Menu Close
మర్మదేశం (ధారావాహిక)

ఘాలి లలిత ప్రవల్లిక

ఘాలి లలిత ప్రవల్లిక

వీళ్లు దగ్గరకు రాగానే ఆటోమేటిక్ గా పై భాగం ఓపెన్ అయింది. అందులో నుంచి గ్లాస్ తో తయారైన ఓ పెద్ద బాక్స్ క్రిందకువచ్చింది. దాని డోర్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యాయి.

"welcome to my orbit" అంటూ వినబడింది ఓపెన్ అయిన డోర్స్ లోంచి.

అందరూ ఆ బాక్స్ లాంటి దాని లోపలికి ప్రవేశించారు. వారి కళ్ళు ఇందాక వీళ్ళను ఆహ్వానించిన వ్యక్తి కోసం వెతికాయి. లోపల ఎవరూ కనిపించకపోయేసరికి ....ఎవరు వీళ్లను లోపలికి ఆహ్వానించారో అర్థం కాక ఆశ్చర్యపోతున్న పిల్లలను ఉద్దేశించి,

"ఆశ్చర్య పోతున్నారా మా వస్తువులు కూడా మీతో మాట్లాడగలవు". అన్నాడు మేథా.

"ఓహో బాక్స్ రూపంలో ఉన్న రోబో నా ఇది!" అన్నాడు చరణ్.

"నీకు అర్ధమయ్యే పరిభాషలో నువ్వు అనుకో" అన్నాడు మేథా.

అందులో రోప్వేలో ఉన్నఅనుభూతి కలిగింది పిల్లలకు. అది వీళ్ళను పైకి తీసుకెళ్ళింది. పైకి వెళ్ళిన వాళ్ళు కళ్ళు మూసి తెరిచేలోగా ఫ్లయింగ్ సాసర్ లో కుషనులాంటి సీట్లో కూర్చుని ఉన్నారు. అంతా మిరాకిల్ లా జరిగిపోయింది.

ఆ ఫ్లైయింగ్ సాసర్ పైభాగం అది. అంతా ఓపెన్ లోనే ఉంది. ఆరు బయట కూర్చున్నట్లుగా ఉంది వాళ్ళకు.

వాళ్ళు కూర్చున్న సీట్ల కింద నుంచి రంగురంగుల వెలుగులు వెదజల్లబడుతున్నాయి. రకరకాల వాయువులూ వెలువడుతున్నాయి. ఏదో వింత అనుభూతి కలుగుతోంది వారికి.

ఫ్లయింగ్ సాసర్ బయలుదేరింది.

"బెల్టులేమీ కట్టుకో అక్కర్లేదా" విచిత్రంగా అడిగాడు కౌశిక్.

"ఏమి అవసరం లేదు". అన్నాడు క్రేన్.

"మరి అయితే పడిపోమా?" భయంగా అన్నాడు దినేష్.

"ఏం పడిపోరు." నవ్వుతూ అన్నాడు డింగూ.

"మరైతే మమ్మల్ని ఇలాగే తీసుకెళ్తారా?" ఆశ్చర్యంగా అడిగాడు చరణ్.

"నువ్వు ఇలాగే వస్తాను అన్నావు కదా! అందుకే ఈ ఏర్పాటు." అన్నాడు మేథా.

ఫైయింగ్ సాసర్ గాలిలోకి ఎగిరింది. క్షణాల్లో పైకి ఆకాశంలోకి ఎగిరిపోయింది.

ఎంతో ఆహ్లాదంగా ఉంది వాతావరణం. వారి శరీరాలకు అనుకూలంగా వాతావరణం మార్చేస్తోంది వారు ఎక్కిన వాయువాహనం. అదో అద్భుతమైన అనుభూతి.

"హాయ్ హాయ్ హాయ్ మేఘాలు...నేను వాటిని పట్టుకొంటా" అంది శర్వాణి.

మేఘాలు పట్టుకొంది కానీ చేతిలోకి ఏమీ రాలేదు.

"వే..వే...వే... మేఘాలు ఘనపదార్థమా నీ చేతికి చిక్కడానికి" వెక్కిరించాడు చరణ్.

"ఎక్కిరించనక్కరలేదు. వానలు మేఘాల వల్లే కురుస్తాయి కదా! మరి అవి ఆ నీటిని ఎక్కడ దాచాయోనని చూడడానికి పట్టుకున్నా" అంది ఉడుకు మొత్తనంగా శర్వాణి.

ఆకాశంలో విహంగాలు గుంపులు గుంపులుగా అందమైన ఆకారాలతో ఎగురుతున్నాయి.

చూడముచ్చటగా ఉన్నాయి ఆ విహంగాల మాలలు. అవి పిల్లల మెడలు అలంకరించడానికి వస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. నక్షత్రాలు అక్కడ అక్కడా మినుకు మినుకుమని మెరుస్తున్నాయి. కిందకి చూసిన వీరు అనంత విశ్వంలో భూమి ని చూడగానే వాళ్లకు చెప్పలేని అనిర్వచనీయమైన తీపి బాధ కలిగింది. వీరి శరీరంలో ఒక భాగం దూరమైనట్లు గా అనుభూతి చెందారు.

"పిల్లలూ మీ భూమి ఎలా ఏర్పడిందో మీకు తెలుసా?"వాళ్ళను డైవర్ట్ చేయడానికి అడిగాడు మేథా.

"ఆ..ఆ...నాకుతెలుసు"అంటూ చేయి పైకి ఎత్తాడు. టీచర్ అడిగే ప్రశ్నకు జవాబు చెప్పే విద్యార్థిలా దినేష్.

"అయితే చెప్పు" అన్నాడు మేథా.

"భూమిని రాక్షసుడు చాపలా చుట్టి ఎత్తుకుపోయి సముద్రం లోపల దాచేస్తే విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తి భూమిని రక్షించాడు". చెప్పాడు దినేష్.

"అసలు ఫస్టు భూమి ఎలా వచ్చింది అని అడిగాడు మెథా అంకుల్. అంతేగా అంకుల్ "అంది శార్వాణి.

"ఫస్ట్ అంతా నీళ్ళతో నిండిపోయి ఉంటే ఆది పరాశక్తి నాలుకని చాపి అందులోంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పుట్టించిందట. వారిని పరిపాలించమని కొంతభూమిని కూడా ఇచ్చిందట. మా అమ్మమ్మ చెప్పింది." అమాయకంగా చెప్పాడు దినేష్.

"ప్రణవం నుండి పుట్టిందని మా తాతయ్యా నాకు చెప్పాడు." అన్నాడు కౌశిక్.

"అలా కాదు మొదట దేముడు ప్రకృతి, సూర్యుడు, చంద్రుడిని సృష్టించాడుట. ఇవన్నీ ఉన్నాయి కాని వీటిని అనుభవించేవారు లేరే అని అనుకున్నాడుట దేవుడు.

గాలేమో ఇసుకను కూర్చి ఓ మానవుని రూపును చేస్తే భగవంతుడు ప్రాణం పోశాడు. ఆ సృష్టించబడిన వ్యక్తి పగలంతా ఒంటరిగా తిరుగుతూ రాత్రికి వచ్చి ఎక్కడైతే తను తయారయ్యాడో అక్కడికి వచ్చి పడుకునేవాడుట. ఒంటరిగా ఉన్న అతన్ని చూసి జాలిపడి అతనికి తోడు కోసం గాలి మరో ప్రతిరూపం తయారు చేసిందిట.

దేవుడు అతని ప్రక్కటెముకను ఒక దానిని తీసి ఆమెకి అమర్చిప్రాణం పోసాడుట. వారిద్దరే ఆడమ్ అండ్ ఈవ్ మొదటి మానవులట మా ఫ్రెండ్ ఫాదర్ చెప్పారు." అన్నాడు చరణ్.

"ఒరేయ్ మీరా గోలలో పడి వింతలు చూడటం మర్చిపోతున్నారురా.." అంది శార్వాణి.

ఇంతలో మేథా కలగజేసుకుని "మీరు మీ భూలోక వాసులులా చర్చించడం వదిలేయండి.

మీరు మా అతిథులు మా టెక్నాలజీని మీరు ఉపయోగించుకోవచ్చు." అన్నాడు మేథా.

"చర్చించుకోకపోతే ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తాయి?" అమాయకంగా అన్నాడు దినేష్.

"చర్చించడం ఎందుకు అనుభూతిని కలిగిస్తే పోలా! అంతా అనుభవించి తెలుసుకునేందుకు గాని" అన్నాడు మేథా.

"హాయ్ బలే బలే మమ్మల్ని టైం మిషన్ లో కూర్చోపెడతావా ఏంటి అంకుల్" సంభ్రమంగా అడిగాడు చరణ్.

"భలేగా గెస్ చేసావే చరణ్. పిల్లలూ మీకు ఇష్టమేనా ఆ కాలానికి వెళతారా?" అంటూ అడిగాడు మేథా.

"ఓ.... అంకుల్ వెళ్తాము." అన్నారు అందరూ ఏకకంఠంతో. కావల్సినవి వారి కిచ్చి వారిని టైమ్ మిషన్లో కూర్చోపెట్టాడు మేథా. వాళ్ళు13,70,000 లక్షల సంవత్సరాలు వెనక్కు వెళ్లారు.

***సశేషం***

Posted in June 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!