-- డా. మధు బుడమగుంట
ప్రతి మనిషి పుట్టుకకు ఒక నిర్దిష్టమైన కారణముంటుంది. ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసినప్పుడు మనిషి జన్మకు సార్థకత చేకూరుతుందంటారు. కొందరి జీవితాలలో అదృష్టం కూడా తోడై వారు చేసిన మహాత్కార్యాలకు మంచి గుర్తుంపు లభించి సమాజంలో వారికంటూ ఒక ఉనికి ఏర్పడుతుంది. మరికొందరు ఎటువంటి గుర్తింపుల గురించి గానీ, వచ్చే అవకాశాల అదృష్టాన్ని పరీక్షించుకోవడం గానీ చేయక, ఆ సమయాన్ని కూడా విలువకట్టలేని అమూల్యమైన విషయాలను భావితరాలకు విశ్లేషణ రూపంలో అందించాలని ‘నివురుగప్పిన నిప్పు’ వలె తమ వృత్తి, ప్రవృత్తి నిష్ఫలాపేక్షతో చేసే అక్షరోపాసన అయి, తమ జీవితాలను నిత్యం సమాజ శ్రేయాస్సు కు సహకరించే విషయాల మీద కేంద్రీకరిస్తారు. ఆ కోవలోకే చేరిన మితభాషి, మననశీలి, అనాసక్త తత్వాన్వేషి, ఋషితుల్యులు శ్రీ సూరపరాజు రాధాకృష్ణమూర్తి నేటి మన ఆదర్శమూర్తి.
ముందుగా, ఈ ఆదర్శమూర్తి గురించిన సమాచారాన్ని నాకు అందజేసిన శ్రీమతి సూరపరాజు రమాదేవి గారికి, సూరపరాజు పద్మజ గారికి మరియు శ్రీ వేములపాటి శ్రీనివాసమూర్తి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారి ప్రమేయం లేకుంటే మూర్తి గారి భావుకత, తాత్వికత మేలు కలయికల పాండిత్య పటిమ గురించి మన సిరిమల్లె పాఠకులకు తెలిపే అదృష్టం ఉండేదికాదు.
రాధాకృష్ణ మూర్తి గారి రచనల సంఖ్య తక్కువే ఉండవచ్చు కానీ ఆ రచనల విషయ సాంద్రత విస్తారమై, వివిధ అధ్యయనాల సమన్వయ దృక్పథాలతో నిండి ఉన్నవి. అందుకు కారణం వారి బహుభాషా పాండిత్య పటిమ మరియు సైకాలజీ మొదలు లిటరేచర్ వరకు వివిధ రంగాలలో వారు ఎంతో ఆసక్తితో చేసిన ఎల్లలెరుగని పఠనము.
వీరి చదువు ఒక తపస్సు వంటిది, అందుకు ఎటువంటి విద్యాలయాలు, ఉన్నత విద్యార్హతలు అవసరం లేదు. కనుకనే తోటివారు డాక్టరేట్ లు సాధించి ఉన్నత పదవులు అందుకునేటప్పుడు వీరు సాధారణ ప్రభుత్వ డిగ్రీకళాశాల ఉపన్యాసకుడిగా వృత్తిలో స్థిరపడి, మిగతా సమయమంతా నిరంతర అధ్యయనానికి వెచ్చించారు. ఆంగ్లము, సంస్కృతమూ, ఫ్రెంచ్ భాషా సాహిత్యాలపైన ఆసక్తితో ఆ సాహిత్యాలను చదువుతూనే ఆ భాషలను ఆమూలం అభ్యసించారు. సంస్కృతంలో పాణిని వ్యాకరణసూత్రాలు, పతంజలి మహాభాష్యం ఉపనిషత్తులు, ఆదిశంకరుల భాష్యాలూ వీరికి కరతలామలకం.
నేటి ప్రకాశం జిల్లా, కందుకూరు మండలం లోని ఓగూరు గ్రామంలో ఆగష్టు 15,1935 లో రాధాకృష్ణ మూర్తి గారు జన్మించారు. బాల్యం నుండే పుస్తక పఠనానికి ఎక్కువ ఆసక్తి కనపరిచేవారు. అదే ఆయనను మద్రాసులో కాలేజీ చదువుతున్న సమయంలో కాలేజీ లో కన్నా ఎక్కువ సమయం హిగిన్ బాదమ్స్ పుస్తకాలషాప్ లోనే గడిపేటట్లు చేసింది. ఇంగ్లీష్ సాహిత్యంలో, ప్రాచ్య, పాశ్చాత్య వేదాంతాలలో చదవవలసిన గ్రంథాలన్నీ అప్పుడే చదివేవారు. తెలుగులో విశ్వనాధ దగ్గరనుంచి అప్పటి వరకూ ప్రసిద్ధులైన రచయితల పుస్తకాలన్నీ చదివారు. మొదటి పఠనంతోటే పుస్తకం లో గ్రహించవలసింది గ్రహించే మేధ ఆయన స్వంతం.
మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బి ఎ ఇంగ్లిష్ లిటరేచర్, ఆ తరువాత ఉద్యోగం చేస్తూ బెనారస్ యూనివర్సిటీలో ఎమ్. ఏ. లిటరేచర్ లో పట్టభద్రుడయ్యారు. గురువెరగని గురుత్వం మూర్తిగారిది. గ్రంథాలే ఆయన గురువులు.
యాభై అయిదవ వయసులో రాధాకృష్ణ మూర్తి గారికి కలిగిన ఒక విషాదం ఆయనకు తనను తాను మరపించుకోవలసిన అగత్యం ఏర్పరచింది. అప్పుడు మొదలు పెట్టి తనకై వారు చేసుకున్న మొదటి ప్రముఖ రచన, భగవద్గీత పై ఆదిశంకరుల సంస్కృతభాష్యాన్ని తెలుగులోకి అనువదించటం. అంతకుపూర్వం వారు ఎన్నో ప్రసిద్ధ గీతావ్యాఖ్యలు చదివి ఉండటం వల్ల శంకరభాష్యంలోని నిరుపమానమైన ప్రత్యేక ఉపదేశం వారికి అనుభవసారంగా సిద్ధించింది. గీతలో ముఖ్యంగా చర్చచేయబడే అంశాలైన కర్మ, యుద్ధము, సన్న్యాసము ల నిజార్థము వీరు దర్శించి ఆవిష్కరించిన విధము, ఒక కొత్త దృష్టి తెచ్చిపెట్టింది ఆ గ్రంథానికి, అందుకే రామకృష్ణామఠం, హైదరాబాద్ వారు వీరి ‘భగవద్గీత శంకరభాష్య అనువాదం’ ప్రచురించారు. నిజానికి అంతకుమునుపే మూర్తి గారి కుమార్తె గారి 'జనని' ద్వారా ప్రచురించిన ఈ భగవద్గీత శంకరభాష్యం ప్రముఖ ఆంగ్ల పత్రిక 'The Hindu' మరియు కొన్ని తెలుగు పత్రికల చేత మిక్కిలి ప్రశంసా స్పందనలు అందుకున్నది.
ఆ తరువాత కొందరి పండిత పాఠకాభిమానుల కోరిక మేరకు ఉపనిషద్ వ్యాఖ్యలు వ్రాయడం మొదలుపెట్టారు.
'ఈశోపనిషత్తు', 'కేన', 'కఠ' జనని ద్వారా రెండు ముద్రణలు పొందింది. 'మాండూక్య' ముద్రణలో ఉంది. బహుభాషా కోవిదులైన రాధాకృష్ణ మూర్తి గారు ఆంగ్లంలో ‘Upanishads Insights into Infinity', 'Krishna calling, a free rendering on Gita' రచించారు. అంతేకాదు దాని తెలుగు అనువాదం 'కృష్ణుని పిలుపు' జ్ఞానదేవ్ 'అమృతానుభవం' తెలుగుసేత ఇంకా కొన్ని అనన్యసామాన్య విజ్ఞాన దీపికలుగా రచింపబడ్డాయి.
'షేక్స్పియర్ - సాహిత్యావలోకనము' అని మాతృ భాష లో ప్రపంచ రచయితలను తెలుసుకోవాలనుకునే వారికి ఆంగ్ల భాషను ఆశ్రయించే అవసరం లేకుండా చేసి ఆ పుస్తకం నాటకకర్తగా షేక్స్పియర్ ని ఎవ్వరూ ఊహించని ఎత్తుకు చేర్చిన ఘనత మన మూర్తి గారిది.
వీరి ఈరచనల ప్రధమ ఉద్దేశ్యం, ప్రయోజనం ఎక్కడ ఉన్నదంటే అవి రాసిన పద్ధతిలో నిగూఢమై ఉంది.
వీరి రచనలన్నీ ముందే చెప్పినట్లు వారి ఎనిమిది పదుల జీవితంలో (ఇప్పటికీ) చేసిన విస్తార, వివిధ అధ్యయనాల సమన్వయ దృక్పథాలతో నిండి ఉన్నవి.
ప్రపంచ దేశాలన్నీ తమ వివిధ సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, అస్తిత్వ సమస్యలకు వారి సిద్ధాంతాలలో సంతృప్తికర జవాబులు దొరకక, మన వేద వాజ్ఞ్మయమూ, ఉపనిషత్తులు, భగవద్గీత, ఆధ్యాత్మిక జ్ఞానం వైపు అడుగులు వేస్తున్నారు. ఇదివరకే రమణులు, వివేకానందులు, అరవిందయోగి ఇంకొందరు పాశ్చాత్య తత్వాన్వేషకులను ఇటు చూచేటట్టు చేసినా ఇప్పుడు అధిక సంఖ్యలో వారు ఈ త్రోవను అనుగమిస్తున్నారు. ఇప్పుడు మన వారికి మన విద్యా, జ్ఞానములందు కొత్త ఉత్సుకత, అధ్యయనాశక్తి అనే స్వాభిమానంతో కూడిన ఆశ కలుగుతున్నాయి. పరిస్థితులు అటువంటివి.
ప్రశ్నలు, సమస్యలు (పర్యావరణం దగ్గరనుంచి ప్రపంచ అణు యుద్ధాలవరకూ), అస్తిత్వవిషాదం, మతాల పేరిట మారణహోమాలు, మునుపెన్నడూ లేనంత తీక్షణంగా ఉన్నాయి ఇప్పుడు.
నాస్తికత్వమా, ఆస్తికత్వమా, సెక్యులరిజమా, వేదవిద్యా, తక్షణ కర్తవ్యం? మనిషిని వేధిస్తున్న ఆధ్యాత్మిక అస్తిత్వ సమస్యలకు జవాబు, కేవలం ప్రాచీన వేదవాజ్ఞ్మయంలోనో, దేవుడు అసలే లేడన్న నాస్తికతలోనో పూర్తిగా లేదు. మన సాహిత్యం సముద్రమంత, ఆధ్యాత్మికం ఏడు సముద్రాలంత ఉన్నా అవన్నీ క్షారజలం అంటూ హేతువాదం, ఆధునికతలు కొట్టివేస్తూ వచ్చాయి.
సానుభూతితో, సమతుల్యతతో వారి సందేహాలను తీర్చే గురువులు, రచనలకు కొరవే ఎప్పుడూ, ఎందుకంటే ఈ పరిస్థితులలో కావలసినది సమగ్ర సమన్వయదృష్టి, ప్రాక్, పశ్చిమాల మేలుకలయిక, ఆస్తికతలో హేతువాదం, నాస్తికతలో దాగిన మూల సత్యదర్శనం.
ఆ దర్శనం మన రాధాకృష్ణ మూర్తి గారి సాహిత్యసృష్టి లో జరిగింది. ఆయన రచనల గురించి ఎంతో మంది సాహితీ వేత్తలు ప్రశంసల జల్లులు కురిపించారు. మరికొందరు ఆయన రచనలకు ముందుమాటగా అత్యంత అపురూపమైన పదజాలాన్ని వాడి తన పాండిత్య పటిమకు తమ అభినందనలు తెలియజేసారు.
ప్రాక్ సాహిత్యం తో పాటు, పాశ్చాత్య చింతనకు సంబంధించిన మౌలిక సాహిత్యాన్ని అనన్య రీతిలో సమన్వయం చేసి ఒక సజీవ, అత్యంత నూతన దృక్పథాన్ని పాఠకుల చేతులలో పెట్టిన రచనలు రాధాకృష్ణ మూర్తి గారు చేశారు. కనుకనే ఆ రచనలను చదువవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది.
వీరి రచనలలో, గ్రీక్ సాహిత్యంలో హోమర్, సొఫోక్లిస్, ప్లేటో; లాటిన్ సాహిత్యంలో వర్జిల్, హొరేస్,లుక్రీషియస్ నుంచి ,మధ్య యుగాల అగస్టైన్, ఆక్వినాస్,ఎక్కార్ట్; రినైసెన్స్ లో డాంటే, షేక్ స్పియర్, సెర్వాంటిస్; ఎన్ లైటెన్ మెంట్ కాలంలో రూసొ,వోల్టేర్, గొథే; పందొమ్మిదో శతాబ్దిలో కిర్క్ గార్డ్, డాస్టవిస్కీ, బోదిలేర్; పందొమ్మిది-ఇరవయ్యవ శతాబ్ది మధ్యకాలంలో టాల్ స్టాయి, నీషే, హిడెగ్గర్; ఇరవయ్యవశతాబ్దిలో ఇలియట్, కాఫ్కా, బొరేస్ వరకు, మన ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణ, భారతాలు, ఆదికవి వాల్మీకి, వ్యాసుడి నుండి విశ్వనాధ, శ్రీశ్రీ, ఇంకా ఆధునిక కవులు కలిసి కనిపిస్తారు. వీరందరి జ్ఞానసారాలు ఈ రచయిత చేత harness, చేయబడి ఒకసమీకృత సమన్వాయామృతఝరియై ప్రవహిస్తాయి.
టి.ఎస్.ఎలియట్ ప్రముఖ రచనలపై ఆయన వ్రాసిన వ్యాసాలు ముద్రణకు నోచుకోన్నాయి. షేక్స్పియర్ ఏడు గొప్ప నాటకాలపై, అస్తిత్వవాద సాహిత్యకారులైన ప్రపంచ ప్రసిద్ధ పాశ్చాత్య రచయితల పుస్తకాలపై సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. వారే స్వయంగా ఒక బ్లాగు నిర్వహించడం చేస్తూ e-books వెలువరించడం కూడా చేశారు. advaitha.org అనే వెబ్ సైట్ లో వీరి మహావాక్యాలు మనం చూడవచ్చు.
ఈ వయసులో ఇంత విస్తార, కూలంకష, అనిదంపూర్వమైనటువంటి ఇటువంటి రచనలు చేయటానికి రోజుకు ఎన్ని గంటలు ,ఎంత శక్తి వెచ్చిస్తున్నారో చూస్తే, సంకల్ప బలం లోకోపకరణానికే అన్న విషయంఅర్థమౌతున్నది. వారు నమ్మిన దేవతల ఆశీర్వాద బలం ఆయనకు సదా నిలిచి మరిన్ని మంచి రచనలను మానవాళికి అందించాలని మనసారా కోరుకుందాం.