురించి, మధు ప్రఖ్యాగారు యండమూరి నవలలు కలిగించిన  స్ఫూర్తి  గురించి, టి.పి.ఎన్.ఆచార్యులుగారు “రామాయణ రహస్యాలు” అంటూ ఆసక్తిదాయక ప్రసంగాలు చేశారు.

ఆ తరవాత  శ్రీ రావు తల్లాప్రగడ అధ్యక్ష నిర్వహణలో జరిగిన కవిసమ్మేళనంలో అమెరికా కవులే కాకుండా భారతదేశం నుండి కూడా పాల్గొన్నారు. కవిసమ్మేళనంలో పాల్గొన్నవారు: శ్రీచరణ్ పాలడుగు, డా||కె.గీత, శ్రీధర్ రెడ్డి, దాలిరాజు వైశ్యరాజు, డా|| బాలకృష్ణారెడ్డి తాటిపర్తి, మధు ప్రఖ్యా, వజ్రాల రాజగోపాల్, హరనాథ్, రావు తల్లాప్రగడ, మారుతి తన్నీరు, స్వాతి ఆచంట, వరూధిని, పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్, టి. పి. ఎన్. ఆచార్యులు, డా|| గోపాల్ నేమన మొ.న వారు.

చివరగా జరిగిన సంగీత విభావరితో వీక్షణం 9వ వార్షిక సాహితీ సమావేశం ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. ఈ సమావేశంలో స్థానిక ప్రముఖులు, సాహిత్యాభిలాషులు విశేషంగా హాజరయ్యి సభని జయప్రదం చేశారు. వీక్షణం లైవ్ సమావేశాన్ని వీక్షణం యూట్యూబ్ ఛానెల్లో ఇక్కడ  https://youtu.be/DvDY3SxJxEk చూడవచ్చు.

Posted in October 2021, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!