‘నరహరికీర్తన నానిన జిహ్మబరుల నుతింప నోపదు జిహ్వ’ అని తన జీవితం అంతా వేంకటేశ్వరుని స్తుతిస్తూ కీర్తనలు వ్రాయడమే కానీ నరుల కొరకు అనగా నరసింహరాయలను ప్రస్తుతిస్తూ తాను కీర్తనలు పాడలేనని అన్నమయ్య చెప్పి నిష్క్రమించాడు. రాయలకు కోపం తారాస్థాయికి చేరి అన్నమయ్యను పట్టుకు రమ్మని భటులను పంపించి తనను చెరసాలలో బంధించాడు. పట్టి చంపేవేళ, పట్టం కట్టే వేళా ఎల్లప్పుడూ ఒకేలా ఉండే అన్నమయ్య కించిత్ కూడా చలించక స్థిరంగా పాటలు పాడుకోవడం మొదలు పెట్టాడు.
‘ఆకటి వేళల నలపైన వేళలను తేకువ హరినామమే దిక్కుమరి లేదు
కొఱమాలి ఉన్నవేళ కులము చెడిన వేళ చెరవడి నొరులచే జిక్కిన వేళ’ …
అంటూ అన్నమయ్య పాటలు పాడుకుంటూ ఉంటే ఆయనకు వేసిన సంకెలలు వాటంతట అవే ఊడిపోయాయట. ఆ వార్త తెలుసుకున్న రాయలు, అన్నమయ్య ను మరోసారి సంకెళ్ళు వేసి తనముందే పాటలు పాడి విప్పి చూపిస్తే, అన్నమయ్యనే తన దైవంగా భావిస్తానని చెప్పినప్పుడు అన్నమయ్య పాటలు పాడితే సంకెళ్ళు వాటంతట అవే మరలా ఊడిపోగా రాయలు అన్నమయ్య కు పాదాభివందనం చేసి ఆయనను పల్లకి ఎక్కించి స్వయంగా తానే మోస్తూ తన రాజాస్థానానికి తీసుకెళ్ళి ఆయన భక్తుడైనాడు.
అన్నమయ్య రచనా విధానం:
అన్నమయ్య పదాలలో శృంగార వైరాగ్య వర్ణనలను గూర్చి చెబుతూ ఆరుద్ర తన అభిప్రాయం ఇలా వెలిబుచ్చారు.
‘అన్నమయ్య శృంగార వైరాగ్యాలు ఒక్క చోటనే మలచి చూపగలడు. ఎంత విచ్చలవిడి శృంగారం వ్రాసినా అన్నమయ్య నిజమైన వైష్ణవ భక్తుడు. వైష్ణవాన్ని అన్నమయ్య పదకవిత్వం గా రూపొందించాడని విశిష్టాద్వైతాన్ని మతంగా స్వీకరించినందువల్లనే అన్నమయ్య ఈ సాహసాన్ని చేశాడు’ అని చెప్పి దానికి కారణాలు తెల్పాడు ఆరుద్ర.
‘అన్నమయ్య కాలానికి నాటి పండితులకు పదకవిత్వం అంటే ఈసడింపు. తెలుగు పండితులు ఏమనుకొన్నాసరే ద్రావిడ వేదంతో, తమిళ కవిత్వంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న విశిష్టాద్వైతాన్ని స్వీకరించిన అన్నమయ్య ఆ భాషలోని మధుర భక్తినంతా అనుభవించిన అన్నమయ్య తత్యుల్య మైన గేయాలను తెలుగులో వ్రాయాలనుకొన్నాడు’ అని చెప్పి ఆరుద్ర ప్రపంచంలోని ఏ మొదటిరకం కవిత్వానికి తీసిపోని రచనలు చేశాడు అని అంటూ ఆరుద్ర అన్నమయ్య రచనలలోని అంతరార్ధాన్ని ఆవిష్కరించారు.
వైష్ణవ మత సూత్రాలు – ఆరుద్ర వివరణ
“అన్నమయ్య కవితా మానస సరోవరంలో అడుగు పెట్టడానికి, అడుగు పెట్టినదే తడవుగా వోలలాడడానికి ముందు వైష్ణవ మత సూత్రాలను కొద్దిగా క్రోడీకరించుకోవడం మంచిది.” అంటూ ఆరుద్ర తెల్పి, ఆ తర్వాత ఆ మత తత్వాన్ని వివరించారు. ఆ వివరణ క్లుప్తంగా వివరించడం నా ఉద్దేశ్యం. ఆరుద్ర చెప్పిన వివరణ-
పరమాత్మ ఒక్కడే కానీ జీవులు మూడు రకాలు. వారు నిత్యులు, ముక్తులు, బద్ధులు. జీవులకు కర్మ, జ్ఞాన, భక్తి ప్రపత్తులనే యోగాల చేత బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. అయితే ఈ యోగాలలో ప్రపత్తి అనే శరణాగతి యోగమే సర్వ జీవకోటికి ఉపయుక్తమైన యోగమని విశిష్టాద్వైతం చాటి చెప్పింది.
ప్రపత్తిలో ముఖ్యమైనది భగవానుని లీలలను అనుభవించి అతని దయను ప్రస్తుతించడమే. ప్రపత్తిని న్యాసమని కూడా అంటారు. వైష్ణవ పరిభాషలో న్యాసమంటే భక్తుడు.
తన ఆత్మను పరిపూర్ణంగా పరమాత్మాధీనం చేయడం వారిని పూజించడం ఎంత పుణ్యమో హరిదాసులను పూజించడం అంతకన్నా ఎక్కువ పుణ్యం. ఈ మత సూత్రాలు వివరించే గేయాలు, ఈ మత సూత్రాలను వివరించే గేయాలు అన్నమాచార్యుల వారి ఆధ్యాత్మిక కీర్తనలలో కోకొల్లలుగా దొరుకుతాయి. ఇదంతా, ఆరుద్ర విశిష్టాద్వైత మత సూత్రాలను గూర్చి, అన్నమయ్య రచనా ఉద్దేశ్యం గూర్చి చెప్పిన వివరణ. ఆరుద్ర మాటలను యధాతధంగా పాఠకులకు అందించాను. అన్నమయ్య రచననలను, ఆయన శృంగార, వైరాగ్య పద సంపదను ఆస్వాదిస్తూ ఆనందించడం మనందరి అదృష్టం.
అన్నమయ్య పదాలలో ఉన్న ఆధ్యాత్మిక, భక్తి, శాంత గుణాదులను ఆరుద్ర అన్నమయ్య రచించిన అన్ని రచనలను (సంపుటాలు) పరిశీలించి వివరించారు. 5,6 పుటలలో స్థాలీపులాక న్యాయంగా వాటిని ఇక్కడ పొందుపరుస్తాను. ప్రతి ఒక్క పదం ఒక వేదం అని చెప్పవచ్చు.
ప్రసిద్ధ గేయం “బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే” అన్న దానిలో భగవంతుడు ఒక్కడే ఎందుకు భేదాలు అన్న బోధన ఉందని అలాగే అన్నమయ్య శాంతచిత్తుడని తెల్పే (ఉత్సవ సంపుటి సంకీర్తన 76) కీర్తనలో ‘దేవ ఈ తగవు తీర్చవయ్యా …’ అంటూ జీవాత్మ పరమాత్మల సంబంధాన్ని అద్వైత భావనలను వివరించాడు అన్నమయ్య అని ఆరుద్ర తెల్పారు.
అన్నమయ్య కొన్ని వేల కీర్తనలు వ్రాశాడని ఆరుద్ర అభిప్రాయ పడ్డారు. భక్తుడు తాను భగవత్సేవకుడనని భావించడమే దాస్య భక్తి. ఈ దాస్య భక్తి మార్గంలో అన్నమయ్య కీర్తనలను ఆరుద్ర తెల్పారు. కొంత నా కర్మ ఫలము కొంత నీ రక్షకత్వము (సంపుటి 2 – సంకీర్తన 33) ఇందులో ఒక చక్కని పదాన్ని ఆరుద్ర తెల్పారు.
‘శక్తి గలిగితే నీ సరస దేవుడుండగా నా
యుక్తి గలిగితే నే నొడుల మోతు నా
శక్తియు యుక్తియు నొకటి లేక
భక్తుండనయితిని నన్ను పాలింపవే’
నీ అంతటి శక్తి ఉంటే ఈ మానవులు అబ్బో ఊరుకుంటారా? నీ ప్రక్కన నేనే దేవుడినని కూర్చోరా స్వామీ అని అన్న అన్నమయ్య పదం ఎంత గొప్పది.!!
‘శక్తి యుక్తి అన్నీ మనిషికి భగవంతుని అనుగ్రహంతోనే కలుగుతాయి.’ అని అన్నమయ్య తన పదాల ద్వారా నొక్కి చెప్పాడు.
భగవంతుని ఏదో ఒక కోణంలో నుండి చూడడం మామూలు భక్తులకు పరిపాటి. కానీ అన్నమయ్య బహువిధాలుగా భగవంతునితో మాట్లాడగలగడం, ఆ భావాలను పాటల రూపంలో చిత్రీకరించడం ఆయనకు భగవంతుడు ఇచ్చిన వరం.
సంపుటి ఎఎ, సంకీర్తన 28 లోని కీర్తనను ఆరుద్ర చూపిస్తూ ఇందులో అన్నమయ్య భగవంతుని హెచ్చరిస్తున్నాడు అని తెల్పారు. ఆ కీర్తన;
నేనైతే ఈడేరుదు, నీకు లీలామాత్రమింతే
మానక నన్నేలుకొమ్ము మాధవగోవిందా
ఇందరిపై సూర్యుండు ఎండలు గాసించేను
అందు కొన్ని కిరణాలు అణగిపోయెనా
సూర్య కిరణాలు కొందరికి కరవైనట్లే నాకు నీ దయ కరవైంది అని మంచి ఉపమానంతో రాసిన గేయమిది.
౧. సఖుండుగా భగవంతుని భావించాడు అన్నమయ్య. దీనిని కీర్తనలో ‘చెలిమి చేయగరాదు, చేసి విడువంగరాదు’ అన్నమాట. ఇది ‘పట్టి విడువంగరాదు’ అన్న త్యాగయ్య కీర్తనను జ్ఞప్తికి తెస్తున్నది. (అన్నమయ్య సంపుటి 10, సంకీర్తన 102).
౨. శృంగార గీతాలను ఆరుద్ర మన్మదోపనిషత్ అన్నారు. ఇందులో కూడా ‘మనసియ్యరాడు, ఇచ్చి మరువరాదు’ అంటాడు అన్నమయ్య. ఇది ప్రేమకు పరాకాష్ఠ. అలా ఇచ్చి మరిచిపోతే అది కామమే కానీ ప్రేమ కాదు.
౩. వాత్సల్య భక్తి: నవవిధ భక్తులు ఉన్నారు కదా! అందులో పుత్ర/పుత్రికా ప్రేమ వాత్సల్య భక్తి గా ప్రసిద్ధి చెందింది. తాను యశోద భగవంతుడు కృష్ణుడు. అందుకే అంత చక్కని జోలపాట అన్నమయ్య వ్రాయగలిగాడు.
‘జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా’ అని
‘చందమామ రావే జాబిల్లి రావే మంచి
కుందనపు పైడి కోర వెన్నపాలు తేవే’ అంటూ
గోరుముద్దలు భగవంతునికి తినిపించాడు అన్నమయ్య. ఒక మంచి కవిత్వం కళ్ళు తెరవాలంటే హృదయం స్పందించాలి.