Menu Close
Kasi Viswanatham
పలుకుబడి కథలు
కాశీ విశ్వనాథం పట్రాయుడు

భలే భలే జాతీయాలు!

ఒక రోజు కాశీతాతతో కలిసి కాత్యాయని గుడికి వెళ్ళింది. పూజారి గారు అభిషేకం పూర్తి చేసి, వారిద్దరి మీద అక్షింతలు చల్లి దీవించారు.

పవిత్రమైన తీర్థం ఇచ్చి, తల మీద శఠగోపం పెట్టి ఆశీర్వదించారు.

సాయంత్రం పెరటి గుమ్మంలో కూర్చుని తాతయ్య, మనవరాలు కబుర్లు చెప్పుకుంటున్నారు.

మునిమామ్మ అక్కడికి వచ్చి “విన్నారా విశేషం? చిట్టీలు వేసే చిట్టెమ్మ అందరి డబ్బులూ కైంకర్యం చేసి, అందరి నెత్తిన శఠగోపం పెట్టి రాత్రికి రాత్రే పరారైందట! తన భర్త వద్దని చెప్పినా వినకుండా, పావని తన దగ్గరున్న సొమ్మంతా చిట్టెమ్మ దగ్గర చిట్టీ వేసింది. అది తెలిసి వాళ్ళాయన పావనికి గట్టిగా అక్షింతలు వేశాడట. పాపం, పావని ఇప్పుడు లబోదిబోమంటోంది” అని చెప్పింది.

అది విన్న కాశీతాత “మన వార్డు మెంబర్ ఈ మధ్యే అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఆయనను కలిసి చెపితే ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో” అన్నాడు.

“తాతయ్యా! అక్షింతలు వేసేది గుడిలో కదా? మరి మునిమామ్మ ఏంటో వింతగా చెబుతోంది?” అని ఆశ్చర్యంగా అడిగింది కాత్యాయని.

తాతయ్య నవ్వుతూ, “తెలుగు భాషలో కొన్ని పదాలకు సందర్భాన్ని బట్టి వేరే అర్థాలు వస్తాయి. అవే జాతీయాలు.

“భలే భలే జాతీయాలు! వాటిగురించి చెప్పవా తాతయ్యా” అని అడిగింది కాత్యాయని.

గుడిలో అక్షింతలు వేయడం అంటే దీవించడం. కానీ బయట ఎవరైనా ఎవరినైనా గట్టిగా అరచి తిట్టినప్పుడు ‘అక్షింతలు వేశారు’ అంటారు.

గుడిలో శఠగోపం పెట్టడం అంటే దేవుని పాదాలు తలమీద ఉంచి ఆశీర్వదించడం. బయట ఎవరైనా ఎవరినైనా తెలివిగా మోసం చేస్తే దానిని ‘శఠగోపం పెట్టారు’ అంటారు.

గుడిలో దేవునికి చేసే సేవ కైంకర్యం.

బయట ఇతరుల వస్తువులను, ఆస్తులను కాజేయడాన్ని లేదా మాయం చేయడాన్ని ‘కైంకర్యం’ అంటారు.

గుడిలో భక్తితో ఆరోగ్యానికి మంచిదని తీర్థం తీసుకుంటాం. వ్యావహారికంలో రాజకీయ నాయకులు పార్టీ మారినప్పుడు వ్యంగ్యంగా ‘ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు’ అంటారు” అని తాతయ్య వివరించాడు.

“భలే భలే గుడిలో అలా…బయట ఇలా..
తాతయ్యా! ఈరోజు సాయంత్రం నేను మీ దగ్గర ఉన్న చాక్లెట్లను కైంకర్యం చేస్తాను, మీరు నాకు అక్షింతలు వేయకండి!” అని నవ్వుతూ చెప్పింది కాత్యాయని.

మనవరాలి సమయస్పూర్తికి మురిసిపోయాడు తాతయ్య.

రచయిత పరిచయం

Kasi Viswanathamనా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి.

కాశీ విశ్వనాథం.

Posted in March 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *