జననానికి, మరణానికి మధ్యన ఉన్న నిర్ధిష్టమైన కాలవ్యవధిలో, వివిధ ప్రక్రియల రూపాలలో మనిషి కాలంతో పాటు చేస్తున్న ప్రయాణమే జీవితం అని మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ నిర్ధిష్ట కాల వ్యవధిలో అలుపెరుగక, నిర్విరామంగా, వ్యాకోచ, సంకోచాలతో ప్రాణవాయువును ఉపయోగించి మన శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచి, శరీరంలోని అన్ని భాగాలకు పంపుతూ నిరంతరం ఆరోగ్యాన్ని, అసమాన శక్తిని అందిస్తున్న ఆ చిన్ని గుండె యొక్క ఉనికిని మనలో ఎంతమందిమి గమనిస్తున్నాము. ఆ వ్యాకోచ సంకోచాల ప్రక్రియ ఒక్క నిమిషము ఆగినా మనిషిగా మన ఉనికినే కోల్పోతాము. అయితే నేటి ఆధునిక వైద్య పరిజ్ఞానం యొక్క పుణ్యమా అని ఒక గంట వరకూ గుండె పనిచేయడం ఆగిపోయినా మన మనుగడని పొడిగించవచ్చు అది కూడా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నప్పుడే సాధ్యమౌతుంది. ఆ గుండెకు మనం ఇవ్వవలసిన ఆధారం కేవలం కావలినంత ప్రాణవాయువును అందించి కొవ్వును తన దరికి చేరకుండా చూడడం. ఆ ప్రాణవాయువు పుష్కలంగా లభించాలంటే కర్బన ధూళిని అందించే కాలుష్యాన్ని తగ్గించాలి, ఆక్సిజన్ ను అందించే చెట్లను పోషించాలి. మరి మనం ఆ ప్రాణవాయువు నిచ్చే చెట్లను నరికేస్తున్నాం, కాంక్రీట్ జంగిల్ వంటి జీవన విధానంలో నివసిస్తూ సహజ విధానాలకు స్వస్తి చెప్పి శాస్త్రీయతను వాడి తయారుచేస్తున్న కృత్తిమ విధానాలకు బానిసలమై మన ఆరోగ్యాన్ని చేజేతులా మనమే చెడగొట్టుకుంటూ మానసిక అసంతృప్తితో కాలం వెళ్ళబుచ్చుతూ అందుకు ఇతరులను కారణాలుగా చూపుతూ చేతులు దులుపుకుంటున్నాము. అదేమంటే ఆధునికత, నాగరికత అని సర్ది చెప్పుకుంటున్నాము. మనకు లభించిన సుఖంతో హాయిగా జీవించడం అలవర్చుకుంటే ఎటువంటి మానసిక ఒడిదుడుకులు ఏర్పడవు. మన శక్తిని మించి సాధించాలని ఆరాటపడితే, అదృష్టం అనుకూలించకపోతే అందులో విఫలం కావచ్చు. అందుకు గల కారణాలను, మన సామర్ధ్యాన్ని బేరీజు వేసుకుని తద్వారా ఒక అవగాహనకు వస్తే బాగుంటుంది. అంతేగానీ అందుకు కృంగిపోయి అందరినీ నిందిస్తూ వుంటే దాని ప్రభావం మన మీదనే ఉంటుంది.
అనువుగాని చోట అధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువకాదు
కొండ అద్దమందు కొంచెమై ఉండదా
విశ్వదాభిరామ వినురవేమ
చిన్నప్పుడు చదువుకున్న ఈ పద్యం ఎందుకో గుర్తుకువచ్చింది. ఆ మహానుభావుడు వేమన ఎంత వాస్తవాన్ని బోధించాడు. ఇప్పుడు అనుభవం మీద ఆ విషయాన్ని అర్థం చేసుకుంటున్నాము.
గాలి బుడగకు ఒక స్థిరమైన వ్యాకోచ సామర్ధ్యం ఉంటుంది. అది ఆ బుడగను తయారుచేసే పరిమాణానికి తగినట్లు నిర్ణయించబడుతుంది. ఆ వ్యాకోచ సామర్ధ్యానికి మించి అధికమోతాదులో గాలిని నింపితే ఏమౌతుంది, పేలిపోతుంది. అలాగే ఈ ప్రపంచంలోని ప్రతి పదార్థానికి ఒక నిర్ధిష్టమైన సామర్ధ్యం ఉంటుంది. ఆ సామర్ధ్య పరిధిని మనం గుర్తించి తదనుగుణంగా వాడుకుంటే అది చక్కగా పనిచేస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఆ పదార్ధం మన శరీరంలోని మెదడు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె కూడా కావచ్చు. ‘మెదడుకు మేత’ అంటూ ఏవైనా challenges ను తీసుకుని వాటిని సాధించుటకు ప్రయత్నించడం అనేది నిజంగా గొప్ప విషయమే. ఆ విధంగా మన బుర్రను నిరంతరం active గా ఉంచవచ్చు. అయితే, ఇతరులతో పోల్చుకుని తను కూడా అలాగే ఉండాలనే విభిన్న ప్రక్రియలకు శ్రీకారం చుడితే, మన యొక్క సామర్ధ్యం ఏమిటి అనే విచక్షణ కోల్పోయినప్పుడే అనవసరమైన చికాకులు వస్తున్నాయి. ఆ విషయం అర్థమయ్యే లోపునే జరగవలసిన అనర్ధం జరిగిపోతున్నది.
మనం కొనసాగించే జీవన విధానం నిరంతరం మార్పులు చెందుతూ అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. అందుకు తగినట్లుగానే మన అలవాట్లను కూడా మార్చుకుంటూ కాలంతో పాటు, సంఘజీవిగా మన ఆలోచనలను మార్చుకుంటూ, సరిక్రొత్త అలవాట్లను చేసుకుని ముందుకు సాగుతున్నాము. అయితే, మనం వదిలేస్తున్న విధానాలలో ఎన్నో మంచి ప్రక్రియలు అన్నివేళలా ఉపయోగపడే విధంగా ఉంటున్నాయి. వాటిని గుర్తించి, మరిచిపోకుండా పాటిస్తూ ఉన్నప్పుడు మన ప్రమేయం లేకుండానే మనం అందమైన, హాయినిగోలిపే జీవితాన్ని అనుభవించగలం. ఆ విధానాలనే మనం సంస్కృతీ, సంప్రదాయాలని చెప్పుకోవచ్చు.
‘సర్వే జనః సుఖినోభవంతు’