క్రితం నెల పద్యంలో భీష్ముడి మీద కృష్ణుడి కృప ఎలా ప్రవహించిందో చూసాం. అయితే భగవంతుడెప్పుడూ ధర్మం వైపు ఉంటాడని కదా తెల్సిన విషయం? పన్నెండేళ్ళు అరణ్యవాసం, మరో ఏడు అజ్ఞాతవాసం చేసాక కూడా దుర్యోధనుడు నేను రాజ్యం ఇవ్వనూ అన్నప్పుడు సంజయుడు రాయబారానికి వస్తాడు పాండవుల దగ్గిరకి. అలా వచ్చిన సంజయుడు ధర్మరాజు తో చెప్తాడు, “ఇదిగో ఇలా పంపించారు నన్ను. మీరూ మీరూ కలిసి ఉండాలి. ధర్మం చూస్తే నీకు రాజ్యం ఇవ్వాల్సిందే. కానీ నా మనసులో మాట కూడా విను, వాళ్ళు రాజ్యం ఇవ్వకపోతే భిక్ష ఎత్తి జీవించడం మంచిది కానీ నీ వంటి వాడు యుద్ధానికి రాకూడదు” అని. ఈ మాట విన్నాక ధర్మరాజు అడుగుతాడు, “సంజయా నన్ను బిక్ష ఎత్తుకోమనడం బాగానే ఉంది. మరి అది క్షత్రియుడినైన నా ధర్మమా కాదా అనేది నాకు అంతు బట్టటం లేదు. ధర్మం అనేది సూక్ష్మాతి సూక్ష్మం కనక మా వైపు ఉన్న కృష్ణుడు ఏం చెప్తే అలాగే చేస్తాను” అంటాడు. అక్కడే ఉన్న కృష్ణుడికి వళ్ళు మండుతుంది ఇదంతా విని.
అప్పుడు కృష్ణుడు చెప్తాడు సంజయుడితో, “భలే చెప్తున్నావయ్యా నీతులు. ధర్మరాజు క్షత్రియుడు. క్షత్రియ ధర్మం యుద్ధమా, భిక్ష ఎత్తుకోవడమా? నిన్ను ఇలా నీతులు చెప్పమని ఆ పెద్దమనిషి ధృతతాష్ట్రుడు పంపించాడా? ఇది ధర్మం అనేనా, అక్కడున్న భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్యులు అనుకునేది? వాళ్లకి ‘ఇదీ ధర్మం’ చెప్పడానికెవరూ లేరా? సరే, నువ్వు వెళ్ళు, నేనే స్వయంగా వస్తున్నాను వాళ్ళకి చెప్పడానికి. నేనొచ్చి ధర్మం అంటే ఏమిటో వీళ్ళకి చెప్పకపోతే రేపు కానీ యుద్ధం జరిగితే ఈ కృష్ణుడు అన్నీ చేయగలిగి ఉండీ చూస్తూ కూర్చున్నాడనే మాట పడుతుంది నామీద.”
సంజయుడు వెళ్ళిపోయాక కృష్ణుడు సాత్యకితో పాటు హస్తినాపురం వెళ్తాడు రాయబారానికి. సభలో ఉన్న అందరికీ నీతులన్నీ చెప్పాక చివరకి ఈ మాట కూడా చెప్తాడు. అదే తిక్కన రాసిన మహాద్భుతమైన పద్యం.
ఉ. సారపు ధర్మమున్ విమలసత్యముఁ బాపముచేత బొంకుచేఁ
బారముఁ బొందలేక చెడఁబాఱినదైన యవస్థదక్షు లె
వ్వార లుపేక్షచేసి రది వారలచేటగుఁ గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్
ధర్మం అనేది ఎటువంటిది? సారమైనది, ఎవరి మూలానా కళంకం కానిది. అటువంటి ధర్మం పాపం చేతా, ఏ మాలిన్యమూలేని సత్యం, (సత్యం పరం ధీమహి అని కదా?) అబద్ధాల చేతా చెడిపోయే దశ వచ్చినప్పుడు మీ లాంటి సమర్థులైనవారు, చేతకాని వాళ్ళలా చూస్తూ కూర్చుని ఉపేక్ష చేస్తే అది వారికి సర్వనాశనాన్ని తీసుకొస్తుంది. అంతేకానీ ధర్మం పాడైపోయి నాశనం అవుతుందని అనుకోకండి. ఎందుకంటే, ధర్మాన్ని కాపాడి గట్టెక్కించడానికి, సత్య శుభస్థితిని యోగ్యులకు సమకూర్చేదీ అయిన దైవము ఎల్లవేళలా కాచుకుని ఉంటాడు.
ధర్మం పాడవుతున్నప్పుడు “ఆ, పోనీయ్ నాకెందుకులే” అని చూస్తూ కూర్చుంటే ఆ అలసత్వం అలా ఉపేక్షించేవాళ్లని కాటేస్తుంది కానీ ధర్మం పాడవదుట. ఎందుకంటే, ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడెప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అందుకే భగవంతుడంటే ఎవరనే ప్రశ్న వచ్చినప్పుడు సత్యమే, ధర్మమే భగవంతుడని చెప్పడం. ఈ పద్యంలో మరో విశేషం ఏమిటంటే భగవంతుడే ఈ మాట చెప్పడం. “యుద్ధం రాబోతోంది, అది వారించడానికి నేను వచ్చాను. లోకులు నన్ను వేలెత్తి చూపకుండా ఉండడానికీ, మీరు ఏమీ చేయకపోవడం చూసి, మీరు చేయగలిగిన పని చేయటం లేదని చెప్పడానికీను. అయినా మీరేం చేయకపోతే రాబోయే యుద్ధంలో నేను – భగవంతుణ్ణి – ధర్మాన్ని రక్షించడానికి అటు పాండవుల వేపు జేరాల్సి ఉంటుంది. అప్పుడు – వినండి సరిగ్గా – ధర్మాన్ని రక్షించనందుకు అది మిమ్మల్ని కాటు వేసి తీరుతుంది.” ఇంత కన్నా సులభంగా ఇంకేమిటి చెప్పడం?
ఇంత చెప్పినా చివరకి యుద్ధం జరుగుతుంది. భీష్ముడు అంపశయ్య మీదకి జేరతాడు. మొత్తం పద్దెనిమిది అక్షౌహిణీల సేన తుడిచిపెట్టుకుపోతుంది. చివరి రోజుల్లో భీష్ముడి ప్రాణం పోయేముందు ధర్మరాజుని వెంటబెట్టుకుని మళ్ళీ వస్తాడు కృష్ణుడు అంపశయ్య దగ్గిరకి. “కృష్ణా నేనెప్పుడూ ధర్మం తప్పినవాణ్ణి కాదు, మరి నాకింత నెప్పి, ఇలా జీవితం చాలించాల్సిన అవసరం కలిగిందే?” అని అడిగితే కృష్ణుడు చెప్తాడుట అప్పుడు, “ఆ రోజు ద్రౌపది కి సభలో చేసిన అవమానానికీ, యుద్ధం తప్పు అని తెలిసీ ఏమీ చేయకచూస్తూ కూర్చోవడం వలన వచ్చిన అనర్ధం ఇది,” అని. “దక్షులెవ్వార లుపేక్షచేసి రది వారలచేటగుఁ గాని..” అంటే ఇదే. తన తండ్రి కోసం భీకర ప్రతిజ్ఞ చేసాక కూడా మొత్తం కౌరవ పాండవ వంశాలు నాశనం కాకుండా ఉండడానికి ఎంతో కృషి చేసిన అతి దక్షుడైన భీష్ముడు చేయాల్సిన పని చేసాడా అని ప్రశ్న వేసుకుంటే లేదనే సమాధానం వస్తోంది కదా? అదే ధర్మాన్ని ఉపేక్ష చేయడం అంటే.
భగవంతుడు ధర్మ రక్షణ కోసం ఏం చేస్తాడో అనేది మళ్ళీ యుద్ధం ముందు భగవద్గీతలో ఆయనే చెప్పడం గమనించవచ్చు, “యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతు భారతః…” అంటూ.