Menu Close
PrakriyalaParimalaalu_pagetitle
ముత్యాలహారం

వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు పెద్దలు. ఉవ్వెత్తున ఎగసిపడ్డ మిని కవితా ఉద్యమ సముద్రంలో ఎగసిపడుతున్న ప్రక్రియల కెరటాలెన్నో.

ఇటీవలి కాలంలో లఘుకవితా ప్రక్రియలకు ఆదరణ పెరుగుతోంది.అక్షర సంఖ్య ఆధారంగా ఉన్నవాటికంటే మాత్రానియమ లయసహిత ఛందోబద్ద కవిత్వ రీతులే అధిక సంఖ్యలో వెల్లువెత్తడం శుభపరిణామమేనని చెప్పాలి.

ప్రాస పదాలపై, గురువు, లఘువులపై అవగాహన పెంచి మాత్రా గణన, పదజాలాలపై పట్టు సాధించేలా ఉండే ప్రక్రియలు కవులు, పాఠకులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులను చేరడం శుభ పరిణామం.

అందునా వారూ కవితలు వ్రాసే దిశగా ఈ ప్రక్రియలు స్ఫూర్తి నింపుతున్నాయి. చరవాణి మోజులో కొట్టుకుపోతున్న యువత పఠనాభిలాషను పెంపొందించుకోవడమే కాక రచనాశక్తిని రచనాసక్తిని పెంచుకోవడం నిస్సందేహంగా గొప్ప సామాజిక ప్రయోజనమే. ఇంత కంటే కావలసిందేముంది అని భాషాప్రియులు సంతోషించే  గొప్ప విషయం.

ప్రక్రియ ఏదైనా అది కేవలం నియమాలను పాటించి వ్రాసినపుడు, అందులో కవిత్వం లోపించినపుడు అది ఆత్మ లేని శరీరంలా నిర్జీవమే.

కానీ అది కవి వైఫల్యమే తప్ప ప్రక్రియ పరాజయం కాదు.

ఇక ఇటీవలి ప్రక్రియలలో అద్భుతమైన అంత్యానుప్రాసల సొబగుతో మాత్రానియమ సహితమై అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్న మరో ప్రక్రియను చూద్దాం.

ఇదొక నూతన లఘు కవితా ప్రక్రియ. పేరు ముత్యాల హారం. ప్రక్రియ రూపకర్త శ్రీ రాథోడ్ శ్రావణ్. వీరు కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ప్రభుత్వ జూనియర్  కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్  మండలం సోనాపూర్ గ్రామానికి  చెందిన వారు. తెలుగు భాషపై ఆసక్తిని, అనురక్తిని పెంచడమే కాక ప్రాసపదాలపై పట్టు సాధింపచేయడమే ప్రక్రియ లక్ష్యంగా పేర్కొన్నారు.

ముఖ్యంగా విద్యార్థిలోకంలో రానురాను మాతృభాష మృతభాషగా మారిపోతుండడం తనను కలవరపెట్టిందని,  ఆ‌ తపన నుండే ‘ముత్యాల హారం’ ప్రక్రియకు రూపకల్పన జరిగిందని వివరించారు. ప్రస్తుతం వాట్స్ అప్ వేదికగా ఒక ప్రత్యేక గ్రూప్ ను ఏర్పరచి కవులను సూచనల ద్వారా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాక వంద హారాలు కవితాత్మకంగా అల్లిన వారికి ఉట్నూర్ సాహితీ వేదిక ద్వారా ఆన్లైన్ ప్రశంసాపత్రాలను, సాహితీ ముత్యాలహార పురస్కారాన్ని అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు.  వీరికి శ్రీ కొండగుర్ల లక్ష్మయ్య, జాధవ్ బంకట్ లాల్, ఆత్రం మోతీలాల్ తదితరులు సహకరిస్తున్నారు.

ఇటీవలే ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలనుండి 50 మంది పైగా ముత్యాల హారాలను రమణీయంగా అల్లుతుండగా వారిలో పదిమంది పైనే శతాధిక కవితలు వ్రాయడం గమనార్హం.

ఇక అత్యంత ఆకర్షణీయమైన ప్రక్రియ ముత్యాల హారం నియమాలను ఒకసారి పరిశీలిద్దాం.

ముత్యాల హారం (నూతన లఘుకవితా ప్రక్రియ) నియమాలు:

  1. ఇందులో నాలుగు పాదాలుంటాయి.
  2. మొత్తం నాలుగు పాదాల్లోనూ చివర అంత్య ప్రాస ఉండాలి.
  3. మొత్తం నాలుగు పాదాల్లోనూ మాత్రల సంఖ్య పది నుండి పన్నెండు వరకు ఉండాలి
    (తెలుసు కదా! లఘువు ఒక మాత్ర,గురువు రెండు మాత్రలు.)
  4. నాలుగు పాదాలు కలిపి చదివినపుడు భావాత్మకంగా ఉండాలి.

పాఠకులకు మరింత అవగాహన కోసం నేను వ్రాసిన ముత్యాల హారాలు కొన్ని:

రక్తమిచ్చే దాత
అతను దేవుని దూత
తీర్చురా మన చింత
కలిగించు నిశ్చింత

వాన నిలుపును బతుకు
మబ్బు కోసం వెతుకు
మెరుపు జిలుగుల తళుకు
వెనుక చల్లని చినుకు

మేఘ మాలిక మెరుపు
వాన ధరణిని తడుపు
నింపునోయ్ మనకడుపు
చేయు కరువును అదుపు

పూల రెమ్మల కులుకు
ఎంత శోభలు ఒలుకు
వాడిపోయే వరకు
మదిన శాంతిని చిలుకు

మానవత్వపు జాడ
మంచి వృక్షపు నీడ
సేదదీర్చే మేడ
ఆసరయ్యే గోడ

వింతదైనది బతుకు
సుఖము మాత్రమె వెతుకు
చితిని చేరును తుదకు
సత్యమిదియే కడకు

కృష్ణ బోధయె గీత
తొలగించునోయ్ చింత
చదవాలి మనమంత
శాంతి కలిగేనంత

మంచి పనులను చెయ్యి
చెడును పాతర వెయ్యి
పుస్తకాలను తియ్యి
హాయిగా చదివెయ్యి

ధనికులుండెడి మేడ
దర్పాల క్రీనీడ
చెట్టు చల్లని నీడ
ఆదరించెడి జాడ

నిప్పులాంటిది మనసు
నీరులాంటిది వయసు
ఊరుకోదని తెలుసు
తెలిసి మనసుకు అలుసు

చెప్పుడు మాటలు నమ్మకు
కైకేయి గతిని మరువకు
మంచి మార్గమును వదలకు
దుష్టుల చెంతకు చేరకు

అంత్యానుప్రాసలతో ఆకర్షణీయంగా ఉన్నాయి కదా!

సాధన చేస్తుండండి మరి. వచ్చే నెల మరో కొత్త ప్రక్రియతో మిమ్మల్ని పలకరిస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.

***సశేషం***

Posted in June 2021, సాహిత్యం

3 Comments

  1. ముద్దు వెంకటలక్ష్మి

    పెన్ కౌంటర్ ప్రక్రియ కోసం వెతుకుతూంటే మీ ముత్యాల హారం వివరణ కనిపించింది, చక్కటి ఉదాహరణలతో చాలా బాగా చెప్పేరు, ధన్యవాదాలు.
    నేను కూడా ఈ ప్రక్రియ ప్రయత్నిస్తాను.

  2. D v v r bhattar

    చాలా సరళమైన రీతి లో జీవిత సత్యాలు ఈ కవితలలో తొంగి చూసాయి

  3. గోదావరి రచయితల సంఘం, రాజమహేంద్రవరం

    చాలా చక్కగా ముత్యాలహారం ప్రక్రియ గూర్చి వివరించారు. మీరు విశ్లేషణతో పాటుగా చక్కటి ఉదాహరణలు కూడా ఇచ్చారు. అభినందనలు మీకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!