Menu Close
Radhika Nori
రాధికారుచిరం
రాధిక నోరి

ఆత్మవంచన

సుమారు ఒక ఆరు నెలల క్రితం నేను రాసిన ఒక కథకు ప్రతిష్టాత్మకమైన ఒక తెలుగు సంఘం వారి కథల పోటీలో బహుమతి వచ్చింది. ఆ కథ పేరు 'మితాహారం'. దానిలోని ముఖ్య పాత్రలు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇద్దరూ కూడా కొంచెం బొద్దుగా, చూసేవారికి లావు అనిపించేలాగా వుంటారు. వారు ఒకరిని ఒకరు impress చెయ్యటం కోసం తాము gym కి వెళ్తున్నామని, dieting చేస్తున్నామని, బరువు తగ్గటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నామని నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పేసి, చివరికి అవన్నీ ఎక్కడ బయటపడి తమ పరువు పోయే అపాయం వస్తుందేమో అన్న భయంతో, ఇంక తప్పనిసరిగా, వేరే దారేదీ లేక ఆమాటల్ని నిజం చేసుకునే ప్రయత్నాలలో పడతారు. ఆ తర్వాత ఏమవుతుంది, వాళ్ళ ప్రయత్నాలు ఫలించి, సన్నబడి, ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారా లేదా అన్న వివరాలు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అసలు ఆ కథ గురించిన ఈ విషయాలన్నీ ఇక్కడ చెప్పటంలో నా అభిమతం అది కాదు.

అయినా ఆ కథ గురించి ఎందుకు చెప్పానంటే, ఒకొక్కసారి మన అభిప్రాయాలను, ఆత్మవంచనలను మనం పక్కన పెట్టేసి, యిష్టంగానో, అయిష్టంగానో మనం అన్న మాటలను నిజం చెయ్యటానికి ప్రయత్నిస్తాం. అలా అనాలని మన ఉద్దేశం కాకపోవచ్చు. మన మనసులో సరిగ్గా దానికి వ్యతిరేకమైన అభిప్రాయం వుండచ్చు. అయినా ఆత్మవంచన చేసుకుంటూ ఆ నిముషాన బయటికి ఏదో అనేస్తాం. అందరికంటే మనమేమీ మిన్నగా లేము అని తెలిసినా కూడా ఏవో గొప్పల కోసం లేదా వేరే ఏవో కారణాల చేత వున్నాము అని చెప్తే దాన్ని నిజం చేయటం కోసం కృషి చేస్తే అది మంచి ఫలితమే! అంటే గొప్పలు చెప్పటం మంచిది కాకపోయినా, ఆ గొప్పలు నిజం చెయ్యటం కోసం కృషి చేయటం మరి కొంతలో కొంత మంచి విషయమే కదా! అందుకే నా కథ గురించి ప్రస్తావించాను. అయితే ‘అడుసు తొక్కనేల, కాలు కడగనేల’ అన్నట్లుగా అసలు అలా అబద్ధాలు, అవి వినటానికి ఎంత ప్రియంగా వున్నా కూడా, చెప్పేయటం ఎందుకు, ఆతర్వాత వాటిని నిజం చేయటం కోసం ఆ తిప్పలు ఎందుకు అన్న ప్రశ్నను పక్కకు పెడితే, ఇక్కడ నాకు అప్పుడప్పుడు ఆత్మవంచన, మనిషిని మంచి ప్రయత్నాల వైపు ప్రేరేపిస్తుందేమో అని అనిపిస్తోంది. అంటే అందరికంటే నేనే మిన్నగా వున్నాను అని అనుకోవటం ఆత్మవంచనే! కానీ దాన్ని నిజం చేయటం కోసం కనీసం అదనపు పరిశ్రమ చేస్తున్నారు కదా! అంటే ఆత్మవంచన అప్పుడప్పుడు మనుషులను మంచి పనులకు ప్రోత్సహిస్తుందన్నమాట. అవునా? అయితే ఈ ఆత్మవంచన మంచిదా, చెడ్డదా, ఎప్పుడు మంచిది, ఎంతవరకు మంచిది, ఎప్పుడు చెడ్డది, ఎందుకు చెడ్డది, ఈ మీమాంసలన్నిటిలోకి వెళ్ళే ముందు అసలు ఆత్మవంచన అంటే ఏమిటి, దేన్ని ఆత్మవంచన అని అంటారు అని తెలుసుకోవటం ముఖ్యం కదా!

నిజాన్ని నిజంగాను, అబద్ధాన్ని అబద్ధంగాను ఒప్పుకోకుండా, తెలిసి తెలిసీ నిజాన్ని అబద్ధంగాను, అబద్ధాన్ని నిజంగాను భావించటాన్ని ఆత్మవంచన అంటారు. అందుకే 'మనల్ని మనం మూర్ఖులుగా తయారుచేసుకునే రెండు మార్గాలలో ఒకటి నిజాన్ని నిజంగా నమ్మకపోవటం, రెండోది అబద్ధాన్ని నిజంగా నమ్మటం' అని Soren Kierkegaard అనే Denmark కు చెందిన ఒక కవి, తత్వవేత్త అన్నారు. వారు నమ్ముతున్నది నిజం కాదని వారికి తెలుసు. ఎదురుగా వున్న ఋజువులన్నీ విరుద్ధంగా వున్నాయని కూడా వారికి తెలుసు. అయినా అదే నిజమన్న అబద్ధంలో బతకడానికి వారు ఎందుకు సిద్ధమవుతారు? ఎదురుగా స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవాన్ని తోసిరాజని ఎలా అనగలరు?

చాలా మంచి ప్రశ్న కదూ. అయితే దీనికి అనేక కారణాలు వుండచ్చు. మనుషులకు వారి నమ్మకాలతో వున్న భావోద్వేగ అనుబంధమే, అంటే emotional attachment కారణం అని Robert Travers అనే ఒక పరిణామ జీవశాస్త్రవేత్త, అంటే evolutionary biologist అన్నాడు. అంటే వారి భావాలు ఎంతో హేతువాదరహితమైనవి అని తెలిసినా కూడా వాటితో పెనవేసుకున్న మానసిక బంధాల వలన మనుషులు వాటిని వదిలించుకోవడానికి తొందరగా సమ్మతించరు అని ఆయన వుద్దేశం. అలాగే తమకి అయిష్టమైన చేదు విషయాలని, నిజాలని తెలిసినా కూడా, అవును అని ఒప్పుకోవటానికి మానవ సహజంగా ఎక్కువ ప్రేరణ, అంటే motivation ఎవ్వరూ అనుభవించరు. ఇది ఇంకో కారణం కావచ్చు. నాకు బాగా గుర్తు, మా వూళ్ళో ఒకావిడకు కేన్సరు వస్తే ఆవిడను ఒప్పించి ట్రీటుమెంటు మొదలుపెట్టడానికి వారి కుటుంబసభ్యులకు చాలా కాలం పట్టింది. వైద్యుల భ్రమ కానీ తనకు కేన్సరేమిటి అని ఆవిడ వాదం. డాక్టర్లందరూ తన విషయంలో ఏదో పెద్ద పొరపాటు పడ్డారు అని ఆవిడ గట్టి నమ్మకం. అలాగే తమకి ఇష్టమైన అభిప్రాయాలను అవి నిజం కాదు అని తెలిసినా, వాటిని మార్చుకోవటానికి కూడా చాలామందికి ఇష్టం వుండదు. ఎదుటివారి కంటే తమ అందం తక్కువ అని ఎవరు తేలికగా ఒప్పుకుంటారు? ఇక్కడ అహం కూడా పెద్ద పాత్రని వహిస్తుంది. మనం చెప్పేది తప్పని తెలిసినా మన అహం ఒకపట్ఠాన దాన్ని ఒప్పుకోనీయదు. అంతేకాకుండా తమ తప్పు ఒప్పుకుంటే తమ గౌరవానికి ఏదో భంగం కలిగినట్లు, ఏదో తలవంపులుగా భావిస్తారు కొందరు. అంతేకాకుండా తమ తప్పుని ఒప్పుకుని, దాన్ని దిద్దుకునే బాధ్యతను తీసుకోవటానికి కూడా చాలామందికి ఇష్టం వుండదు. దాన్ని వారు చాలా చిన్నతనంగా భావిస్తారు. ఇంకో కారణం మనసులో ఏమూలో దాగున్న భయం. కిటికీ వెనక చీకట్లో ఏదో నీడ కదిలింది, అది ఖచ్చితంగా ఏ దొంగో అని మనసులో ఒక భయం ఏర్పడితే ఇంక ఆ భయం పోవటం చాలా కష్టం. అది ఉత్త నీడే, మనిషి కాదేమో అని మనసు చెప్తున్నా ఆ ఆత్మవంచన లోంచి బయటపడటం కొంచెం కష్టమే అవుతుంది. అందుకే తమ మనసులో వున్న భావాలకు విరుద్ధంగా ఏదన్నా వుంటే అది నిజమని సాక్ష్యాధారాలు ఏవీ లేకపోయినా వాటిని వదిలించుకోవటం కష్టమని Carol Tavris అనే అమెరికా కు చెందిన ఒక మానసికశాస్త్రవేత్త అన్నారు.

అయితే ఈ ఆత్మవంచనలో చాలా రకాలున్నాయి. నేను మొదట చెప్పినట్లుగా ఏదన్నా విషయం నిజమని ఋజువయినా దాన్ని అంగీకరించడానికి మనసొప్పదు కొంతమందికి. ఇలాంటివాళ్ళే మాటిమాటికి accidents చేస్తున్నా తమ డ్రైవింగులో ఏమాత్రం లోపం లేదని వాదిస్తారు. కళ్ళెదురుగా వున్న సాక్ష్యాధారాలని చాలా తేలికగా నిరాకరిస్తారు. ఇంకొంతమంది తమ ఆత్మవంచనలను ఏవేవో కుంటిసాకులు చెప్పి సమర్ధించుకోవాలని చూస్తారు. మద్యపానం చేయటం తప్పని బాగా తెలుసు. అయినా ఆ చెడు అలవాటుని మానేయలేక మద్యపానం వారికి చాలా మంచి చేస్తుందని, దానివలన తమ బాధలను మర్చిపోగలమని ఏవేవో కారణాలు చెప్తారు. ఇంకో రకమైన ఆత్మవంచకులు వుంటారు. వీరి తప్పులకు బయటి కారణాలు ఎప్పుడూ వేచి కాచుకునివుంటాయి. వారి ఆలస్యానికి కారణం వారి ముందు వున్నవారు కారు చాలా నెమ్మదిగా నడపడం, లేక ట్రాఫిక్ చాలా ఎక్కువగా వుండటం, అంతే తప్ప తాము సమయం గురించి సరిగ్గా ప్రణాళిక వేసుకోలేదని ముమ్మాటికీ ఒప్పుకోరు. ఇంకొంతమంది వుంటారు. వీరి నిజం ఎలా వుంటుందంటే అది నిజమైన వాస్తవం మీద ఆధాపడివుండదు, వారు వూహించుకున్న వూహల మీద ఆధాపడివుంటుంది. వీరి Resume లో వారికి వున్న అర్హతలు వుండవు, వారికి వుండాలని వారు కోరుకుంటున్న, లేదా వున్నాయి అని వూహించుకొంటున్న అర్హతలు మాత్రమే వుంటాయి. ఇంకోరకమైన ఆత్మవంచన వుంటుంది. వీరు తమ మనసులో వున్న అబద్ధపు ఆలోచనలను ఎవరైనా వ్యతిరేకిస్తారేమో అన్న దడుపుతో అలాంటి వ్యక్తులను తప్పించుకొని తిరుగుతూవుంటారు. ఇంకొంతమంది వుంటారు. అదేం ఆత్మవంచనో తెలీదు కానీ మనందరికీ తేటతెల్లంగా కనిపిస్తున్నది కూడా వీరికి కనిపించదు. ఒకవేళ కనిపించినా చూడటం వీరికి ఇష్టం వుండదు. ఒకవేళ చూసినా దాన్ని నమ్మటం అంతకంటే ఇష్టం వుండదు. మా ఆఫీసులో ఒకమ్మాయి వుంది. ఆ అమ్మాయి boyfriend కి వేరే ఇంకో అమ్మాయితో సంబంధాలు వున్నాయని తెలిసినప్పుడు ఏడ్చి, రాగాలు పెట్టి నానా గొడవ చేసింది. ఇంక ఈ కథ ఇంతటితో సమాప్తం అని అందరం అనుకున్నాం. కానీ మర్నాడు ఆఫీసుకి వచ్చి 'పాపం, అతని తప్పు ఏమీ లేదు, ఆ అమ్మాయే అతని వెనక పడిందిట. అతను వద్దు వద్దు అంటున్నా వినకుండా పట్టుకుని మీద పడి వదలలేదుట' అంటూ ఏవేవో చెప్పడం మొదలెట్టింది. ఇలాంటి ఆత్మవంచనలే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ abuse లు జరిగేటట్లు, అవి ఎలాంటివైనా సరే, సహించేటట్లు, ఆ abuse చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ ప్రోత్సాహం తెచ్చుకుని ఇంకొంచెం ఎక్కువ abuse చేసేట్లు కూడా చేస్తాయి. మరి వీరు ఆ ఆత్మవంచనల వలయం లోంచి ఎలా బయటపడతారు? అసలెప్పుడైనా బయటపడతారా? నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, చాలా బాధని అనుభవించకుండా మాత్రం బయటపడలేరు. పా…పం.

అంటే అలా ఎందుకు చెప్తున్నానంటే ఆత్మవంచనల అంతం అలాగే వుంటుంది. మనస్తాపాలు, కలతలు, కన్నీళ్ళు తప్పవు. అంతేకాకుండా ఇలా ఆత్మవంచన పదేపదే చేసుకుంటూవుంటే కొన్నాళ్ళకు అసలు మన వ్యక్తిత్వమే మారిపోయే ప్రమాదం వుంది. 'అసలైన' మనం మారిపోయి, ఆత్మవంచనతో మనల్ని మనమే మార్చేసుకున్న 'అబద్ధమైన' మనం మిగిలే అపాయం వుంది. అందుకే S.E. Hinton అనే అమెరికాకు చెందిన ఒక రచయిత్రి 'నాతో నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్తూనే వుంటాను. అందుకే నన్ను నేను అస్సలు నమ్మను' అన్నారు.

ఆత్మవంచన ఎలాంటి రకమైనా దాని చేతుల్లో చిక్కుకుపోవటం మాత్రం చాలా సులభం. అందుకే 'మనం అసాధ్యం అని అనుకుంటాం కానీ మనల్ని మనం మూర్ఖులుగా చేసుకోవటం చాలా తేలికైన పని' అని Jodi Picot అనే అమెరికాకు చెందిన ఒక నవలా రచయిత్రి అన్నారు.

మరి వీటి నుండి తప్పించుకునే మార్గం ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఒక్కటే మార్గం కనిపిస్తోంది. ఆ ఆత్మవంచనలలోంచి ముందుగానే బయటపడటమే! మన గురించిన నిజాలు మనకి తెలుసు. మన ఆత్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. బుద్ధిగా అది చెప్పిన మాటని విని, ముందుగానే మన అపోహల్ని గ్రహించి మనని మనం వంచించుకోవటం మానాలి. నిజం ఎంత చేదుగా వున్నా, తప్పదు, వినాలి, విని హరాయించుకోవాలి. మన గురించిన నిజాలు మనకి నచ్చకపోతే వాటిని మార్చుకోవటానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి కానీ వాటిని అబద్ధాలు అనుకుని ఆ అబద్ధాలే నిజమనుకొని బతికేస్తే ఎలా? ఎందుకంటే అబద్ధాల మబ్బుల నుండి విడిపోయి నిజం ఎప్పటికైనా బయటపడి వెలుగులు విరజిమ్ముతుంది కదా!

ఆతర్వాత ఇంకో మార్గం ఏమిటంటే, నిష్పాక్షికత, అంటే objectivity. దాన్నికూడా నేర్చుకోవాలి. తమ గురించి విమర్శనాత్మకమైన ఆలోచనా దృష్టిని పెంచుకోవాలి. అపోహల ఆకాశంలోంచి నిజాల భూమి మీదకి దిగాలి. అప్పుడే నిజాలను ధైర్యంగా చూడగలం. స్వీకరించగలం.

ఇంకో విషయం. ఆత్మవంచన బారి నుండి తప్పించుకోవటానికి ఇంకో మార్గం, ఎల్లప్పుడూ జాగ్రత్తగా, మెలకువతో వర్తమానంలో వుండటం. భూతకాలంలో జరిగినవాటి గురించి వగచటం, భవిష్యత్తులో జరగబోయేవాటి గురించి వూహించి భయపడటం మాని, వర్తమానంలో ఏం చెయ్యాలో ఆలోచిస్తే మన గురించి మనకి సరైన అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే ఆత్మవంచనకి సరైన విరుగుడు స్వావగాహనయే! అందుకే Dr. David Dunning అనే University of Michigan లోని ఒక ప్రొఫెసరు, మనస్తత్వవేత్త, (అంటే, Psychologist అన్నమాట) ఏం అన్నాడంటే వారి గురించి వారికి సరైన అవగాహన ఎవరిలో అయితే వుండదో, వారిలో ఆత్మవంచన పాళ్ళు చాలా ఎక్కువగా వుంటాయట.
వీటన్నితోపాటు ఇంకో విషయం నేర్చుకోవాలి. Daniel Kahneman అనే ఒక Nobel prize ని పొందిన ఇంకో మనస్తత్వవేత్త, ఏమన్నాడంటే మన ఆలోచనా వేగం కొంచెం నెమ్మదిగా వుండాలిట. అంటే, slow thinking అన్నమాట, దాన్ని అవలంబించాలిట. ఎందుకంటే ఆలోచనల వేగం తగ్గితే మనల్ని మనం పూర్తిగా విమర్శించుకోవటానికి తగినంత సమయం దొరుకుతుంది. అప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా వుంటుంది అని ఆయన అభిప్రాయం.
మానవ స్వభావం లోపభూయిష్టం. దోషాలు, కొరతలతో కూడుకున్నది. అందుకే ఎప్పుడైనా అబద్ధంలో బతకటం, ఆత్మవంచన చేసుకుని తాత్కాలికంగా సంతృప్తిని పొందటం అన్నది మనిషన్న తర్వాత కొంతవరకు సహజమే! కానీ అది ఎప్పుడూ హద్దుల్లోనే వుండాలి. అలాగే మనిషికి విరుద్ధమైన భావాలతో కుస్తీపట్టడం కూడా సహజమే! వ్యాయామం చేయటం ఆరోగ్యకరం అని తెలుసు. కానీ ఏదో ఒక వంక పెట్టి దాన్ని ఎగ్గొట్టాలని చూడటం, మంచిది కాదు కానీ, మరి అది మానవ సహజమే! దీన్నే మనం విరుద్ధభావాలను పోషించటం, అంటే paradox అని అంటాం. అంటే ఇక్కడ మోసం చేసేవారు, మోసం చేయబడేవారు ఒక్కరే అన్నమాట. అవునా? అంటే తెలిసి తెలిసీ స్వహస్తాలతో మోసాల వలలో చిక్కుకుపోవడమన్నమాట. ఇదేం విచిత్రమో సుమా! అందుకే 'నాగురించి ఎవరైనా గొప్ప అబద్ధాలు చెప్పారంటే అది వేరెవరో కాదు, అది నేనే' అని Patrick Rothfuss అనే అమెరికాకు చెందిన ఒక రచయిత అన్నారు. Derak Landy అనే Ireland కు సంబంధించిన ఇంకో రచయిత కూడా సుమారు ఇలాంటి అర్ధం వచ్చేలాగానే 'మనం ఇతరులతో చెప్పే అబద్ధాలు మనం మనతో చెప్పేవాటి ముందు ఎందుకూ పనికిరావు' అని అన్నారు. అసలైనా, తెలిసి తెలిసీ, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము అన్న సంగతి, అబ్బా, చాలా నగుబాటుగా వుంది కదూ!? అందుకే ప్రముఖ ఇంగ్లీషు రచయిత, Somerset Maugham 'అప్పుడప్పుడు ఇతరులతో అబద్ధాలు చెప్పటం తప్పనిసరి అయితే, ఎల్లప్పుడూ మనతో మనమే అసత్యం పలుకుతూ ఆత్మవంచన చేసుకోవటం మాత్రం చాలా నీచమైన విషయం' అని అన్నారు. తెలివైనవారు వాస్తవాన్ని గ్రహించి ఆ ఆత్మవంచన సుడిగుండాలలోంచి ఏదో ఒక విరుగుడు మార్గం ఉపయోగించి, ఎలాగో అలాగ బయటపడతారు. అప్పుడే వారికి విముక్తి లభిస్తుంది. మనందరం కూడా ఆ విచక్షణతో సరైన నిర్ణయాలు తీసుకుని ఈ ఆత్మవంచన దెయ్యాన్ని దూరంగా తరిమేద్దాం, సరేనా?

మీరు ఆ ప్రయత్నాలలో వుండండి, ఈ లోపల నేను వచ్చే నెల ఇంకో మంచి విషయాన్ని వెంటబెట్టుకుని మీ దగ్గరకు వచ్చే సన్నాహాలలో వుంటాను. సరేనా? అంతవరకూ సెలవు.

********

Posted in March 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *