Menu Close
91. ప్రకృతి స్నేహం

పువ్వు పువ్వును
పలకరిస్తున్నది
బురదలో పుట్టిన నాకన్నా...
పేదరికపు బురదలో పుట్టిన
నీ పరిమళమే భలే ఉందని

నిజమే
పేదరికం బంధనం కాదు
పరిమళ బంధం
ఆ సుగంధ చెమటచుక్కలతో
ప్రకృతే స్నేహం చేస్తోంది
ఆ పాదాల దూళిని నెత్తినేసుకుంటూ...

92. ఓ దినసరి కూలీ ఆవేదన

ఔను నిజమే
వలస కూలీల సాక్షిగా
నేను సిగ్గు పడుతున్నా
నా దేశం గొప్పదని చెప్పుకోవడానికి...

ఔను నిజమే
ఈ నాయకుల నాటకాల సాక్షిగా
నేను సిగ్గు పడుతున్నా
నా దేశం గొప్పదని చెప్పుకోవడానికి...

ఔను నిజమే
ఈ విపత్తులో ఉబికిన వెర్రుల సాక్షిగా
నేను సిగ్గు పడుతున్నా
నా దేశం గొప్పదని చెప్పుకోవడానికి...

మీరు మనుషులేనా...?
కేంద్రం ఇవ్వలేదని రాష్ట్రం
రాష్ట్రం తిన్నదని కేంద్రం
కప్ప బెకబెకల రాజకీయ రాబంధుల సాక్షిగా
నేను సిగ్గు పడుతున్నా
నా దేశం గొప్పదని చెప్పుకోవడానికి...
దేశాన్ని నిర్మించే దేహాలకే రక్షణలేని
దేశం నాదని ఎలా చెప్పుకోను...

వలస కూలీలను చీమలను చేసి
పాములై వారి నిర్మిత పుట్టలను దోచుకుని
దేశం గొప్పదని ప్రసంగాలు జేసే మీ దేశభక్తికో నమస్కారం
ప్రాణం కాపాడిన వాడు దేవుడంటారే...
మీ ప్రాణ మాన ధన రక్షణకు భవనమిచ్చిన వాడు
నడిరోడ్డు భిక్షగాడా…

93. మండుతున్న నిజం

వలస కూలీలెప్పుడూ
సమాజమనే జాలి పాడెపై
సజీవ శవాలు...
ఎవడు కాదనగలడు ఈ నిజం..?

మనదంతా పబ్లిసిటీ ఇజం కదా...!

వలసకూలీ వేదనన్నది కాలానికైన గాయం
వర్తమాన భవిష్యత్ గతాలను సైతం వేదిస్తునే ఉంటుంది
నివారణం లేని రోగం ఆకలి కనుక...

94. నీ శ్రమకు పాదాభివందనం

నీ సుఖం చూసి
ఇంద్రుడు ఈర్ష్య పడుతడయ్యా
నీ పదవి తనకులేదని...

నీ కష్టం చూసి
భూమాతా గర్వపడతదయ్యా
నీ పాదం కింద దూళినైయ్యానని...

గాటొచ్చినా..రేటొచ్చినా..
వెగటు చెందక సాగిపోయే...
సగటు రైతు నీ శ్రమకు పాదాభివందనం.

95. అమ్మ పటం

ఉన్నోడింటిలో
గోడకు
వేలాడుతున్న
వాళ్ళమ్మ పటాన్ని
చూసినప్పుడు
అతని మనసు
అయోమయంలోకి
జారుకుంటుంది
మనసులో ఉన్న
తన అమ్మను
గోడమీద వేసే
స్థోమత లేనందుకు
బాధపడాలో
సంతోషపడాలో
తెలియక

96. చావు తేలికైతే బాగుండు

తడిసిన గుండెలో ఉదయించే మొక్కేది
కమ్మేసిన మౌనపు తెర అలికిడి పేరేది
అసలు ఈ అలజడికి అంతమేది
ఆగని అరువులపంతాల ఈ గమనానికి తీరమేది

చుట్టూ జవాబు తెలియని కొడవలి కోతల నాట్యమే
ప్రశాంతతన్నది ప్రాణంలేని ప్రయాణ మార్గమే
గర్భంలో పిండమే బ్రహ్మాండం చేరెనా
ఆ బ్రహ్మరాత చేతలే బ్రతుకు కంచానా వాతలై మిగిలెనా....

ఏమిటి నే చేసిన నేరం
ఎందుకీ నాకే ఇంతటి ఘోరం
ఎంతకీ కనికరించదే... ఆ యముడిచేతి పాశం
ఏమిటో నాలోని దోషం

తడిసిన గుండెలో ఉదయించే మొక్కేది
కమ్మేసిన మౌనపు తెర అలికిడి పేరేది
అసలు ఈ అలజడికి అంతమేది
ఆగని అరువులపంతాల ఈ గమనానికి తీరమేది

ఆశలన్ని ఆవిరాయే
అంతులేని ఆలోచనల అల్లరాయే
ఊపిరేమో భారమాయే
ప్రాణమేమో ఒంటరాయే
ఎడారి సుడిలో దైవంలేని గుడిలా ఎందుకీ ప్రయాణము
ఓ నేలతల్లి తినేయవే నా ప్రాణము

నన్నే నమ్ముకుని నడిచిన కాడెద్దులు సెలవికా
నా చేతిలో…

97. అమ్మే దైవం

అమ్మ కట్టిన చీరే
అర్ధనారీశ్వర తత్వమై
సగము మాన రక్షణకు
సగము బిడ్డ రక్షణకు
ప్రతిజ్ఞ బూని
సంతోషాల ఊయలైంది
కన్నపేగును కష్టపెట్టాలన్న
కలి కోరిక నివ్వెరపోయింది
ఆ కడుపున పుట్టి తరించిన ముత్యం
హాయిగా నిదురపోయింది
అమ్మగా ఆ జన్మ తరించిపోయింది
అమ్మకు మించిన దైవంలేదని తేలిపోతుంది

98. దేశానికి రోగమొచ్చింది

నా దేశానికి కరోనా
రోగమొచ్చింది
ఆ రోగాన్ని తీసే మందు
మనుషుల చేతుల్లోనే ఉంది

కానీ
ఆ మనుషులకే
దేశాన్ని ఆరోగ్య పరచడానికి
చేతులు రావట్లేదు

దేశమేమో
అందరి చేతులను తడిపే స్థితిలో లేదు మరి

కనకే
దేశం
కలకంటూ ఉన్నది
నేను ఎప్పటికైనా ఆరోగ్యవంతమవుతానని
ఆ కల తీరేదెప్పుడో ?

99. పుణ్యముంటుంది

ఓ అక్షరమా
మా నాన్న ప్రభుత్వాన్ని
ముందుకు నడపడానికి
బారుషాపుకెళ్ళాడు
నువ్వైనా ఇటొచ్చి
నాతో స్నేహం చేయరాదూ

ఓ పదమా
మా అమ్మ సంసారాన్ని
ముందుకు నడపడానికి
కూలికెళ్ళింది
నువ్వైనా ఇటొచ్చి
నన్ను పలుకరించరాదూ

ఓ వాక్యమా
నేనేమో తమ్ముడిని చూడడానికి
ఇంటికాడే ఉండిపోయాను
నువ్వైనా వచ్చి
నా రేపటి బ్రతుకు మూటలోకి కాస్తా విద్యను దానం చేసిపోరాదూ
నీకు పుణ్యముంటుంది

100. ఇంకేముందిక్కడా....?
పేదరికం అంటే శాపమా...!
లేనోడిగా ఉండుటే పాపమా...!
ఇది ప్రకృతి ప్రకోపమా...!
శ్రమను భక్షించు నరుడీ నైజమా...!

చరణం

ఒంట నీరు జారుతోంది 
కంటనీరు ఇంకుతోంది 
గుండె బరువు పెరుగుతోంది 
కండ బరువు తరుగుతోంది 
అయినా మా బ్రతుకులో మార్పే లేకపోయే 
ఎప్పుడూ పడమర సూర్యుడిలా మునుగుడాయే
మా పానం అరిగిన ఆశలతో గొణుగుడాయే
                                       పేదరికం..

చద్దిగిన్నె ఖాళాయే
జేబు కూడా ఖాళాయే
చేతి సంచి ఖాళాయే
కడుపు కూడా ఖాళాయే
ఈ ఖాళీల్లో మా బ్రతుకే ఖాళీ అయై కాలీపోతుందేమో...
పనిలేని ఖాళీని పూడ్చలేక 
పస్తుల ఖాళీని తట్టుకోక.....
                                         పేదరికం..

సంతోషపు కూనీ రాగాలే రాలిపోయే
ఆకలి రోగాలే మిగిలిపోయే 
రాళ్ళెత్తే యోగము కాస్తా... 
ఉపవాస యాగముగా మారిపోయే 
ఒకరికొకరు తోడుండామనే భోగము కాస్తా...
వలస బ్రతు…
వంద సమాప్తం...

 

... సమాప్తం ....

Posted in October 2021, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!