౭౫౧. అవసరంలో ఆదుకున్న వాడే ఐనవాడు.
౭౫౨. అగ్గి చూపిస్తే చాలు, వెన్న అడక్కుండానే కరిగిపోతుంది.
౭౫౩. అగ్రహారం పోయినా ఆక్టులన్నీక్షుణ్ణంగా తెలిశాయి- అన్నాడుట!
౭౫౪. పుండుమీద కారం జల్లినట్లు...
౭౫౫. అచ్చొచ్చిన నేల ఒక్క అడుగు ఉన్నా చాలు.
౭౫౬. అటుకులు బొక్కే నోరు, ఆడిపోసుకునే నోరు క్షణం ఊరుకోవు.
౭౫౭. అడవి పంది వచ్చి చేను పాడుచేస్తే, ఊరపంది చెవులు కోశారుట!
౭౫౮. అడియాశ, పేరాశ, దురాశ దుఃఖానికి కారణమౌతాయి.
౭౫౯. అడుక్కునే వాళ్లకు అన్నీ తమ ఊళ్ళే...
౭౬౦. అడుగునవేసిన ఎరువు కొద్దీ పైన పంట బంగారమౌతుంది.
౭౬౧. అడుసు తొక్కనేల, కాలు కడగనేల...
౭౬౨. అడ్డ బొట్టువాడూ, నిలువు బొట్టువాడూ తగవులాడి అన్నసత్రాన్ని అంటించేశారుట!
౭౬౩. అతికించిన మీసం అట్టేకాలం ఉండదు.
౭౬౪. అతిరహస్యం - బట్టబయలు.
౭౬౫. అతుకుల బొంత - గతుకుల పుంత!
౭౬౬. అత్తా ఒకింటి కోడలే, కోడలూ ఒకనాటికి అత్తే!
౭౬౭. అత్తలేని కోడలు ఉత్తమురాలు - కోడలు లేని అత్త గుణవంతురాలు.
౭౬౮. అత్తారి సొమ్ము అల్లుడు ధారపోసినట్లు ...
౭౬౯. అదును ఎరిగి సేద్యం చెయ్యాలి, పదును చూసి పైరు కొయ్యాలి.
౭౭౦. అదును చూసి విత్తితే అదృష్టం కలిసివస్తుంది.
౭౭౧. అదృష్టం, దురదృష్టం మనతో చెప్పి రావు, చెప్పి పోవు...
౭౭౨. అదృష్టం పండితే ఆరు నూరవుతుండి.
౭౭౩. అదృష్టం అందలం ఎక్కించబోతే, బుద్ధి బురదలోకి ఈడిచిందిట!
౭౭౪. అరువు తెచ్చిన నగలు అవసరానికి పనికిరావు.
౭౭౫. అద్దెకొచ్చిన గుర్రాలు అగడ్తలు దాటలేవు.
౭౭౬. చట్టానికి చెవులేగాని కళ్ళు లేవు.
౭౭౭. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదు...
౭౭౮. అడగనిదే అమ్మైనా పెట్టదు.
౭౭౯. అమ్మా! అల్లుడు వచ్చాడే - అంటే, నాకేమీ ఫరవాలేదు, వాడు నిన్నే తీసుకుపోతాడు - అందిట ఆ తల్లి.
౭౮౦. అమరం నెమరుకువస్తే, ఇంక కావ్యాలెందుకు - కాల్చనా!