ఆఫీసులో గోడ గడియారం పదిన్నర చూపుతున్నది.
ఒక్కోరూ ప్రభుత్వకోశాధికారి కార్యాలయంలోకి [ట్రెజరీ ఆఫీస్] రాసాగారు.
ముందుగా వచ్చి ఆఫీసు ముందున్న మునగచెట్టు నీడలో ముసలి ముత్యాలమ్మ కూర్చునుంది తనకు కావల్సిన ఉద్యోగి కోసం నిరీక్షిస్తూ.
పదకొండు ప్రాంతంలో జవాన్ జగదీష్ వచ్చాడు.
ముత్యాలమ్మను చూసి "ఏమే ముసల్దానా! అప్పుడే వచ్చావా! మా ప్రాణాలు తియ్యను" అంటూ లోపలికెళ్ళాడు.
అటెండర్ అమృతరావు మరో పదినిముషాలకు వచ్చాడు. ముత్యలమ్మను చూశాడు.
"ఏం ముసలీ! తెల్లారిందీ. ఇంకా ఎంతకాలం పెన్షన్ తీసుకుంటావే! ఇంకా పిలుపురాలేదా!" అని నవ్వుతూ లోపలికెళ్ళాడు. పేరు అమృత రావే గానీ ముందుగా ముడుపులివ్వందే లోపలికి కాలైనా కదపనివ్వడు.
మరో పదినిముషాలకు గబగబా నడుచుకుంటూ గణేష్ వచ్చాడు. అతడే ముత్యాలమ్మకు కావల్సిన వాడు. ముత్యాలమ్మను చూసి,
"ఏవమ్మా! వచ్చావా! నాకంటే ముందే! కూర్చోనుండు పిలుస్తాను" అంటూ లోనికెళ్ళాడు.
ముత్యాలమ్మ కూర్చున్న బండరాతి మీద చెట్టునీడ తగ్గిపోయి ఎండ పడుతుండగా లేచి లోపలి కెళ్దామనుకుంది. వెళ్లి లాభంలేదని ఆమెకు తెల్సు. అందుకే చీరకొంగు తలచుట్టూ తిప్పి కప్పుకుని మళ్ళా కూర్చుంది రాతి మీద.
ఇంకో పదినిముషాలకు ట్రెజరీ ఆఫీసర్ మోటార్ బైక్ మీద వచ్చి దిగాడు, ముత్యాలమ్మను చూశాడు.
"ఏమ్మా! ఎండలో కూర్చున్నావ్! వరండాలో కెళ్ళికూర్చో." అంటూ లోపలి కెళ్ళాడు.
అంతే ఎవరిపనుల్లో వారుండిపోయారు. ఎవ్వరూ ఆమెను లోపలికి పిలిచిందే లేదు... ముడుపుల్లేవుగా!
ఎప్పుడో ఉదయం వచ్చే ముందుతిన్న రెండు ఇడ్లీలూ, బస్సుదిగి రెండు కిలోమీటర్లు నడిచి వచ్చిందేమో అరిగి పోయాయి. ఆకలేస్తున్నది, దాహమూ వేస్తున్నది ముత్యాలమ్మకు.
ఈ రోజు పనికాక పోతే రేపు మళ్ళీ రాను ఆమె వద్ద బస్ చార్జీకి రూకల్లేవు. వేలి ముద్రలు పడక వారం నుంచీ వస్తూనే ఉంది. బస్సుకు పైసలు పోస్తూనే ఉంది.
కడుపులో అన్నంగా పడాల్సిన రూకలు బస్సుపాలవుతుంటే ఏమీ చేయలేక మౌనంగా ఉంది. ఎప్పుడో మిడ్ వైఫ్ గా రిటైరైన ఆనాటి పెన్షన్ డబ్బులు రోజూ గంజి త్రాగను మాత్రమే సరిపోతాయి.
చేతిముద్రలు అరిగిపోడం తనతప్పా? డెబ్బైఐదేళ్ళకు ఇంకా వ్రేలి ముద్రలేముంటాయి. పూర్వం చదువుకోనివారు వ్రేలి ముద్రలు వేసేవారు. భూమి గుండ్రంగా ఉందని మళ్లా వ్రేలిముద్రల కాలం వచ్చింది. వయస్సులో ఉండగా మంత్రసాని పని చేస్తూ ఎందరికో ప్రాణాలుపోసింది. తాను కానుపు చేసిన తల్లులూ బిడ్దలూ తనపట్ల ఎంత ప్రేమ చూపేవారు. వద్దన్నా ఏవేవో ఇచ్చేవారు. వాటిని తాను తీసుకోక ఆస్పత్రికి వచ్చే పేద తల్లులకు, నిరుపేద గర్భవతులకూ ఇచ్చేసేది. ప్రభుత్వ దవాఖానా కనుక నిరుపేదలే వచ్చేవారు. తన పొట్టకింత అన్నం వండుకుని తినేది. ఆరోజుల్లో ప్రభుత్వం ఇచ్చే జీతం తనకు సరి పోయేది. అన్నిటి వెలలూ తక్కువ గనుక తనకు సరి పోయేది ఆ జీతం సొమ్ము. కాదు కాదు సరిపెట్టుకునేది ముత్యాలు.
‘ప్రభుత్వం తన నిజాయితీ సేవలను గుర్తించి అవార్డూ ప్రదానం చేసింది. ఐతే అవన్నీ ఈ వయస్సులో దేనికీ పనికి రాకుండా పోయాయి. ఇంకా బతికున్నావని అడిగే ఈ కుర్ర కుంకలకు బతుకు గురించీ ఏంతెల్సు! వృత్తిపట్ల నిజాయితీ ఏం తెల్సు? వృత్తినే దైవంగా భావించే వారి మనస్సులెంత హాయి గా ఉంటాయో వీరికెవరు చెప్తారు. గంజి తాగినా హాయిగా కంటి నిద్ర పోయి వళ్ళు అలిసేలా పనిచేసి, హాయిగా బతికినవారి గురించీ ఈ వాజెమ్మలకేం తెల్సు. అంతా బల్లల కింద చేతులు మొలిచిన వారేనాయె!' అనుకుంటూ కూర్చునుంది.
తినేందుకేమైనా, పండైనా దొరుకు తుందేమోని తలత్రిప్పి చూస్తూ ఉంది. కళ్ళు మసకలైనందున ఎక్కడా స్పష్టంగా ఏమీ కనపడటం లేదు. పైగా ఎండ! రోజూ మాట్లాడే వ్యక్తులను మాత్రం వారి స్వరాన్ని విని ఎవరైందీ గుర్తించగలదు ముత్యాలమ్మ. ‘కంటిచూపు పరీక్షకెళ్ళాలన్నా తన దగ్గర రూకల్లేవాయె! ఉచిత కంటివైద్యక్యాంపులు ఇప్పుడు ఎక్కడో తప్ప లేవు, తనకు అందుబాటులో ఎక్కడా రాలేదాయె. అంతా రూకలమయం.’ నేటిస్థితిని, తన గతిని గురించి ఆలోచిస్తూ మండే ఎండలో కాలే కడుపుతో కూర్చునుంది ఓపిగ్గా ఓపికలేని ముత్యాలమ్మ.
ఇంతలో ఒక కారు వచ్చి చెట్టు క్రింద ఆగింది. దాన్లోంచీ ఒక సూటూ బూటూ వేసుకున్న, నల్లకళ్ళద్దాలతో వున్న దొర లాంటి వ్యక్తి దిగాడు. కారు తలుపేసి పక్కనే ఉన్న ముత్యాలమ్మను చూశాడు. కొద్దిసేపు గమనించి పరిశీలనగా చూసి, “అమ్మా! మీరు ముత్యాలమ్మగారు కదూ! ఔనా!" అంటూ దగ్గరగా వచ్చి చేయి పట్టి మాడిపోతున్న బండమీద కూర్చునున్న ఆమెను లేపాడు.
"ఇక్కడ మండే ఎండలో ఉన్నారేమమ్మా! అక్కడ వరండాలో కూర్చోలేక పోయారూ! అసలెందుకిక్కడ కూర్చున్నారు? పదండి లోపలికి" అంటూ చేయిపట్టి నడిపించబోయాడు.
"అయ్యా! తమరేవరో నాకు తెలీడం లేదు. దొరబాబులా ఉన్నారు. చమట పట్టిన నన్ను ముట్టుకోకండి. నా ఒళ్లంతా చమటకు తడిసి కంపుకొడుతున్నది. ఈ మధ్య కళ్ళు మసకలొచ్చి రోజూ వినే గొంతుకలు మాత్రం ఎవరో తెలుస్తున్నాయి. ముఖాలు గుర్తు పట్టలేనయ్యా!" అంది అతడి ముఖాన్ని తేరి పారచూస్తూ.
"అమ్మా! ముప్పై ఏళ్ళక్రితం, ఆరోజు అంతా బందు. ఆస్పత్రులు కూడా మూసేసి ఉన్న సమయాన మా అమ్మ ప్రసవ సమయమైతే ఎవ్వరూ సహాయం చేసేవారు లేక మా ఇంటివారు అవస్తపడుతుంటే, ఎవరో మీ పేరు చెప్పగా, మిమ్మల్ని పిలవగానే వచ్చి మా అమ్మగారికి ప్రసవం చేసి నా ప్రాణాలు, అమ్మ ప్రాణాలు కాపాడారు. మీరు నా జీవనదాత." అంటూ వంగి ముత్యాలు పాదాలకు నమస్కరించాడా వ్యక్తి.
"బాబూ నీవు వర్ధన్ కదూ! గుర్తొచ్చింది బాబూ! బావున్నావా నాయనా!" అంటూ అతడి చెయ్యి పట్టుకుని ప్రేమగా బుగ్గలు నిమిరింది ముత్యాలమ్మ.
"మీ దయవల్ల బతికి బట్టగట్టి బావున్ననమ్మా! ఆరోజు మీరు వచ్చి సాయం చేయకపోతే అమ్మా నేనూ కూడా బతికేవాళ్ళం కాదుట. మీ కోసం అమ్మ మీరుండే ఇంటికెళ్ళి ఇటీవల చూసింది. ఎక్కడికెళ్ళింది ఎవ్వరూ చెప్పలేక పోయారు. ఎక్కడుంటున్నారు! అసలు ఇక్కడెందుకున్నారమ్మా! మీరు కాపాడిన ఈ ప్రాణి ఇప్పుడో పెద్ద ఆఫీసర్." అన్నాడు వర్ధన్ అనే ఆ వ్యక్తి.
"నాయనా! పెన్షన్ కోసం వ్రేలు ముద్రలు వేయాలిట కదా! వేళ్ళు అరిగి పోయి పడలేదయ్యా! రోజూ వారంగా వస్తున్నాను. అన్నం కోసం దాచుకున్న డబ్బులు బస్సుటికెట్ కోసం ఖర్చై పోయాయి. ఈ రోజైనా పనవుతుందేమోనని ఎదురు చూస్తూ కూర్చున్నాను."
"మరి లోపలివాళ్ళకు తెల్సా! మీరిక్కడున్నట్లు."
"తెలుసయ్యా! మసకలైనా వారి గొంతుకలను, మాట తిరునూ బట్టి గుర్తుపట్టాను. ముందు ఆఫీసు జవానొచ్చాడు. ఆ తర్వాత అటెండరొచ్చాడు, తర్వాత క్లర్క్ వచ్చాడు. చివరగా ఆఫీసర్ గారొచ్చారు. ఇప్పుడు మీరొచ్చారు." అంది బోసి నోటుతో నవ్వుతూ ముత్యాలమ్మ.
"మీకు కళ్ళు మసకలు కదా! ఎలా కనిపెట్టారు ఎవరెవరో!"
"దాందేముంది బాబూ! వారి పిలుపును బట్టీ కనిపెట్టాను. సంస్కారం అలా పిలిపిస్తుంటుంది నాయనా! అది వారి తప్పుకాదు. దానికేంలే బాబూ! ముసల్దాన్ని నన్నెలా పిల్చినా ఫరవాలేదులే! అమ్మగారిని అడిగాననిచెప్పు." అంటున్న ముత్యాలమ్మను చూస్తూ,
"పదండి లోపలికి మీ పనెందుకు కాదో చూద్దాం, 'రాతికుండకు ఇనుప తెడ్డ' ని బాదేవాడుంటేనే పనవుతుంది ముత్యాలమ్మవ్వా ఈ రోజుల్లో. మనుషులు నీ కాలపు సత్యకాలం మనుషులు కాదవ్వా! నీలాగా నిరుపేదై ఆధారం లేని వారిని చూస్తే కర్రే పామై కరిచినట్లు జవానూ దర్జా వెలగ బెడతాడు ఆఫీసరులాగా. వారి బ్యాంకుల్లోంచీ ఇచ్చినట్లు పేదలకు ప్రభుత్వమిచ్చే పెన్షన్ ఇవ్వను ఇరకాటం చేస్తారు. పద పదా. ఆ తర్వాత మా ఇంటి కెళ్దాం. మిమ్మల్ని చూస్తే అమ్మ ఎంతో సంతోషిస్తుంది." అంటూ చేయి పట్టుకుని లోనికి నడిపించాడా వర్ధిల్లాల్సిన వర్ధన్, నిలువెత్తు సంస్కారాన్ని అనుసరించింది ముత్యాలమ్మ.
Excellent story Madam. I used to read such works when I was a kid. You understand that you are building and refining the character of the readers right!
Very grateful for publishing this.