ప్రయాణం
లోదృష్టిని అలవరుచుకొని నీలోనువ్వే ఉండిపోతూ,
పైసృష్టిని అలవోకగా వదులుకొని నీలోనీవే నిండిపోతూ,
శోకాన్నీ, సుఖాన్ని కూడా మరిచి,
గతాన్నీ, భవిష్యత్తునీ కూడా విడిచి,
మౌనంగా మనగలిగితే, ఇదే స్థిరమని కనగలిగితే
ఆమౌనంలో నీకు సంగీతం వినిపిస్తుంది.
ప్రాప్తాన్ని గుర్తిస్తూ, ప్రయత్నంలో నర్తిస్తూ,
ఈక్షణంలోకి నిన్నునువ్వు నెట్టుకోగలిస్తే
ఆప్రయత్నంలో నీకొక ఆనందం లభిస్తుంది.
నిరంతర దుఃఖంనుండి నిన్నది విడిపిస్తుంది.
నీలోపలకు నువ్వు పయనించగలిస్తే
లోలోపల నువ్వు శయనించగలిస్తే
నిలువెల్లాశాంతి నిన్ను ఆవరిస్తుంది.
నిండైన జీవితాన్నినీ ముందు ఆవిష్కరిస్తుంది.
ప్రశించటంమాని పరిశీలించగలిగితే
పరితపించటంమాని ప్రార్ధించగలిగితే
ఆక్షేపించటంమాని అంగీకరించగలిగితే
వెల్లువైనకాంతి నిన్ను ఆవహిస్తుంది.