Menu Close
Banner-Balu-Messages

సినీ ప్రంపంచంలో అలుపెరుగక, ఆలాపనలతో మొదలుపెట్టి ప్రేక్షకులను ముగ్దులను చేస్తూ, అలవోకగా ఎవరి గాత్రాన్నైనా అనుకరిస్తూ అత్యంత పదస్పష్టతతో మరెవ్వరూ సాధించలేని విద్వత్తుతో, వివిధ భాషలలో తన గాత్రంతో, స్వరకల్పనతో ఆరు దశాబ్దాల పాటు సినీ కళామతల్లికి సేవలందించిన గాన గంధర్వుడు మన ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం గారితో తమకున్న పరిచయాన్ని, అనుబంధాన్ని, ఆయనను అభిమానించే అనేకమంది ఆప్తమిత్రులు ‘బాలు అంటే ఎవరు?’ అని అడిగినప్పుడు వెనువెంటనే వారు వ్యక్తపరిచిన అభిప్రాయాలను యధాతధంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆవిధంగా ఆ మహానుభావుణ్ణి మరొకరి ఆలోచనల రూపంలో స్పరించుకుంటూ...

🙏 మధు బుడమగుంట 🙏

leaf-divider
నటరాజన్ గుత్తా

SP బాలసుబ్రహ్మణ్యం గారు స్వరాభిషేకం కార్యక్రమంలో భాగంగా శాక్రమెంటో వచ్చినప్పుడు నా ఆతిధ్యంలో ఆయనతో దాదాపు వారం రోజులు ఎంతో సన్నిహితంగా గడపడం జరిగింది. ఎన్నడూ, ఏ విషయంలో కూడా ఆయనలో విసుగు ధ్వనించదు. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరినీ మర్యాదపూర్వకంగా పలకరించడం ఆయనకున్న గొప్ప గుణం.

ఆయన సాన్నిహిత్యంలో నేను ప్రత్యేకంగా గమనించిన విషయాలు ఏంటంటే;

మొదటిది, ఎంత బిజీగా ఉన్ననూ వారి తల్లిగారితో రోజుకు ఒక్కసారైనా మాట్లాడందే నిద్రపోరు.

రెండు, అందరి తండ్రుల వలెనే ఆయన తన పిల్లల గురించి నిత్యం ఆలోచిస్తూ వారితో ఎంతో అనుబంధాన్ని కలిగి ఉండేవారు. తనకు ఆప్తులైన వారి గురించి మాట్లాడేటప్పుడు ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయ్యేవారు.

మూడు, సమయపాలన, ఇది మనందరం కూడా నేర్చుకోవలసిన ముఖ్య లక్షణం. ఎటువంటి కార్యక్రమం అయినా కరెక్ట్ టైం కి ఆయన హాజరౌతారు.  అలాగే తనతోనే ఉంటూ, తనతో ప్రయాణిస్తున్న తన తోటి కళాకారులు, సహాయకులను ఎప్పుడూ గమనిస్తూ వారి బాగోగులను పట్టించుకునేవారు.

చివరగా, ఎంత చిన్న సంగీత కార్యక్రమం అయినా ముందుగా rehearsals చెయ్యందే ప్రోగ్రాం ఇవ్వరు. ప్రోగ్రాం అయ్యేంతవరకు ఎంతో బాధ్యతగా ప్రవర్తించేవారు. ఎవరైనా ఎటువంటి చిన్న సహాయం చేసినా మరీ గుర్తుపెట్టుకొని వారిని అనేక విధాలుగా అందరిముందు పొగిడేవారు, ఎంతో అభిమానంతో ఉండేవారు.

‘ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండటం’ అనే మాటకు బాలుగారే ప్రత్యక్ష ఉదాహరణ, నిలువెత్తు దర్శనం.

వెంకట్ నాగం

శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం ఒక స్వర రాగ గంగా ప్రవాహం. నెల్లూరు లో మొదలైన ఈ ప్రవాహానికి ఆరు దశాబ్దాలుగా ఎదురు లేదు, అలుపు లేనే లేదు, అంటే అతిశయోక్తి కాదు. ఆయన మైకు తీసుకొని పాడుతుంటే వేదికపై అమర్చిన మైకు, స్పీకర్లు, తదితర సౌండ్ పరికరాలు ఆయనకు మోకరిల్లుతాయి. ప్రపంచం నలుమూలలా పర్యటించి వేలాది వేదికలపై తెలుగు పాటను పాడి వీక్షకులను పులకరింపజేసి, సంగీత మాధుర్యంలో ఓలలాడించి వారి గుండెల్లో నిలిచిపొయిన బాలు చిరంజీవులు. ఘనత వహించిన మన తెలుగు గడ్డపై ఆయన జన్మించడం నిజంగా మన అదృష్టం. మన పిల్లలు, తరువాతి తరానికి తెలుగు పాటను పరిచయం చేయడం, వారిచేత తెలుగు పాటను పాడించడమే ఆయనకు ఘనమైన నివాళి - అనేది నా భావన.

ధన్యవాదాలు.

అబ్దుల్ రహీం షేఖ్

నా అనుబంధం SPB సార్‌తో -

1995-1996 కాలంలో హ్యూస్టన్‌లో ఎస్పీ సార్, ఆయన కుమారుడు చరణ్ మరియు వారి బృందంతో ఒకసారి కలిశాను.

నా కలయిక SPB సర్ తో రెండవ సారి -

Abdul-Balu5-6 సంవత్సరాల క్రితం శాక్రమెంటోలో "పాడుతా తీయగా" program నిర్మించడానికి వచ్చినప్పుడు ఆయనతో కొంత సమయం గడపే అదృష్టం నాకు దొరికింది. TAGS సంఘం వారు ఆయన కోసం ఒక సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేసారు. నా సౌండ్ సిస్టమ్‌ను సెటప్ చేయడం నా అదృష్టం, నా సిస్టమ్‌ తో ఆయన ప్రేక్షకుల తో మాట్లాడారు మరియు వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ రిసెప్షన్ సందర్భంగా ఆయన నా వైపు చూస్తున్నప్పుడు నేను నా మొదటి పాట "ఆమని పాడవే హాయిగా..." పాడాను. అంతటి లెజెండరీ గాయకుని ముందు పాడుతుంటే నేను చాలా nervous అయ్యాను.

ఆయన మొహమ్మద్ రఫీ సాహెబ్ యొక్క పెద్ద అభిమాని అని నాకు తెలుసు, కాబట్టి నేను రఫీ గారి పాటలలో ఒకటైన "An Evening in Paris” పాడాను. ఎస్.పి.బి సార్ కు నేను ఈ పాట పాడటం నచ్చింది. తర్వాత రెండు రోజులు నన్ను నా పేరుతో  పిలవడానికి బదులుగా, ఆయన నన్ను "పారిస్ అబ్బాయి" అని పిలిచారు. నేటికీ ఆ మధురస్మృతులు నాకు గుర్తుకువస్తూనే ఉన్నాయి.

ప్రతిభ కత్తిరశెట్టి

పాట పాడటానికి కంఠం, శృతి, లయతో పాటు చలనచిత్రం మీద అవగాహన, పాడాలన్న ఆసక్తి, అంతకు మించి కృషి ఉంటే గాయకులుగా గుర్తింపబడానికి ఎంతో సమయం పట్టదు అనే ఒక ఉదాహరణే బాలుగారు!  నాలాంటి ఎంతోమంది చిన్నా పెద్దా గాయకులకి ప్రత్యక్షంగా, పరోక్షంగా స్ఫూర్తిని ఇచ్చారు. దాదాపు 6 దశాబ్దాల్లో నలభై వేల పైగా  పాటలు, ఎన్నో భాషల్లో పాడి, ప్రతి ఇంట 'గాన' దీపాన్ని వెలిగించి, మనని రంజింప చేసి, మనలో అణువణువునా 'గాన' వాయువుని నింపిన మహా పురుషుడు బాలు గారు!  ఇక 'పాడుతా తీయగా' వేదిక కానీ 'స్వరాభిషేకం' వేదిక గాని, ఎంతో మంది కొత్త గాయకులకు సంగీతం మీద ఆసక్తిని పుట్టించేలా చేసింది కూడా బాలుగారే. ఒక రేడియో పెట్టినా, ఒక కేసెట్ పెట్టినా, చివరికి మనఇంట్లో వేంకటేశ్వరస్వామి పటంలో inbuilt ఆడియో పెట్టినా ('ఓం మహా గణపతీ నమః', ఓం నమో వేంకటేశాయ) కూడా బాలు గారి స్వరమే వినిపిస్తుంది. ఆయన ప్రతి ఇంటిలో ఒక కుటుంబ సభ్యుడు. ఆయన పాటలైతే ఇప్పుడు ఎన్నో రకాలైన మాధ్యమాల్లో వినగలుగుతాము. కానీ గతంలో అనేకమంది దర్శకులైతేనేమి, గేయ రచయితలైతేనేమి, సాంకేతిక సిబ్బందిలైతేనేమి, వారితో  ఆయన పంచుకున్న అనుభవాలు మనకి చెప్పడం, గేయ రచన విశ్లేషణం, సున్నితమైన హాస్యం, ఇవి మాత్రం ఇక మనం వినలేము. మారుతున్న కాలంతో పాటు మారుతూ పాత చలనచిత్ర సంగీతానికి ప్రస్తుత చలనచిత్ర సంగీతానికి ఒక వారధిగా నిల్చిన ఆయనని 'ఏమని వర్ణించను'?!! శిరస్సు వంచి ఆయనకు నివాళులు అర్పించడం తప్ప.

'ఉదయశ్రీ' యు.సి. ఓబులేశు గౌడ్

నేను బాలుకు అభిమానిని. ఒక్క సంగీతపరంగానే కాదు ఆయన వేదికల మీద ప్రసంగిస్తున్నప్పుడు ఎంత ఎదిగినా ఒదిగి పోయే ఆ సజ్జనలక్షణం అభీష్టం. ఆ విషయం స్వరాభిషేకం సంగీతవిభావరిని చూస్తే తెలుస్తోంది. అందులో ఆ పాటల నేపథ్యం వివరిస్తుంటే సాహిత్యం పైన కూడా ఆయనకున్న పరిజ్ఞానం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఆయన గురించిన నా అనుభూతులను క్రింది కవితలో మీతో పంచుకుంటున్నాను.

బాలూ! ఇన్నేళ్ళుగా నీవు మధురంగా పాడుతుంటే
వేదికలమీద సవినయంగా మాటాడుతుంటే
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నీ వ్యక్తిత్వం చూసి
ఒక హిమోన్నతాశిఖరం మా కళ్ళముందుండేది
నీ మోముపై చెక్కుచెదరని ఆ చిరుమందహాసం
జామురేయి జాబిలి దిగివచ్చి నిల్చిన చందం
గీతమే ఉచ్ఛ్వాస గా శ్వాసించి
సంగీతమే నిశ్వాసగా శాసించి
జీవితానికదే సార్థకతగా భావించి
అందులో అజేయుడవై రాణించి
సద్గుణసంపన్నుడవై ఈ పుడమి లో
చిరస్థాయిగా అదే నీ స్థాయిగా
పేరొందినావు కీర్తి ప్రతిష్టలు గడించావు
అంపశయ్యపై భీష్మ మహారాజు
స్వచ్ఛందమరణమొందినట్టు
కరోనా పరచిన మరణశయ్యపై
అకాలగతుడవై అమరుడైనావు
ఇదే నేను నీకు ఇచ్చే నా కవితా నివాళి!

అనిల్ మండవ

Anil-Baluశాక్రమెంటో లో జరిగిన పాడుతా తీయగా  ప్రోగ్రాం సందర్బంగా బాలు గారితో ముఖాముఖి పరిచయ భాగ్యం కలగడం ఓ అదృష్టం. బాలు గారిని నా కారులో శాంతాక్లారా వరకు తీసుకొనివెళ్ళడం ఆ సందర్బంగా రెండు గంటలు పైగా ఎన్నో విషయాలపై చర్చించడం ఓ మధుర జ్ఞాపకం. ‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం’ అనే నానుడి విన్నాను కానీ అది బాలు గారిని కలిసిన తరువాతే బాగా అర్ధమైంది. ఏ వయసు వారితోనైనా, ఏ పని చేసేవారినైనా మర్యాదతో ఆప్యాయంగా పలకరించే సుగుణం ఉన్న మహానుభావుడు. ఓ వ్యక్తి కి జ్ఞాన సంపదతో పాటు గుణ సంపద అనేది ఎలా ఉంటుందో బాలు గారిని కలిసిన వారికి చెప్పనవసరం లేదు. బాలు గారితో కొన్ని గంటలు ప్రయాణించిన నాకే ఆ అనుభూతి కలిగితే ఆయన జీవన ప్రయాణంలో ఎంత మందికి ప్రేరణ కలిగించారో అని ఊహించుకుంటే ఆయన ఓ వ్యక్తి కాదు ఓ విశ్వవిద్యాలయం అనడం అతిశయోక్తి ఏమాత్రం కాదు. ఆయన ప్రోగ్రామ్స్ లో యువ గాయకులకు పారదర్శకంగా ఇచ్చిన ప్రోత్సాహం మరియు విలువైన సూచనలే అందుకు నిదర్శనం.

శ్రీనివాసమూర్తి వేములపాటి

SP బాలసుబ్రహ్మణ్యం గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక జీవిత కాలంలో అన్ని కళల లో  ప్రావీణ్యం సంపాదించి అందరినీ మెప్పించడం చాలా అరుదు. ఆయన పేరు వినగానే నాకు వెంటనే మనసులో  మెదిలే  విషయాలు.

ఒకటి, ఏ పని చేసినా నూటికి రెండు వందల శాతం న్యాయం చేయడం.  రెండోది,  సంస్కారం మూర్తీభవించిన ఆయన వ్యక్తిత్వం. ఎవరిని నొప్పించకుండా, ప్రోత్సహిస్తూ తను చెప్పదలుచుకొన్నది సులభంగా అర్ధం అయ్యేలా వ్యక్తీకరించడం. సామాజిక స్పృహ ప్రతిఫలించే  సందేశాలు.

ఇక ఆయన భాష మీద  ప్రధానంగా మాతృభాష తెలుగు మీద వున్న అభిమానం, దానిని వాడుకలో బతికించాలి అన్న తపన. అన్ని భాషల వారికి, అన్ని ప్రాంతాల వారికి తమ ఇంటి మనిషి, తమవాడు అనిపించేలా  జీవించడం ఆయనకే సాధ్యం. తుది వరకు ఆయనలో ఆ పసివాడి మనస్తత్వం, ఆ కళ్ళలోని  చిలిపితనం, కొత్త వాటిపై ఆయన ప్రకటించే ఆశ్చర్యం, ఉత్సుకత  నాపై ప్రభావం చూపాయి. ఇక ఆయన హాస్యం గురించి  చెప్పక్కర లేధు. అన్ని అలా వుంటే ఆయన జ్ఞాపక శక్తి, ఎప్పుడో జరిగినవి పూస గుచ్చినట్లు  నెమరు  వేయగలగడం. నేను చూసే ఒకే ఒక tv  కార్యక్రమం ‘పాడుతా తీయగా’.  కేవలం పాటలు గురించి కాదు, ఆయన భాష కోసం, ఆయన నెమరువేసే  సందర్భాల  కోసం, ఆయన గాయకులని తీర్చి దిద్దే  ప్రక్రియ కోసం .. ఆయన ఒక నడిచే విశ్వవిద్యాలయం. అలా గంటల తరబడి  చూస్తూ వుండగలను ..

ఆ మహానుభావుని ఒక్కసారి స్మరిస్తూ...

రమేష్ తొళ్ళ

జూన్ 14 మరియు 15, 2013, నా జీవితంలో ఎంతో విలువైన రెండు రోజులు అని చెప్పాలి. ఎందుకంటే అవి నేను బాలు గారితో గడిపిన మధుర ఘడియలు. ఆ రెండు రోజులలోనే నేను ఎన్నో అనుభూతులను ఆయనతో పంచుకొన్నాను. ఎన్నో విలువైన విషయాలను తెలుసుకున్నాను. నా కుటుంబానికి ఆప్తమిత్రుడైన బాపినీడు గారి ద్వారా నాకు బాలు గారు పరిచయమయ్యారు.

మొట్టమొదటి సారిగా ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాం అమెరికాలో నిర్వహించడం, అది కూడా మా శాక్రమెంటో లో జరగడం, దానికి నాకు స్పాన్సర్ చేసే అవకాశం రావడం అనేది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

వ్యక్తిగతంగా బాలు గారు ఎంతో వినయశీలి. అనేక విషయాలలో ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. ఉదాహరణకు మేము ఆయనకు Five Star hotel బుక్ చేస్తే, దానిని కాదని తనతో పాటు ఇండియా నుండి వచ్చిన మిగిలిన singers and musicians తో కలిసి ఉండటానికే ఇష్టపడ్డాడు. అంత పెద్ద పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి ఏనాడు ఆ దర్పాన్ని ప్రదర్శించకుండా సామాన్యుని లాగా ఉండటం అనేది ఎంతో గొప్ప విషయం.

బాలు గారిని కలవడానికి ముందు నేను ఆయన చాలా రిజర్వుడు, ఎవ్వరితో ఎక్కువగా కలవడు అని అనుకునేవాడిని. కానీ ఆయనను కలిసినప్పుడు నా అభిప్రాయం తప్పని తెలిసింది. అంతటి స్నేహశీలి, మృదుభాషి ని నేను ఎన్నడూ చూడలేదు. ఆయనతో మాట్లాడుతుంటే మనలను మనం మరిచిపోతాము. ఎటువంటి వారితోనైనా కలిసిపోయి down to earth అన్నట్లు ఉండే ఆ మహా మనిషి గురించి ఎంత చెప్పిననూ తక్కువే అవుతుంది.

ఆయన భోజనప్రియుడు. అయితే ఇంటి భోజనాన్ని ఇష్టపడతాడు. అందుకే నా భార్య పార్వతి స్వయంగా వండిన ఆహారాన్ని ఇష్టంగా భుజించి మాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలగలిపి అందించిన బాలు గారిని మరిచిపోవడం అంటూ జరగదు. ఆయన స్ఫూర్తితోనే మా అమ్మాయికి సంగీతం మీద ఆసక్తి కలిగింది. తనతోపాటు, తన చుట్టూ ఉన్నవారి గురించి కూడా ఆలోచిస్తూ అందరికీ ఆప్యాయతను అందించిన ఆ గాన గంధర్వుడు అజరామరుడు.

ప్రసాద్ మరియు సౌజన్య వేములపాటి

పాడుతా తీయగా USA కార్యక్రమంలో మా అబ్బాయి అభిజిత్ పాల్గొన్నందువల్ల,  బాలుగారిని మొదటిసారి కలిసి మాట్లాడే అదృష్టం కలిగింది. ఆయనలోని నిరాడంబరత, మంచితనములను ప్రత్యక్షంగా  చూడగలిగాము. ప్రోగ్రాములోని పిల్లల తల్లిదండ్రులతో ఎంతో గౌరవంగా  మాట్లాడేవారు.

పిల్లల్లో పిల్లవాడిగా కలిసిపోయేవారు. వేదిక మీద పిల్లలకు కంగారు తగ్గటానికి ఆయన ధైర్యం చెప్పే పద్ధతి, పాట పాడిన తరువాత దానిలోని తప్పులను సరిదిద్దే విధానము చూసి అందరం ముగ్ధులమయ్యాము.

మేము కూడా నెల్లూరివారమని తెలిసి, అభితో నెల్లూరు యాసలో మాట్లాడి నవ్వించేవారు.

రెండవసారి శాక్రమెంటోలో స్వరాభిషేకం rehearsals జరుగుతుండగా కలిసినప్పుడు, అంతటి గొప్ప మనిషి ఒక సామాన్యునిలాగా చాలా మర్యాదగా, ఆప్యాయంగా మాట్లాడారు.

ఇవన్నీ మా కుటుంబానికి బాలుగారితో  ఎప్పటికీ మర్చిపోలేని అపురూపమైన  అనుభవాలు. ఆయన మన మనసుల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు.

ఆయన జయంతిని పురస్కరించుకుని మా భావాలను ఇలా ఆయన అభిమానులందరితో పంచుకునే అవకాశం కల్పించినందుకు సిరిమల్లె సంపాదకులు మధు మరియు ఉమ గార్లకు మా ధన్యవాదాలు.

రంగ-నూతన్ తాటిపత్రి

మాకు తెలిసిన కొన్ని అంశాలు బాలసుబ్రమణ్యం గారి గురించి మీతో పంచుకోవాలని అనుకొంటున్నాము. ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం గారు 1946 జూన్ 4 న  జన్మించారు. ప్రముఖ సంగీత దిగ్గజం ఎస్పీ కోదండపాణి శిష్యరికంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం 1966లో డిసెంబర్ 15 తేదీన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి,  ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడారు. 1981లో ఏక్ దూజే కే లియే చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు లభించింది. 1983లో సాగర సంగమం, 1986లో స్వాతిముత్యం, 1988లో రుద్రవీణ లాంటి ఎన్నో చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకొన్నారు.

మన అందరికీ తెలిసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్‌గా, డబ్బింగ్ హోస్ట్‌గానే  కాకుండా నటుడిగా అద్భుతమైన పాత్రలు పోషించారు. కమల్ హాసన్, రజనీకాంత్, విష్ణువర్ధరణ్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజా, అనిల్ కపూర్, గిరీష్ కర్నాడ్, జెమిని గణేషన్, అర్జున్ సర్జా, నాగేశ్, కార్తీక్, రఘువరన్ లాంటి ప్రముఖ నటులకు గాత్రదానం చేశారు. 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 40 వేల పైచిలుకు పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. ఆ మహానుభావునికి ఇదే మా హార్దిక నివాళులు.

జంధ్యాల నీహార్

మనస్సులో ...

ఆయనను కన్న తల్లి-తండ్రులకు నమస్కారాలు. ఎందుకంటే అటువంటి రత్నాన్ని మనకు ఇచ్చినందుకు. ఆయిన నిరంహంకారంతో అనేవారు – ‘నేను పాడాలి అని ఎంతో మంది మహానుభావుల ఆశీర్వాద బలం వల్ల నేను గాయకుడినయ్యానే తప్ప నా ఒక్కడి వల్ల కాదు’. వెంకటేశ్వర స్వామి కీర్తి అన్నమయ్య వల్లనైతే – అన్నమయ్య కీర్తి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం వలన నలుదిశలా వ్యాపించిందని నిస్సందేహంగా అనవచ్చును. ఎన్నో సినిమాలకు ప్రాణం ఆయన గొంతే. మన భారత జాతి గర్వపడాలి. ఆయిన హిందీలో తక్కువ పాటలు పాడటం అక్కడి దర్శకుల దురదృష్టంగా భావించాలి. అలవోకగా, “తకిట-తధిమి” పాడి మనస్సును కదిలింపజేసిన ఆయన గాత్రశక్తి అనుభవింప దగినదే. ‘మన జాతికే చెందిన హక్కు, మన బాలు గారు’ ఇక లేరా? ఎవరన్నారు - ఇలాంటి మహానుభావులు వస్తూనే ఉంటారు. త్వరలో ఆయన మరలా రావాలని ఆయన జయంతి సందర్భంగా ప్రార్థిస్తున్నాను.

మురళీ మోహన్

బాల సుబ్రహ్మణ్యం గారి గురించి నా మాటల్లో....

ప్రపంచంలో చాలా తక్కువమందికి, తమ ప్రతిభతో ఎదుటి వారి మనసుల్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసేసుకునే శక్తి వుంటుంది. అలాంటి వారిలో బాల సుబ్రహ్మణ్యం గారు ఒకరనేది నిస్సందేహం.

muralimohan-baluఆగష్ట్ 12,2015 న బాలు గారిని కలిసినప్పుడు - ఆయన పాదాల్ని స్పృశిస్తుంటే కలిగిన అనుభూతి వర్ణనాతీతం. చిన్ననాటి కల నిజమయ్యిందనే సంతోషం. మాట్లాడిన ప్రతి నిమిషం - మరువలేని మధురక్షణం.

బాలు గారి గాత్రం- అమరం, ఆయన పాట- అజరామరం. వారు భాషకి ఇచ్చిన ప్రాధాన్యం- అద్వితీయం.

తెలుగు పాట జీవించినంత కాలం, బాలు గారి స్వరం మన చెవులకి వినిపిస్తునే వుంటుంది. వారి పాట విన్నప్పుడు ఆ గాన తపస్వి రూపం కళ్ల ముందు మెదులుతూనే వుంటుంది.

ఆందుకే బాలు గారు దూరమయ్యారనే భావన కలగట్లేదు. ఆయన జయంతి సందర్భంగా ఆయనకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నాను.

Posted in June 2021, బాలు ప్రత్యేకం, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!