పంచతంత్రం కథలు
- దినవహి సత్యవతి
నేతగాడు – యక్షుడు
అనగనగా ఒక పట్టణంలో ఒక నేతగాడు (Weaver) నివసిస్తుండేవాడు. మగ్గం (Hand Weaving Machine) పై బట్టలు నేసి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవితం గడుపుకునేవాడు.
ఒకనాడు పనిచేస్తుండగా మగ్గానికి అవసరమైన చెక్క పనిముట్లు (Wooden Accessories) విరిగి పోయాయి. అవి తిరిగి చెయ్యాలంటే చెక్క అవసరం. అందుచేత చెట్టును కొట్టి చెక్క తెచ్చుకుందామని గొడ్డలి తీసుకుని దగ్గరలోనే ఉన్న అడవికి వెళ్ళాడు నేతగాడు.
అడవిలో తన పనిముట్లుచేయడానికి పనికి వచ్చే చెట్టుకోసం చూస్తుండగా కొంచెం దూరంలో ఒక ధృఢమైన మాను కలిగిన చెట్టు ఒకటి కనిపించింది.
‘ఆహా! ఈ చెట్టు నా పనిముట్లు చేసుకోవడానికి బాగా సరిపోతుంది’ అనుకుని ఆ చెట్టును కొడదామని గొడ్డలి ఎత్తాడు.
ఆ చెట్టు మీద ఎంతో కాలంగా సుఖంగా నివసిస్తున్న ఒక యక్షుడు, నేతగాడు చెట్టును నరకబోతుండగా ‘ఆగు మిత్రమా ఆగు’ అంటూ ప్రత్యక్షమయ్యాడు.
యక్షుడిని చూసి ముందు నివ్వెరబోయినా ‘అదెలా కుదురుతుంది? నాకు ఈ చెట్టును కొట్టగా వచ్చిన చెక్క ఎంతో అవసరం. ఇది లేకపోతే నా మగ్గానికి కావలసిన పనిముట్లు తయారు చేసుకోలేను. అవి లేకపోతే నా మగ్గం పని చేయదు. మగ్గం లేకపోతే నేను బట్టలు నేయలేను. బట్టలు నేసి అమ్మితే వచ్చే పైకం తోనే నాకు నా కుటుంబానికి తిండి వస్తుంది లేకపోతే మేమంతా పస్తులు ఉండాల్సిందే’ అన్నాడు నేతగాడు.
‘మిత్రమా నీ బాధ నాకు అర్థమయింది. ఎప్పటినుండో నేను ఇక్కడ నివసిస్తున్నాను. ఈ చెట్టును ఇప్పుడు నువ్వు నరికితే నాకు చక్కటి నివాసం పోతుంది. కనుక దీనికి బదులుగా నీకేదైనా వరం ఇస్తాను కోరుకో’’ అన్నాడు యక్షుడు.
‘అయితే సరే. నేను ఇంటికి వెళ్ళి నా భార్యను, మిత్రుడినీ అడిగి వస్తాను’ అన్నాడు నేతగాడు.
‘సరే అలాగే అడిగిరా’ అని యక్షుడు మాయమయ్యాడు.
నేతగాడు ముందుగా మిత్రుడి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి సలహా అడిగాడు.
‘అయితే యక్షుడిని నువ్వు ఒక రాజ్యానికి రాజు కావాలని కోరుకో. నేను నీ మంత్రిగా ఉంటాను. ఇద్దరం కలిసి రాజ్యమేలవచ్చు. అన్ని సుఖాలూ అనుభవించవచ్చు’ అన్నాడు మిత్రుడు.
‘నువ్వు చెప్పిన సలహా బాగుంది. ఇంటికి వెళ్ళి నా భార్యను కూడా ఒకసారి అడుగుతాను‘ అన్నాడు.
నేతగాడి భార్య తెలివి తక్కువది అని మిత్రుడు వద్దని వారించినా ‘నేను నా భార్యకి చెప్పకుండా ఏమీ చేయను. ఆమెను అడగాల్సిందే ‘ అని ఇంటికి వెళ్ళి భార్యతో జరిగిన విషయం, మిత్రుడి సలహా అంతా చెప్పాడు.
‘నీ మిత్రుడి సలహా అఘోరించినట్లే ఉంది. ఆ రాజ్యాలూ అవీ మనకి వద్దు. నువ్వు ఇప్పుడు రెండు చేతులు ఉపయోగించి ఒక తలతో ఆలోచంచి బట్టలు నేస్తున్నావు కదా! అదే కనుక నీకు ఇంకో రెండు చేతులూ మరొక తల ఉంటే ఇంకా చక్కగా ఆలోచించి ఇంకా ఎక్కువ బట్టలు నేయవచ్చు. అందుచేత నీకు మరో రెండు చేతులూ మరొక తల ఇవ్వమని యక్షుడిని అడుగు’ అంది నేతగాడి భార్య.
భార్య సలహా ఎంతో బాగుందనిపించిన నేతగాడు మళ్ళీ అడవికి వెళ్ళి యక్షుడిని ఆ విధంగానే వరం కోరాడు.
యక్షుడు వరం ప్రసాదించగానే నేతగాడికి ఇంకో రెండు చేతులూ ఇంకొక తల వచ్చాయి శరీరంలో.
అలా నాలుగు చేతులూ రెండు తలలతో తిరిగి పట్టణంలో అడుగు పెట్టిన నేతగాడిని చూసి జనమంతా ‘ఇదేదో వింత జంతువు వచ్చింది' అని భయపడి రాళ్ళతో కొట్టారు. రాళ్ళ దెబ్బలను తట్టుకోలేక నేలకి ఒరిగి ప్రాణాలు కోల్పోయాడు నేతగాడు.