Menu Close
నీలి జాకట్టు
-- డా.వి.వి.బి.రామారావు

డాక్టర్ కరుణాకర రావు కన్సల్టింగ్ రూమ్ ముందర హాలులో సంగమేశం చాలా బిజీగా ఉన్నాడు. సంగమేశం వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ పేర్లు చిన్న కాగితాల మీద రాసుకొని వాళ్ళ దగ్గర కన్సల్టింగ్ ఫీజ్ వసూలు చేసి నంబర్లు ఇస్తున్నాడు. కరుణాకర రావు లోపల గదిలో కూర్చొని ఒక్కొక్క నెంబర్ పిలిచి పేషెంట్ కి పరీక్ష చేసి మందు రాసి ఇస్తే పక్క గదిలో కాపౌండర్ డబ్బు తీసుకొని మందులు కలిపి ఇస్తున్నాడు. ఆస్పత్రి అంతా హడావిడిగా ఉంది. ఆస్పత్రి ముందు ఒక కారు ఆగింది. లోపలికి భారంగా నడుస్తూ సేఠ్ రామదాస్ ప్రవేశించే సరికి సంగమేశం అర్జంటుగా ఆయనికి ఆహ్వానం చెప్పి సరాసరి డాక్టర్ గారి గదిలోకి తీసుకెళ్ళాడు. డాక్టర్ గారు ఒక పేషెంట్ కడుపు నొప్పి బాధ వినడం సగంలో ఆపి సేఠ్ జీని కూర్చోమని మర్యాద చేశాడు.

“ఆఁ నొప్పి ఎక్కడ?”

“ఇక్కడ సార్! లోపల నుంచి గునపంతో పొడిచినట్లు వస్తుంది”

“ఇంకా?”

“చెవి పోటు, కాళ్ళు మంటలు, నాలిక ఎండడం”

“ఇంకా”

“ఒళ్ళు పీకులు, గుండెదడ”

డాక్టర్ కి నవ్వు వచ్చింది. సిమ్ టమ్స్ ఒకదాని కొకటి కనెక్ట్ కావడం లేదు. వెంటనే అన్నాడు. “సరే నేను మందు ఇస్తాను. రెండు రోజులాగి మళ్ళీ రండి.” గబగబా ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చి “పక్క గదిలో కంపౌండర్ మందిస్తాడు. మూడవరోజున రండి. మందు రెండు పూటలా భోజనానికి ముందు ఒక మోతాదు తాగండి. పులుపు, కారం తగ్గించండి” అని చెప్పి “సంగమేశం” అని పిలిచాడు కరుణాకరం. సంగమేశం తొందర తొందరగా లోపలికి వచ్చాడు.

“ఈ కడుపునొప్పి పేషెంట్ దగ్గర కన్సల్టేషన్ తీసుకున్నావా?”

“తీసుకున్నాను సార్”

“నీకెన్ని సార్లు చెప్పాను? బీదవాళ్ళను బాధించవద్దని. పాపం అతను మన వెనక వీధిలో ఎలిమెంటరీ స్కూల్ టీచరు. ఇక మీదట అలాంటి వాళ్ళని ఖండించి మాత్రం డబ్బు పుచ్చుకోకు. వెళ్ళు.. సారీ సేఠ్ జీ! మీరెందుకు వచ్చారు?మీకు రెస్ట్ కావాలని చెప్పాను కదా! ఫోన్ చేస్తే ఏ సాయంకాలమో నేనే వచ్చేవాడ్నికదా!”

“లేదు డాక్టర్, మీ నాన్న సంజీవ్ గారంటూవుండేవారు. ముసలి కాలంలో చావు భయం ఎక్కువౌతుందని. మళ్ళీ మళ్ళీ చిన్న వాళ్ళతో కలిసి మాట్లాడుతూ ఉంటె కొంచెం కొంచెం తాకత్ కలుగుతుందని!”

డాక్టర్ నవ్వుతూ సిస్టర్ అని పిలిచేసరికి అహల్య వచ్చింది.

“బ్లడ్ ప్రెషర్ కట్టు” మెర్క్యూరీ కాలం జాగ్రత్తగా చూసి “మరేం పెద్ద తేడా ఏమి లేదు. జాగ్రత్తగా ఉంటున్నారు. కొత్త మందులు ఏవీ అక్కరలేదు. పాతవే కంటిన్యూ చెయ్యండి” అన్నాడు కరుణాకరం.

సేఠ్ జీ వచ్చి ఒక పచ్చ కాగితం టేబుల్ మీద పెట్టాడు.

“థాంక్స్!” అన్నాడు కరుణాకరం డ్రాయరులో నోటు పడేస్తూ,

“డాక్టర్?” అన్నాడు సేఠ్ జీ

“చెప్పండి”.

“ఏం లేదు. ఈ రోజు ఏమిటో జ్ఞాపకాలు వస్తున్నాయి. పదేళ్ళ క్రితం ఇలాగే చెకప్ కి నాన్నగారి దగ్గరకు వచ్చాను. ఒక పల్లెటూరు వాడు క్షయ జబ్బుతో అనుకుంటాను. బాగా భయంకరంగా ఉన్నాడు. పాతికేళ్ళు కూడా ఉండవు. అది పదినిమిషాల క్రితం మీరు సంగమేశాన్ని కేక లేసినట్లే ఆయనా కేక లేశాడు ధర్మాత్ముడు. వేలాది బీద ప్రజలకి వైద్య దానం చేసిన పుణ్యాత్ముడు” అని మార్వాడి నిట్టూర్చాడు.

మార్వాడీకి ధర్మచింతన చాలా ఎక్కువైనందుకు కరుణాకరం చిరునవ్వు నవ్వుతున్నాడు. సేఠ్ జీ ని చూస్తే కరుణాకరానికి జాలి. చావంటే వీళ్ళకెందుకింత భయం? అతనికి తాను చేసినది ప్రత్యేకం ఏమీ లేకపోయినా వచ్చినప్పుడల్లా వంద ఇస్తాడు. నాన్నగారి సంగతులెత్తి గంటసేపు కాలక్షేపం చేస్తాడు. అవతల పేషెంట్ ల రద్దీ ఎక్కువగా ఉంది.

“అయితే సేఠ్ జీ ఋషీకేశ్ కి ప్రయాణం ఎప్పుడు?” అడిగాడు కరుణాకరం. అతనికి తెలుసు. ఆ మాట ఎత్తితే సేఠ్ జీ వెంటనే సెలవు తీసుకుంటాడని వాళ్ళ నాన్న గారు చెప్పిన ట్రేడ్ సీక్రెట్ అది. ఈ ముసలాడు చివరి రోజుల్లో ఋషీకేశ్ పోయి యాత్రికుల సేవలలో కళ్ళు మూసుకొందామని కనీసం పదేహేనేండ్ల నుండి అనుకుంటున్నాడు. ఋషీకేశ్ వెళతాడని మాత్రం కరుణాకరానికి నమ్మకం లేదు.

“సార్!”

సంగమేశం లోపలి వచ్చాడు. “ఫ్రాక్చర్ కేసు సార్!” సేఠ్ జీ సెలవు తీసుకున్నాడు. ఆయనతో పాటు కరుణాకరం కూడా హాలులోకి వచ్చాడు. ఒక చిన్న పిల్ల కాలు విరిగింది. “ఎక్స్ రే తీయాలి ఆ అమ్మాయిని జాగ్రత్తగా ఎత్తుకొని విరిగిన కాలెక్కడా కదలకుండా ఆ గదిలోనికి తీసుకెళ్ళండి” అన్నాడు కరుణాకరం.

టెక్నీషియన్ వెనకాల ఆ పిల్ల తండ్రి పిల్లను ఎత్తుకొని బయలుదేరాడు. ఇంతలో “నమస్కారం డాక్టరు గారు!” ఒక పాతికేళ్ళ అమ్మాయి హాలులోకి వచ్చింది. డాక్టర్ తిరిగి చూసి “రామ్మా! రా హలో! ఎప్పుడు రాక!” అంటూ ఆమెను కన్సల్టింగ్ రూము లోకి తీసుకెళ్ళాడు.

లోపల “సిస్టర్! పుట్ హర్ ఆన్ ఎ సెడటివ్. గెట్ మీ ఫోర్ ఇంచ్ జిప్సోనా బాన్డేజ్ ఫర్ ది కాస్ట్....ఏం భయం లేదు లాయరు గారు! పాపకిపుడు కట్టుకట్టి ఆరు వారాల తరువాత తీసేస్తాం.”

“ఏదో డాక్టర్ గారు మీ దయ. ఆడపిల్ల అవిటిదైతే జీవితాంతం బాధపడుతుంది.”

“అదేం భయం లేదండీ! ఈ మాత్రం ఫ్రాక్చర్ కే దిగులెందుకు?”

“చాలా బిజీ గా ఉన్నట్టున్నారు” అంది తాయారు.

“ఆ ఎప్పుడూ బిజీనేలే.”

“ఏమిటి విశేషం? ఎప్పుడు వస్త?”

“నిన్ననే. యునివర్సిటీలో సమ్మర్ ఇన్స్టిట్యూట్ కి వచ్చాను”

“ఎక్కడ ఉంటున్నావు?”

“ఉమెన్స్ హాస్టల్ లో”

“సరే మీదికి పద. ఇవ్వాల్టికి ఇక్కడే ఉందువుగాని. రేపు ప్రొద్దున్నే డ్రైవర్ నిచ్చి హాస్టల్ కి పంపుతా” అన్నాడు కరుణాకరం. సిస్టర్ బాన్డేజ్ రెడీ చేసింది. వెట్ ఫిల్మ్ పట్టుకొని టెక్నీషియన్ వచ్చాడు.

“కాంపౌండ్ ఫ్రాక్చర్. ఎక్కువ స్ప్లింటర్స్ అవలేదు బోను. ఎదికే పిల్ల చాల తేలికగా సెట్ అవుతుంది” అన్నాడు కరుణాకరం లాయరు వైపు తిరిగి.

“అహల్యా! తాయారుని మీదకు తీసుకెళ్ళి పంకజ చేల్లెలొచ్చిందని అమ్మకు చెప్పు.” కట్టు పూర్తి చేసి మిగిలిన కేసులు చూసేసరికి ఒంటి గంటయింది. డ్రాయరు మూసి లేచాడు కరుణాకరరావు.

*   *   *   *   *   *

మీదకెళ్ళేసరికి తాయారు, మహాలక్ష్మమ్మ మాట్లాడుకుంటున్నారు. మహాలక్ష్మమ్మ చెబుతోంది “ఆమె అహల్య. మా వారు మద్రాసులో చదివిన నాటి రోజులలో చిన్ననాటి స్నేహితుని కూతురు. మా వారే చదువు చెప్పించి నర్స్ ట్రైనింగ్ అయిన తరువాత ఆస్పత్రి పనిలో పెట్టారు. చాలా బుద్ధిమంతురాలు. మాకు తలలో నాలుకలా ఉంటుంది. చెల్లాయి చెల్లాయని కరుణ ప్రాణం పెడ్తాడు. వాడూ ఒంటరి వాడే కదా. మా అంబుజం బ్రతికి ఉంటె అచ్చం అలాగే ఉండేది. అంబుజం అంటే కరుణకి ప్రాణం. అహల్య అంటే కూడా అంతే” కరుణ స్నానానికి వెళ్ళాడు.

“అయితే అమ్మాయి, పంకజం ఇప్పుడెక్కడుంది?”

“ఆఁ బొంబాయిలో. మొన్ననే మా అక్కా, బావా అమెరికా నుండి తిరిగివచ్చారు. అమెరికా అంటే విసుగెత్తిందట. అక్క చదువుతూ ఉన్నన్నాళ్ళు అమెరికా, అమెరికా అని గంగ వెర్రులెత్తింది. అమెరికాలో ఉన్న మా మేనమామ గారి అబ్బాయిని ఏరి కోరి కట్టుకుంది. ఇప్పుడు అంత చదువు చదివి ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ కూచుంది. వాళ్లాయనకి ప్రాక్టీసు పెట్టడం ఇష్టం లేదట.”

ఇంతలో కరుణ భోజనానికి వచ్చాడు. వాళ్ళ భోజనాల తరువాత వచ్చింది అహల్య. అహల్య భోజనం చేస్తున్నంతసేపూ కరుణ, తాయారు అక్కడే కూర్చున్నారు. ఆమె భోజనం అయిన తరువాత “తాయారు నువ్వెళ్ళి కాసేపు పడుకో, నేను కొంచెం సేపు నిద్రపోయి వస్తాను. సాయంత్రం బీచికి పోదాము. అహల్యా! సాయంత్రం ముఖ్యమైన కేసులేమన్నా ఉన్నాయా?”

“ఆఁ ఆ టెటనెస్ కేసు నిన్న రాత్రి చూసింది ఒకటుంది. ఇవాళ సాయంత్రం నాలుగింటికి వస్తామని చెప్పారు”.

“ఓ అదా! అదెంతసేపు? ఆ కేసు చూసుకునే పోదాం షికారుకి” అన్నాడు కరుణాకరం లేస్తూ.

ఆ అమ్మాయి ఎవరో ఎందుకంత చనువుగా వారితో మాట్లాడుతుందో అహల్యకి అర్థం కాలేదు. సమయం వచ్చినపుడు కరుణే చెప్తాడని ఊరుకుంది. సాయంకాలం అనుకున్న ప్రకారం తిరిగి తిరిగి తొమ్మిదింటికి ఇల్లు చేరారు. అహల్య, కరుణ, తాయారు భోజనాలు అవుతూండగానే గదిలో ఫోన్ మోగింది. అహల్య వెళ్లి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది.

డాక్టర్ కృష్ణమూర్తి గారికి హార్ట్ ఎటాక్, ఆయన భార్య మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు.

“అరె” అంటూ లేచాడు కరుణాకరం.

“కృష్ణమూర్తి మా గురువు గారు. నే వెళ్లి వస్తా. అహల్యా! తాయారుని కాస్త హాయిగా పడుకోనీ. టెలిఫోన్ ప్లగ్ తీసెయ్, లేదా ఇక్కెడికెందుకు వచ్చానా అని ప్రొద్దునే విసుక్కుంటుంది” అంటూ చిరునవ్వుతో మేడ దిగాడు కరుణ.

తాయారుకి నిద్ర పట్టలేదు. ఏవో ఆలోచనలు. అక్కకి కరుణంటే చాలా అభిమానం అని తనకి తెలుసు. రాత్రి ఎంతైందో తెలియదు. అప్పుడే పట్టింది చిన్న నిద్ర. కారు గారేజీలో పెడుతున్న శబ్దం విని నిద్ర పోయింది. కొంచెం సేపు పోయిన తరువాత తల్లీ కొడుకూ సంభాషణ వినవస్తోంది.

“ఏం అమ్మా! ఇంకా నిద్ర పోలేదా?”

“ఏం నిద్ర నాయనా! ఎప్పుడూ నువ్వూ నీ ఆస్పత్రి, నీ అర్జంట్ కేసులూ. నీ ఇంటికి దీపం ఎప్పుడు వెలిగిస్తావో?”

“మనింటికి దీపాల కేం కొరత? మరో ట్యూబ్ లైట్ పెట్తించనా?”అన్నాడు కరుణ అమ్మ మాటలకి నవ్వేయడానికి ప్రయత్నం చేస్తూ.

“ఏమిటో నాయనా! నీ సంగతి నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయిని చూస్తే ముచ్చటేస్తుంది.” కరుణకి కొంచెం కోపం వచ్చింది. ఏమీ అనలేదు. కాని అతని నిట్టూర్పు విని మహాలక్ష్మమ్మ విస్తుపోయింది.

మరుసటి ఉదయం తాయారు పెందరాడే రెడీ అయ్యింది. కరుణ వాష్ బేసిన్ దగ్గర పళ్ళు తోముకుంటున్నాడు.

“మరి నే వెళ్లి వస్తాను. తొమ్మిదింటికి నేను క్లాసులో ఉండాలి.” అన్నది తాయారు. మహాలక్ష్మమ్మ గదిలోకి వచ్చి “అదేమిటమ్మా! ఇక్కడే ఉండరాదు? ఒంటరిదాన్ని. నాకు కాస్త ఊసుపోతుంది. డ్రైవర్ కారులో తీసుకెళ్ళి తీసుకొస్తుంటాడు.”

“ఆఁ ఎందుకులెండి. నాకు మధ్యాహ్నం కూడా ఎవన్నా క్లాసులుంటాయి.”అంది తాయారు సిగ్గు ఒలకబోస్తూ.

కరుణ ముఖం కొంచెం ఎర్రబడింది. కొంచెం చిరునవ్వుతో “పోనీ శనివారం సాయంత్రం కారు పంపనా! వీకెండ్ నాతొ ఉండవచ్చు.”

“సరే చూద్దాం.” అని తాయారు కిందికి నడిచింది. ఈ లోపల అక్కడకు వచ్చిన అహల్య తాయారు వంకా కరుణ వంకా చిత్రంగా చూస్తూ నిలబడింది.

***** సశేషం *****

Posted in December 2019, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!