Menu Close
prabharavi

విషం
చెప్పి చంపుతుంది,
కూల్ డ్రింక్
చెప్పకుండా.

“ఏసీబీ” సోడాలో
అసత్యం
సత్యాన్ని మింగింది,
సత్యంగా మారింది.

ఆడ మొగ్గల్ని కొరికేసే
మగ పురుగులు పెరిగిపోయాయి
ఘాటైన పురుగు మందులకు
రాజకీయా లడ్డుపడుతున్నాయి.

కొందరు
ఉప్పులాంటి వారు,
అతిగా గౌరవిస్తే
ముప్పు తెచ్చి పెడతారు.

ఆవిడ చెయ్యి పైనే
నా దెపుడూ కిందే,
ఏదైనా పడకుండా
పట్టుకోవాల్సింది నేనే.

 

పెండ్లాడదా మనుకున్నాడు
అవసరం లేదట,
వెండి తెరమీద
అన్నీ చూపిం దట.

దేశ భక్తి
ఎక్క డుంది!
కాపాడ మని
గుడి కెళ్ళింది!

మనిషి ప్రపంచాన్ని
గడ్డి పొలంగా మార్చాడు
గడ్డిని
పెంచుకుంటూ పంచుకుంటూ.

ధరణి మెడలో శ్రామికులు
ఎర్ర మందారాల హారాలు,
ధనవంతుల సుఖాల
దండలలో దారాలు.

అంత ఎత్తు నుండి
పడిన కిరణాలు
పగలాలని నీకు
వెలగాలని నాకు.

 “టీవీ”ల్లోంచి కురుస్తోన్న
విషానికి
చెట్లు నదులూ
ఎండిపోతున్నాయి.

మేము దోచుకుంటున్నది
దాచుకోటానికి కాదు,
రేపు ఎన్నికలలో
మీకు పంచటానికి!

ఆకాశాన్ని కూడా
ఆక్రమించారు,
చుక్కల రాళ్ళతో
ప్లాట్లు వేశారు.

మీకు ఉపకరణాలే,
అయుధా లుండకూడదు,
మా చేతుల్లో మాత్రం
తుపాకు లుండాలి.

మబ్బు పట్టింది,
వాన పడవచ్చు,
పల్లెకు మోదం,
నగరానికి ఖేదం.

సీలింగుకు
ఫ్యాను రెక్క లడ్డం,
తిరిగేటప్పుడు కాదు,
తిరగనప్పుడే.

“డబ్బు”
అనగానే
నాలుక మడత పడుతుంది,
పెదాలు గుద్దుకుంటాయి.

“నోటు” పవరు కంటె
“నోటి” పవరుకే ఓట్లు
బాగా పడతాయని
నమ్మినట్లున్నారు నాయకులు.

రేయింబవళ్ళు శ్రమిస్తున్నాం
పదవులకు తుప్పు పట్టకుండా,
మా శ్రమ ఆయుధాలు 
వారసుల కిస్తే తప్పా!

కొన్ని పథకాలు
ప్రభుత్వ ఫలాలు,
చాలా కాలం దాచేస్తారు,
కుళ్ళిపోయాక పారేస్తారు.

Posted in December 2019, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!