Menu Close
veeranjaneyulu-sivaratri
సీతా స్వయంవరం: ఓ రామాయణ కథ
- వీరాంజనేయులు శివరాత్రి -

సీత ఒక ట్రోఫీనా?

Seetha-Swayamvaram-image

“సీత ఏమైనా ట్రోఫీనా తాతా? పోటీలో గెలిస్తే తీసుకెళ్లడానికి? ఆమెకీ ఇష్టం–అయిష్టం ఉంటాయి కదా! అసలు దీనిని ‘సీతాస్వయంవరం’ అని చెప్పడం పెద్ద అబద్దం!. సీత స్వయంగా ఎక్కడ వరించింది చెప్పు? బలం ఉన్నవాడు ఆ శివ ధనుస్సుని ఎత్తి సీతని గెలుచుకున్నాడు. ఒక బహుమతి గెలిచినట్లు! పోటీలో గెలిచాడని అసలు పరిచయంలేని వాడి వెంట తలవంచుకుని వెళ్ళవలసిరావడం అన్యాయం తాత. పైగా ఈ అన్యాయాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా దారుణం.”

***

పండగ పందిరిలో వినిపించిన కథ:

ఊరంతా పండగ వాతావరణంతో కళకళలాడుతోంది. తాటాకు పందిరి వేసి, ఆ పందిరిలో ఒక స్టేజీ కట్టి, సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించారు. రంగురంగుల అలంకరణలతో కల్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

ఆ రోజు సాయంత్రం సీతారాముల కల్యాణ కథా శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కథ వినేందుకు వచ్చే వారు కూర్చోవడానికి క్రింద పరదాలు పరిచారు. సాయంత్రం ఆరు గంటలకల్లా పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా చాలామంది ఉత్సాహంగా పందిరిలోకి చేరుకున్నారు.

పండగకని లండన్ నుంచి అమ్మాయి, అల్లుడు, మనవడు, మనవరాలు వచ్చారు. వారందరినీ వెంటబెట్టుకుని వెంకయ్య–లక్ష్మమ్మ దంపతులు కూడా పందిరిలోకి వచ్చి కూర్చున్నారు. కాసేపటికి పంతులు గారు కథ చెప్పడం ప్రారంభించారు.

***

విదేహ రాజైన జనక మహారాజు వద్ద, శివుడు ప్రసాదించిన ‘పినాక’ అనే మహా ధనుస్సు ఉండేది. అది అత్యంత బరువైనది.

జనక మహారాజు కుమార్తె సీతాదేవి. ఆమె చిన్నదిగా ఉన్న రోజుల్లో ఒకసారి ఆ శివ ధనుస్సుని ఎత్తి పక్కన పెట్టింది. ఆ దృశ్యం చూసిన జనకుడు, ఆ ధనుస్సుని ఎత్తి ఎక్కుపెట్టగలవాడే తన కుమార్తెకు సరైన వరుడని నిర్ణయించుకున్నాడు.

సీతాదేవికి యుక్తవయసు రాగానే, ఆమె వివాహార్థం స్వయంవరం ప్రకటించాడు.

“శివ ధనుస్సుని ఎత్తి ఎక్కుపెట్టగలవాడికే సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తాను” అని ప్రకటించాడు.

సీతాదేవిని వివాహమాడాలని ఆశించిన ఎందరో రాజులు ఆ ధనుస్సుని ఎత్తే ప్రయత్నం చేశారు. కానీ ఎవరూ దాన్ని కదిలించలేకపోయారు..

కోసల రాజు దశరథుడికి నలుగురు కుమారులు—రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుజ్ఞుడు. వసిష్ఠుని వద్ద విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత రాముడు లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షికి యజ్ఞంలో సహాయం చేయడానికి ఆయన ఆశ్రమానికి వెళ్లారు.

యజ్ఞం పూర్తి అయిన తరువాత, విశ్వామిత్ర మహర్షి తన శిష్యులు శ్రీరాముడు, లక్ష్మణులతో కలిసి విదేహ రాజధాని మిథిలకు వచ్చాడు. గురువుగారి ఆజ్ఞతో శ్రీరాముడు శివ ధనుస్సుని ఎత్తి, దానికి సూత్రాన్ని బంధించేందుకు వంచాడు. కానీ శ్రీరాముడి అపార బలానికి ధనుస్సు పెళపెళలాడుతూ విరిగి పోయింది.

అది చూసి జనక మహారాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. సీతాదేవిని శ్రీరాముడికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు.

ఆ సీతారాముల కళ్యాణాన్ని మనం ప్రతీ సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటూ, పండగ జరుపుకుంటూ వస్తున్నాం.

***

మనవరాలి ప్రశ్న:

ఇలా పంతులుగారు సీతా రాముల బాల్యం నుండి కళ్యాణం వరకు కథ చెప్పి ముగించారు. కథా శ్రవణం అయిపోయిన తర్వాత, అందరూ ఇంటివైపు కదులుతున్నారు. ఆ సందడిలోనే, లండన్ నుంచి వచ్చిన మనవరాలు తాత దగ్గరికి వచ్చి అడిగింది.

“సీత ఏమైనా ట్రోఫీనా తాతా? పోటీలో గెలిస్తే తీసుకెళ్లడానికి? ఆమెకీ ఇష్టం–అయిష్టం ఉంటాయి కదా! అసలు దీనిని ‘సీతాస్వయంవరం’ అని చెప్పడం పెద్ద అబద్దం!. సీత స్వయంగా ఎక్కడ వరించింది చెప్పు? బలం ఉన్నవాడు ఆ శివ ధనుస్సుని ఎత్తి సీతని గెలుచుకున్నాడు. ఒక బహుమతి గెలిచినట్లు! పోటీలో గెలిచాడని అసలు పరిచయంలేని వాడి వెంట తలవంచుకుని వెళ్ళవలసిరావడం అన్యాయం తాత. పైగా ఈ అన్యాయాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా దారుణం.”

కోపం, బాధ రెండూ కలిసిన స్వరంతో అప్పుడే యుక్తవయసుకి వస్తున్న మనవరాలు అంది.

వెంకయ్య చిరునవ్వుతో ఆమె తల నిమురుతూ అన్నాడు.

“భలే చెప్పావు తల్లీ. నిజమే. నువ్వన్నట్టు పంతులుగారు చెప్పిన కథ ప్రకారం చూస్తే, సీత స్వయంగా వరించలేదు. పోటీలో గెలిచిన శ్రీరాముడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

కానీ ఇంటికి వెళ్లాక… ఈ కథను మనం మరోలా చెప్పుకుందాం. అంతవరకూ కాస్త ఓపిక పట్టు.” బుజ్జగిస్తూ చెప్పాడు.

ఇంటికి చేరుకున్నాక, వెంకయ్య సీతారామ కళ్యాణం కథను మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు…

***

ప్రకృతి నియమం - అడవి జీవనం:

కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవ సమాజం నేటిలా ఉండేది కాదు. భూమి యొక్క ఎక్కువ భాగం దట్టమైన అడవులతో కప్పబడి ఉండేది. పరిశ్రమల పొగ లేదు, కాలుష్యం అనే భావనే లేదు. అడవిలో బలం ఉన్న జంతువు, బలం లేనిదాన్ని వేటాడి తినేది. అది వాటి జీవన అవసరం.

మనుషులూ దానికి మినహాయింపు కాదు. వారు కూడా వేటాడేవారు, దొరికిన పళ్ళు, గింజలు ఏరుకుని తినేవారు. మనిషి–జంతువు మధ్య తేడా అప్పటికి చాలా స్వల్పం. బలవంతులు బలహీనులపై ఆధిపత్యం చెలాయించేవారు. తమకు కావాలనిపించినదాన్ని లాక్కునేవారు—అది ఆహారమైనా, ఆడవాళ్లైనా. అది అడవి జీవన విధానం. అది అడవి న్యాయం. అదే ప్రకృతి నియమం.

యజ్ఞం - సంస్కృతి:

కానీ కాలక్రమేణా కొందరు ఆ ప్రకృతి నియమాలను అధిగమించే ప్రయత్నం చేశారు. వారు కొత్త సమాజాన్ని ఊహించారు. మనిషికి శారీరక బలం కంటే, తెలివి తేటలు ఎంతో అవసరమని గుర్తించారు. బలవంతులు కాకపోయినా, తెలివైనవారు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతారని అర్థం చేసుకున్నారు. బలంతో సంబంధం లేకుండా ప్రతి మనిషికీ రక్షణ ఉండేలా నియమాలను నిర్మించుకున్నారు.

అలా తెలివైనవారు వ్యవసాయాన్ని కనుగొన్నారు. వ్యవసాయం కోసం అడవులను కొట్టి, నేలను చదును చేశారు. అప్పటివరకు సంచార జీవులుగా ఉన్న మనుషులు, వ్యవసాయ క్షేత్రాల చుట్టూ స్థిరపడ్డారు. ఒకరి నుండి ఒకరు దోచుకోకుండా ఉండేందుకు కట్టుబాట్లు పెట్టుకున్నారు; నీతి, న్యాయం అనే భావనలకు రూపం ఇచ్చారు. నీతీ నియమాలతో చేసిన వ్యవసాయం అందరికీ ఆహారాన్ని అందించింది. అటువంటి పవిత్రమైన వ్యవసాయ ప్రక్రియను వారు ‘యజ్ఞం’ అన్నారు. మనసున్న జీవులు కాబట్టి, తమను తాము ‘మానవులు’ అని పిలుచుకున్నారు. అలా మానవ సంస్కృతి ఆరంభం అయింది.

రక్షకులు:

అయితే అడవుల్లో, జంతువులతో పాటు ఇంకా ఎందరో మిగిలిపోయారు. వారు ఇప్పటికీ అడవి న్యాయంతోనే జీవిస్తున్నారు. అలా జీవిస్తున్న వారు ఒక విషయం గ్రహించారు—యజ్ఞాల పేరుతో అడవులను తగులబెట్టడం, చెట్లను నరికి చదును చేయడం, తాము ఆధారపడే జంతువులకు స్థానం లేకుండా చేయడం కేవలం తమకే కాదు, ఆ సమస్త ప్రకృతికే ప్రమాదమని. ఆ ప్రకృతిని రక్షించుకోవాలనే సంకల్పానికి వచ్చారు. తమను తాము ప్రకృతి ‘రక్షకులు’ అని పిలుచుకున్నారు.

***

రాక్షసులు:

అడవుల్లో జీవిస్తూ, నీతి–నియమాల పట్ల ఎలాంటి గౌరవం లేకుండా తమపై దాష్టీకాలకు పాల్పడుతున్న వారిని, మానవ సమాజం ‘రాక్షసులు’ అని పిలిచింది.

“మేము మా పనుల్లో మేము శాంతిగా యజ్ఞాలు చేసుకుంటుంటే, ఈ దుర్మార్గులు మా మీద దండెత్తుతున్నారు. మా యజ్ఞాలను పాడు చేస్తున్నారు. మా వాళ్లను హింసిస్తున్నారు, చంపుతున్నారు. మా ఆడవాళ్లను ఎత్తుకుపోయి అత్యాచారాలు చేస్తున్నారు …” అని మానవులు ఆవేదన చెందారు.

రాజులు - రాజ్యాలు:

ఆ రాక్షసుల భయంనుంచి తమను తాము కాపాడుకోవాలనే ఆలోచనతో మానవులు యుద్ధ నైపుణ్యాలను పెంపొందించుకున్నారు. రక్షణ కోసం మొదలైన శిక్షణ, క్రమంగా ఆయుధ విద్యగా మారింది. తమలో చాలామంది సుశిక్షితులైన సైనికులుగా తయారయ్యారు. ఆ సైనికులకు నాయకత్వం వహించిన వాడు రాజయ్యాడు. కాలక్రమేణా రాజ్యాలు ఏర్పడ్డాయి, రాజులు వెలిశారు. మొదట రక్షణకోసం ఏర్పడిన శక్తి, క్రమంగా అధికారంగా మారింది.

రాజుల బలం పెరిగింది. యజ్ఞాల సంఖ్య పెరిగింది. వాటితోపాటు అడవులను నరికివేయడం కూడా విచ్చలవిడిగా పెరిగింది.

పరశురాముడు - సమతుల్యం - శివ ధనుస్సు:

రాజుల విచ్చలవిడితనం వల్ల ప్రకృతి క్రమంగా నాశనం అవడం గమనించిన పరశురాముడు అనే ఋషి తీవ్రంగా కలత చెందాడు. ప్రకృతిని, సంస్కృతినీ సమతుల్యంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాజులకు విన్నవించాడు.

“సమతుల్యత అంటే ఏమిటి, గురువుగారు?” అని ఒక రాజు ప్రశ్నించాడు.

అప్పుడు పరశురాముడు శాంతంగా చెప్పాడు—

“ప్రకృతి మీ ధనుస్సు లాంటిదే, రాజా. ధనుస్సును వంచి, సూత్రాన్ని కట్టి, బాణాన్ని సంధించడానికి వాడుకుంటాం కదా—అలాగే ప్రకృతిని కూడా మానవ ప్రయోజనాల కోసం ఉపయోగించాలి. కానీ ధనుస్సును మరీ గట్టిగా వంచితే ఎలా విరిగిపోతుందో, అలాగే ప్రకృతిని అతిగా పీడిస్తే అది కూడా విరిగి నాశనం అవుతుంది.

అలాగని ధనుస్సును అసలు వంచకుండా వదిలేస్తే, లేదా వదులుగా వంచితే దానివల్ల ప్రయోజనం ఉండదు. ధనుస్సు సూత్రాల మధ్య సరైన మోతాదులో ఒత్తిడి ఉంటేనే అది పనిచేస్తుంది. అలాగే ప్రకృతి–సంస్కృతుల మధ్య సమతుల్యమే మన దైవం శివుడి ధనుస్సు. దాన్ని కాపాడుకుంటేనే మనం క్షేమంగా ఉంటాం.”

కొద్దిసేపు ఆగి, ఆవేదనతో కొనసాగించాడు—

“కానీ ఈ రోజుల్లో చాలామంది రాజులు విచక్షణ లేకుండా ప్రకృతిని నాశనం చేస్తున్నారు. శివుడి ధనుస్సును అపరిమితంగా వంచి, విరిచేస్తున్నారు. అటువంటి రాజులు కేవలం తమ రాజ్యాలకే కాదు, సర్వ జీవుల మనుగడకే ప్రమాదం.”

పరశురాముడి విజ్ఞతను కొందరు రాజులు అర్థం చేసుకున్నారు. వారు ప్రకృతిని పాడుచేయడం తగ్గించారు. కానీ చాలా మంది రాజులు అతని హెచ్చరికలను పట్టించుకోలేదు. పైగా తమ అధికారానికి అడ్డుగా నిలిచాడని భావించి, పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షిని హత్య చేశారు.

బలగర్వంతో ప్రజలపై దాష్టీకాలు చేస్తూ, పవిత్రమైన శివధనుస్సును విరిచేస్తున్న రాజులను ఇక ఉపేక్షిస్తే ప్రపంచమే తీవ్ర ప్రమాదంలో పడుతుందని పరశురాముడు గ్రహించాడు. ఆగ్రహంతో ఆయుధం ఎత్తాడు. అలా ఒకరి తర్వాత ఒకరిని సంహరిస్తూ, ప్రకృతి–సంస్కృతుల మధ్య సమతుల్యతను కాపాడాడు పరశురాముడు.

***

దైవమిచ్చిన కూతురు సీత:

విదేహ రాజ్య పాలకుడు సిరధ్వజుడు అనే జనక మహారాజు. ఆయన సతీమణి సునైన. చాలా కాలం వరకు వారికి సంతానం కలగలేదు.

ఒక రోజు వ్యవసాయ క్షేత్రాన్ని దున్నుతూ ఉండగా, జనకునికి ఒక పాప కనిపించింది. ఆ అపూర్వమైన ఘటనను దైవానుగ్రహంగా భావించిన జనకుడు, అపార ఆనందంతో ఆ పాపను తన కూతురుగా స్వీకరించాడు. దేవుడు తనకు ప్రసాదించిన కుమార్తెగా భావించి, ఆమెకు ‘సీత’ అని నామకరణం చేశాడు.

కొంతకాలానికి జనక మహారాజు భార్య సునైన ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు ‘ఊర్మిళ’ అని పేరు పెట్టుకున్నారు.

జనకుని సోదరుడు కుషధ్వజునికి కూడా ఇద్దరు కుమార్తెలు పుట్టారు. వారికి ‘మాండవి’ మరియు ‘శ్రుతకీర్తి’ అని నామకరణం చేశారు.

***

విజ్ఞానం - ఉపనిషత్తు - సీత:

సైనిక బలం కన్నా విజ్ఞాన బలమే శాశ్వతమని జనక మహారాజు గ్రహించాడు. ఆ అవగాహనతో ఆర్యావర్తమంతటా ఉన్న ఋషులను తన ఆస్థానానికి ఆహ్వానించి, వేద విజ్ఞానంపై చర్చలు జరపాలని కోరాడు. ఆయన ఆహ్వానాన్ని గౌరవించి, కొన్ని వందలమంది ఋషులు మిథిలకు చేరుకున్నారు. అక్కడ వేదాల అర్థం, వాటి అంతర్లీన సారాంశం గురించి లోతైన చర్చలు సాగాయి.

ఆ మహాసభకు అష్టావక్రుడు, యాజ్ఞవల్క్యుడు వంటి మహర్షులతో పాటు గార్గి అనే తపస్వినీ కూడా హాజరైంది. ఆ చర్చల్లో జనకుడితో పాటు సీత కూడా ఆసక్తిగా పాల్గొనేది—వింటూ, ఆలోచిస్తూ, ప్రశ్నిస్తూ. అక్కడ తరచుగా ఇలాంటి ప్రశ్నలు ప్రతిధ్వనించేవి—

“నేను ఎవరు?

ఈ విశ్వంలో నా స్థానం ఏమిటి?

ఈ జగత్తు ఎందుకు, ఎలా ఏర్పడింది?

ఆలోచించే శక్తి మనుషులకు ఎక్కడి నుంచి వచ్చింది?”

ఒక ఋషి ఇలా వివరించేవాడు—

“ప్రతి మనిషి ఈ ప్రపంచాన్ని తన ఊహాశక్తితో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అలా ప్రతి వ్యక్తి తనదైన ఒక ఊహా ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ఆ అర్థంలో ప్రతి మనిషి ఒక బ్రహ్మే—‘అహం బ్రహ్మాస్మి’.”

మరొకరు ఇలా అన్నారు—

“ఒకడు ఊహించినది, ఇంకొకడు ఊహించినదానికంటే భిన్నంగా ఉంటే, తన ఊహే గొప్పదని వాదిస్తాడు. ఆ ఊహను కాపాడుకోవడానికి పోరాడతాడు.”

వేరొకరు ఇలా అన్నారు—

“తాను తన గురించి ఏమనుకుంటున్నాడో, ఇతరులు తనను ఎలా చూడాలనుకుంటున్నాడో—ఆ ఊహాచిత్రాన్ని రక్షించుకోవడానికే మనిషి జీవితమంతా శ్రమిస్తాడు. అదే ‘అహం’. అహం ఎప్పుడూ గుర్తింపును కోరుకుంటూ ఉంటుంది. గొప్పగా కనిపించాలనే కోరికతో ధనం, ఆస్తి, రాజ్యం కూడబెట్టుకుంటాడు.”

“ఈ ఊహలతో కప్పబడిన అహం నుండి విముక్తి పొందడానికి, ఆత్మానుభూతికి చేరుకోవడానికి తపస్సు ఒక మార్గం” అని మరొక ఋషి చెప్పేవాడు.

ప్రశ్నలు, సమాధానాలు, వాదనలు, మౌనాలు—ఇలా వేదార్థ చర్చలే కాలక్రమంలో ఉపనిషత్తులుగా రూపుదిద్దుకున్నాయి.

***

దశరథుడు - నలుగురు కుమారులు:

కోసల రాజ్యానికి రాజు దశరథుడు. ఆయన సతీమణి కౌసల్య. వారికి ఒక కూతురు—శాంత. పేరు శాంత అయినా, దశరథుని హృదయానికి మాత్రం శాంతి దొరకలేదు. రాజ్యానికి వారసుడు లేడనే ఆలోచన ఆయనను లోపల నుంచే కుంగదీస్తూ ఉండేది.

శాంతను అంగదేశపు రాజు రోమపాదునికి దత్తత ఇచ్చాడు దశరథుడు. కాలక్రమంలో రోమపాదుడు శాంతకు ఋష్యశృంగుడితో వివాహం చేశాడు. ఋష్యశృంగుడు తన తండ్రి వద్ద వైద్యశాస్త్రం, రసాయన శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించిన మహావిద్వాంసుడు.

దశరథుడు పుత్రసంతానం కోసం కేకయ రాజకుమారి కైకేయిని వివాహమాడాడు. అయినా కొడుకులు కలగలేదు. తరువాత సుమిత్రను కూడా వివాహం చేసుకున్నాడు. కానీ ఫలితం మారలేదు. ఆశతో పాటు నిరాశ కూడా పెరుగుతూ పోయింది.

చివరికి అంగదేశం నుండి ఋష్యశృంగుడిని ఆహ్వానించి, తనకు పుత్రసంతానం కలిగేలా సహాయం చేయమని వినమ్రంగా కోరాడు దశరథుడు.

ఋష్యశృంగుడు తన తండ్రి నుండి నేర్చుకున్న రసాయన విజ్ఞానంతో ఒక విశేష నైవేద్యాన్ని సిద్ధం చేశాడు. ఆ నైవేద్యాన్ని మూడు రాణులు స్వీకరించారు. దాని ఫలితంగా కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు కవలలు—లక్ష్మణుడు మరియు శత్రుజ్ఞుడు జన్మించారు.

ఆ నలుగురు రాకుమారులు రాజగురువు వసిష్ఠుని ఆశ్రమంలో వేదాలతో పాటు వివిధ శాఖల్లో విద్యాభ్యాసం చేశారు. విద్య పూర్తయ్యాక వారిని తీర్థయాత్రలకు పంపారు.

సన్యాసమా? గృహస్థాశ్రమమా?

తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చిన తరువాత, ఒక రోజు రాముడు వసిష్ఠ మహర్షిని అడిగాడు —

“గురువర్యా…సమాజాన్ని వదిలి సన్యాసం తీసుకోవాలా, లేక సమాజంలోనే ఉండి గృహస్థాశ్రమం స్వీకరించాలా అన్న సందిగ్ధంలో నా మనసు చిక్కుకుంది. ఏ మార్గాన్ని అనుసరించాలో నాకు స్పష్టంగా తెలియడం లేదు. సరైన మార్గాన్ని నాకు ఉపదేశించండి”

వసిష్ఠుడు మృదువుగా చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు—

“గృహస్థుడు లేకుండా సృష్టి ముందుకు నడవదు నాయనా. గృహస్థుడు తనకోసం, సమాజం కోసం యజ్ఞం చేస్తాడు. తన వారి ఆకలిని తీర్చుతాడు. కానీ గృహస్థాశ్రమంలోని వ్యామోహాలకు బానిసై, బంధాలలో చిక్కుకున్నవాడు ఎప్పుడూ అలజడితో, అశాంతితో జీవిస్తాడు.

సన్యాసి బంధాలను విడిచిపెట్టి శాంతిలో జీవిస్తాడు. ఆకలిని, కోరికలను జయిస్తాడు. కానీ ఆకలిగా ఉన్న సమాజానికి ప్రత్యక్షంగా ఉపయోగపడడు.

గృహస్థుడిగా ఉంటూనే సన్యాసి మనసును అలవరుచుకున్నవాడే నిజమైన జీవనకళను తెలుసుకున్నవాడు. అతడు శాంతిలో జీవిస్తాడు, తనవారి ఆకలిని తీర్చుతాడు.

తపస్విగా కైలాసంలో ఉన్న శివుడు, మనకోసం వారణాసికి దిగివచ్చి గృహస్థుడై శంకరుడిగా మారాడు. మహాశక్తి పార్వతి అన్నపూర్ణగా మారి లోకానికి అన్నాన్ని ప్రసాదించింది.

మనసును తపస్విలా ఉంచుకుంటూ, గృహస్థుడిగా కర్మలను ఆచరించడమే ఉత్తమ మార్గం. ఈ రెండింటి సమతుల్యతను పవిత్రమైన శివధనుస్సులా భావించి కాపాడుకోవాలి నాయనా.”

***

వదులైన శివ ధనుస్సు - విశ్వామిత్రుడు:

పరశురాముడు రాజులలో కలిగించిన భయోత్పాతం వల్ల యజ్ఞాలు దాదాపుగా నిలిచిపోయాయి. అడవులు నరకడం, కాల్చడం ఆగిపోయింది. చెట్లు మళ్ళీ మొలిచాయి. జంతువులు తిరిగి సంచరించాయి. ప్రకృతి ఊపిరి పీల్చుకుంది—మళ్ళీ కళకళలాడింది.

కానీ ప్రకృతి బాగుపడటంతో పాటు మరో సమస్య నెమ్మదిగా తలెత్తింది. వ్యవసాయ క్షేత్రాలు తగ్గిపోయాయి. గ్రామాల్లో, నగరాల్లో స్థిరపడిన మానవులకి ఆహారం దొరకడం దుర్లభమైంది. యజ్ఞం లేక ఆహారం లేదు; ఆహారం లేక సంస్కృతి నిలవదు.

ఒకప్పుడు ప్రకృతి అతిగా వంచబడింది. ఇప్పుడు అవసరానికి మించి వదిలివేయబడింది. శివ ధనుస్సు ఈసారి మరో వైపు జారిపోయింది. సమతుల్యం మళ్ళీ దెబ్బతింది. మానవ సంస్కృతి ప్రమాదంలో పడింది.

ఈ మారుతున్న పరిస్థితిని గమనించిన విశ్వామిత్ర మహర్షి—

“ప్రకృతిని రక్షించాలి. అదే సమయంలో మానవ ఆకలిని తీర్చాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యం తిరిగి నెలకొల్పాలి” అని సంకల్పించాడు.

మానవుల ఆహార సమృద్ధి కోసం గంగా నది పరివాహక ప్రాంతంలో యజ్ఞాలను మళ్ళీ ప్రారంభించాడు. అవి పరిమితి లేకుండా అడవిని నాశనం చేసే యజ్ఞాలు కాదు. ప్రకృతిని జయించే యజ్ఞాలు కాదు— ప్రకృతితో అనుసంధానమై సంస్కృతిని నిలబెట్టి జీవించడానికి చేసే యజ్ఞాలు.

***

మానవులు vs రాక్షసులు - అడవి vs సంస్కృతి – సంఘర్షణ:

మానవులు యజ్ఞాల పేరుతో అడవిని మళ్ళీ తగులబెట్టడం ప్రారంభించడంతో అది తమ ఉనికికే ప్రమాదమని రాక్షసులు గ్రహించారు. ప్రకృతిలో లీనమై, ప్రకృతితో కలిసి జీవిస్తున్న తమ జీవన విధానానికి మళ్ళీ ముప్పు ఏర్పడిందని వారికి అనిపించింది.

ఈ భయమే క్రమంగా కోపంగా మారింది. కోపం ఆవేశంగా మారింది. ఆవేశం మానవుల మీద విపరీతమైన ద్వేషంగా రూపుదాల్చింది.

“మా అడవులు, మా జీవితం, మా ఆచరణ—ఇవన్నీ నాశనం చేస్తూ తమ సంస్కృతి మాత్రమే గొప్పదని భావిస్తున్న ఈ మానవులు మాకు శత్రువులు” అని తలచారు వారు.

ఆ కోపావేశంలో కొందరు రాక్షసులు యజ్ఞాలు నిర్వహిస్తున్న ఆశ్రమాలపై దాడులకు దిగారు. ఎదురొచ్చినవారిని కరుణలేకుండా సంహరించారు. యజ్ఞాశ్రమాలని కాలరాశారు. అక్కడ నివసిస్తున్న స్త్రీలపై అమానుషమైన హింసకు పాల్పడ్డారు.

ఈ విధంగా సంస్కృతి పేరుతో ప్రకృతిని గాయపరుస్తున్న మానవులు, ప్రకృతి పేరుతో సంస్కృతిని తుడిచివేస్తున్న రాక్షసులు— ఇద్దరి మధ్య ఘర్షణ అనివార్యమయింది.

***

రాక్షసుల భారి నుండి యజ్ఞాలని కాపాడటానికి సమర్థులైన సైనికులతోసహా యువకులైన రాకుమారులని పంపవలసిందిగా ఆ చుట్టుపక్క రాజ్యాలకి కబురుపెట్టాడు విశ్వామిత్రుడు. రాక్షసుల బలం, వారి హద్దులులేని దురాగతాల గురించి తెలుసుకున్న రాజులు తమ కుమారులని పంపే ధైర్యం చేయలేక బదులు ఇవ్వలేదు.

ఇక చేసేది లేక విశ్వామిత్రుడు తనే స్వయంగా వెళ్లి రాజులని సహాయం చేయవలసిందిగా ఒప్పించాలని బయలు దేరాడు.

***

రామ లక్ష్మణులు - విశ్వామిత్రుడు - అడవి ప్రయాణం:

కోసల రాజధాని అయోధ్యలోని దశరధుని కొలువుకు విశ్వామిత్రుడు వచ్చాడు. రాక్షసుల దాడుల నుండి యజ్ఞాలను కాపాడటానికి, వసిష్ఠుని వద్ద సకల విద్యలు అభ్యసించిన రాకుమారులను పంపమని కోరాడు.

కానీ క్రూరమైన రాక్షసులతో పోరాడేందుకు తన కుమారుల ప్రాణాలను పణంగా పెట్టడానికి దశరధుడు సిద్ధపడలేదు.

“అవసరమైతే నేనే వచ్చి రాక్షసులతో తలపడతాను,” అని చెప్పాడు.

అప్పుడు విశ్వామిత్రుడు గంభీరంగా, కానీ ఆప్యాయతతో ఇలా అన్నాడు—

“రాజా, వయసుతో పాటు నీ శారీరక పటుత్వం తగ్గింది. రాక్షసులతో సమరానికి అది సరిపోదు. నీ కుమారులు యుక్తవయసులో ఉన్నారు. వసిష్ఠుని వద్ద సకల శాస్త్రాలు, యుద్ధవిద్యలు నేర్చుకున్నారు. అదికాక, నా తపస్సు ద్వారా పొందిన దివ్యాస్త్రాలను వారికి ప్రసాదించి, వాటి ప్రయోగ విధానాన్ని నేర్పిస్తాను. వసిష్ఠుని విద్యకు, నా దివ్యాస్త్రాల శక్తి తోడై నీ కుమారులు రాక్షసులను నిలువరించగలరు. వారి భద్రతకు, వారి క్షేమానికి బాధ్యత నేను తీసుకుంటాను. నన్ను నమ్ము.”

దశరధుడు మౌనంగా వసిష్ఠుని వైపు చూశాడు.

వసిష్ఠ మహర్షి విశ్వామిత్రుని మాటలతో ఏకీభవిస్తూ, రాకుమారులను పంపాలని సూచించాడు.

దశరధుడు మనసు నిండా భారంతో, అయిష్టంగానే ఒప్పుకుంటూ—

“నలుగురిని కాదు… ఇద్దరిని మాత్రమే పంపిస్తాను,” అని తేల్చిచెప్పాడు.

అలా రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుని వెంట బయలుదేరారు. రాజప్రాసాదాల సౌఖ్యాన్ని వదిలి, కాలి నడకన అడవి మార్గాల వెంట ఆయనను అనుసరించారు. దారిలో దొరికింది తిన్నారు. నేలమీదే నిద్రించారు. సుఖసౌకర్యాలకు దూరంగా, కఠినమైన అడవి జీవితాన్ని తొలిసారిగా అనుభవించారు. ఆ ప్రయాణంలోనే విశ్వామిత్రుడు వారికి యుద్ధవిద్యలను, దివ్యాస్త్రాల ప్రయోగాన్ని నేర్పించాడు.

యవ్వనం - తొలి చూపు:

వారు విశ్వామిత్రుని సిద్ధాశ్రమానికి చేరుకునే సరికి, అక్కడ కుషధ్వజుడు విదేహ రాకుమార్తెలు నలుగురితో సహా ఉన్నాడు. అతడు వినయంగా నమస్కరించి ఇలా చెప్పాడు—

“నా సోదరుడు జనకునికీ, నాకూ కుమారులు లేరు. మీ యజ్ఞానికి సహాయం చేయాలనే సంకల్పంతో, నన్నూ ఈ నలుగురు రాకుమార్తెలనూ పంపాడు నా సోదరుడు. వీరి పేర్లు—సీత, ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తి.”

అది విని విశ్వామిత్రుడు హృదయపూర్వకంగా సంతోషించాడు.

అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగుపెడుతున్న రాముడు, సీత ఒకరినొకరు చూసుకున్నారు. రాముని ధారుడ్యం, ముఖంపై మెదిలిన ప్రశాంతమైన చిరునవ్వు, ఆత్మవిశ్వాసం చూసి సీత హృదయం ఒక్క క్షణం మధురంగా తడబడింది. ముగ్దమనోహరమైన సీతని చుసిన రాముడి కళ్ళు కొన్ని క్షణాలు ఆమె మీదనే నిలిచిపోయాయి.

****ముగింపు తరువాతి సంచికలో****

Posted in March 2026, కథలు

4 Comments

  1. K M RAMACHAND

    రామాయణ కథారూపం ద్వారా మనకు అద్భుతంగా తెలిసిన కథ రూపాన్ని ప్రకృతి నియమాలకి మానవాళి మనో వికాసానికి ఏ విధంగా పునాది పడ్డాయి అది ఏ విధంగా మార్పు చెందుతుంది అన్న విషయం చాలా చక్కటి వివరణతో మాకు అర్థమయ్యేట్టు చెప్తున్నా వీరాంజనేయులు గారికి కృతజ్ఞతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *