ఆది కవి వాల్మీకి మహర్షిని తలచి
కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
రామాయణం భారతదేశపు వీనులవిందైన సాంస్కృతిక పురాణ చరిత్ర ఆదర్శ కావ్యాలలో ఒకటి. భారతీయ భాషల్లో అత్యంత మధురమైన భాష, జాతీయ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి ద్వారా సుందర తెలుగు ప్రశస్తి పొందిన, అజంత భాషైన, బహుభాషా కోవిదుడైన సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలు ద్వారా దేశభాషలందు తెలుగు లెస్స అనిపించుకున్న, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని వెనిస్ యాత్రికుడు నికాలో డాంటేగారి ద్వారా ప్రశంసలందుకున్న తెలుగు భాషలో ఎన్నో రామ కావ్యాలు వెలిశాయి. తెలుగులోని కవులందరూ వాల్మీకి రామాయణాన్నే మూల గ్రంథంగా ఎంచుకొని తెలుగు లో పద్య గద్య కావ్యాలతో తమ కల్పనా భావాలతో రామాయణాన్ని రచించారు. తిక్కన ద్వారా రచింపబడ్డ నిర్వచనోత్తర రామాయణమే తెలుగు లోని మొదటి రామ కావ్యం. ఈయన వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా తీసుకొని అయోధ్యను, రామ సీతా విహార వర్ణనలను కూడా చేశారు. తర్వాత పోతన రచించిన భాగవతపు నవమ స్కంధంలో శ్రీరాముని కథలో భాగంగా రాముని చిత్రకూట గమనం, సీతాహరణo మున్నగు ఘటనలు ఇందులో వున్నాయి.
తెలుగులోని ప్రథమ పూర్ణ రామ కావ్యం రంగనాథ రామాయణం. కృతిత్వంపై పలు విమర్శలున్నప్పటికి దీని రచన గోన బుద్దారెడ్డి చేసి ఆయన తన తండ్రైన విట్టల లక్ష్మనాద్ పేరుపై ప్రచారం చేశారని ఆ గ్రంథ అవతారికలో చెప్పబడింది. దీని ఉత్తర కాండాన్ని కాచవిభుడు, విట్టల నాథుడు అన్న కవి ద్వయాలు రచించి తన తండ్రి బుద్ధ విభుడుని రచయితగా పరిచయం చేశారని చెప్పబడుతున్నది. సాధారణంగా భారతీయ భాషల్లో లిఖింపబడిన రామాయణాల్లో రచయిత పేరు తప్పకుండా ఉంటుంది. వాల్మీకి రామాయణము కంబ రామాయణము, భాస్కర రామాయణము. మొల్ల రామాయణము మొదలగునవి ఉదాహరణగా చెప్పవచ్చు. అదే క్రమంలో రంగనాథ కవి కూడా దీన్ని రాసి ఉండవచ్చు. విదేశీ విధ్వాoసులు బ్రౌన్ గారు తమ హస్త లిఖిత ప్రతులలో రామాయణ కర్త విషయంలో తమ సందేహాన్ని ప్రకటించారు. కొంతమంది విమర్శకుల అభిప్రాయ ప్రకారము యువరాజుగా ఉన్నప్పుడు అతని పేరు గోనబుద్ధారెడ్డి అని, పట్టాభిషిక్తుడైన తర్వాత రంగనాథునిగా పిలువబడ్డారని చెప్పబడు చున్నది. ఒకే వ్యక్తికి రెండు పేర్లు ఉండడం ఆనాటి రాజుల జీవితాలలో సహజమని భావించబడింది. పింగళి లక్ష్మీకాంతం, జనమంచి వెంకట సుబ్రహ్మణ్య శర్మ, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఆనాటి రాజులు కృతులలో ఇతరుల పేర్లు ఉండటం సహజం అని భావించారు కానీ స్పష్టంగా గోనబుద్ధారెడ్డి రంగనాథుడు ఒకే వ్యక్తిని తేల్చిచెప్పారు. రంగనాథ రామాయణం ప్రశస్తి పాల్కురికి సోమనాథుడు ద్వారా రచింపబడిన ద్విపద కావ్యాన్ని ప్రాతిపదికగా ఎంచుకొని గోనబుద్ధారెడ్డి ఆ ద్విపద శైలిని అనుసరిస్తూ రామాయణాన్ని రచించారు. లోక రక్షకుడు, మర్యాద పురుషోత్తముడు, హిందువుల ప్రియ దేవుడైన శ్రీరామచంద్రుని కథన శైలిలో రంగనాథ రామాయణం గా గోనబుద్ధారెడ్డి గారు రచించారు. ఇది వాల్మీకి రామాయణానికి ఆంధ్రీకరణం అయినా కూడా స్వతంత్రమైన భావనలతో భవ్య రమణీయ మధురమైన తెలుగు భాషలో గేయాలను పొందుపరిచి ద్విపద శైలి లో వీరు దీన్ని రచించారు.
రంగనాథ రామాయణము రామాయణము లో సర్వ శ్రేష్టమైనవి: భక్తి ప్రాధాన్యము, పరమతసహనం, జన శ్రుతులలో నుండు కథలను గ్రహించుట, ప్రభంధ రీతులలో నుండు వర్ణనలలు, దీనికితోడు తెలుగులోని శసమగ్రమైన తెలుగు మొదటి అనువాద రామాయణ మనే గుర్తింపు దీనికి ఉన్నత తత్వము చేకూర్చినది. బాలకాండమున గౌతమ ఆశ్రమమున ఇంద్రుడు కోడియై కూసినట్లు రంగనాథ రామాయణం లో కలదు. అది గౌతముని అహల్య నుండి వేరు చేయుటకు చక్కని ప్రయత్నం. ఇది వాల్మీకి రామాయణంలో లేదు. ఇలా ఎన్నో అవాల్మీకి అంశములను రంగనాథ రామాయణం లో మనం చూడవచ్చు. రంగనాథ రామాయణము పురాణ మార్గమున కథాకథన ప్రధానమైన గా దేశీయ పద భాష్యముగా సర్వజన సుఖంగా రచింపబడి కవితా శిల్పమును కలిగి ఉన్నది. యుద్ద కాండమున “సౌమిత్రి హాసము” అన్న పేరుతొ ఉన్న వర్ణన ఆంధ్ర స్త్రీలు నిరంతరము పాడుకొను గేయములలో ప్రశస్తమైన “లక్ష్మణ దేవర నవ్వు” అను దానికి ఛాయా రూపము. ఇది వాల్మీకి రామాయణo లో లేదు. ఈ రామాయణ పాత్రలలో కవి రామ భక్తి అడుగడుగునా గోచరిస్తుంది. విభీషణుని ద్వారా రామ భక్తి కైకశి ద్వారా రావణుడికి రాముని మహిమ చెప్పించుట, మండోదరి రావణుడికి రాముని మహిమలు తెల్పుట, రావణుడిచే రాముని విలు విద్య నైపుణ్యాన్నిపొగడించడం వల్ల కవి రామభక్తి అడుగడుగునా కనిపిస్తుంది. స్వయానా ప్రతినాయకుడగు రావణుని కూడా ఇందున కవి లోక భీకరుడైన శూరుడుగానే గాక, గుణ గ్రహణ పారీణునిగా, ఉదాత్త చరితునిగా మహోదారుడిగా చిత్రించాడు. రాముని పై పగబూనిన రావణుడు కూడా రాముని ధనుర్విద్యా కౌశలాన్ని ఇలా కీర్తించాడు –
“నల్లవో రఘురామ! నయనాభిరామ! విలువిద్య గురువ వీరావతార
-------------------బాపురే రామా భూపాల !లోకముల నే పాటి విలుకాడు నేర్చునే కలుగ”
“రంగనాథ రామాయణం ఒక ప్రత్యేక స్థానము కలిగి ఉన్నది. శివకవుల ఆవేశం ఇందులో లేకపోవుట, ప్రబంధ కవుల పదబంధములకకు దూరముగా ఉండుట ఈ రెండూ గుణముల వల్ల రంగనాథ రామాయణ కావ్య గౌరవం ఇనుమడించుచున్నది” అని ఆచార్య జి నాగయ్య గారు పేర్కొని ఉన్నారు.
ఎఱ్ఱన సంక్షిప్త రామాయణము ప్రస్తుతం అలభ్యము. ఎఱ్ఱన రామాయణం గూర్చి ప్రస్తావిస్తూ గణపవరపు వేంకటకవి తన ప్రయోగ రత్నాకరము లో కొన్ని పద్యాలను ఉదహరించాడు. ఎర్రన్న రామాయణము సంక్షిప్త రామాయణం మైసూరు నందునగల సంక్షేప రామాయణమును ఎర్రన అనువదించి ఉంటాడని కొందరు విమర్శకులు తలచినా, కూచిమంచి తిమ్మకవి తన సర్వ లక్షణ సారసంగ్రహం లో ఎర్రన్న రామాయణం నుండి తొమ్మిది పద్యాలు ఉదహరించారు. ఎర్రన రామాయణంలో లభించిన పద్యాలను చూచినచో అవి భాస్కర రామాయణం కంటే మిన్న అయిన రచన అని చెప్పవచ్చును. ఎర్రన రామాయణము మూల వాల్మీకి అనువాదమై ఉండి సాహిత్య ప్రియులను ఆకర్షించే, సామాన్య ప్రజలను మెప్పించే రామాయణము.
చంపూ కావ్య పద్ధతిలో తెలుగు లో మొట్టమొదటిగా రాయబడ్డది ”భాస్కర రామాయణము”. దీని రచనలో కూడా బహు కర్తృత్వ రచన అనిముద్ర పడ్డది. భాస్కర రామాయణంలోని బాల కిష్కింద సుందరకాండ లను భాస్కరుని పుత్రుడు మల్లికార్జున భట్టు, అయోధ్య కాండంను భాస్కరుని శిష్యుడు కుమార రుద్రదేవుడు అరణ్య కాండం యొక్క పూర్వ భాగాలను హుళుక్కి భాస్కరుడు, ఆయన విడిచిన యుద్ధ కాండం లోని శేషభాగాన్ని భాస్కరుని మిత్రుడు అయ్యలార్యుడు మొత్తం నలుగురు కవులు కలిసి భాస్కర రామాయణాన్ని నిర్మించారు. ఈ కావ్య నిర్మాణ ప్రక్రియలో అభిప్రాయ బేధాలు ఉన్నాయి. ఈ కావ్య నిర్మాణ సంబంధంగా కొన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి. రెడ్డి రాజుల యొక్క ఆస్థానములో ఎఱ్ఱన రామాయణము రాయడానికి ముందే సాహిని మారన్న అనే రాజు భాస్కర కవిని తొందరగా రామాయణం రాయమని మభ్యపెట్టారు, రాజు పై గల భయముతో భాస్కరుడు ఈ రామాయణాన్ని తన శిష్యులతో కొడుకులతో పూర్తి చేశాడని చెప్పబడుచున్నది. భాస్కర రామాయణం యొక్క మొదటి నిర్మాణకర్త కవి మల్లికార్జున భట్టు. ఈయన భాస్కర రామాయణంలోని పలు అంశాలను సుమారు 2190 గద్య పద్య కావ్యం తో నిర్మించి బాల కిష్కింద సుందరకాండలను పూర్తి చేశారు. అసాధారణ ప్రతిభతో వ్యాకరణ శాస్త్రం లోని మర్మజ్ఞ విద్వాంసుడైన మల్లికార్జున భట్టు అతి సుందరమైన సంస్కృత తత్సమ శబ్దాలను ప్రయోగిస్తూ రసభరిత వర్ణన కావించాడు. శబ్దాలంకారం అతనికి ఇష్టమైన అలంకారము కావున ప్రసంగానికి అనుగుణంగా పరిస్థితిని, ఘటనను క్రమంగా వుంచి ఉచిత రసపోషణ చేస్తూ కావ్యాన్ని అద్భుతంగా మలిచారు. భాస్కర రామాయణ ద్వితీయ కవి రుద్రదేవుడు సంస్కృత మూలం నుండి కథా వస్తువును గ్రహించి అతి సంక్షిప్తంగా అనువదించాడు సంస్కృత మూల రామాయణం లోని అయోధ్య కాండము లో మొత్తం 4,300 శ్లోకాలు ఉన్నప్పటికీ ఈయన అయోధ్యకాండలో 468 పద్యాలు మాత్రమే ఉంటుంది ఈయన కవితలో దీర్ఘ సమాస శైలితో కూడిన దేశీ పదాలతో కూడిన సుందర భాష కనబడుతుంది. భాస్కర రామాయణ తృతీయ కవి హుళుక్కిభాస్కరుడు. శిల్పదృష్టితో సుందరంగా రామాయణాన్ని నిర్మించిన అఖండ పండితుడు. ఈయన కావ్యంలో శబ్ద చాతుర్యము, వ్యంగ్య శబ్దాలు అధికంగా కనబడవు. భాస్కర రామాయణ ఉత్తర కవి అయ్యలార్యుడు హుళుక్కి భాస్కరుని సామెతలతో లోకోక్తులు తో కూడిన భాషా శైలి ని అచ్చు అతికినట్లు ప్రయోగిస్తూ యుద్ధ కాండం లోని శేష భాగం తో పొడిగించారు. ఒకే యుద్ద కాండాన్ని ఇరువురు కవులు రాసినప్పటికీ ఎక్కడా, ఏ భేదం కనబడదు. ఈయన కోమల, పద భంగిమ, లాలిత్య భాష, వర్ణనాత్మక శైలి ఇవన్నీ భాస్కర రామాయణాన్ని ద్విగుణీకృత సౌందర్యకావ్యంగా రూపొందించింది.
మొల్ల రామాయణము: కవయిత్రి మొల్ల (క్రీస్తుశకం1600) తెలుగు కావ్య సామ్రాజ్యంలో మొట్ట మొదటి కవయిత్రి. రామాయణ నిర్మాణకర్త ఈవిడ పేరు ఆతుకూరి మొల్ల. మొల్ల తన రామాయణాన్ని ఆరు కాండాల లో పద్య కావ్యం లో రచించి తన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చింది. ఈనాటివరకు ఆంధ్రదేశంలో మొల్ల రామాయణం గా ఈ రామాయణం పేరొందింది. ఈరోజు వరకు ఇదే ప్రథమాంధ్ర సంగ్రహ రామాయణముకూడా. శ్రీరాముని యొక్క బాలలీలల వర్ణనలో మొల్ల సిద్ధహస్తురాలు. ఆమె వ్యక్తిత్వం కవిత్వం గురించి “ఆమె కుమ్మరి జాతికి చెందిన స్త్రీ అని, తండ్రి పేరు ఆతుకూరి కేశన అని ఆయన పెద్ద శివ భక్తుడు అని చెప్పబడుచున్నది. ఆమె తన రచనలో గోపవరపు శ్రీకంఠ మల్లేశ్వరస్వామి కృపా కటాక్షం తో నా కావ్యం వ్రాయబడింది అని స్వయంగా ఉపోద్గాతం లో చెప్పింది. గోపవరం అనే గ్రామం నెల్లూరు జిల్లాలో ఉంది మొల్ల తన కవిత్వం గురించి చెప్తూ “నిత్యనూతన ప్రదేశ పరిస్థితి భావముతో వెలువడే శ్రీరామ చంద్రుని మహిమలను దివ్య కావ్యంతో, ఎన్ని సార్లు స్మరించినను, అది తక్కువ అంటుంది. శ్రీరాముని దివ్య కథ పరలోక సుఖం ఇస్తుందని, మర్యాద పురుషోత్తముడు అయిన శ్రీరాముని కరుణాకటాక్షాలతో లభించిన వాణి ద్వారా తను ఈ కృతిని రచించాలని, తనకు శాస్త్ర అధ్యయనము లేదని మొల్ల సవినయంగా చెప్పుకున్నరామ భక్త మహోన్నత కవయిత్రి . “శబ్ద సంపదలతో రసాలను సృష్టించి కావ్య రచన గావిస్తే అది కవి ప్రవృత్తిగా ఉండదు, నిత్యనూతన విధానాలతో కావ్యాన్ని సృష్టించాలని అంటున్నది మొల్ల. తన రామాయణంలో ఒకటి నుండి పన్నెండు పద్యాల వరకు తనను అజ్ఞాని అని చెప్పుకుంటూ దాస్య భక్తి భావాన్ని ప్రకటించింది మొల్ల. వాల్మీకి రామాయణం కాక, ఆధ్యాత్మ రామాయణం లోని కొన్ని అంశాలను కూడా అనువదించింది. మొల్ల కథావస్తువులు పద్మపురాణము, మహాభారతము, రఘువంశము దేవిభాగవతం మొదలగు వాటి ఆధారంతో, సందర్భానుసారము కొన్ని మార్పులు చేర్పులు చేసి కావ్యాన్ని రచించింది. రామాయణ పాత్రలోని మంధర పాత్ర మొల్ల రామాయణం లో లేదు. కైకేయి తన వరాల ఎరుక మంత్రి సుమంత్రునికి, గురు వశిష్టుడికి చెబుతుంది. అప్పుడు స్వయంగా రామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా దశరధుని చూడకుండానే వనవాసానికి వెళ్లిపోతాడు. నది దాటేటప్పుడు నిషాదరాజు గుహుని ద్వారా శ్రీరామచంద్రుని కాళ్లు కడిగే వృత్తాంతాన్ని సుందరంగా రమణీయంగా మొల్ల వర్ణించినట్లు తెలుగులోని ఏ రామాయణంలో ఆ వర్ణన కనబడదు.
“సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయి యే
ర్పడ నొక కాంత యయ్యేనట, పన్నుగనీతని పాద రేణు వి
య్యెడ వడిసోక నిది యేమగునో యని సంశయాత్ముడై
కడిగె గుహుడు, రామపదకంజ యుగంబు భయమ్ము పెంపునన్ “-అయోధ్యాకాండం -32 పద్యం
చక్కని పద్యాలతో సంగ్రహంగా రచించిన మొల్ల రామాయణంలోని మరో ప్రసిద్ధమైన పద్యం “నారదులైరి సన్మునులు నాకమహీజములయ్యె భూజముల్”. పండు వెన్నెల తెల్లగా కాస్తుంటే ఆ వెన్నెల్లో సర్వ ప్రపంచమూ తెల్లగా మారిపోయిందట. మునులందరూ నారదులైనారు. చెట్లన్నీ కల్ప వృక్షాలైనాయి. స్త్రీలందరు సరస్వతులుగా, కొండలన్నీ కైలాస పర్వతాలుగా, సాగర జలమంతా పాదరసంలా, పాములన్నీ వాసుకిలా మారిపోయాయని ఈ పద్యంలో మొల్ల వర్ణిస్తుంది. నారదుడు, కల్పవృక్షము, పాదరసము, వాసుకి – ఇవన్నీ తెల్లవే. కైలాసం రజతగిరి. సరస్వతి సర్వశుక్ల. తెలుగు భాష ఉన్నంత వరకూ మొల్ల, ఆమె రామాయణము చిరంజీవులుగా వుంటారు.
మొల్ల సంస్కృతం ఆధ్యాత్మ రామాయణం లోని కొన్ని విషయాలను తీసుకొని ఉపయోగించి ఉండవచ్చు. సీతాన్వేషణకై రాముడు వెళ్లేటప్పుడు శ్రీరాముడు సమస్త జగత్తును అంతమొందిస్తానని చెప్పే ఘటన అన్నీ రామాయణాల లో ఉంది, కానీ మొల్ల రామాయణంలో లేదు. రాముడికి బదులుగా లక్ష్మణుడు కోపాన్ని ప్రకటిస్తాడు. మొల్ల యొక్క కావ్యనాయకుడైన శ్రీరాముడు సంపూర్ణ రామాయణం లో శాంత స్వభావానికి అధిపతి. సుందర కాండలో పద్యం 91, 245 వర్ణానాతీత హృదయ స్పర్శం గావించే భక్తి అమృత బిందువులు.
యుద్ధ కాండం లో కూడా త్రిజటా స్వప్నవృత్తాంతము విభీషణుడు రావణుడికి చెపుతాడు. ఇది కూడా మొల్ల యొక్క కల్పన మాత్రమే. మొల్ల వర్ణనలో రామాయణం ఒక ప్రౌఢ కావ్యంగా స్నేహ శబ్దాలంకారాలతో కూడి అత్యంత మృదుమధురమైన హృదయాన్ని స్పర్శించే వర్ణనలు ఉంటాయి. హనుమంతుడు అశోకవనం లో సీతను చూసి ఇలా అంటాడు .
“ఉన్నాడు లెస్స రాఘవుడున్నా డిదె డీజే కవుల గూడి యురుగతి రానై
యున్నాడు నిన్నుగొనిపో నున్నాడిది నిజము నమ్ము ముర్వీ తనయా” సుందరకాండము పద్యము- 91
తిరిగి శ్రీ రాముల వారిదగ్గరకు వచ్చి ఇలా వర్ణిస్తాడు
“కంటిన్ జానకి బూర్ణచంద్ర వదనన్ గళ్యాణి నాలంకలో
గంటిన్ మీ పదపంకజంబులను నే గౌతూహలం బొప్పగా
గంటిన్ మీ కరుణావలోకనము విఖ్యాతంబుగా గీర్తులం
గంటిన్ మా కపి వీర బృందములలో గాంభీవ్యవారాన్నిధీ”-245
ఈ రామాయణములో కాలనేమి వృత్తాంతము కొంచెం దీర్ఘముగా వర్ణించినది. భావములందును భాష యందున్ హృదయంగమమైన మార్దవమును చిందించుచు మొల్ల కవితా శిల్పముతో రామాయణమును రచించినది.
ఇలా తెలుగు లో ఉన్న సమస్త రామ కావ్యాలలో మొల్ల రామాయణానికి ప్రథమ స్థానం లభించింది.
16 శతాబ్ది లో అయ్యల రాజు రామ భద్రుడు రాసిన “రామాభ్యుదయం లో రాముని సుందర దివ్య మంగళ విగ్రహరూప వర్ణనలు, లీలలను చూడవచ్చు. ఇందులో రాముని జలక్రీడా వన విహారము మొదలు ఎన్నో రసవత్తరమైన ఘటనలు చూడవచ్చు. రాముడు అరణ్యానికి వెళ్లే సందర్భములో దశరధుని విలాపము సీతాపహరణం సమయంలో రాముని పరితప్త హృదయంతో చేసిన విలాప వర్ణనలలో కవి కరుణ రసాన్ని అత్యంత మనోహరంగా ప్రకటించారు.
రామదాసు: తెలుగు రామభక్త కవులలో కంచర్ల గోపన్న అనబడే భద్రాచల రామదాసు 1620 సంవత్సరము కెన్నడ జిల్లాలోని నేలకొండపల్లి లో జన్మించారు. ఈయన రాముని పై అనేక కీర్తనలు తన దాశరథి శతకం లో రాశారు. భాగవతంలో వర్ణింపబడ్డ నవధా భక్తిని ఈ గేయాల్లో చూడవచ్చు. రాముని ప్రభువుగాను తనను దాసునిగా చిత్రించు కొని అనేక గేయాలు వ్రాశాడు. అందుకే ఆయన రామదాస్ అయ్యాడు.
ఈ వరుస క్రమంలో భక్తాగ్రేసరుడు సంగీత త్రిమూర్తులలో త్యాగత్ బ్రహ్మ, నాద బ్రహ్మంగా కొనియాడబడిన శ్రీ త్యాగరాజ స్వామి వారు కూడా రామ భక్త శిరోమణి కవుల క్రిందకే వస్తారు. త్యాగరాజు సమయము ( క్రీ.శ.1759 నుండి 1886 వరకు). త్యాగరాజు శ్రీరాముని యొక్క అన్య భక్తుడు. ఆయన రామునిపై ఎన్నో వేల కీర్తనలు కృతులు రాశాడు.
శ్రీ త్యాగరాజు తన ఆరాధ్య దైవమైన శ్రీ రామచంద్రుని తన జీవితంలోని ముఖ్య దైవం గా భావించి జీవితమంతా ఆయనే అని, ఆయనే తన సర్వస్వంబని నమ్ముకొని ఎల్లప్పుడూ రామనామస్మరణ గావించుకుంటూ రామనామ స్మరణ సంకీర్తనము లో తన్ను తానే మరిచే వాడు. సీతమ్మ మా యమ్మ శ్రీరాముడు మాకు దండ్రి, అని దేవతలందరినీ తమ బంధువర్గాలుగా భావించి కీర్తన రాసిన భాగవతోత్తముడు. తమ ఆరాధ్య దైవమైన శ్రీ రాముని విష్ణువు యొక్క విభావావతరంగా భావించి పరబ్రహ్మ స్వరూపంగా సేవించారు. ఈయన రామ సాహిత్యంలోని 10 వేల కీర్తనలు ఈరోజు లభ్యము. ఈ కీర్తనలు సంగీత జగతిలో, సాహితీ జగత్తులో, నాట్య జగత్తులో అమూల్య నిధులుగా స్వీకరించబడినవి. ఆయన తన రాముని నామావళిని స్మరించి 96 కోట్ల శ్రీ రామనామాన్ని జపించి రాముని ప్రత్యక్షం చేసుకున్నారని ప్రతీతి. ఈ నామావళి లో ప్రస్తుతం 24 వేల నామావళి లభ్యములు. వీరి కీర్తనలు కీర్తనలు కృతులు గా విభజింపబడ్డాయి. త్యాగరాజు వారి సంగీత అమృతమును విని ముగ్ధుడై తంజావూరు రాజు తమ సభలో గాయకుడిగా ఉండుటకై ఆహ్వానించారు కానీ రాముని కొలువు తప్ప ఎవరిని ఆశ్రయించక త్యాగరాజు ఆహ్వానాన్ని తిరస్కరించాడు. ఈయనకు గాయక బ్రహ్మ అని బిరుదు కూడా కలదు. ఈయన రైన పంచరత్న కీర్తనలు మన తెలుగువారి గాన గంధర్వ రాజులైన మంగళంపల్లి బాల మురళి కృష్ణ గళంతో కురిసిన అమృత జల్లులు. ఉత్సవ సంప్రదాయ కీర్తనలు ఉయ్యాల పాటలు, మేలుకొలుపు పాటలు, ఇంకెన్నో ఆత్మను స్పర్శించే మృదు మధుర గాన సౌందర్యాన్ని సాహిత్యంతో కలిపిన భక్త సార్వ భౌముడు మన త్యాగరాజ స్వామివారు. ఇంకా ద్విపద లో ద్వయర్థీ, త్రయర్థీ, చతురర్థీ లలో రామ కావ్యాలు రాయబడ్డాయి. పద కవితాపితామహుడైన అన్నమాచార్యులు కూడా తమ కీర్తనలలో శ్రీరాముని స్వరూపంగా శ్రీ వేంకటేశ్వరుని భావించి కొలిచారు. ఆయన శ్రీరాముని “రాముడు రాఘవుడు రవి కులడితడు, భువి జగపతియైన పురుష నిదానము” అని వేన్నోళ్ళ పొగిడారు.
ఇవిగాక ఆధునిక యుగంలో ఎన్నో రామభక్తి రచనలు వున్నాయి. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్ష కావ్యం తెలుగులోని పూర్ణ రామాయణం. ఇవి గాక తెలుగు జానపద సాహిత్యం, జానపద గేయాలలో, యక్ష, కొరవంజి గీతాలలో కూడా రామాయణం లభిస్తుంది. విషయ విస్తారానికి జంకి వ్యాసం సంక్షిప్తంగా సమర్పించబడ్డది. ఇలా తెలుగు సాహిత్యంలో రామ భక్తి మూడు పువ్వులు ఆరు కాయలుగా దిన దిన వర్ధమానమై వెలుగు చున్నది.