"రండి. ప్రయాణం బాగా జరిగిందా?" గేటు తీసుకుని లోపలకు వస్తున్న కొడుకుని, కోడలిని ఆప్యాయంగా పలకరించాడు కామేశ్వరరావు. "బాగానే జరిగింది నాన్నా" అంటూ కొడుకు, కోడలు పిల్లలతో సహా లోపలికి వచ్చారు. కామేశ్వరరావు ఏ.జి. ఆఫీసులో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నాడు. తనకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు, కోడలు చెన్నై లో వుంటున్నారు. ఇద్దరూ సాఫ్టువేర్ ఉద్యోగస్తులే. వాళ్ళిద్దరికీ ఒక కూతురు, ఒక కొడుకు. ఇక అమ్మాయి సృజన కు కూడా పెళ్ళిచేసారు. అమ్మాయి, అల్లుడు ఢిల్లీలో వుంటున్నారు. అల్లుడు ఆర్ధిక శాఖలో అధికారిగా పనిచేస్తున్నాడు. కామేశ్వరరావు సొంతవూరు రాజమండ్రి అయినా, ఉద్యోగరీత్యా హైద్రాబాద్ లోనే స్థిరపడ్డారు. పదేళ్ల క్రితమే సొంత ఇల్లు కొనుక్కున్నారు. కొడుకు, కోడలు దీపావళి పండుగకు వచ్చారు. హైదరాబాద్ కు చెన్నై దగ్గరే కాబట్టి, అప్పుడప్పుడు సెలవులకు కూడా వస్తుంటారు. కామేశ్వరరావు భార్య విమల. చాలా సాదాసీదా మనిషి. తన పిల్లల బాగోగులు చూడటం, భర్తకు కావలసినవి సమకూర్చటం తప్ప, ఆవిడకు ఇంకో లోకం లేదు. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా, అణకువగా మెలుగుతూ, తనపని తానూ చేసుకు పోతుంటుంది. కామేశ్వరరావుకి అన్ని విషయాలలోనూ చేదోడు వాదోడుగా ఉంటుంది. కామేశ్వరరావుకి, పిల్లలంటే ఎంతో అభిమానం. తన పిల్లలెప్పుడూ క్రమశిక్షణలోనే ఉండాలన్నదే అతని ఉద్దేశం. పిల్లల విషయంలో, చిన్న తప్పు కూడా జరగకూడదన్నదే కామేశ్వరరావు అభిమతం. పిల్లలు తనమాటే వినాలనే ఉద్దేశం లేదుకానీ, వాళ్ళు ఎక్కడా తప్పటడుగు వేయకూడదనే మనస్తత్వం. తను పనిచేసే ఆఫీసులో కూడా అందరిని అభిమానించే వాడు, అందుకనే సహోద్యోగులందరికి తరచు సలహాలిస్తుంటాడు. అది కొందరికి నచ్చుతుంది. కొందరికి నచ్చదు. కానీ కామేశ్వరరావు మనసు మాత్రం, నిష్కల్మషంగా ఉంటుంది. అందరి బాగోగులే తన లక్ష్యం అన్నట్లు ఉండేవాడు. అప్పుడప్పుడు ఎవరికైనా అవసరమైతే ఆర్ధిక సహాయం కూడా చేసేవాడు. బయటే అలా ఉంటే, ఇంట్లో ఇంకా ఆప్యాయంగా ఉండేవాడు. కామేశ్వరరావు పిల్లలిద్దరూ, చిన్నప్పుడు ఎక్కువగా గమనించలేదేమో కానీ, పెద్దయిన తరువాత మాత్రం, నాన్నగారు, మాకు స్వాతంత్ర్యము ఇవ్వటంలేదన్నట్లుగా భావించేవారు.
సహజంగా పిల్లల్ని పట్టించుకునే తల్లితండ్రులు, ఎప్పుడూ వాళ్ళ బాగు గురించే ఆలోచిస్తుంటారు. ఇది ఒక్కోసారి పిల్లలకి ఇబ్బంది కలిగిస్తుంది, కానీ తల్లితండ్రులు తీసుకునే ఆ జాగ్రత్త పిల్లల మంచికే అని చిన్నప్పుడు తెలుసుకోలేరు. కాఫీ, టిఫిన్లు అయిన తరువాత, అందరూ టీవీ చూస్తూ మాట్లాడుకొంటున్నారు. "ఎలా వుంది నాన్నా మీ ఆరోగ్యం?" పలకరించాడు ప్రభు. "నా ఆరోగ్యానికేం బాగానే వుంది. షుగరు, బిపి ఇంకా రాలేదు కాబట్టి పరవాలేదు.. మీ అమ్మే, అప్పుడప్పుడు కీళ్ల నొప్పులు అంటుంది. డాక్టర్ కి చూపించాము. ఎన్నో మందులు కూడా వాడుతున్నాము. కానీ గుణం కనపడటంలేదు." చెప్పాడు కామేశ్వరరావు. "సాధ్యమైనంతవరకు పనులన్నీ పనిమనిషిచేతే చేయించమని అమ్మకి చాలాసార్లు చెప్పాను.. ఎక్కువ బరువులు ఎత్తకూడదు. ఎక్కువ నడక కూడా తగ్గించాలి." డాక్టర్ గారిలా సలహా ఇచ్చాడు ప్రభు. కామేశ్వరరావు భార్య విమల, కోడలు హాసిని కూడా ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లలు వసారాలో ఆడుకొంటున్నారు. తాతగారింటికి వస్తే పిల్లలకు పండుగే పండుగ. ఇంటిముందు బోలెడు జాగా ఉంటుంది. అన్ని ఆటలు ఆడుకోవచ్చు.
"నాన్నా నాకీవూరు బదిలీ అయ్యేటట్లు వుంది. బహుశా జనవరిలో ఆర్డర్స్ రావచ్చేమో. హాసిని కూడా, వాళ్ళ కంపెనీలో బదిలీకి అప్లై చేసింది." మెల్లగా చెప్పాడు ప్రభు. కామేశ్వరరావుకి కొడుకు బదిలీ వార్త చాలా సంతోషాన్నిచ్చింది. "చాలా మంచి వార్త చెప్పావురా. మాకు చాలా సంతోషం. మీకు బదిలీ అయ్యి, హైదరాబాద్ వస్తే అందరమూ మనింట్లోనే ఉండవచ్చు. ఎన్నాళ్ళయిందో అందరమూ కలిసివుండి." ఆనందంగా అన్నాడు కామేశ్వరరావు. "ఒకవేళ వచ్చినా, నాన్నా, మేము మా కొత్త ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నాము. బిల్డరుతో ఇప్పుడే మాట్లాడాను. డిసెంబర్ కల్లా, ఇచ్చేస్తామన్నాడు. మాకు కూడా ఆఫీసుకు దగ్గరగా ఉంటుంది." మనసులో మాట మెల్లగా బయట పెట్టాడు ప్రభు. "అదేంటిరా. అందరూ కలిసివుంటేనేకదా, ఖర్చులు కలిసివచ్చేది. ఈరోజుల్లో ఎంత సంపాదించినా, ఖర్చులు తగ్గించుకోకపోతే, చాలా ఇబ్బంది కదా. నువ్వు కొత్తగా కొన్న ఇల్లు అద్దెకిచ్చి, అందరం మనింట్లోనే ఉంటే బాగుంటుంది. అమ్మా నేనూ ఇదే అనుకుంటున్నాము." అభిప్రాయం తెలిపాడు కామేశ్వరరావు.
కొడుకు సొంత ఇంట్లో ఉంటానంటే, కామేశ్వరరావు జీర్ణించుకోలేక పోయాడు. తను కూడా ఇంకో నెలలో పదవి విరమణ చేస్తాడు. ఇంత కాలం పిల్లలగురించి చాలా కష్టపడ్డాడు. ఇకనైనా అందరం కలసి వుండొచ్చనుకొన్నాడు. పిల్లలతో కలసివుంటే, చేదోడు వాదోడు గా ఉంటుందని అనుకునేవాడు. ప్రభు ఒక్కసారిగా ఇలా చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. "మనందరమూ కలసివుంటే, మాకు కొంత ఆసరాగా ఉంటుంది. నీ పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలంటే, డబ్బులు వెనకేయాలి కదా." అభిమానంగా చెప్పాడు కామేశ్వరరావు. "అవుననుకోండి. కొంత కాలమైనా, కొత్త ఇంట్లో వుండి, తరువాత చూద్దాంలే నాన్నా. హాసిని కూడా కొత్త ఇంట్లో వుందామంటోంది" తప్పించుకోవడానికా అన్నట్లు చెప్పాడు ప్రభు.
నిజానికి ప్రభుకు, ప్రభు చెల్లెలు సృజనకు, నాన్నగారంటే ఇష్టమే కానీ, తమకు ఇవ్వాల్సిన స్వతంత్రం ఇవ్వటంలేదన్న అభిప్రాయం చిన్నప్పట్నుంచి బలంగా వుంది. కామేశ్వరరావు ప్రతీ చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి ఏది మంచో, ఏది చెడో ఆలోచించి, పిల్లలకు చెప్పేవాడు. చిన్నప్పటినుంచి, చాకోలెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఎక్కువగా కొనేవాడు కాదు. చదువులు పాడైపోతాయని, పిల్లల్ని సినిమాలకు తీసుకు వెళ్ళటం కూడా తక్కువే. పిల్లలిద్దరికీ, సెల్ ఫోన్లు కూడా, డిగ్రీ పూర్తయిన తరువాతే కొన్నాడు. దుస్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకునేవాడు కామేశ్వరరావు. మరీ ఫాషన్ గా వుండే దుస్తులు కొనేవాడు కాదు. ప్రభు ఎన్నిసార్లు అడిగినా జీన్ పాంట్స్ కొనేవాడు కాదు. ఫ్రెండ్స్ ని ఇంటికి తేవద్దని సలహా ఇచ్చేవాడు. సాయంత్రం ఆరయిందంటే పిల్లలిద్దరూ ఇంట్లో ఉండాల్సిందే.
కామేశ్వరరావు పిల్లల్ని ఎప్పుడూ కోపగించుకోలేదు. కానీ తాను వాళ్ళు ఎలా వుండాలనుకొంటాడో, సూటిగా చెప్పేవాడు. డబ్బులు కూడా పొదుపుగానే ఇచ్చేవాడు. డబ్బులు లేక కాదు. దుబారా ఎందుకని. పిల్లలు అప్పుడప్పుడు నాన్న గురించి, తల్లితో కంప్లైంట్ చేసేవాళ్ళు. పిల్లలు కంప్లైంట్ చేసిన ప్రతిసారి, నాన్న గురించి సర్ది చెప్పేది. విమలకు తెలుసు భర్త మనసు. ఎవరికీ సర్ది చెప్పాలన్నా వినరు. ఎవరి వాదన వాళ్లకు సరిగానే అనిపిస్తుంది. అందుకే భర్త, పిల్లల మధ్య కొన్ని సార్లు నలిగిపోయేది.
కొడుకు, భర్త మాట్లాడుకున్న మాటలు కొన్ని విమల కూడా విన్నది. తన కొడుకుకి ఆ అభిప్రాయం కలగటం, ఆశ్చర్యం కలిగించకపోయినా, బాధ మాత్రం కలిగించింది. నిజమే భర్త అన్నట్లు అందరూ ఒకే ఇంట్లో ఉంటే, ఖర్చులు కలసిరావటమేకాదు, మనసులు కూడా ప్రశాంతంగానే ఉంటాయి. పిల్లల బాగోగులు చూసుకోవడానికి వీలుంటుంది. కానీ ఈ రోజుల్లో అందరూ విడిగా వుందామనుకునే వాళ్ళే. “కలసి ఉంటే కలదు సుఖం” అనేది పాత సామెత అయిపొయింది. ఈ కాలానికి పనికిరాకుండా పోయింది. నిట్టూర్చింది విమల.
ఆరోజు రాత్రి భోజనాలయ్యాయి. పిల్లలందరికీ, వాళ్లకిష్టమైన వంటలు చేయడంతో, అందరూ తల్లి వంటలను మెచ్చుకున్నారు. కాసేపు టివి చూసి అందరూ, ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్లి పడుకున్నారు. విమల కూడా భర్త గదిలోకి వచ్చింది.
రాత్రి పదైనా, కామేశ్వరరావు ఇంకా పడుకోలేదు. పేపరు చూస్తున్నాడు. విమలకు తెలుసు. భర్త అంతసేపు పడుకోలేదంటే, ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నాడని అర్ధం. "ఏమైందండీ! నిద్ర రావడంలేదా" అడిగింది విమల. "ఏం లేదు విమలా, ప్రభు జనవరిలో మన వూరికి బదిలీ అవుతాడట, కానీ వాడు కొన్న కొత్త ఇంట్లోనే ఉంటానంటున్నాడు. వాడలా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియటం లేదు." అన్నాడు కామేశ్వరరావు.
"మీకు తెలియనిది ఏవుందండి. మీరు వాళ్లింకా చిన్నపిల్లలే అనుకుంటున్నారా. వాళ్ళు స్వతంత్రులయ్యారు. వాళ్లకీ కోరికలుంటాయి. సొంత ఇంట్లో వుండాలని, విదేశాలు వెళ్లాలని. కొంచెం విలాసవంతంగా జీవితం గడపాలని అనుకోవటంలో తప్పేముందండి. కొత్త ఇల్లు కడుతున్నాడుగా. కొన్నాళ్ళు అక్కడవుంటాడు. దీంట్లో బాధ పడాల్సిందేముంది. పిల్లల్ని పెంచి, చదువులు చెప్పించి పెళ్లిళ్లు చేసేవరకే మన బాధ్యత. అంతేకాని పెళ్లిళ్ల తరువాత కూడా, వాళ్ళు మనం చెప్పినట్లు చేయాలి అంటే ఎలా? కొన్ని విషయాలు చూసి, చూడనట్లు ఉంటే మంచిది. పెద్దయినతరువాత, పిల్లల బాగోగులు వాళ్లకు తెలియవా! వాళ్లకి పిల్లలు పుట్టారుగా, కష్ట, సుఖాలు వాళ్లకి తెలుస్తాయి. వాళ్లకు ఏది మంచో వాళ్లకి తెలియదా. ప్రతిసారి మనం చెప్పినట్లుండాలంటే ఎలాగండి." భర్తను అనునయిస్తూ చెప్పింది విమల. "నువ్వు చెప్పింది నిజమే. మనకు పెళ్లయి ముఫై ఐదేళ్లు అయింది. నా మనసు, నీకు తెలుసు. నేను చిన్నప్పటినుంచి కష్టపడి పెరిగాను. అమ్మ, నాన్న స్థితిపరులు కాదు. కానీ నన్ను చదివించగలిగారు. నేను కూడా వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా చదువుకొని, భగవంతుని దయవల్ల మంచి ఉద్యోగమే సంపాదించుకోగలిగాను. కానీ నాలాగా నాపిల్లలు కూడా కస్టాలు పడకూడదన్నదే నా ఆలోచన. అందుకనే దుబారా ఖర్చుకు బదులు, వాళ్లు పొదుపు నేర్చుకోవాలనుకున్నాను. అలా పొదుపు చేయటం వల్లనే, మనం పిల్లలిద్దరికీ చెరో ఇల్లు ఇవ్వగలుగుతున్నాము. నా సంపాదనలో, మన గురించి ఖర్చు పెట్టినది చాలా తక్కువ.
అదే దుబారాగా ఖర్చు పెట్టివుంటే, మనం ఇప్పుడు వుండే స్థితి కంటే తక్కువ స్థితిలో ఉండేవాళ్ళం. అప్పుడు పిల్లలు కూడా మనగురించి తప్పుగా అనుకునేవాళ్ళు. నాకు ఏ చెడు అలవాటూ లేదు. డబ్బు వృధా చేయటం ఎందుకని, కనీసం కాఫీ టీలు కూడా బయట తాగను. మనదేశ సంస్కృతి వేరు. "నీ పిల్లలు, నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారు" అన్న సంస్కృతి పాశ్చాత్త్యులది. వాళ్ళను నేను తప్పుపట్టటంలేదు. ఎవరి సంస్కృతి వాళ్ళది. అందరు తల్లితండ్రులు, పిల్లలను పట్టించుకోరు. పట్టించుకునే కొద్దిమందిమీద, వాళ్ళ పెంపకాన్నిబట్టి, పిల్లల అభిప్రాయం ఉంటుంది. ప్రభు, సృజన నా పిల్లలని చెప్పుకోవడానికి, నేను గర్వపడుతున్నాను. ఇద్దరూ గోల్డ్ మెడలిస్టులే. ఏనాడు నేను వాళ్ళని ఎక్కువగా మెచ్చుకోలేదు. కారణం. వాళ్లకు దిష్టి తగులుతుందనే కాక, ఏ మాత్రం గర్వం వాళ్లలో కలిగిందంటే, అది వాళ్ళ భవిష్యత్తుకు కూడా అడ్డుతగులుతుంది. దానివల్ల, వాళ్ళు ఎదగాల్సిన ఎత్తుకు ఎదగలేరు. పిల్లల దగ్గరనుంచి, నేను ఏనాడూ డబ్బులు తీసుకోలేదు, తీసుకోనుకూడా. ఇంత శ్రద్ధ తీసుకున్నా, పిల్లలు నన్నర్ధం చేసుకోలేదంటే, తప్పు నా పెంపకంలోనే ఉందనుకొంటున్నాను. నేను చాలాసేపు నచ్చచెప్పడానికి చూశాను. కానీ వాడు మనసులో దృఢభిప్రాయానికి వచ్చినట్లున్నాడు. నా మాటలను అసలు పట్టించుకోవటం లేదు. చిన్నప్పుడైతే ఎత్తుకొని ముద్దులాడి నచ్చచెప్పేవాళ్ళం. పెద్దవాళ్లయ్యారుగా. ఇంకేమీ చేయలేమో." బాధపడుతూ చెప్పాడు కామేశ్వరరావు.
విమల కంటినుంచి, రెండు కన్నీటి చుక్కలు రాలాయి. అవి ఆనంద భాష్పాలో, ఆవేదనా భాష్పాలో తెలియలేదు. పిల్లలమీద తన భర్తకు వున్న ప్రేమకు చలించిపోయింది. "మీరు బాధ పడకండి. పిల్లలకు మెల్లగా, మన అభిమతం తెలుస్తుంది లెండి. ఇక పడుకోండి రాత్రి పన్నెడయింది." అనునయించి చెప్పింది విమల. తెల్లవారింది. ఆరోజు నరక చతుర్దశి. అందరూ తలంట్లు పోసుకున్నారు. విమల మంచి పిండివంటలతో అందరికి భోజనం వడ్డించింది. ప్రభు, హాసిని, పిల్లలు భోజనాలు బాగున్నాయి అంటూ మెచ్చుకున్నారు. కామేశ్వరరావు గదిలో ఒంటరిగా కూర్చుని పేపరు చదువుతున్నాడు. గదిలోకి మెల్లగా వచ్చాడు ప్రభు. "నాన్నా" మెల్లగా పిలిచాడు. "ఏం ప్రభు చెప్పు." పలకరించాడు కామేశ్వరరావు. "నన్ను క్షమించండి నాన్నా. మీ మనసు కష్ట పెట్టాను. రాత్రి నేను, హాసిని మాట్లాడుకున్నాము. కొత్త ఇంటిని అద్దెకిస్తున్నాను. మేమందరం ఇక్కడికి బదిలీ అయిన తరువాత, మనింట్లోనే ఉంటాము." పశ్చాత్తాపంతొ చెప్పాడు ప్రభు. కామేశ్వరరావు కి చాలా సంతోషం వేసింది. ఏమేవ్ విమల, ప్రభు మనదగ్గరే వుంటానంటున్నాడు." భార్యను పిలిచి ఆనందంగా చెప్పాడు కామేశ్వరరావు.
అంతే. ఆ ఇల్లు ఆనందనిలయంగా మారింది. ప్రభు ఆ రోజు సాయంత్రం పిల్లలకు టపాసులు తెచ్చాడు. దీపావళి పండుగను అందరూ వైభవంగా జరుపుకొన్నారు. మరుసటి రోజు ఉదయం కొత్త ఇంటిని చూడటానికి కామేశ్వరరావు, ప్రభు వెళ్లారు. "హాసిని! నీ మేలు ఎప్పటికి మరిచిపోలేను. ప్రభులో మార్పు తెప్పించావు." కృతజ్ఞతగా చెప్పింది విమల. "అదేంలేదు అత్తయ్యా. ప్రభుకు మీరంటే పంచ ప్రాణం. కాకపొతే చిన్న అహం. నిన్న రాత్రితో అదీ పోయింది" చెప్పింది హాసిని.
అసలేం జరిగిందంటే. ప్రభు, కామేశ్వరరావు ఆరోజు మాట్లాడుకున్న మాటలన్నీ విమల, హాసిని ఇద్దరూ విన్నారు. "ఎలా చేస్తే బాగుంటుందమ్మా" హాసినిని అడిగింది విమల. హాసిని బీటెక్ తో పాటు, సైకాలజీలో డిప్లొమా కూడా చేసింది. ఆ రోజు రాత్రి ఏం చేయాలో అత్తయ్యకు చెప్పింది. ఆ ప్రకారమే తమ గది తలుపు పూర్తిగా వేయకుండా కొంచెం వారగా తీసివుంచింది. ఇవతల హాసిని భర్తతో "చూడండి మీ నాన్నవాళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నారు" అని వాళ్ళ మాటలు ప్రభు వినేటట్లుగా చేసింది. కామేశ్వరరావు, విమల మాట్లాడుకున్న హృదయం స్పందించే మాటలకు, ప్రభులో పశ్చాత్తాపం మొదలై, చివరకు మార్పు వచ్చింది. దానికితోడు హాసినికూడా అత్తమామలను సమర్ధించడంతో తన తప్పేమిటో తెలిసింది. నాన్న మనసు తెలుసుకున్నాడు.
Nice story with happy ending.
Very heart touching story. thank you for giving nice story
భానుమూర్తి గారు కృతఙతలు.చాలా బాగా చెప్పారు.
very very nice heart touching story