మన శరీర నిర్మాణం అంతా జీవ కణాల సముదాయమే. మన దేహంలోని జన్యుకణాల సంఖ్య వంద కోట్లకు పైమాటే ఉంటుంది. ఈ జన్యుకణాలు జంట కట్టడం ద్వారానే మనిషి జన్యురాశి నిర్మాణం జరుగుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్యన DNA దాదాపు అంటే 99.6 శాతం ఒకే విధంగా ఉంటుంది. ఆ మిగిలిన 0.4 శాతమే మనుషుల మధ్యన ఇన్ని అంతరాలను, వ్యక్తిత్వాలను చూపుతున్నది. తదనుగుణంగా మన ఆలోచనలలో తేడాలు కనపడుతున్నాయి.
తరాలు మారుతుంటే అంతరాలు పెరుగుతూ వస్తున్నాయి. అందుకు కారణాలు అనేకం. అందులో ముఖ్యమైనది సామాజిక జీవన ప్రమాణాలు. మన తల్లితండ్రులు చిన్నప్పుడు మనలను సరైన మార్గంలో పెంచేందుకు పడిన కష్టాలు, మనం మన పిల్లలను పెంచేందుకు పడిన కష్టాలు బేరీజు వేసుకుంటే, మనం ఒక విధంగా సుఖమయ జీవితాలను అనుభవిస్తున్నామనే భావన కలుగుతుంది. అయితే ఆ తరం వారికి ఉండిన ఓపిక, సహనం, స్థిరమైన ఆలోచన విధానం మన తరం వారికి అంతగా లేదనే చెప్పాలి. కారణం సామాజిక పరిస్థితులు, నేను, నాది, మాది అనే స్వార్థపూరిత ఆలోచనలు. మరి రేపు, మన తరువాతి తరం, వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగుగా ఉన్నప్పుడు వారికి కష్టపడే మనస్తత్వం ఎలా కలుగుతుంది. ఆ సహనం, ఓపిక ఎందుకుంటుంది. అదే మానవ సంబంధాల మధ్యన అంతరం ఏర్పడేందుకు అవకాశం కల్పిస్తున్నది. మన జీవన శైలి అంతా కూడా సాపేక్ష సిద్ధాంతంతో ముడిపడి ఉంది. ప్రతిదానికి ఒక reference పాయింట్ ఉంటుంది. మరి ఏది సరైనది అనే నిర్ణయంలో ఎవరికి అనుగుణంగా వారు మార్పులు, చేర్పులు చేసుకుంటూ జీవితాన్ని తమ ఆలోచనలకు అనుగుణంగా మార్చుకొని స్వార్థ చింతనకు లోనై జీవితాలను గడుపుతున్నారు. మరి వారి జీవన విధానం వారికి మాత్రమే సుఖాన్ని ఇస్తే సరిపోదు. మనిషి సంఘజీవి. మరి ఈ సంఘంలో ఉన్న తోటి మనుషులు కూడా తమలాగే సుఖంగా ఉండాలనే ఆలోచన మనలో సదా ఉండాలి. అందుకు అనుగుణంగా మన జీవనశైలి ఉండేవిధంగా అవసరమైన మార్పులు చేసుకోవలసిన అగత్యం ఎంతైనా ఉంది. ‘అందరూ బాగుండాలి అందులో మనమూ ఉండాలి’ అనే సిద్ధాంతం మనందరిలోనూ కలగాలి. అదే సర్వజన సమ్మతము. నీ జీవన ప్రమాణాలు, ప్రామాణికాలకు అనుగుణంగా నీ జీవితాన్ని నీకు నచ్చినట్టు మలుచుకొని అదే సరైనది అందరూ అలాగే ఉండాలనుకోవడం ఒక అపోహ మాత్రమే. నీవు పదిమందికి మార్గాదర్శకంగా ఉండాలంటే నీ చేతలలో స్థిరమైన విధానం ఉండాలి. అందరితో నీవు మాట్లాడే విధానం ఒకే విధంగా ఉండాలి. నీవాళ్ళు అనుకున్న వారితో ఒక విధంగా వేరే వారితో మరో విధమైన సూత్రాలను చెప్పకూడదు.
“కూపస్థమండూకము” అనే సామెత మనకందరికీ సుపరిచితం. బాల్యంలో మనం పెరిగే వాతావరణం, పరిసరాల ప్రభావం మన ఆలోచనల విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ ఆలోచనల పరిధి వయసుతో పాటు పెరగాలంటే అందుకు సామాజిక స్పృహ అనేది ఎంతో అవసరం. పదిమందితో కలిసి నడిచి, సంఘంలో మన వంతు పాత్రను పోషించినప్పుడే ఆ స్పృహ స్వానుభవంతో కలిగి మన ఆలోచనల ప్రవాహం విశాలమై మనకే ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. మన ఆలోచనా పరిధిని పెంచుకోకపోతే మన ప్రవర్తన అంతా బావిలో కప్ప వలే కొంతవరకే పరిమితమై అదే నిజం, మనం అనుసరిస్తున్నదే సరైన మార్గం అనే భావనలో ఉంటాం. మన జీవితం అంతా ఒక అనుభవపూర్వక ఆత్మ పరిజ్ఞానం. ప్రతి వ్యక్తిలో ఎన్నో మంచి విషయాలు, ధర్మాలు దాగుంటాయి. అసలు మంచి చెడు అనే పదాలు సమాజంలో పది మందితో కలిసి ధర్మబద్ధంగా నడవడానికి మనం సృష్టించుకొన్న సూత్రాలు. చిన్న వయసులోనే మంచి సూత్రాలను అలవరుచుకొంటే పెద్దయినాక అవే అలవాట్లు మన జీవితంలో భాగమౌతాయి. ఒక వయసు వచ్చిన తరువాత మంచి లక్షణాలను అలవరచుకోవాలంటే అంత సులభం కాదు. కారణం మన మనస్సును కష్టపెడుతూ మన mindset ను మార్చకోవడం అంత సులభం కాదు. అందుకే వృద్ధాప్యంలో పెద్దవారి అలవాట్లను అంత సులువుగా మార్చలేము.
‘సర్వే జనః సుఖినోభవంతు’