మరణం రాకతో.....
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు
అన్ని స్నేహాలూ సమసిపోతాయి,
అన్ని బంధాలూ భ్రమసిపోతాయి,
అన్ని మమతలూ మసయిపోతాయి,
అన్ని చైతన్యాలూ ఆగిపోతాయి,
ఆ ఒక్కమరణం రాకతో!
అన్ని కలలూ చెదరిపోతాయి,
అన్ని భ్రమలూ బెదరిపోతాయి,
అన్ని ఆశలూ ఆవిరైపోతాయి,
అన్ని బాసలూ బలైపోతాయి,
ఆ ఒక్కమరణం రాకతో!
అన్ని రంగులూ అదృశ్యమైపోతాయి,
అన్ని పొంగులూ చల్లారిపోతాయి,
అన్ని హంగులూ అల్లాడిపోతాయి,
అన్ని శోకాలూ బావురుమంటాయి,
ఆ ఒక్కమరణం రాకతో!
అనురాగాలన్నీ అణిగిపోతాయి,
అభిమానాలన్నీ అలసిపోతాయి,
ఆప్యాయతలన్నీ అలుసైపోతాయి,
ప్రేమలన్నీ పెళుసైపోతాయి,
ఆ ఒక్క మరణం రాకతో!!!!