సమస్యలు అనేవి మన జీవితాలలో ఒక భాగమే. మొదటగా మనం గమనిచాల్సింది ఆ సమస్య ఏ పరిమాణంలో మనం గుర్తించామనేది. కొంతమంది ఎంత పెద్ద ఇబ్బంది లేక కష్టము వచ్చినను పెద్దగా చలించరు. అదే మరి కొంతమంది (ఎక్కువ శాతం) అతి చిన్న సమస్యను కూడా భూతద్దంలో చూసి ఆందోళన పడుతుంటారు. అయితే ఆ సమస్యకు పరిష్కారం వెతుకులాడే పనిలో మనం చేస్తున్న అతి చిన్న తప్పిదం మన జీవన పంథానే మారుస్తుంది. అందుకే కొంచెం తెలివిగా, మనసుని స్థిరం చేసుకొని, మన ఆలోచనలను నియంత్రిచుకొని, సహనంతో ఆలోచిస్తే సమస్య దానంతట అదే తొలగిపోతుంది. జీవితంలో సర్దుకుపోవడం అనేది కూడా అందులో భాగమే.
సమస్య కలిగినప్పుడు మనం పొందే ఆందోళన, ఆత్రుత మన బుర్రను పూర్తిగా కట్టడి చేస్తుంది. అందుకనే ముందుగా మన సబ్ కాన్షస్ మైండ్ ను మనం నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. అందుకు సామాజిక స్పృహ, మనలాగే ఆలోచించే మంచి స్నేహితులు, కుటుంబ సభ్యులు మనతో ఉండాలి. నేటి సమాజంలో లోపిస్తున్నది అదే. జగమంత కుటుంబం, ఏకాకి జీవితం అని సిరివెన్నెల గారు అన్నట్టు, ప్రపంచంలో ఏ మూల ఉన్న వారినైనను పలుకరించగలుగుతున్నాం కానీ సొంత మనుషులతో కూర్చుని కొన్ని నిమిషాలు ప్రత్యక్షంగా మాట్లాడలేక పోతున్నాం.
మనం బతుకుతున్నది ‘థియరీ అఫ్ రెలటివిటి (Theory of Relativity)’ అనే సాపేక్ష సిద్ధాంత ప్రపంచంలో. అంటే,
ఒక విషయాన్ని వేరే విషయంతో పోల్చుకొని మన స్థాయిని, తెలివిని నిర్ధారించుకోవడం. మరి ఆ విషయంలో కొంచెం జాగురూకతతో వ్యవహరించి మన మెదడు లోని ఆలోచనల ఒరవడిని మనకు అనుగుణంగా మార్చుకొంటే ఆ సమస్య సగం చిన్నదైపోతుంది. అట్లని పట్టించుకోకుండా వదిలేయమని అర్థం కాదు. సమస్యను ముందు చిన్నదిగా చేసి లేక ముక్కలుగా విడగొట్టి ఆ తరువాత ప్రాముఖ్యత ఆధారంగా (priority basis)పరిష్కరించుకొంటే అంతా సులువుగానే ఉంటుంది. అయితే అందుకు కొంచెం సర్దుకుపోయే తత్త్వం ఉండాలి. ఎల్లవేళలా అంతా మనకు అనుకూలంగానే ఉండాలని అనుకోకుండా పరిస్థితులకు తలవొగ్గి కార్యం సాధించుకోవాలి. అందుకు మానసిక పరిణతి అవసరం. అంతేగానీ అంతిమ నిర్ణయం హడావిడిగా తీసుకొంటే, అదే సరైన నిర్ణయం అనుకొంటే తప్పు. కొన్నిసార్లు మన ప్రక్కన ఉన్న శ్రేయోభిలాషుల సలహా వినడం మంచిది. వారు చిన్నవారైనా మంచి ఆలోచనలతో మనకు ఉపయోగపడవచ్చు.
ప్రస్తుత సమాజపోకడ ఎట్లుందంటే
నైతిక విలువలు తరిగి
వలువలు తరిగి
వావి వరుసల బంధాలు తరిగి
రోగనిరోధక సాంద్రత తరిగి....
గురువును మరిచి
తరువును మరిచి
తల్లిదండ్రులను మరిచి...
సిరిసంపదలు పెరిగి
రుగ్మతలు పెరిగి
స్వార్థచింతన పెరిగి
ఆధునిక పరిజ్ఞాన పరిధులు పెరిగి ....
ఇక మనిషి ప్రవర్తన చూస్తే –
సంపాదన తప్ప సమస్యలు ఆలోచించరు
తిండి ఉంటుంది కానీ తీరిక ఉండదు
మనీ ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు
దేనికోసమో తెలియని తపన, ఆరాటం
ఏదో విధంగా తనను అందరూ గుర్తించాలనే ఆదుర్దా
యాంత్రిక జీవనం, ఆర్టిఫిషియల్ అనురాగం....
మనిషికి సహజ ప్రాణవాయువు ఎంతో ముఖ్యం.
కానీ మనకు తెలియకుండానే కృత్రిమ వాయువులను పీలుస్తూ బతుకుతున్నాం
అనుభవిస్తున్నాం అవి కురిపిస్తూ కట్టడి చేసే కలుషిత కారుణ్యాన్ని.
చివరకు మనకు తెలిసింది ఏమిటంటే మానసిక ప్రశాంతతకు మించిన మందు లేదు. నేను, నాది అని కాకుండా మనం, మనది అని మందితో కలిసి నడుద్దాం. మనం కూడా ఆరోగ్యంగా ఉందాం.
జీవితం పట్ల చక్కటి అవగాహన పెంచే మంచి ఆర్టికల్ చదివామన్న తృప్తి కలిగింది. ఆరోగ్య పరిరక్షణకు ఆహారం తో పాటు జీవనవిధానం పట్ల సరైన దృక్పథం కూడా అవసరమని తెలియజేసిన మీకు మనఃపూర్వక ధన్యవాదాలు.
చాలా చాలా బాగా చెప్పారు. కృతజ్ఞతలు 🙏🙏