అమరగాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మృతి సందర్భంగా కొందరు పనిగట్టుకుని మరీ సామాజిక మాధ్యమాలలోనూ, ఇతరత్రా అనవసరమైన వివాదాలు సృష్టించారు. ఆయన పండితుడు కాడనీ, శాస్త్రీయ సంగీత విద్వాన్ కాదనీ, ఆయన బ్రాహ్మణీయ సంస్కృతికి సమర్థకుడనీ, ఆయనకు కులతత్వం ఉందనీ, ఎందరో ఔత్సాహికులను ఆయన తొక్కేశాడనీ - ఇలా అర్థం పర్థం లేని విమర్శలెన్నో చేశారు. మా తెనాలికి చెందిన కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి ఎస్పీ తెనాలి వాడేనంటూ కొత్త సిద్ధాంతం లేవదీశారు. ఇంకొందరు సంప్రదాయవాదులు మరింత ముందుకెళ్లి అంత్యక్రియలలో బాలూని దహనం చేయకుండా ఖననం చేయటం హిందూ సంప్రదాయాలకు విరుద్ధమని గగ్గోలు పెట్టారు. మృతిచెందిన అంతటి గొప్ప కళాకారుడికి ఘనంగా నివాళులు సమర్పించాల్సిందిపోయి, ఆయన మృతి సందర్భంగా ఇలా వివాదాస్పదమైన, పనికిమాలిన చర్చలతో రచ్చ చేయటం విజ్ఞత కలిగినవారు చేసే పని మాత్రం కాదు.
బాలూని అభిమానించే వ్యక్తిగానే కాక ఒక విజ్ఞత కోల్పోని వ్యక్తిగా నేను సామాజిక మాధ్యమాలలో చెలరేగిన ఈ రచ్చపట్ల తీవ్రంగా కలత చెందాను. అందుకే ఈ వ్యాసంలో ఆ దుష్ప్రచారాన్ని అంశాలవారీగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాను.
గాయకులు రాణించడానికి పాండిత్యం ఏమేరకు అవసరం??
బాలు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా తాను శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదనీ, తానొక పండితుడను కాననీ, అతి సామాన్యుడననీ నిజాయతీగా చెప్పేవారు. అయితే ఆయన ప్రతి మాటలోనూ పాండిత్యం, వినయం తొణికిసలాడతాయనేది అసలు వాస్తవం. బహుభాషావేత్త అయిన బాలు అనర్గళంగా చేసే సమయోచిత ప్రసంగాలు విశ్వవ్యాప్తంగా ‘పాడుతా - తీయగా’, ‘స్వరాభిషేకం’ వంటి తెలుగు సంగీత కార్యక్రమాలు వీక్షించే బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితాలే. విషయమేమంటే ఒక గాయకుడు శ్రోతలను రంజింప జేసేందుకు తప్పనిసరిగా పండితుడు కానక్కరలేదు. ఒక గొప్ప గాయకుడు భాషా పండితుడు కూడా అయితే ఆయన మరింతగా శ్రోతలను అలరిస్తాడనేది నిజమైతే కావచ్చు. అయినా గాయకులకుండాల్సిన పాండిత్యానికి కొలబద్ద ఏమిటి? దానికి ఏదైనా పరిమితి ఉందా? నిజానికి గాయకులు భాషాపరంగా తప్పులు లేకుండా, స్పష్టమైన ఉచ్చారణతో పాడితే చాలు. గాయకుడికి ఉండాల్సిన పాండిత్యానికి పరిమితి ఏమైనా ఉందా? అని నేను ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే దిగ్గజ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల కూడా ‘వినాయక చవితి’ చిత్రం కోసం పాడిన ‘వాతాపి గణపతిమ్ భజేహం’ అన్న గణపతి స్తుతిలో
‘శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్న వదనం ధ్యాయేత్, సర్వవిఘ్నోపశాంతయే||
అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం |
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే||’
అని పాడాల్సి ఉండగా రెండవ శ్లోకంలోని చివరి పాదంలో ‘అనేక దంతం’ అని కలిపి పాడేశారు. ‘అనేక దం’ అంటే భక్తుల అనేకమైన కోర్కెలను ఇచ్చేవాడా(తీర్చేవాడా) అని అర్థం. ‘తం భక్తానాం’ అని వేరుగా పలకాల్సి ఉండగా ఈ శ్లోకంలో ముందు శబ్దం ‘దం’ ని తరువాత శబ్దం ‘తం’ తో కలిపి, ఏకదంతుడైన గణేశుడిని అనేకదంతమ్ అంటే పలు దంతములు కలవాడిని చేశారనే విమర్శను ఎదుర్కొన్నారు ఘంటసాల.
‘ప్రమాదో ధీమతామ్ అపి’ అంటే తప్పులు చేయటం ధీమంతుల(పండితుల) కు కూడా సహజమే. ‘To err is human. Good Homer sometimes nods’ అనే లోకోక్తి సుప్రసిద్ధం. తప్పుచేయడం మానవసహజం - హోమర్ మహాకవి అంతటివాడికి కూడా అప్పుడప్పుడూ తల కంపిస్తుంది. కనుక గాయకుడికి తప్పనిసరిగా పాండిత్యం ఉండి తీరాల్సిన అవసరం లేదు. చక్కని గాత్రశుద్ధి, స్పష్టమైన ఉచ్చారణ ఉంటే చాలు. అవి బాలు దగ్గర పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు. తాను ఏ నటుడికి పాడినా ఆ నటుడి స్వరాన్ని అనుకరించి పాడగలిగే నైపుణ్యం ఆయన ఒక్కడికే స్వంతం.
శాస్త్రీయ సంగీతమే సంగీతమా?
ఇక్కడ మరో విషయం కూడా గమనార్హం. కేవలం శాస్త్రీయ సంగీతం మాత్రమే సంగీతం కాదు. మనం గమనించాలేగానీ పల్లె ప్రజలు కాలక్షేపం కోసం పాడుకునే పదాలు, శ్రమజీవులు తాము చేసే శ్రమను మరచిపోయేందుకు పాడుకునే శ్రామిక గేయాలు, ఇంకా అన్ని తరహాల జానపద గేయాలలోనూ, జావళులలోనూ సంగీతం ఉంది. వ్యవసాయంలో అంతర్భాగమైన ఏరువాక పాటలు, ఏతము, మోటబావి పాటలు, నాట్లు (ఊడ్పులు) వేసే మహిళల పాటలు, కుప్ప నూర్పిళ్ల సందర్భంగా పాడుకునే పొలి పాటలు, వడ్లు దంచే స్త్రీలు పాడుకునే రోకటి పాటలు, విసురు రాతి (తిరుగలి) పాటలు, రాట్నము పాటలు వీటన్నిటిలో లయబద్దమైన సంగీతం ఉంది. ‘ఒహోం ఒహోం భీం’ అంటూ బోయీలు పాడుకునే పాటలు, ‘జోర్సెయ్.. బార్సెయ్’ అంటూ, ‘హైలో హైలేసా .. ఏలేసా .. ఓలేసా’ అంటూ తెడ్డు వేసే కళాసులకు శ్రమ తెలియకుండా వారిని ఉత్సాహ పరచడం కోసం ఓడ అధికారి (సరంగు) లేక పడవ అధికారి (తండేలు) పాడే పడవ పాటలలోనూ, చివరికి గ్రామీణుల డప్పు పాటలలోనూ, ‘లాగరా హైలెస్సో .. లాగరా హైలెస్సా’ అంటూ లాగరాయి శ్రామికులు పాడుకునే పాటలలోనూ అంతర్లీనంగా సంగీతం ఉంది మనం గమనిస్తే. జానపద, లలిత సంగీతాలతో పాటు శ్రోతలను రంజింపజేసే గాత్ర, వాద్య సాధన ఏదైనా కూడా సంగీతమే. అసలు రసజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రకృతిలోని మనం వినే ప్రతి శబ్దంలోనూ ఒక శృతి, లయ ఉన్నాయి. మన ఉఛ్చ్వాస నిశ్వాసములు, నాడీ స్పందనలలోనూ లయబద్దమైన సంగీతం ఉంది మనం గ్రహించగలిగితే. కాబట్టి సంగీతం అంటే కేవలం శాస్త్రీయ సంగీతమే అనే కొందరి భావన అర్థరహితం. ఈ వాదనకు ఎప్పుడో కాలం చెల్లింది.
‘శిశుర్వేత్తి..పశుర్వేత్తి.. వేత్తి గానరసం ఫణిః’ అని ఆర్యోక్తి. గానరసాన్ని ఎలా ఆస్వాదించి, ఆనందించాలో శిశువుకూ, పశువుకూ, పాముకూ కూడా తెలుసు. తన గాన మాధుర్యంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేయడం, వారికి రసానుభూతిని కలిగించి అంతిమంగా వారిని రంజింపజేయడమే ఒక గాయకుడి లక్ష్యం. ఆ లక్ష్యసాధనలో ‘గాన గంధర్వుడు’ బాలు నూరు శాతం కృతకృత్యుడయ్యాడు. ఇక ఆయన శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాకనే సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టాడా? లేదా? ఆ తరువాత ఆయన ఏ మేరకు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు? అనే ప్రశ్నలు ఇక్కడ అసందర్భం. ఒక గాయకుడు రాణించడానికి అతడికి శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండితీరాలనే నియమమేమీ లేదు. విలక్షణమైన గాయకుడిగా తన సుదీర్ఘ అనుభవంతో, స్వయంకృషితో ఎంతో నేర్చుకున్న విజయవంతమైన సంగీతజ్ఞుడు బాలు.
ఆరాధ్యులంటే?
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం పుట్టుక రీత్యా ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఆరాధ్య బ్రాహ్మణుల గురించి తెలుసుకోవాలంటే మనకి ముందుగా వీరశైవాన్ని గురించి కొంత అవగాహన ఉండటం అవసరం. ఇది శైవ మతం నుండి చీలిన ఒక శాఖ. దీనిని లింగాయత మతం అని కూడా అంటారు. తమ మతాచారాలకు సూచనగా వీరశైవులు లింగాన్ని ధరిస్తారు కనుక వారిని లింగాయతులు అంటారు. వీరశైవం యొక్క ఆవిర్భావం కర్ణాటకలో జరిగింది. బసవేశ్వరుడు అనే ఒక బ్రాహ్మణ యువకుడు స్థాపించినదే వీరశైవ మతం అని కొందరు భావిస్తున్నప్పటికీ అంతకుముందే క్రీ.శ .9 వ శతాబ్దిలోనే వీరశైవ మతం ఆవిర్భవించిందని చరిత్రకారులు భావిస్తున్నారు. బసవేశ్వరుడి కాలంలో వీరశైవం ఉచ్చదశకు చేరుకుందని పలువురి అభిప్రాయం. బసవ శబ్దం వృషభ శబ్దం ప్రాతిలోమ్యమై ఏర్పడినదే. శైవ మతాన్ని పునరుద్ధరించడం కోసం శివుడి ఆజ్ఞమేరకు ఆయన వాహనమైన నంది బసవేశ్వరునిగా భూలోకంలో అవతరించడం జరిగిందని వీరశైవుల విశ్వాసం. 13 వ శతాబ్దికి చెందిన పాల్కురికి సోమనాథ కవి రాసిన ‘బసవ పురాణం’ అనే ద్విపద కావ్యంలో బసవేశ్వరుడి జీవిత విశేషాలు వివరించబడ్డాయి. సోమన రాసిన తెలుగు ద్విపద కావ్యాన్ని 14 వ శతాబ్దికి చెందిన భీమకవి అనే కన్నడ కవి ‘బసవ పురాణ’ అనే పేరుతో కన్నడ భాషలోకి అనువదించాడు. దీనిలో బసవేశ్వరుడి జీవితానికి సంబంధించిన మరిన్ని విశేషాలు జోడించబడినందున దీనిని బసవేశ్వరుడి చరిత్రను తెలిపే సాధికార గ్రంథంగా భావిస్తున్నారు. బసవడు క్రీ.శ. 1105 లో నేటి కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని ఇంగలేశ్వర బాగేవాడి (నేటి బసవన బాగేవాడి) లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 1167 లో బసవడు బాగల్ కోట్ జిల్లాలోని కూడల సంగమేశ్వర అనే ప్రదేశంలో మరణించాడు. (ఇది ఆల్ మట్టి డ్యాం సమీపంలో కృష్ణా నదిలో మలప్రభా నది కలిసే చోటు). ఆయన రాసిన వచనాలు, ఆయన బోధనలు కన్నడసీమలో భక్తి ఉద్యమానికి, శైవమత పునరుద్ధరణకు దారితీశాయి. బసవడు వేద ప్రామాణ్యాన్ని అంగీకరించలేదు. వేదాలలో ప్రతిపాదించిన వర్ణాశ్రమ ధర్మాలను, యజ్ఞ సంస్కృతిని, పశుబలులను ఆయన తీవ్రంగా నిరసించాడు. అమానుషమైన వర్ణ వ్యవస్థను, అంటరానితనం వంటి దురాచారాలను తీవ్రంగా విమర్శించి వర్ణరహిత సమాజ స్థాపన కోసం కృషిచేశాడు. జన్మతః తాను బ్రాహ్మణుడే అయినా సమాజంలో బ్రాహ్మణాధిక్యతను నిరసించాడు. సామాజిక పురోగతికి జనాభాలో సగభాగంగా ఉన్న స్త్రీల విముక్తి తప్పనిసరి అని ఆయన ఆనాడే గుర్తించాడు. వైదిక సాహిత్యంలో స్త్రీల పట్ల ఎంతటి వివక్షాపూరిత వైఖరి ఉందో తన రచనలలో ఎత్తిచూపిన బసవడు తన జీవితకాలమంతా స్త్రీలు, బలహీనవర్గాల విముక్తికే కట్టుబడి కృషిచేశాడు. కుల ప్రసక్తిలేని వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించాడు. తన సోదరి నాగలాంబికను ఒక అంటరాని కులానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ దంపతుల కుమారుడే చెన్న బసవడు. అనంతరకాలంలో చెన్న బసవడు లింగాయత మత వ్యాప్తికి విశేష కృషి చేశాడు. వీరశైవులు అంగము అని పిలిచే తమ శరీరానికి, పరమ శివుని ప్రతిరూపంగా భావించే లింగమునకు అభేదం పాటిస్తారు. తమ శరీరంపై సదా ఇష్టలింగాన్ని ధరిస్తూ, ఆత్మ - పరమాత్మల విడదీయరాని సాన్నిహిత్యానికి దానినొక సంకేతంగా భావిస్తూ, ఆ ఇష్టలింగాన్ని తమ శరీరాన్నుంచి ఎట్టి పరిస్థితులలోనూ తొలగించరు. ఇష్టలింగ ధారణలో భాగంగా వీర శైవులు సాధారణంగా హృదయానికి సమీపంలో ఒక లింగకాయ లేక రుద్రాక్షను ధరిస్తారు. వారు బ్రాహ్మణులలా యజ్ఞోపవీతాన్ని ధరించరు. తాము ధరించే ఇష్టలింగాన్ని వారు మరణానంతరం కూడా తొలగించరు. పార్థివ దేహాన్ని దహనం చేయడం కారణంగా తాము జీవించి ఉండగా ధరించిన ఇష్టలింగం చితిమంటలలో కాలిపోకూడదనే వారు తమ అంత్యక్రియలలో దహన పద్ధతిని కాకుండా ఖనన పద్ధతిని పాటిస్తారు.
వీరశైవ మతంలో ఆరాధ్యులు అనే ఐదుగురు ప్రవక్తలు ప్రసిద్ధులు. వారు - రేవణారాధ్యుడు, మరుళారాధ్యుడు, పండితారాధ్యుడు, ఏకోరామారాధ్యుడు, విశ్వారాధ్యుడు. వీరు ప్రాచుర్యంలోనికి తెచ్చినదే ఆరాధ్యశైవ మతం. కాశ్మీర శివాద్వైతం ప్రభావంతో బసవేశ్వరునికి పూర్వమే కన్నడనాట ప్రభవించిన వీరశైవ భావాలు గొప్ప సామాజిక సంస్కరణలు తెచ్చాయి. బసవేశ్వరుడి కాలంలో ఈ సామాజిక విప్లవం మరింత ముందడుగువేసి, వీరశైవం కులభేదాలను నిరసించి కులరహిత సమాజం కోసం కృషిచేసింది. దాదాపు అదే సమయంలో ఈ ఆరాధ్యులు ప్రవచించిన ఆరాధ్య సంప్రదాయం కన్నడ దేశం నుంచి ఆంధ్ర ప్రాంతానికి విస్తరించింది. కర్మ ప్రధానమైన వైదిక మతం అప్పుడు వెనుకపట్టు పట్టి తెలుగు నేలపై సైతం భక్తి ప్రధానమైన వీరశైవ మతం క్రమంగా పైచేయి సాధించసాగింది. అయితే కుల ప్రసక్తిలేని కన్నడ సీమ నుంచి ఈ లింగధారులు వీరశైవ మత వ్యాప్తికి ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు ఆంధ్రదేశం అంతటా వర్ణ వ్యవస్థ ఘనీభవించి ఉన్నది. బ్రాహ్మణులు అగ్ర వర్ణంగా ఉండి సమాజానికి దిశానిర్దేశకులుగా ఉన్నారు. ఆ దశలో ఆంధ్రదేశంలోకి అడుగుపెట్టిన వీరశైవ ఆరాధ్య సంప్రదాయం ఇక్కడి ప్రత్యేక పరిస్థితుల కారణంగా వర్ణధర్మాలను విడనాడకుండా వాటికే కట్టుబడి ఉన్నది. ఆంధ్రదేశంలో ‘పండిత త్రయం’ గా పేరొందిన ప్రవక్తలు ఆరాధ్య సంప్రదాయానికి ఆద్యులు. వారు - శ్రీపతి పండితుడు, శివలెంక మంచన పండితుడు, మల్లికార్జున పండితుడు. శివుడే పరదైవమని చాటటం కోసం శ్రీపతి పండితుడు తన పై పంచెలో నిప్పులు మూట కట్టాడని కొందరి విశ్వాసం. ఈ పండిత త్రయం గొప్ప భక్తాగ్రేసరులే అయినా వీరు వీరశైవ మతబోధనల ప్రకారం వర్ణ రహిత సమాజంకోసం శ్రమించక, వర్ణాశ్రమ ధర్మాలకే కట్టుబడి ఉన్నారు. సన్యాసాశ్రమాన్ని వీరు నిరసించారు. ఆది శంకరుడి అద్వైతాన్నీ వీరు ఖండించారు. మల్లికార్జున పండితారాధ్యుడు
“భక్తి మీది వలపు బ్రాహ్మ్యంబుతో పొత్తు
పాయలేను నేను బసవలింగ”
అన్నాడు. ఆరాధ్య శైవం భక్తి తత్త్వాన్ని ప్రబోధించి, కులభేదాలను నిరసించిన వీరశైవంలో నుంచి పుట్టుకొచ్చినదే అయినా ఆంధ్రదేశంలోని ప్రత్యేక పరిస్థితుల కారణంగా అది వర్ణ వ్యవస్థను సమర్థించిందనేదానికి ఇదే నిదర్శనం.
తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన మల్లికార్జున పండితారాధ్యుడు పండిత త్రయంలో ప్రసిద్ధుడు. ఆయన బసవేశ్వరుడికి సమకాలికుడు. ఆయన ‘శివతత్త్వ సారము’ అనే గ్రంథం రాశాడు. అది తెలుగు శతక సాహిత్యానికి ఆది గ్రంథంగా భావిస్తున్నారు - దానికి పూర్తిగా శతక లక్షణాలు లేకున్నా.
ఈయన తన శిష్యగణంతో సహా శ్రీశైలం మీదుగా కన్నడ దేశం చేరుకొని బసవేశ్వరుని దర్శించుకోవాలనుకున్నాడు. అయితే ఆయన శ్రీశైలం చేరేటప్పటికే 1167 లోనే బసవడు లింగైక్యం పొందాడనే వార్తలు వచ్చాయి. దానితో ఆయన శ్రీశైలంలోనే కొంతకాలం ఉండి, క్రీ.శ .1170 లో శ్రీశైల శిఖరం మీది నుంచి లోయలోకి దూకి శివైక్యం పొందాడని ఐతిహ్యం. ఇలా ఆత్మార్పణం చేసుకొనడాన్ని వీరశైవులు కరుమారి (కర్మారి) అంటారు. ప్రముఖ శివకవి పాల్కురికి సోమనాథుడు తన ‘పండితారాధ్య చరిత్రము’ అనే ద్విపద కావ్యంలో మల్లికార్జున పండితారాధ్యుని జీవిత విశేషాలను వివరించాడు.
ఆంధ్రదేశానికి ఆరాధ్య శైవులు వచ్చిన సమయంలో ఇక్కడి పరిస్థితుల ప్రభావం కారణంగా వారు వర్ణ వ్యవస్థను సమర్థించినప్పటికీ వారిని బ్రాహ్మణులుగా గుర్తించి, వారితో వైవాహిక సంబంధాలు ఏర్పరచుకొనటానికి ఆంధ్ర బ్రాహ్మణులు - ముఖ్యంగా వైదికులు ముందుకు రాలేదట. కొంతకాలానికి ఈ అల్పసంఖ్యాక ఆరాధ్య శైవులతో ఆరువేల నియోగులలోని కొందరు మాత్రం అక్కడక్కడా వైవాహిక సంబంధాలు ఏర్పరచుకున్నారట. అలా నాటినుంచి ఆరాధ్యులు మిగిలిన స్థానిక బ్రాహ్మణులకు భిన్నంగా తమ ప్రత్యేక వీరశైవ సంప్రదాయాలు కొనసాగిస్తూ తెలుగు బ్రాహ్మణులలో ఒక మైనారిటీ వర్గంగానే కొనసాగుతూ వస్తున్నారు.
అలాంటి ప్రత్యేక వీరశైవ సంప్రదాయాలలో భాగమే ఇష్టలింగ ధారణ, అంత్య క్రియలలో మిగిలిన హిందువులకు భిన్నంగా దహనానికి బదులు ఖననం పాటించడం, పార్థివ దేహాన్ని పాడె మీద పడుకోబెట్టి కాక కూర్చోబెట్టి శ్మశానానికి తీసుకెళ్లడం వంటివి. అసలు అంత్యక్రియల పద్ధతే అశాస్త్రీయమని భావించే విజ్ఞులు పలువురు మరణానికి ముందే తమ మృత శరీరాలను వైద్య పరిశోధనల నిమిత్తం వైద్యశాలలకు దానం చేస్తున్న ఈ ఆధునిక యుగంలో, పార్థివ దేహాన్ని దహనం కాక ఖననం చేయడం అరిష్టదాయకమని గగ్గోలు పెట్టేవారిని చూస్తుంటే నవ్వొస్తుంది. ఆరాధ్యుల ప్రత్యేక ఆచారాలు వారివి. వాటిని అనాచారమని, అరిష్టదాయకమని అవే తరహా అశాస్త్రీయమైన ఆచారాలు పాటించే వేరొకరు తప్పుపట్టటంలో అర్థమే లేదు. చేతనైతే ఈ తరహా అన్ని ఆచారాలు ఏమేరకు శాస్త్రీయమైనవో లోతైన పరిశీలనతో గ్రహించి, అశాస్త్రీయమైన ఆచారాలకు ముందుగా తాము దూరంగా ఉంటూ, వాటిపై ప్రజలలో చైతన్యం కలిగించాల్సి ఉంది. ఆరాధ్యుల ఆచారాల గురించి కనీస పరిజ్ఞానం లేనివారు తమ అంత్యక్రియలలో పార్థివ దేహాన్ని పాతిపెట్టటం హిందువులకు అరిష్టదాయకమనడం అర్థరహితం.
ఆరాధ్యులలో కొందరు ప్రముఖులు
కాశీనాథుని, శ్రీపతి పండితారాధ్యుల (S.P.), మల్లికార్జున పండితారాధ్యుల (M.P.), ములుగు, శివలెంక, ముదిగొండ, మల్లంపల్లి వంటి ఇండ్లపేర్లు కలిగిన అతికొద్ది కుటుంబాలవారు ఈ ఆరాధ్యులు. శ్రీపతి పండితారాధ్యుల, శివలెంక, మల్లికార్జున పండితారాధ్యుల అనే మూడు ఇండ్లపేర్లు ఆరాధ్యులలో ప్రముఖులైన పండితత్రయం మీదుగా ఏర్పడ్డాయి. కాశీనాథుడు అనే ఆరాధ్య ప్రముఖుని పేరిట కాశీనాథుని అనే ఇంటి పేరు ఏర్పడింది. కాకతీయ ప్రతాపరుద్రుని పాలనాకాలం (క్రీ.శ .1296 -1323) లో ఆయన తన గురువైన శివయోగీశ్వరుడిని తెనాలికి పంపించి, అక్కడి (ప్రస్తుత గంగానమ్మపేటలోని) రామలింగేశ్వరస్వామి దేవస్థానానికి ఆయన్ని స్థానాచార్యుడిగా నియమించి, ఆయనకూ, మరికొన్ని ఆరాధ్య కుటుంబాలవారికి నివాసగృహాలు నిర్మించి ఇచ్చినట్లు తెనాలి కైఫీయ్యత్ పేర్కొంది. తెనాలి మరియు సమీప ఈమని తదితర గ్రామాలలో స్థిరపడిన ఆరాధ్య కుటుంబాలవారు కన్నడసీమనుంచి వచ్చి కాకతీయ సామ్రాజ్యంలో నేటి వరంగల్ జిల్లా లోని ములుగు, ముదిగొండ, మల్లంపల్లి వంటి గ్రామాలలో స్థిరపడి, అనంతరం శివయోగీశ్వరునితోపాటు ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడి ఉంటారు. సుప్రసిద్ధ వీరశైవుడు ముదిగొండ ఉద్భటారాధ్యుడే ఆరాధ్యులలోని ముదిగొండ వారి మూలపురుషుడు. ఈయన జీవిత విశేషాలను తెనాలి రామలింగకవి తన ‘ఉద్భటారాధ్య చరిత్రము’ కావ్యంలో వివరించాడు.
‘విశ్వదాత’ గా పేరొంది, ‘ఆంధ్రపత్రిక’, ‘అమృతాంజనం’ కంపెనీ ల స్థాపకులుగా ఖ్యాతిగాంచిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, తెనాలిలో ఓరియంట్ పబ్లిషింగ్ కంపెనీ నిర్వహించిన కాశీనాథుని శివరావు, రేపల్లె తాలూకా పెదపులివర్రుకు చెందిన సుప్రసిద్ధ సినీ దర్శకులు ‘ కళాతపస్వి’ కాశీనాథుని విశ్వనాథ్, 1935 లో ‘వైద్యయోగ రత్నావళి’ అనే ఆయుర్వేద గ్రంథం రచించిన తెనాలికి చెందిన సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు బ్రహ్మశ్రీ పండిత ములుగు రామలింగయ్య, వారి కుమారుడు, మరో సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, గ్రంథ రచయిత ములుగు విశ్వేశ్వర శాస్త్రి, వారి అల్లుడు, పెదపులివర్రు గ్రామానికి చెందిన మరో సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు కాశీనాథుని మల్లికార్జునరావు, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి వద్ద చిరకాలం వ్యక్తిగత సహాయకుడు (పి.ఏ.) గా పనిచేసిన తెనాలి వాసి ములుగు కుమారస్వామి (వీరి కుమార్తె శ్రీపతి పండితారాధ్యుల వరలక్ష్మి ఎస్పీ బాలు కి స్వయానా అన్న భార్య), నాగేశ్వరరావు పంతులు గారి అల్లుడు శివలెంక శంభుప్రసాద్, వారి కుమారుడు శివలెంక రాధాకృష్ణ, తెనాలికి చెందిన సుప్రసిద్ధ నాటక రచయిత, రంగస్థల - సినీ నటుడు ముదిగొండ లింగమూర్తి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ముదిగొండ వీరభద్రయ్య, ప్రముఖ కవి, కావ్య పరిష్కర్త ముదిగొండ వీరభద్రమూర్తి, ప్రముఖ రచయిత ప్రొ. ముదిగొండ శివప్రసాద్, తెనాలి సమీప గ్రామం ఈమనికి చెందిన ముదిగొండ జ్వాలాపతిలింగ శాస్త్రి, ఈమనికే చెందిన ప్రముఖ కమ్యూనిస్టు, వ్యవసాయ కార్మిక సంఘ నేత కామ్రేడ్ శ్రీపతి పండితారాధ్యుల మల్లికార్జున శర్మ (ఈయన్ని 1948-51 మధ్యకాలంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సందర్భంగా ఆంధ్ర ప్రాంతంలోనూ కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించిన కాలంలో పోలీసులు చిత్రహింసలపాల్జేసి చంపేశారు), సుప్రసిద్ధ చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖర శర్మ, సుప్రసిద్ధ సినీ నటుడు మల్లంపల్లి చంద్రమోహన్, తెనాలికి చెందిన రంగస్థల నటులు, ప్రయోక్త, వ్యాఖ్యాత మల్లికార్జున పండితారాధ్యుల (M.P.) కన్నేశ్వరరావు నాకు తెలిసిన కొందరు ప్రముఖ ఆరాధ్య శైవులు.
ఎస్పీ ది తెనాలి అంటే ఎలా?
రాష్ట్రంలోని పలు ఇతరప్రాంతాలలో లాగే, పైన తెలిపినట్లు కాకతీయుల పాలనాకాలం నుంచి తెనాలి పట్టణంలోనూ, రేవేంద్రపాడు, ఈమని వంటి కొన్ని సమీప గ్రామాలలోనూ ఆరాధ్య బ్రాహ్మణులు స్థిరపడ్డారు. ప్రముఖ ఆరాధ్యుడు రేవణ్ణ పేరిట ఏర్పడిన రేవేంద్రపాడులో ఇప్పుడు ఆరాధ్యులెవరైనా ఉన్నారో లేదో తెలియదుగానీ, ఈమని గ్రామంలోనూ, తెనాలి పట్టణంలోనూ ఆరాధ్యులు ఒకప్పుడు, ఇప్పుడు కూడా గుర్తించదగిన సంఖ్యలోనే ఉన్నారు. ప్రాచీన కన్నడ భాషలో ‘మ’ శబ్దం ‘వ’ గానూ, ‘వ’ శబ్దం ‘మ’ గానూ పలకబడేది. దిగంబర జైన శ్రమణులు స్నానం చేసిన కర్ణాటకలోని ‘చెన్నరాయ పట్టణ’ కు సమీపంలోని తెల్లని స్వచ్ఛమైన నీరు కలిగిన సరస్సును అందుకే వారు ‘శ్రవణ బెళగొళ’ (బెళగొళ అంటే కన్నడ భాషలో స్వచ్ఛ జలములు కలిగిన సరస్సు అని అర్థం) అన్నారు. అక్కడి ఇంద్రగిరి మీద భగవాన్ బాహుబలి (గోమఠేశ్వరుడి) ఏకశిలా విగ్రహాన్ని చెక్కించిన సేనాని చాముండ రాయడిని వారు ‘చావుండ రాయ’ అన్నారు. కన్నడ ప్రాంతం నుంచి ఆంధ్ర దేశానికి వలసవచ్చిన ఆరాధ్య శైవులు ‘ఈవని’ గ్రామాన్ని ‘ఈమని’ అన్నారు. (తెనాలి సమీపంలో ఆ+తోట = అత్తోట గ్రామనామం లాగే ఈ + వని = ఈవని గ్రామ నామం కూడా ఈ వనము అనే అర్థంలో ఏర్పడింది). ఆ ఈమని గ్రామంలోనూ శ్రీపతి పండితారాధ్యుల ఇంటి పేరు కల ఆరాధ్య కుటుంబాలు అనాదిగా ఉన్నాయి. వారిలో కొందరు చాలా కాలం క్రితమే నెల్లూరు వెళ్లి స్థిరపడ్డాక, ఆ వంశంలో ఎస్పీ బాలు జన్మిస్తే, ఆయన జన్మస్థలం నెల్లూరు కనుక ఆయన నెల్లూరు వాడే అవుతాడు కానీ తెనాలివాడు ఎలా అవుతాడు? నెల్లూరులో పుట్టి, పెరిగి, విద్యాభ్యాసం చేసిన ఎస్పీ బాలు కి నెల్లూరుతో చక్కటి అనుబంధం కూడా ఉంది. ఆయన తన స్వస్థలం నెల్లూరుగానే భావించేవారు, అలాగే చెప్పుకునేవారు కూడా. వాస్తవం ఇది కాగా ఎస్పీ బాలు తాత తండ్రులో, లేక పూర్వీకులో ఎవరైనా తెనాలి సమీపంలోని ఈమని నుంచి నెల్లూరు వెళ్లి స్థిరపడితే, ఆయన నెల్లూరులో పుట్టి, పెరిగినా కూడా ఆయనను తెనాలి ప్రముఖుల ఖాతాలో వేసేసుకోవటం ఎంతవరకూ సబబని మనం ఆలోచించాలి. ఇలాగే సుప్రసిద్ధ పౌరాణికులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి గురించి ఎవరో ఒక చోట రాస్తూ ఆయనది తెనాలి అని పేర్కొంటే ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. తనది తెనాలి కాదనీ, తమ స్వగ్రామం సత్తెనపల్లి తాలూకా గోరంట్ల గ్రామమనీ ఆయన ఘాటుగా వివరణ ఇచ్చారు. ఎవరి స్వస్థలం మీద వారికి మమకారం ఉండదా మరి? నిజమేమిటంటే గోరంట్లకు చెందిన చంద్రశేఖర శాస్త్రి గారి బాబాయి కీ.శే.మల్లాది హరిశంకర శాస్త్రి గారు తెనాలి పట్టణంలో పినపాడులోని పినపాటి వారి అమ్మాయిని వివాహం చేసుకుని గోరంట్లనుంచి తెనాలికి ఇల్లరికం రావడం, చంద్రశేఖరశాస్త్రి గారు బాల్యంలో తన చిన్నాన్నగారి వద్ద వేదాభ్యాసం చేయడం కారణంగా తెనాలి వారంతా మల్లాది హరిశంకర శాస్త్రి, వారి అన్న కుమారుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి - వీరిరువురిదీ తెనాలిలోని పినపాడు అనే తప్పు అభిప్రాయం ఏర్పరచుకున్నారు. ఇది ఎందుకు చెప్పానంటే, తాము పుట్టి పెరిగిన గడ్డ మీద ఎవరికైనా మమకారం ఉండటం సహజం. అది గమనించకుండా ఇప్పటికే ఎందరో మహానుభావులను కన్న పురిటిగడ్డ తెనాలి ప్రముఖుల జాబితాలో ఎస్పీ బాలు వంటి మరికొందరు ప్రముఖులను కూడా కలపాలని చూడటం సరికాదు.
బాలు బ్రాహ్మణ పక్షపాతా?
వందల ఏళ్ల క్రితం కర్ణాటక ప్రాంతంలో వీరశైవం ఉద్ధృతంగా ఉన్న కాలంలో ఆరాధ్యులు అక్కడి నుంచి తెలుగునేలకు వలస రావటం, ఘనీభవించిన కులవ్యవస్థ, తీవ్రమైన కులకట్టుబాట్లు కలిగిన నాటి ఇక్కడి వర్ణ సమాజానికి ఆధిపత్యం వహించిన వైదిక బ్రాహ్మణులచే వారు చిన్నచూపు చూడబడటం మొదలైన కారణాల మూలంగా ఆరాధ్యులు సహజంగానే బ్రాహ్మణ శిష్టాచారాలకు అతుక్కుపోయి, మరింతగా సనాతన సంప్రదాయ ప్రియులుగా రూపొందారు. కన్నడదేశంలో ఉండగా వీరశైవ మతానుయాయులుగా, భక్తి ఉద్యమకారులుగా వేద ప్రామాణ్యాన్నినిరసించి, వర్ణ వ్యవస్థకూ, సామాజిక దురాచారాలకూ, స్త్రీల అణచివేతకూ వ్యతిరేకంగా పోరాడిన తమ ప్రగతిశీల లక్షణాలను వీరు క్రమంగా కోల్పోయారు. ఆ దశలో మిగిలిన అన్ని బ్రాహ్మణ శాఖలలాగే ఆరాధ్యులు కూడా ఫక్తు సంప్రదాయ ప్రియత్వం అలవరచుకుని ఉండవచ్చు. ఆరాధ్యులలో అంతర్భాగమే అయినట్టి బాలుకు కూడా సంప్రదాయ ప్రియత్వమే ఉండి ఉండవచ్చు. అంతేగానీ ఆయనకు కులతత్త్వం ఆపాదించడం అమానవీయం. ఎవరికైనా కొంతమేరకు స్వకులాభిమానం ఉండటం సహజమే - అయినా అదీ సమర్థనీయం మాత్రం కాదనుకోండి. బాలుకి కొంత స్వకులాభిమానం ఉంటే ఉండవచ్చు. అల్ప సంఖ్యాక సామాజిక వర్గాలన్నింటిలో అభద్రతా భావమో లేక మరేదైనా కారణం వల్లనో ఈ తరహా స్వకులాభిమానం మిగిలినవారిలోకంటే కొంచెం ఎక్కువగా ఉండటం మనం చూస్తాం. మిగిలినవారికంటే అల్పసంఖ్యాక ఆరాధ్య సామాజిక వర్గంలోనే మనం ఈ తరహా స్వకులాభిమానాన్నీ, ఐక్యతా భావాన్నీ ఎక్కువగా చూస్తాం. సినిమా రంగాన్నే తీసుకుంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి మొట్టమొదటగా హాస్యనటుడు పద్మనాభం నిర్మించిన ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’ చిత్రం (1967) లో గాయకునిగా పాడే అవకాశం ఇచ్చింది సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి.’ ఏమి ఈ వింత మోహం’ అంటూ సాగే పాటే ఆయన సినిమాలకోసం పాడిన మొదటి పాట.
‘ఆలీ తో సరదాగా’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎస్పీ బాలు తనకు అంతకు ముందు కోదండపాణి ఎవరో తెలియదనీ, ఆయనదీ తనదీ ఒకే ఇంటిపేరైనా, తనకు ఆయన చుట్టం కూడా కాదనీ చెప్పారు. అది పక్కన పెడితే బాలుకి, చంద్రమోహన్ కి, బాలు బావ ‘శుభలేఖ’ సుధాకర్ కి, ఎస్పీ శైలజకూ ‘కళాతపస్వి’ కాశీనాథుని విశ్వనాథ్ ఇచ్చిన ప్రత్యేక అవకాశాలు సామాన్యమైనవేమీ కాదు. దర్శకులు అభిమానంతో అవకాశాలు ఇవ్వటం, వాటిని సద్వినియోగపరచుకుని ఆ యా నటీనటులు, సాంకేతిక నిపుణులు వృత్తిపరంగా ఎదగడం సహజమే. ‘సీతామాలక్ష్మి’, ‘సిరిసిరి మువ్వ’, ‘శుభోదయం’, ‘శంకరాభరణం’ వంటి చిత్రాలలో మల్లంపల్లి చంద్రమోహన్ కి ముఖ్యభూమికలు ఇచ్చి ఎదిగే అవకాశం కల్పించారు విశ్వనాథ్. నటనలో మెళకువలు పెద్దగా తెలియకపోయినా ఎస్పీ బాలు చెల్లెలు శైలజకు ‘సాగర సంగమం’ చిత్రంలో ఒక ముఖ్య భూమికను ఇచ్చి ప్రోత్సహించారు. ఆమె గాయనిగా పరవాలేదనిపించినా నటిగా ప్రేక్షకుల అభిమానం పొందడంలో విఫలమయ్యారు. ఆమె భర్త సుధాకర్ కి ‘శుభలేఖ’, ‘సిరివెన్నెల’, ‘జనని - జన్మభూమి’ వంటి పలు చిత్రాలలో అవకాశాలిచ్చి ఆయన ఎదుగుదలకు తోడ్పడ్డారు.
విశ్వనాథ్ ఇచ్చిన ప్రొత్సాహాన్ని సద్వినియోగపరచుకుని సుధాకర్ విలక్షణమైన నటునిగా ఎదిగి, వెండితెర మీద, ఆ తరువాత బుల్లి తెర మీద చక్కని గుర్తుంచుకోదగ్గ పాత్రలలో రాణించారు. ఎవరు రాణించాలన్నా ముందుగా చక్కని అవకాశాలు రావాలి. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు వారి సామర్థ్యాన్ని గుర్తించి దర్శకులు, నిర్మాతలు అలాంటి అవకాశాలిచ్చి ప్రోత్సహించాలి. సినీ పరిశ్రమలో కొత్తవారికి అవకాశాలు ఇవ్వటంలో స్వకులాభిమానం దాదాపు అన్ని సామాజిక వర్గాలవారిలోనూ ఎప్పుడూ ఉన్నదే. దానిని మనం పెద్దగా తప్పు పట్టలేము. అయితే టాలెంట్ ఉన్నవారిని గుర్తించకపోవటం, ఎదుగుతున్న కళాకారులను వారు ఫలానా సామాజికవర్గానికి చెందినవారనే కారణంగా నిర్లక్ష్యం చేసే లేక తొక్కేసే ప్రయత్నాలు చేయటం మాత్రం ఎవరు చేసినా అవి కుల దురభిమానం కిందికి వస్తాయి. తన 53 సంవత్సరాల సినీ ప్రస్థానంలో బాలు ఎందరో ఔత్సాహిక గాయనీ గాయకులను ప్రోత్సహించాడు. నాకున్న పరిజ్ఞానంలో ఆయన ఎక్కడా ఏ ప్రతిభగల కళాకారులను నిరోధించడం, తొక్కెయ్యడం వంటివి చేశాడని వినలేదు. ఈటీవీ వారు నిర్వహించిన ‘పాడుతా - తీయగా’, ‘స్వరాభిషేకం’ వంటి కార్యక్రమాల ద్వారా ఎందరో ఔత్సాహిక గాయనీ గాయకులను వారి ప్రతిభకు తగిన గుర్తింపు పొందే విధంగా బాలు వెన్నుతట్టి ప్రోత్సహించాడు. వెండితెరకు పరిచయం చేశాడు. సాటి కళాకారులందరూ ఆయన్నొక పెద్దదిక్కుగా భావించేవారంటేనే తెలుస్తుంది - ఆయన వారి పట్ల ఎంతటి ప్రేమాభిమానాలు చూపేవాడో! తన సీనియర్ గాయనీ గాయకుల ఎడల బాలు ఎంతో భక్తిభావం కలిగి ఉండేవారు. వీలైన ప్రతి సందర్భంలోనూ, తన సీనియర్ గాయనీ గాయకులను తాను నిర్వహించే టీవీ షోలకు న్యాయనిర్ణేతలుగా ఆహ్వానించి, వారిని సగౌరవంగా సత్కరించి పంపటం ఆయనకున్న మహమంచి అలవాటు. వెనుకటి తరం గాయనీ మణులు, గాయకులలో ఆయనచే సత్కరించబడనివారు ఒక్కరూ లేరు. ఘంటసాల విగ్రహావిష్కరణలోనూ, మరో ప్రముఖ గాయకుడు జేసుదాస్ కి భార్యాసమేతంగా పాద ప్రక్షాళన చేసి, పూజించి, సత్కరించడంలోనూ ఎస్పీ బాలు పెద్ద మనసు, సౌజన్యం కళాభిమానులు, కళాకారులు అందరూ గుర్తించారు.
బాలు ప్రస్థానం - స్వయంకృషి
53 ఏళ్ల బాలు సుదీర్ఘ సినీ జీవిత ప్రస్థానం పూర్తిగా ముళ్లబాటా కాదు; అలాగని పూలబాటా కాదు. ప్రతిభతో తాను స్వయంకృషితో నిర్మించుకున్న రాచబాట అది. ముందుగా బాలు కృష్ణకి, చలం కి ఎక్కువగా పాడేవాడు. కృష్ణ నటించిన ‘అసాధ్యుడు’, ‘నేనంటే నేనే’, ‘చీకటి వెలుగులు’, ‘టక్కరిదొంగ - చక్కనిచుక్క’, ‘నేరము- శిక్ష’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు గొప్ప మ్యూజికల్ హిట్స్ కూడా కావటం వెనుక ఒక గాయకునిగా బాలు చేసిన కృషి ఎంతో ఉంది. అలాగే చలం చిత్రాలు ‘బుల్లెమ్మ - బుల్లోడు’, ‘సంబరాల రాంబాబు’, ‘మట్టిలో మాణిక్యం’, ‘దేవుడమ్మ’ వంటి చిత్రాల విజయంలో కూడా బాలు పాత్ర తక్కువైందేమీ కాదు. ఆ తరువాత బాలు అప్పుడప్పుడూ స్వరం మార్చి రాజబాబు, అల్లు రామలింగయ్య మొదలైన వారికి పాడేవాడు.
‘నిద్దరపోనా పిల్లా..నా ముద్దూ మురిపాల పిల్లా..’ (కోడలు దిద్దిన కాపురం), ‘చిత్రం..అయ్యారే విచిత్రం’ (దాన వీర శూర కర్ణ) పాటలు ఎన్ఠీఆర్ స్టైల్ కి తగ్గట్లు పాడి, ఇంకా ‘అడవిరాముడు’, ‘యమగోల’, ‘డ్రైవర్ రాముడు’, ‘జస్టిస్ చౌదరి’ వంటి పలుచిత్రాలలో ఎన్టీఆర్ కి పాడిన చక్కని పాటలతో బాలు ఆయన్నీ, ఆయన అభిమానులనూ అలరించాడు. ‘మంచి మనుషులు’, ‘మానవుడు - దానవుడు’ వంటి చిత్రాలలో పాడిన పాటలతో శోభన్ బాబుని, ఆయన అభిమానులనూ ఆకట్టుకున్నాడు. తన పాటలతో, డబ్బింగ్ వాయిస్ తో బాలు కమలహాసన్ మనసు దోచుకున్నాడు. అక్కినేని మొదట్లో కమెడియన్లకు కూడా పాటలు పాడే బాలు చేత తను పాటలు పాడిస్తే తన ఇమేజ్ దెబ్బ తింటుందని భావించేవారట. అందుకే చాలా చిత్రాలలో వి.రామకృష్ణ చేత పాడించుకున్న అక్కినేని బాలు ప్రతిభ మీద విశ్వాసం ఏర్పడ్డ తరువాత ఇక ఆయన్ని వదలలేదు. సూపర్ డూపర్ హిట్ అయిన ‘ప్రేమాభిషేకం’ విజయంలో బాలు పాడిన పాటలదే ప్రముఖ పాత్ర. బాలు తన ప్రతిభ ద్వారా హీరోలను ఎంతగా ఆకట్టుకుంటాడనేదానికి ఉదాహరణగా ఒక చిత్రమైన ఉదంతం చెపుతాను. 1976 లో విడుదలైన వి. మధుసూదన రావు దర్శకత్వం, చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించిన ‘ఇద్దరూ - ఇద్దరే’ చిత్రంలో శోభన్ బాబు, కృష్ణం రాజు ఇద్దరూ హీరోలుగా నటించారు. ఆ చిత్రంలోని హీరోలిద్దరి పై చిత్రీకరించిన ఒక పాట ఉంది. దానిలో బాలు తనకే పాడాలని హీరోలిద్దరూ పట్టుపట్టారట. ఇద్దరు హీరోలకు ఒకేపాటలో స్వరం మార్చి పాడటం తనవల్ల కాదని బాలు చక్రవర్తి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరిస్తే చక్రవర్తి ఆ హీరోలకు నచ్చజెప్పాల్సి వచ్చిందట. అదీ బాలు ప్రతిభ.
తన సహ గాయనీ గాయకులందరికీ తలలో నాలుకలా వ్యవహరించి, నవతరం గాయనీ గాయకులను ఎందరినో వెండితెరకు పరిచయం చేసి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలువేసిన బాలు వర్ధమాన గాయకులను ఎవరినో తొక్కేశారని - అదీ ఆయన మరణానంతరం - చేస్తున్న రగడకు ఏ మాత్రం విలువలేదు. ఇలాంటి దుష్ప్రచారాలన్నీ ఆయన క్లీన్ ఇమేజ్ ని చెడగొట్టే ఉద్దేశంతో చేస్తున్నవేనని మనం గ్రహించగలం. బాలు స్మృతికి నివాళులు సమర్పిస్తూ — మీ ముత్తేవి రవీంద్రనాథ్.