Menu Close
Page Title

ముందుమాట:

ఆంధ్రదేశంలో కవులకు కొదవలేదు. ‘old is gold’ అని కొందరు పద్య రచనను తిరిగి వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అట్టి వారిలో, ఒక తెలుగు అధ్యాపకురాలిగా, భాషాభిమానిగా నా వంతు కృషిని చేస్తున్నాను. అందులో భాగంగానే “సిరిమల్లె” ద్వారా నా పరిజ్ఞాన మేర సంప్రదాయ కవిత్వాన్ని మీ అందరికీ అందించాలన్నదే నా ఆకాంక్ష.

ఆధునిక కవిత్వంతో పాటు సంప్రదాయక పద్య రచనా సరళిని కూడా ఆదరిస్తున్న నేటి సాహిత్య ప్రపంచంలో, అద్భుతమై, తెలుగు సాహిత్యానికి మకుటాయమానమైన ఛందో లక్ష్మిని మరల మన భాషాసాహిత్య పూదోటలో వెల్లివిరిసే విధంగా చేయాలనే మా తపనకు మీ చేయూతనిస్తారని తలుస్తూ .. బుధజన విదేయురాలు – సి. వసుంధర

1వ చంద్రిక

తెలుగు సాహిత్య సంపదకు మూలధనం పద్య ప్రక్రియ. తెలుగు వారి సాహిత్య హారంలో పద్య ప్రక్రియ, అవధాన ప్రక్రియలు మణిపూసలవంటివి. ఇతర భాషలలో ఈ రెండు ప్రక్రియలు కనపడవు.

ఆదికవి నన్నయ ‘శ్రీ వాణీ...’ అంటూ శ్రీకారం చుట్టిన వేళ ఎట్టిదో, పద్యం సహస్రవళ శోభితమైన పద్మంలా వికసించి అనేక కావ్య సంపదలను తెలుగు వారికి అందించింది.

అయితే ప్రాచీన పద్యప్రక్రియకు ఏ మాత్రం తీసిపోకుండా, ఆధునిక కాలం లోనూ కవిత్వం బహుముఖంగా విస్తరిల్లింది. ఈ రెండు ప్రక్రియలు జంట కవులవలె ఆంద్ర సరస్వతికి ఖ్యాతిని సమకూర్చాయి.

కవియొక్క భావ వ్యక్తీకరణకు ఛందస్సు ఆటంకమన్న భావన ఆధునిక కాలంలో ఆవిర్భవించి వచన భావకవిత్వాది ప్రక్రియలు వృద్ధి చెందుతూ ఛందో బద్ధమైన పద్య కవిత్వాన్ని కాస్త వెనక్కు నెట్టివేయడం జరిగిందని చెప్పవచ్చు. అది కొంత వరకు వాస్తవమైనా,  నన్నయ, తిక్కన. శ్రీనాథుడు మొదలైన మహాకవులు ఛందస్సు ననుసరించి వ్రాసిన కావ్యాలలో భావ వ్యక్తీకరణకు ఎట్టి లోటూ రాలేదని చెప్పవచ్చు. అందుచేత ఆధునిక కవిత్వం వ్రాయగలిగిన వారు కూడా చందోబద్దమైన కవిత్వాన్ని వ్రాయడానికి సమర్ధులై ఉంటారన్నది సత్యం. అందువల్ల పోతనాదుల వలె అవసరమయిన చోట కొంత ఛందస్సును సడలించుకొని పద్య ప్రక్రియ తిరిగి అభివృద్ధి పరచడం వల్ల తెలుగు సాహిత్యం నిండుగా ఉంటుంది.

పూర్వం ఛందస్సును తెలిసిన వానిని ‘ఛాందసుడు’ అని గౌరవంగా పిలిచేవారు. కానీ నేడు అమాయకుడనో, తెలివితక్కువ వాడనే అర్థంలో వాడబడుచున్నది. ‘వాడొక ఛాందసుడు’ అనడం కాస్తా ‘నీ చాదస్తం కాకపొతే’ అనేదాకా అయిపోయింది. అందుకే ఈ నాటి అర్థంతో గాక ఆనాటి అర్థంతో మనమందరం  ఛాందసులమయి పోయి ఛందోబద్దమైన కవిత్వం వ్రాసి కవులమయిపోతే ఎంత ఆనందంగా ఉంటుంది.

తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని కీర్తించిన మహానుభావులెందరో ఉన్నారు.

శ్రీకృష్ణదేవరాయలు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’, తమిళకవి సుబ్రహ్మణ్య భారతి ‘సుందర తెలుగు’,

పోతన ‘మందారమకరంద మాధుర్యమున దేలు’ అనే పద్యం ద్వారా అన్యాపదేశంగా తెలుగు తియ్యదనాన్ని తెల్పాడు.

అలాగే అయ్యప్ప దీక్షితులు మొదలైన పండితులు ఎందఱో తెలుగు భాషను కీర్తించారు. దీనికి ముఖ్య కారణం మన ఛందో బద్దమయిన పద్య ప్రక్రియ అని చెప్పవచ్చు. అందుకే తెలుగులో ఛందో బద్దంగా వ్రాయబడిన దేశీయ ఛందస్సు కు సంబంధించిన కంద పద్యాలలో నేను వ్రాసిన అయిదు కంద పద్యాలను మీ ముంచు ఉంచుతున్నాను. “నా కంద పంచకం” అనే పేరుతో ఉన్న నా కందాలలో ఏవైనా తప్పులుంటే పెద్దలు మన్నింతురు.

అందమైన చిన్న కందపద్యంలో ఎన్నో భావాలను వ్యక్తపరచిన తిక్కన, పోతన, మొల్ల మొదలైన మహానుభావులకు మనం ఎంతో ఋణపడిఉన్నాం. వారికి సర్వదా కృతజ్ఞతాంజలులు.

కంద పంచకం

  1. భుక్తికి మాత్రము కాదని
    భక్తికి ముక్తి నెలవని భౌతిక సుఖముల్
    ముక్తము చేయుచు విద్యను
    శక్తిగ ధ్యానించు వాణీ శాశ్వత కృపకై
  2. శక్తిని గల్గిన దేవుని
    భక్తితో వశపరచుకొనుట భావ్యముకానీ
    శక్తికి శక్తిని జూపి, న
    శక్తుడగుట, రావణుడిది సత్యము కాదే!
  3. పదవికి యధిపతి యనగనె
    పదవులు నోట్టుదురు నీకు
    పదుగురు విను నీ, పడవటు తొలిగిన, వారికి
    పెదవులపై చిరునగవు కూడా పేదది గాదే.
  4. చెట్టెల చిగిర్చి పూచియు
    చెట్టెడు ఫలముల నొసంగు చేజాపదు తా,
    పట్టిన వ్రతఫల మెంతదో!
    ఇట్టివెగద మంచిపనులు నేర్పడచూడన్
  5. గడియారము గాదది, మన
    గుడిగంటలు గావు, మనుజ గుండెల లయలే
    వడి వడి జేయుము సర్వము
    విడువుము ప్రాణము, మిగుల్చు మిలలో కీర్తిన్

**** సశేషం ****

Posted in February 2020, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!