Menu Close
Nagamanjari-Gumma
సీతాకోకచిలుకలు (ధారావాహిక)
నాగమంజరి గుమ్మా

కృష్ణుడు కొండవారకు బయలుదేరాడు. ఎక్కడా ఆగకుండా నడిచాడు. తాటిచెట్టు మీద నుంచి తాటిపండు పడింది. తాటి పండును చూడగానే “ఛీ యాక్” అన్నాడు వాడు. వాడి నెత్తిన మరో తాటిపండు పడింది. గుజ్జంతా బట్టలనిండా, తలనిండా పడింది. ఒకటే తాటి గుజ్జు కంపు. భరించలేకపోయాడు. కానీ తప్పదు. ముందుకు వెళ్ళాడు. తాడు కర్ర కనిపించాయి. బట్టలు విప్పి తలపాగా గుడ్డలో చుట్టి, తాడుతో కట్టి, కర్రకు తగిలించి భుజాన వేసుకున్నాడు. నడుముకు తుండు గుడ్డ చుట్టుకున్నాడు. నలుగురు దొంగలూ ఎప్పటిలాగే చెట్టు కింద గూనోడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు.

“ఈడెవడురా? గూనోడికి ఇంకో తమ్ముడా? వాడికి గుడ్డలు కూడా లేవా? తుండు చుట్టుకొని వస్తున్నాడు” అన్నాడు ఒక దొంగ.

“రానీరా… చూద్దాం” అన్నాడు ఇంకొకడు.

కృష్ణుడు సరాసరి వారి దగ్గరకు వెళ్లి, “మా అన్నని, మేకపిల్లల్ని చూసారా? వాళ్ళని దొంగలు ఎత్తుకొని పోయారు…” అన్నాడు.

“అదిగో ఆ కొంపలోనే దొంగలు మీ అన్నని, మేకపిల్లల్ని దాచారు” అని చూపించారు వాళ్ళు.

కృష్ణుడు అటు బయలుదేరగానే, దొంగలు వాడి నోరు నొక్కి, తీసుకెళ్లి గదిలో పడేసారు. అక్కడ భీముడు కృష్ణుణ్ణి చూసి, “నువ్వు కూడా వచ్చేసినావేట్రా… ఇక్కడ సూడు ఎంత బంగారం ఉందో… మనం ఎలాగైనా ఇడిపించుకు పోవాల్రా…” అన్నాడు. మేకపిల్లలు “మే మే” అన్నాయి. కృష్ణుడు చుట్టూ చూసాడు. బోలెడంత డబ్బు, నాణాలు, బంగారు ఆభరణాలు కనిపించాయి. కానీ అక్కడ నుంచి బయటపడటం ఎలాగో అర్ధం కాలేదు వారిద్దరికీ.

*******

“ఒరే నల్లోడా! మీ అన్నలు ఇద్దరూ మేకపిల్లల్ని తోలుకొనెల్లి రెండు రోజులయిపోనాదిరా… ఒకడిని నెలకడానికి ఎల్లి ఇంకొకడు కూడా రాకుండా పోయినాడు. ఏటి సేత్తాను రా” శోకాలు తీయసాగింది రామమ్మ. నల్లోడు, చిన్నడు, తిన్నడు, సిమ్మాద్రి తల్లి చుట్టూ చేరారు.

“అమ్మా… అసలేటి జరిగినాదే… ఇవరంగా సెప్పు” అని అడిగాడు నల్లోడు.

రామమ్మ కొంత, గూనోడు కొంత విషయాన్ని చెప్పారు. ‘దొంగల దగ్గర బంగారం ఉంది, దానికోసం అన్నలు ఇద్దరూ వెళ్లి చిక్కుండి పోయారు’ అని అర్ధమైంది నల్లోడికి.

“అమ్మా… నువ్వేం బాధపడకు. నేనెల్లి అన్నల్ని, మేకపిల్లల్ని తీసుకొస్తాను. బంగారం తీసుకొస్తాను” అని బీరాలు పలికి నల్లోడు బయలుదేరి ఎల్లిపోయాడు.

*****

నల్లోడు అన్నల్ని నెలుక్కుంటూ కొండవారకి ఎల్లాడు. అక్కడి నుంచి తాటిచెట్టు కాడికి ఎల్లాడు. తాటి పండు ఒగ్గేసాడు. తాడు, కర్ర ఒగ్గేసాడు. చెట్టు కింద ఎవలూ లేరు. చుట్టూ చూసాడు. ఒక మనిషి కనిపిస్తే ఎల్లి అడిగాడు “అన్నా… దొంగల్ని సూసారా?” అని అడిగాడు నల్లోడు.

“ఆ పాక ఇంట్లో ఉంటారు ఎల్లు” అన్నాడు వాడు.

పాక ఇంటివైపు నడిచాడు నల్లోడు. తలుపు బయట గొళ్ళెం పెట్టబడి ఉంది. గొళ్ళెం తీసి తలుపు తీసాడు నల్లోడు. వెనక నుంచి వచ్చిన ఒక వ్యక్తి నల్లోడికి లోపలకు తోసి, బయట మళ్లీ గొళ్ళెం పెట్టేసాడు.

“అరె నల్లోడా నువ్వెందుకు ఒచ్చావురా?” ఆశ్చర్యంగా అడిగాడు భీముడు.

“నువ్వెందుకు ఒచ్చినావో నాను కూడా అందుకే ఒచ్చినాను” అన్నాడు నల్లోడు.

“మరి ఈళ్ళకి ఎలా దొరికిపోనావురా?” అడిగాడు కృష్ణుడు.

“నువ్వెలా దొరికిపోనావో అలాగే దొరికిపోనాను” విసుగ్గా చెప్పాడు నల్లోడు.

“తినడానికి ఏటన్నా తెచ్చినావేట్రా? ఆకలి మండిపోతన్నాది. మంచినీళ్ల సుక్క కూడా ఇయ్యలేదు ఎదవలు” తిట్టాడు భీముడు.

“నానేటి తెత్తాను? మీలాగే సేతులూపుకొని ఒచ్చినాను” అన్నాడు నల్లోడు.

“పాలు పిండుదామన్నా మేకలు కావివి. మేకపిల్లలు ఐపాయే” నిట్టూర్చాడు కృష్ణుడు.

“ఇంత బంగారం ఉన్నా, డబ్బులు ఉన్నా తినడానికి లేకపోయే” తలకొట్టుకున్నాడు భీముడు. “మే మే” అన్నాయి మేకపిల్లలు.

“ఈటి గోల ఒకటి. పక్కనే ఉచ్చలు కంపు” తిట్టుకున్నాడు నల్లోడు.

****

“ఒరే గూనోడికి ఎంతమంది తమ్ముళ్లు ఉన్నారురా…?” అన్నాడు ఒకడు.

“ఎంతమంది అయినా ఉండనీ… ఊరోళ్ళంతా రానీ… గూనోడు ఎత్తుకెళ్లిపోయిన బంగారం తిరిగి తెస్తేనే ఈల్లందరిని ఒగ్గేది” అన్నాడు మరొకడు.

********

“ఎల్లినోళ్లు ఎల్లినట్టే ఉన్నారు. ఒక్కడు కూడా తిరిగి రాలేదు” గొల్లుమంది రామమ్మ.

“అమ్మా ఏడకే… ఈ పాలి మేమిద్దరం ఎళ్తాం” చెప్పాడు చిన్నడు.

“దొంగల్ని సితక తంతాం” చెప్పాడు తిన్నడు.

“అన్నల్ని తెచ్చేత్తాం…” చెప్పారిద్దరూ.

“ఏటి తెత్తారో ఏటో… మూడు రోజులైపోనాది. ఆళ్ళకి బువ్వ ఎవరు పెడతారో… మేకపిల్లలకు మేత ఎలా పెడతారో” రాగాలు తీసింది రామమ్మ.

రామమ్మ కళ్ళు తుడిచి, పౌరుషంగా బయలుదేరారు చిన్నడు, తిన్నడు.

దొంగలు ఎక్కడుంటారో తెలీదు. కొండవార అని మాత్రం తెలుసు. అటే బయలుదేరారు ఇద్దరూ.

తాటితోపు దగ్గరకు వచ్చారు. తాటిపండు పడింది. ఇద్దరూ తాటిపండు కోసం దెబ్బలాడు కున్నారు. చెరి సగం తిన్నారు. టెంక ‘నువ్వు పట్టుకో అంటే నువ్వు పట్టుకో’ అని వంతులేసుకున్నారు. మొత్తానికి కింద పారేసి వెళ్లిపోయారు. తాడు, కర్ర కనిపించాయి. ఎవరు తాడు పట్టుకోవాలి? ఎవరు కర్ర తీసుకోవాలి? వంతులు తెగలేదు. వదిలేసి పోయారు. కాస్త దూరంలో దొంగలు వీళ్ళని చూడనే చూసారు. “ఈసారి ఇద్దరు వస్తున్నారు. ఎలా పట్టాలా?” అని ఆలోచిస్తున్నారు వాళ్ళు.

“చిన్నోడా ఆళ్లేనా దొంగలు?” అడిగాడు తిన్నడు.

“ఆళ్లే అయ్యుంటారురా. ఇంతవరకు మనకు ఎవరూ కనబడలేదు కదా” చెప్పాడు చిన్నడు.

“అయ్యో కర్ర తాడు తీసుకోవలసిందిరా… తాడేసి కట్టేసి, కర్రతో కొట్టేసి ఉండేవాళ్ళం. నువ్వు వెళ్లి తీసుకురా” అన్నాడు తిన్నడు.

“నేనెందుకు తీసుకు రావాలి? నువ్వే తెచ్చుకో పో” అన్నాడు చిన్నడు.

తిన్నడు తల కొట్టుకొని తాడు కర్ర తీసుకురావడానికి వెనక్కి తిరిగి వెళ్ళాడు. ఇద్దరిలో ఒకరు వెనక్కి వెళ్లడం చూసిన దొంగలు ఇద్దరు చిన్నడిని పట్టి, నోరునొక్కి తీసుకెళ్లిపోయారు. తిన్నడు ఎందుకో తిరిగి చూసేసరికి చిన్నడిని తీసుకుపోతున్నారు. “అయ్యో చిన్నోడా” అని వెనక్కి తిరిగి వచ్చేశాడు తిన్నడు. మరో ఇద్దరు దొంగలు తిన్నడి నోరునొక్కి తీసుకుపోయారు. ఇద్దరిని పాక గదిలోకి తీసుకెళ్లి పడేశారు.

“ఒరేయ్ చిన్నా! ఒరేయ్ తిన్నా! మీ ఇద్దరూ కూడా వచ్చేసారా? మరి ఇప్పుడు అమ్మ దగ్గర ఎవరున్నారు? రేపు గూనోడు వస్తాడేమో ఆడు వస్తేగానీ మనం బయటపడేలా లేము” అన్నాడు భీముడు.

“ఆడొచ్చి ఏటి ఇడిపిస్తాడులే! నీవల్ల, నా వల్లే కాలేదు. చూద్దాం” అన్నాడు కృష్ణుడు.

“రెండు మేక పిల్లలైతే తోలుకొచ్చేశాడు కానీ ఇప్పుడు ఆ దొంగల్ని కొట్టి మేకపిల్లల్ని, మనల్ని ఎలా తీసుకెళ్తాడు?” అన్నాడు నల్లోడు.

“అంతే అంటావా?” అన్నాడు భీముడు.

“సిమ్మాద్రి గోడు వచ్చి మనల్ని విడిపిస్తాడేమో” అన్నారు చిన్నడు, తిన్నడు.

“పెద్దోళ్ళ వల్లే కాలేదు ఆ చిన్నోడు వచ్చి ఏం విడిపిస్తాడు?” అన్నాడు భీముడు.

అందరూ గోలగోలగా మాట్లాడుతున్నారు. దొంగల్లో ఒకడు వచ్చి “నోరు ముయ్యండెహె. గూనోడు వచ్చి ఎత్తుకెళ్లిపోయిన డబ్బులు, బంగారం, ఆభరణాలు ఇస్తేనే మిమ్మల్ని విడిపించేది. లేదంటే ఆకలితో ఇక్కడే సస్తారు” అన్నాడు.

భయంతో బిగుసుకుపోయారు అన్నదమ్ములు ఐదుగురు. మేకపిల్లలు మేమే అంటూనే ఉన్నాయి.

********

“అమ్మా ఈరోజుకూ అన్నయ్యలు రాలేదు… ఇక నేనే ఎల్తాను. అన్నల్ని మేక పిల్లల్ని తోలుకొస్తాను.” అన్నాడు సిమ్మాద్రి.

“నాయనా! నీమీదే ఆశ… సిన్నోడివి, కడగొట్టోడివి. ఆలందర్ని జారతగా తెచ్చే పూచి నీదే” అంటూ కల్లొత్తుకుంది రామమ్మ.

వీరుడిలా బయల్దేరాడు సిమ్మాద్రి. కొండవారంట పోకుండా మిట్ట మీద నుండి బయల్దేరాడు. దారిలో వాడికి తాటిపండు దొరకలేదు, తాడు కర్ర దొరకలేదు. ఎదురుగా దొంగలు కూడా కనపడలేదు. పాక ఇల్లు మాత్రం కనిపించింది. అడుగులో అడుగేసుకుంటూ కిటికీ పక్కగా వెళ్లి చూసేడు. లోపల అన్నలు కునుకుతున్నారు. గుసగుసగా “అన్నా” అని పిలిచేడు. ఉలిక్కిపడి లేచిన భీముడు “సిమ్మా” అన్నాడు గట్టిగా. ఆ వెంటనే మిగతా నలుగురు లేచారు. “సిమ్మడొచ్చాడు సిమ్మడొచ్చాడు” అన్నారు నలుగురూ ఒకేసారి. ఈ అలికిడికి మేక పిల్లలు “మే మే” అన్నాయి. అంతవరకూ దూరంగా ఉన్న దొంగలు ఈ గోలకి వచ్చి చూసేరు. సిమ్మాద్రిని కూడా నోరునొక్కి గదిలో పడేశారు.

“ఒరేయ్ సిమ్మా. నువ్వేదో రచ్చిత్తావనుకుంటే ఇలా దొరికిపోనావ్ ఎట్రా” అన్నాడు భీముడు.

“అంతా మీ వల్లే. నిమ్మలంగా ఉండొచ్చు కదా. ‘సిమ్మడొచ్చాడు’ అని అరకవకపోతే” అన్నాడు కోపంగా.

“నిన్ను సూసేసరికి మనసాగనేదు రా…”

“మా బాగా అయ్యింది గా.” అన్నాడు సిమ్మడు.

“ఇప్పుడు గూనోడే దిక్కేమో… ఆడెప్పుడు రావాలి… మనల్నెప్పుడు ఇడిపించాలి … సీ… ఎదవ బతుకు.” తిట్టుకున్నాడు కృష్ణుడు.

**********

రేతిరంతా కంటి మీద కునుకు లేదు రామమ్మకి. ఎప్పుడు తెల్లారుతుందా? ఎప్పుడు కొడుకులందరూ వస్తారా? అని ఎదురు చూస్తూ ఉంది. తెల్లారింది, మధ్యాహ్నం అయింది. కొడుకులు రాలేదు. “ఒరే గూనోడా! ఏట్రా ఈళ్లంతా ఎల్లినోళ్లు ఎల్లినట్టే ఉండి పోతన్నారు. ఒక్కడూ తిరిగి రాలేదు” అని గొల్లుమంది.

“అమ్మా! నువ్వు ఏడవకు నేనెళ్లి ఆళ్ళందర్నీ తీసుకొస్తాను” అన్నాడు గూనోడు.

“మా నాయనే… మా బాబే… ఆ పున్నెం కట్టుకోరా నాయనా… సచ్చి నీ కడుపున పుడతాను” అంది రామమ్మ.

“నువ్వు సచ్చి పోనూ వద్దు. నా కడుపున పుట్టొద్దు కానీ నూకలు కట్టి ఇయ్యి.” అని అడిగాడు. ‘అలాగే’ నని తువ్వాలుకు చివర తవ్వెడు నూకలు కట్టి ఇచ్చింది రామమ్మ.

నూకల మూట భుజాన ఏసుకుని బయలుదేరాడు గూనోడు. తాటిపండు తిన్నాడు. తాడు కర్ర తీసుకున్నాడు. దొంగలు మాత్రం చెట్టు కింద లేరు. అక్కడొకడు, ఇక్కడొకడు చొప్పున కాపలా కాస్తున్నారు. వారి కళ్ళ బడకుండా, చెట్లు పొదలు చాటు చేసుకుంటూ పాక ఇంటి దగ్గరకు చేరాడు. చప్పుడు కాకుండా గొళ్ళెం తీసాడు. దొంగలే అనుకోని కొట్టడానికి ముందుకు రాబోయాడు భీముడు.

“ష్…” అంటూ ముందుకు వచ్చాడు గూనోడు. “నేను చెప్పేది వినండి. మాట్లాడకండి.” అన్నాడు.

“అందరూ మెల్లిగా బయటకు రండి. వాళ్ళు నలుగురే. మనం ఏడుగురం. వాళ్ళని కట్టేద్దాం.” అని ధైర్యం చెప్పాడు.

ఆరుగురూ మెల్లిగా బయటకు వచ్చారు. మేకపిల్లలు “మే మే” అన్నాయి. దొంగలు నలుగురూ తిరిగి చూసారు. “తాడు కర్ర… మీ పని చెయ్యండి” అన్నాడు గూనోడు. తాడు నలుగురు దొంగల్ని కట్టేసింది. ఆరుగురు తమ్ముళ్లు తలో దెబ్బ వేసారు. పాక ఇంట్లోకి వెళ్లి ఒక్కొక్కడు రెండేసి గోతాల నిండా డబ్బులు, బంగారం, ఆభరణాలు నింపేశారు. కర్రకు అటు ఇటు పెట్టి కావడి కట్టేశారు.

“ఈ దొంగల్ని ఏం చేద్దాం” అన్నాడు గూనోడు.

“రాజబటులకు ఇచ్చేద్దాం” అన్నాడు భీముడు.

“చంపేద్దాం” అన్నాడు కృష్ణుడు.

“నాను ఒచ్చినప్పుడు ఒక సెరువు సూసినాను. ఆ సెరువులో ఇసిరి పారేద్దాం. సస్తే సస్తారు.” అన్నాడు సిమ్మాద్రి.

****సశేషం****

రచయిత్రి పరిచయం:

Nagamanjari-Gummaనాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..

కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల… ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.

అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.

Posted in March 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *