శంఖుపుష్పం
ఈ పూవుకు ఈ పేరు దీని ఆకారాన్ని బట్టి వచ్చింది. చూడటానికి శంఖువు లా వంపు తిరిగి నాట్యసుందరిలా వుంటుంది. చాలా సుకుమారి కూడా ఈ పూవు. మన గోరు తగిలితేనే నల్లగా అవుతుంది. మనగోటి గీరలుకూడా పడతాయి. దీనికి వాసన లేకున్నా దేవుని పూజకు మాత్రం ఉపయోగిస్తారు. దీన్లో తెలుపు, నీలం అనే రెండు రంగులు అధికంగా కనిపిస్తుంటాయి. సన్నని తీగకు ఆకుల మధ్య ఈ పూలూ తీగకే పూస్తాయి.
శంఖపుష్పం (Clitoria ternatea) సంస్కృతం లో శ్వేతాం, విష్ణూక్రాంతా అని అంటారు. ఇంకా సంస్కృతంలో ‘అస్ఫోట’, ‘గోకర్ణ’, ‘అపరాజితా’ అని కూడా అంటారు. పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన తీగ మొక్క ఈ పూల చెట్టు.
విష్ణుక్రాంత పత్రి, వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏక వింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదవది.
ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి. తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి. ఈ ఆకు ముదురు ఆకు పచ్చ రంగులో ఉంటుంది. కొద్దిగా ఆకులకు గరుకు వుంటుంది. ఇది గుబురు గా పాకే తీగ.
చాలా కాలంగా ఆయుర్వేదంవైద్యంలో వివిధ రకాలైన రోగాల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. వైద్యపరమైన ప్రయోజనాలున్నాయి. దీని వేళ్ళు మూత్రకారిగానూ, విరేచన కారిగానూ పనిచేస్తాయి. దృష్టి దోషాలను పోగొట్టేందుకు ఇది చక్కగా పనిచేస్తుంది. దీని గింజల్ని నేతిలో వేయించి, తినిపిస్తే చిన్నపిల్లలకు మలబద్ధకం, అజీర్తి నయమౌతాయని ఆయుర్వేదవైద్యులు అంటున్నారు. ఐతే ఏదైనా వైద్య సలహామేరకు చేయాలి.
ఈ శంఖుపువ్వు కాయలు చిక్కుడు కాయలనుపోలి ఉంటాయి, ఎండిన విత్తనాలు నాటడం ద్వారా మొక్కలు వస్తాయి. దేవుని పూజకై ప్రతి ఇంటా ఈ శంఖుతీగలను పెంచుకుంటారు. పైకి ఎగబాకి అడ్డుగా వుండనే వుండవు. సన్నని తీగకు విరివిగా పూలుపూస్తాయి. దేవుని పూజకై పూలు వెతుక్కోనక్కరలేదు కూడా.