ఆరోగ్యమే మహా భాగ్యం – ఆరోగ్యంగా ఉంటేనే మన సంకల్పాలను సిద్ధించుకునే దిశలో పయనించగలము. అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం - ఆరోగ్యం అంటే -శారీరక, మానసిక, సామాజిక సంక్షేమం.
మరి నేడు మన ఆరోగ్యాన్ని హరించి మనకు ఆనారోగ్యం కలిగించి, అన్ని విధాల మన జీవన విధానాలను కట్టడి చేస్తున్న ఒక విష ‘క్రిమి కాని క్రిమి’ ప్రభావం యావత్ ప్రపంచానికి సంక్రమించింది. క్రిమి కాని క్రిమి అని ఎందుకన్నానంటే అది నిజంగా జీవముండి తనంతట తానే ఎదిగే సామర్ధ్యం ఉన్నది కాదు. మన శరీరం లోకి ప్రవేశించి మన జీవకణాలను తన ఆధీనంలోకి తెచ్చుకొని వాటిని తనకనుగుణంగా మార్పులు చేసి పెంచి, ముఖ్యంగా మన ఊపిరితిత్తులను ఆక్రమించి శ్వాసప్రక్రియను నిర్వీర్యం చేస్తూ తద్వారా మన మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. అంతేకాదు ఒక దేహం నుండి మరో దేహానికి సులువుగా అంటువ్యాధి లాగా వెళుతుంది. ఈ విష క్రిమి ఈ మధ్యనే అవతరించింది కనుక దానిని నియంత్రించే వైద్య విధానాలు ఇంకా కనుగొనలేదు.
అయితే ఎటువంటి విష క్రిములనైనా నియంత్రిచగలిగిన అస్త్రం అతి సహజంగానే మన శరీరంలో ఉంది. అదే నేను ఈ శీర్షిక వ్రాయడం మొదలుపెట్టిన నాటినుండి చెబుతున్న ‘రోగనిరోధక శక్తి’. అది నిజంగా బ్రహ్మాస్త్రం వంటిది. మన ఇమ్మ్యూనిటి స్ట్రెంగ్త్ ను పెంచుకునే అవకాశం మన జీవన విధానంలో అనుసరించే పద్ధతుల మీద ఆధారపడి ఉంది. నాకు డబ్బు, హోదా ఉంది నేనెందుకు పనిచేయాలి అనే భావన వీడి, గాంధీజీ సూత్రాలను పాటిస్తూ, మన పని మనం చేసుకుంటుంటే మన ఇల్లు మనమే శుభ్రంగా ఉంచుకొంటూ, సరైన గాలీ వెలుతురూ వచ్చే విధంగా వస్తువులను అమర్చుకొంటూ, ఒక విధమైన పౌష్టికాహారానికి అలవాటుపడి మన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. అప్పుడే మన రోగనిరోధక సాంద్రత పెరుగుతుంది. ముఖ్యంగా మానసిక ఆందోళన తగ్గించుకొని ఆనందకరమైన ఆలోచనలను పెంచుకోవాలి. అది చెప్పినంత సులభం కాదు. ఎందుకంటే మనం సాధారణ మనుషులం. ప్రతిదీ మన పక్కన ఉండే వారిని పోల్చుకొని బతుకుతాం. కానీ ప్రయత్నించాలి. ఎప్పుడూ సాపేక్ష సిద్ధాంతాన్ని అనుసరిస్తుంటాం. మనకన్నా పెద్ద దానిని పోల్చుకొని అది మంచో చెడో కూడా గమనించం. అంతెందుకు ఇప్పుడు కూడా ఈ కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితమై మనలను నిత్యం ఇబ్బందిపెట్టె రుగ్మతలను పూర్తిగా మరిచిపోయి డాక్టర్ వద్దకు వెళ్ళడానికి సుముఖంగా లేము. అందుకనే రోజూ మనం వినే అంబులన్స్ అరుపులు నేడు దాదాపు లేవు. మన మనస్సులో ఉన్నదల్లా ఒకటే, జాగ్రత్తగా ఉండాలి, ఆ మహమ్మారిని మన దగ్గరికి రానీయకూడదు.
ఇప్పుడు నాకు చరిత్రను తిరగేసే ఆలోచన వచ్చింది. రాతియుగం నాటినుండి నేటి ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వరకూ మనిషి జీవన విధానాలను పరిశీలిస్తే,
మొదట్లో భుజబలం ఎక్కువగా వాడి, బుద్ధిబలం తక్కువగా ఉండేది. సంప్రదాయ పద్ధతులను అనుసరించేవారు. క్రమేపి యాంత్రిక విప్లవంలో భుజబలానికి బుద్ధిబలం తోడై రెండూ సమానంగా ఉపయోగించేవారు. తరువాత మనిషి సుఖానికి, సౌకర్యాలకు అలవాటుపడి మరింతగా బుద్ధిబలాన్ని వినియోగించడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. తద్వారా మనిషి ఆయుష్ పరిమాణం కూడా పెరిగింది. కానీ, రోగ నిరోధక సాంద్రత తగ్గింది. నొప్పిని భరించే ఓపిక, సహనం కోల్పోయాము. సామాజిక మార్పులు మనలను, మన ఆలోచనల్ని మార్చేశాయి. ఆ తరువాత analog తరువాత digital technology వచ్చి మనకు బుద్ధిబలం యొక్క వాడకం పెరిగి, భుజబలాన్ని వాడటం మానివేసి సుఖాలను, సౌకర్యవంతమైన విలాసాలకు అలవాటు పడిపోయాము. ఇక ఇప్పుడు మనం చేసే పనులన్నింటినీ చేసే విధంగా మర మనుషులను కూడా నిర్మించగలుతున్నాం. ఇంక పూర్తిగా సాధించనిది రంగు, రుచి, వాసన గుర్తించగలిగిన ఇంద్రియాలను కలిగిన యంత్రం. అది కూడా సెన్సార్స్ ద్వారా సాధించగలిగితే ఇక మనిషికి, మనిషితో, ప్రకృతితో ఇతర జీవరాసులతో పనిలేదు. తను, తన మర మనిషి. అప్పుడు అంటువ్యాధులు కూడా ప్రబలవు. చూద్దాం. భవిష్యత్తు ఎలా వుంటుందో. ఆ మార్పును నేను వ్యక్తిగతంగా కోరను. అయితే ప్రస్తుత వైరస్ నిర్మూలనకు, దాని బారిన పడిన మనుషులకు మర మనుషులే మంచి డాక్టర్లు ఎందుకంటే వారి ప్రాణాలను పణంగా పెట్టి సేవను అందించే అగత్యం ఏర్పడదు.
‘సర్వే జనః సుఖినోభవంతు’
బాగా
విశ్లేషణ చేసారు.
ఇది అందరికీ అవసరమైన
అంశమే సుమండీ…
కృతజ్ఞతలు/ శుభాకాంక్షలు/అభినందనలు మీ కు.