Menu Close
manusmrithi page title
మూడవ అధ్యాయము (ఎ)

గృహస్థాశ్రమం ప్రాశస్త్యం

అన్ని జంతువులూ వాయువును ఆశ్రయించి జీవిస్తాయి. అలాగే మిగిలిన మూడు ఆశ్రమాలూ గృహస్థాశ్రమాన్ని ఆశ్రయిస్తాయి. ఒక గృహస్థు మిగిలిన ఆశ్రమముల వారికి అన్న పానాలు సమకూరుస్తాడు. వారిచే వేదాధ్యయనము చేయిస్తాడు. అందుకే ఒక గృహస్థును అన్ని ఆశ్రమముల వారిలోకీ శ్రేష్ఠుడుగా పరిగణిస్తారు. (బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అనే నాలుగింటినీ చతురాశ్రమాలు అంటారు.)

పరలోకంలో అంతులేని స్వర్గసుఖాలు పొందాలని కోరుకునే వ్యక్తి గృహస్థాశ్రమ నియమాలను క్రమం తప్పక పాటించాలి. ఋషులు, పితృదేవతలు, దేవతలు, భూతములు, అతిథులు - వీరందరూ గృహస్థును ఆశ్రయించి తమకు కావలసినవి కోరుతూ ఉంటారు. కాబట్టి విజ్ఞుడైన గృహస్థు వారందరికీ ఏమేమి కావాలో వారి మనసెరిగి వాటిని ముందుగానే సమకూర్చుకోవలసి ఉంటుంది. వేదాధ్యయనము చేత ఋషులను, హోమములు చేసి దేవతలను, శ్రాద్ధములతో పితృదేవతలను, ఆహారంతో అతిథులను, కాకబలి వంటి బలులలో పిండములు పెట్టి భూతముల (జంతువులు, పక్షుల)ను ఒక గృహస్థు శాస్త్ర ప్రకారం పూజించాలి.

శ్రాద్ధ కర్మలు - బలి

గృహస్థు తన పితృదేవతల ప్రీతికోసం సమర్పించేందుకు అన్నాదులు, నీరు, పాలు, దుంపలు, పండ్లు మొదలైన వాటితో శ్రాద్ధమును చేయాలి. గృహస్థు పంచ యజ్ఞాలలో ఒకటైన పితృయజ్ఞంలో ఒక్క బ్రాహ్మణునికైనా రోజూ భోజనం పెట్టాలి. భూత యజ్ఞములో ఒక బ్రాహ్మణుడికి అన్నం పెట్టకపోయినా, బలి మాత్రము వేయాలి.

(గృహస్థు రోజూ చేయాల్సిన పంచ యజ్ఞాలలో ఒకటైన భూత యజ్ఞంలో భాగంగా కాకుల వంటి జీవులకు పెట్టే ఆహారాన్ని బలి అంటారు. అందుకే కాకిని బలితో పోషింపబడేది కనుక బలిపుష్టము అని కూడా అంటారు). వైశ్వదేవము కోసం సిద్ధపరచబడిన అన్నాన్ని దేవతల కోసం ప్రతిరోజూ గృహ్యాగ్నిలో వేయాలి. మొదటగా అగ్నికి, తరువాత సోమునకు, ఆ తరువాత అగ్నీషోములకు, విశ్వే దేవతలకు, ధన్వంతరికి హోమం చేయాలి.

అగ్నికీ, సోమునికీ ఇరువురికీ ఇష్టమైన రీతిలో వారిరువురికీ అతి పవిత్రమైన పశువును బలి ఇచ్చి గానీ, వారిరువురికీ ఇష్టమైన ఆహుతులను హోమాగ్నికి సమర్పించిగానీ చేసే హోమాన్ని అగ్నీషోమీయము అంటారు. సాధారణంగా ధన్వంతరి అంటే క్షీరసాగర మథనం సందర్భంగా చేతిలో అమృతభాండంతో వెలువడిన దేవవైద్యుడు అని అర్థం చెపుతారు. విక్రమాదిత్యుని ఆస్థానంలోని నవరత్నాలలో ధన్వంతరి కూడా ఒకడు. అయితే ఇక్కడ ఈశాన్య దిశగా సమర్పించబడిన ఆహుతులను స్వీకరించే ఒక దేవతగా ధన్వంతరి చెప్పబడ్డాడు.

విశ్వే దేవతలకందరకూ వారి వారికి ఉద్దేశించిన దిక్కులలో బలిహరణము వేయాలి. పగలు, రాత్రి సంచరించే భూతములకు వేరువేరుగా బలి అన్నమును వేయాలి. సర్వాత్మభూతముల కోసం ఇంటి పై భాగంలోనూ, ఇంటికి దక్షిణ భాగంలో పితృదేవతలకు బలి అన్నాన్ని ఉంచాలి.

శునాం చ పతితానాం చ శ్వపచాం పాపరోగిణామ్ |
వాయసానాం  కృమీణాం చ శనకైర్నిర్వపేద్భువి || (3- 92)

శునాం (కుక్కలు), పతితులు (అంటరానివారు - Outcasts), శ్వపచులు అంటే మాలలు (చండాలురు), పాపరోగిణాం (పూర్వం చేసిన పాపాల కారణంగా భయానకమైన కుష్ఠు మరియు క్షయ వంటి వ్యాధులతో బాధపడుతున్నవారు), వాయసానాం (కాకులకు), కృమీణాం (క్రిమి కీటకాలకు), శనకై (నున్నగా), నిర్వపేత్ భువి (చీమలు తవ్వి పోసిన మట్టి గుట్టలు లేకుండా సమతలంగా ఉన్న భూమిమీద) బలి వేయవలయును.

ఈ శ్లోకం ద్వారా అణగారిన కొన్ని వర్గాల ప్రజల నాటి దయనీయమైన సామాజిక స్థితిగతులు మనకు తెలుస్తున్నాయి. జంతువులు, పక్షులకు వేసినట్లు వారికి కూడా ఆహారం నేలమీద వేయడాన్నిబట్టి నాటి దుర్భరమైన వారి జీవితం కుక్కలు, కాకులు, క్రిమికీటకాల జీవన స్థాయి కంటే ఎక్కువైనదేమీ కాదని మనం గ్రహించగలం. పతితులు అంటే నైతికంగా పతనమైనవారు. సమాజంచే వెలివేయబడిన అంటరానివారు. శ్వపచులు అంటే చండాలురు (క్రూరకర్ములు). శూద్ర వర్ణానికి చెందిన తండ్రికి, బ్రాహ్మణ తల్లికి పుట్టిన సంతానాన్ని చండాలురుగా, సమాజంలో అత్యంత నిమ్నకులానికి చెందినవారిగా మనువు వర్గీకరించాడు. ఇదే మనుధర్మశాస్త్రంలోని (10- 12) శ్లోకంలో ఒక శూద్రునికి బ్రాహ్మణ స్త్రీయందు జన్మించినవాడు చండాలుడనీ, అతడు మొత్తం మానవులలోకెల్లా అధముడనీ మనువు పేర్కొన్నాడు. శూద్రులలో ఎవరూ కూడా ఎట్టి పరిస్థితులలోనూ ఒక బ్రాహ్మణ స్త్రీని విలోమ వివాహం చేసుకోకుండా ఉండటం కోసం ఈ విధమైన ఘోర నియమాన్ని ఆయన విధించాడు. ఇక నాటి సమాజం నయంకాని మొండి రోగాలు, భయానకమైన కుష్ఠు వంటి వ్యాధులు, ప్రాణాంతకమైన క్షయ వంటి వ్యాధుల బారిన పడినవారి సంక్షేమం, చికిత్సల గురించి ఆలోచించడం మాట అటుంచి, కనీసం వారి పట్ల సానుభూతి, ఆదరణ కూడా చూపలేదు. పోలియో, కుష్ఠు, క్షయ వంటి రోగాలు ఆ రోగులకు వారు పూర్వజన్మలో చేసిన పాపం కారణంగానే వస్తాయనే నమ్మకాన్ని పెంచి పోషించి, ఆ వ్యాధిగ్రస్థులు అందరినీ పాపిష్టివారుగా భావించి నాటి సమాజం వారిని అంటరానివారని వెలివేసింది. పాశ్చత్య దేశాలలోనూ ఇలా వెలి వేయబడిన వ్యాధిగ్రస్థులు కాలనీలుగా ఏర్పడి గ్రామాలకు దూరంగా కొండ గుహలలో తలదాచుకొనేవారు. సనాతనవాదులు ఎంతగా వ్యతిరేకించినా, భక్తి ఉద్యమకాలంలో మత సంస్కర్తలు అంటరానితనం నిర్మూలనకు గట్టిగా పోరాడారు. ఆధునిక యుగంలో మహాత్మా గాంధీ, వినోబా భావే, బాబా ఆమ్తే, మదర్ థెరెసా వంటి దయాళువుల ఆదరణ కారణంగా మాత్రమే కుష్ఠువ్యాధిగ్రస్థులు కొంత ఓదార్పు పొందారు. శాస్త్ర పరిశోధనల పుణ్యమా అన్నట్లు మల్టీ డ్రగ్ థెరపీ (M.D.T) వాడకంలోకి వచ్చాక, దేశవ్యాప్తంగా కుష్ఠు నివారణ కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న కారణంగా ప్రస్తుతం కుష్ఠు వ్యాధి పూర్తిగా అదుపులో ఉంది. క్షయ వ్యాధిని కూడా పోలియో లాగే పూర్తిగా నిర్మూలించే కృషి దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది.

ఈ విధంగా ఏ బ్రాహ్మణుడు బలిహరణము అనే కర్మను ఆచరిస్తాడో, అతడు బ్రహ్మతేజస్సుతో వెలుగొందుతాడు. అంతిమంగా అతడు బ్రహ్మస్వరూపం పొందుతాడు. గృహస్థు పైన తెలిపిన విధంగా బలికర్మ చేసి, ముందుగా తన ఇంట భోజనం చేసే అతిథికి, తరువాత సన్యాసికి, ఆ తరువాత బ్రహ్మచారికి భిక్ష వేయాలి.

విద్యార్థి అయిన ఒక బ్రహ్మచారి తన గురువుకు గోదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక ద్విజుడైన గృహస్థు భిక్ష వేయడం ద్వారా అంతే పుణ్యఫలం పొందుతాడు. వేద తత్త్వార్థాలను ఎరిగిన ఒక బ్రాహ్మణునికి ఒక గృహస్థు భిక్ష ఇచ్చే శక్తి లేనప్పుడు తన శక్తికొలది భిక్షను కానీ, ఏవైనా ఆకుకూరలు, కాయగూరలనుగానీ, దప్పిక తీర్చడంకోసం ఒక ఉదపాత్రలోని నీటినిగానీ విధిపూర్వకంగా ఇవ్వాలి.

మోహం కారణంగా యోగ్యతను కనిపెట్టలేక, వేదాధ్యయనము, వేదార్థజ్ఞానము, అనుష్ఠానము, బ్రహ్మవర్చస్సు లేని, కేవలం బూడిదతో సమానులైనట్టి బ్రాహ్మణులకు ఇచ్చిన హవ్య కవ్యములు నిష్ప్రయోజకం అవుతాయి.

విద్య, తపస్సు, బ్రహ్మ వర్చస్సు కలిగినట్టి బ్రాహ్మణునికి ఒక గృహస్థు దేవతలు, పితృదేవతల గురించి యీయబడిన దానములు, అగ్నిలో వేల్చిన హవిస్సులలాగే ఇహలోకంలో మొండి వ్యాధులు, శత్రు భయము, రాజోపద్రవము అనే వాటినుంచి, పరలోకంలో మహా పాపం నుంచి విముక్తి కలిగిస్తాయి.

గృహస్థు - అతిథి పూజ

గృహస్థు తన ఇంటికి వచ్చిన అతిథికి స్వయంగా ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి, పాద ప్రక్షాళన (కాళ్ళు కడుగుకొనడం) మొదలైన వాటికోసం నీటిని ఇచ్చి, విధి ప్రకారం తనకు కలిగినంతలో అన్నము, వ్యంజనములు (కూరలు, పచ్చళ్ళు) మొదలైన వాటితో భోజనం పెట్టాలి.

శిలానప్యుంఛతో నిత్యం పంచాగ్నీనపి జుహ్వతః |
సర్వం సుకృతమాదత్తే బ్రాహ్మణో అనర్చితో వసన్ || (3- 100)

శిలాన్ అపి ఉంఛతో నిత్యం - శిలము లేక సిలము అంటే కోతకోసి కుప్పవేసిన చేలో నుంచి రైతులు వదిలేసిన కంకులు, గింజలు ఏరి తేవడం. అలా ఏరి తెచ్చుకున్న గింజలు వండుకు తినడాన్ని ఉంఛము అంటారు. గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆహవనీయము, సభ్యము, అపసభ్యము - ఈ ఐదింటీనీ పంచాగ్నులు అంటారు.

పొలంలో రాలిన గింజలు కంకులను (పరిగ ఏరి) తెచ్చి వాటితో జీవించడాన్ని ఉంఛవృత్తి అంటారు. ఉంఛ వృత్తి పై ఆధారపడి నిరాడంబరంగా జీవించడం, పంచాగ్ని మధ్యలో ఉండి  తపమాచరించడం - ఈ రెండూ పుణ్యలోకాలు చేరేందుకు మార్గం సుగమం చేస్తాయని పెద్దలు చెపుతారు. అయితే ఈ రెండూ నియమం తప్పక పాటించే గృహస్థు కూడా తన ఇంటికి అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడికి సత్కారం చేయకపోతే పై రెండు పుణ్యకార్యాలవల్ల చేకూరిన పుణ్యఫలాన్ని కోల్పోతాడు.

సజ్జనుడైన ఒక గృహస్థు ఇంటిలో అతిథికి పెట్టేందుకు ఒకవేళ భోజనం లేకున్నా, కనీసం అలసి వచ్చిన ఆ అతిథికి తన ఇంట్లో విశ్రమించడానికి తగు తావును చూపి, పరుండడానికి ఆ స్థలంలో పరచేందుకు కొద్ది గడ్డి పరకలను, కాళ్ళు చేతులు కడుక్కోటానికి, తాగడానికి తగినంత నీటిని ఇచ్చి చక్కని మాటలతో పలకరిస్తే చాలు - అతిథి పూజ వలన కలిగే పుణ్యం ఆ గృహస్థుకు దక్కుతుంది.

ఏకరాత్రం తు నివసన్నతిథిర్బ్రాహ్మణః స్మృతః |
అనిత్యం హి స్థితో యస్మాత్తస్మాదతిథిరుచ్యతే  || (  3- 102 )

పరగృహమున ఒక రాత్రి మాత్రమే ఉండే బ్రాహ్మణుడిని అతిథి అంటారు. అతడు ఒక్క రోజు పాటైనా ఒకచోట ఉండడు కనుక అతడిని అతిథి అంటారు. అదే గ్రామంలో నివశిస్తూ, సాంగతిక జీవనం (ఇతరులతో ఏవేవో కబుర్లాడుతూ పొద్దుపుచ్చే జీవితం) గడిపేవాడు వైశ్వదేవం సమయానికి వచ్చినా అతడిని అతిథిగా భావించరాదు.

అతడికి పైన తెల్పిన విధంగా అతిథిపూజ చేయనవసరంలేదు. ఏ గృహస్థులు బుద్ధిహీనులై ఎప్పుడూ పరుల ఇంటి భోజనానికి ఆశపడతారో, వారు మరణించిన తరువాత  ఆ యా అన్నదాతల ఇంట్లో పశువులుగా పుడతారు. సూర్యుడు అస్తమించిన తరువాత తన ఇంటికి వచ్చిన అతిథికి గృహస్థు తప్పక భోజనం పెట్టాలి. (తెలుగులోనూ పొద్దున్నే వచ్చిన వాన, పొద్దుగూకి వచ్చిన చుట్టం తొందరగా పోరని సామెత. సూర్యాస్తమయం తరువాత వచ్చిన వ్యక్తికి భోజనం పెట్టి పంపడం అనాదిగా ఒక ఆచారంగా పాటిస్తున్న కారణంగానే ఆ అతిథి కూడా గృహస్థు తనకు భోజనం పెడతాడని ఆశించడం సహజమే!) భోజన సమయానికి వచ్చినా, వేళ మీరి వచ్చినా ఒక అతిథికి మాత్రం గృహస్థు తప్పక భోజనం పెట్టాలి. అతిథిని సత్కరించని ఇంట్లో ఆ అతిథి కూడా ఉండకూడదు. ఒక గృహస్థు అతిథికి ఇవ్వని పాలు, పెరుగు వంటి వాటిని తాను కూడా స్వీకరించకూడదు. అతిథిపూజ ధనాన్ని, కీర్తిని, ఆయుష్షునూ పెంపొందిస్తుంది. స్వర్గాన్ని ప్రాప్తింపజేస్తుంది. అందుచేత ప్రతి గృహస్థు అతిథిపూజ తప్పనిసరిగా చేయాలి. అతిథికి తగిన ఆసనం ఇవ్వడం, తగిన నివాస వసతి ఇవ్వడం, శయ్యా అంటే మంచం వంటివి ఇవ్వడం, అనువ్రజ్యా (అతిథికి వీడ్కోలు పలికేటప్పుడు అతడితో కలిసి కొంతదూరం వెళ్లి సాగనంపడం) మొదలైనవన్నీ ఒక గృహస్థు తనకంటే గొప్పవారికి గొప్పగానూ, చిన్నవారికి చిన్నగానూ, సమానులకు తగినట్లుగానూ ఇవ్వాలి. వైశ్వదేవం, అతిథి భోజనం  తరువాత వచ్చిన అతిథికి కూడా (బలి అన్నం పెట్టకుండా)  ఉన్నంతలో అన్నము, వ్యంజనములతోనే అతిథి సత్కారం చేయాలి. ఏ బ్రాహ్మణుడూ కూడా గృహస్థు ఇంట్లో భోజనం కోసం తన కులగోత్రాదులను చెప్పకూడదు. అలా తన కులగోత్రాలు చెప్పి భోజనం చేస్తే అతడు వాంతి చేసిన అన్నాన్ని భోజనం చేసినట్లే.

అతిథి పూజ గురించి మనువు విధించిన పై నియమాలలో శాస్త్రీయత ఎంతమేరకు ఉన్నదనే విషయాన్ని పక్కనబెడితే, ఒక గృహస్థు స్వ గ్రామానికే చెంది కబుర్లతో పొద్దుపుచ్చే సాంగతిక జీవులు వైశ్వదేవం సమయంలో అతడి ఇంటికి వచ్చినా, వారు ఆ గృహస్థుకు అతిథులు కారని చెప్పడం, ఏ గృహస్థులు పరుల ఇంటి భోజనానికి ఆశపడి రోజూ ఇతరుల ఇండ్లలో భోజనం చేయడానికి అలవాటు పడతారో, వారు తరువాత జన్మలో ఆ ఇంటి పశువులుగా పుడతారని పేర్కొనడం బాగుంది. తప్పని పరిస్థితులలో ఎవరి ఇంటికైనా అతిథిగా వెళ్ళాలి తప్పితే, ఏదో ఒక వంకతో తరచుగా భోజనవేళకు పొరుగిళ్లకు వెళ్లే పరాన్నభుక్కులను అప్పట్లోనే మనువు నిరసించడం గొప్ప విషయం. గృహస్థాశ్రమం మిగిలిన మూడు ఆశ్రమాలకూ ఆధారమని ఎందుకు అంటారో ఈ నియమాలు చదివితే గ్రహించగలం. ఒక గృహస్థు ఇంట అతిథి సత్కారం ఒక నియమంగా సవ్యంగా జరగాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మనువు పుణ్యపాపాలు, పుణ్యలోకాల ప్రస్తావన చేశాడనేది స్పష్టం.

ఒక బ్రాహ్మణుడి ఇంట్లో క్షత్రియ, వైశ్య, శూద్రులు అతిథులు కారు. అతడి స్నేహితులు, బంధువులు అతడికి సరిసాటి వారు కనుక వారూ అతిథులు కారు. గురువు తనకంటే గొప్పవాడు కనుక ఆయనకు గృహస్థు చేసే సత్కారం గురుపూజ అవుతుందే కానీ అతిథిపూజ కాదు. ఒక క్షత్రియుడికి తనకంటే ఉత్కృష్టుడైనందున ఒక బ్రాహ్మణుడు, తన సరిసాటి కావున వేరొక క్షత్రియుడు అతిథులు. వైశ్య, శూద్రులు ఒక క్షత్రియుడికి అతిథులు కానేరరు. ఒక వైశ్యుడికి ద్విజులందరూ (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు) అతిథులే. ఒక వైశ్యుడికి శూద్రుడు మాత్రం అతిథి కాదు.

ఒక బ్రాహ్మణుని ఇంటికి క్షత్రియుడు అతిథిగా వస్తే, ముందు బ్రాహ్మణులందరూ భోజనం చేసిన తరువాత మాత్రమే ఆ బ్రాహ్మణ గృహస్థు ఆ క్షత్రియ అతిథికి భోజనం పెట్టాలి. ఒక బ్రాహ్మణుని ఇంటికి వైశ్య, శూద్రులు ఎవరైనా అతిథులుగా వస్తే వారికి ఆ బ్రాహ్మణుడు దయతో తన ఇంటి సేవకులతో కలిపి భోజనం పెట్టించాలి. తన ఇంటికి వచ్చిన ఇతర మిత్రులెవరికైనా ఒక బ్రాహ్మణ గృహస్థు భార్యా భోజన సమయంలో భోజనం పెట్టించాలి. సువాసినులకు (పేరంటాళ్లకు), కొత్త పెళ్ళి కూతుళ్ళకు, రోగులకు, గర్భిణులకు అతిథులకంటే ముందే భోజనం పెట్టాలి.

పై అతిథి సత్కార నియమాలన్నింటిలో వర్ణ వ్యవస్థలోని అగ్ర వర్ణాలకు ప్రాధాన్యతాక్రమంలో ప్రాథమ్యం ఇవ్వబడింది. ఒక శూద్రుడు మరొక శూద్రుని ఇంటికే అతిథిగా వెళ్లాలనీ, ఒక బ్రాహ్మణుడి ఇంటికి వైశ్య శూద్రులు ఎవరైనా అతిథులుగా వెళ్లినా వారికి ఆ బ్రాహ్మణ గృహస్థు అతిథిగా కాక దయతో తన ఇంటి సేవకులతో కలిపి భోజనం పెట్టించాలనే నియమం నాటి కరడుగట్టిన వర్ణవ్యవస్థకు తార్కాణం. ‘మనుస్మృతి’ కాలం నాటికి శూద్రులతో పాటు వైశ్యులు (వారు ద్విజులలో అంతర్భాగమే అయినప్పటికీ) కూడా సామాజికంగా ఎంతటి నిమ్నస్థాయిలో ఉన్నారనేదానికి కూడా ఇదొక నిదర్శనం.

సాధారణంగా ఒక గృహస్థు ఇంటిలో ఆరోజు ఉన్న ఆహారంలో అతిథిసత్కారంలో అతిథులకు పెట్టగా మిగిలిందే దంపతులు తినాలి. ‘అవశిష్టం తు దంపతీ’ అనేది నియమం. దంపతీ లేక జంపతీ అంటే ఆలుమగలు. అతిథులు తినగా మిగిలిందే భార్యాభర్తలు తినాలి. అయితే దానిలో కూడా భర్త భోజనం చేయగా మిగిలిందే భార్య తినడం సనాతన ఆచారం. అందరూ భోజనం చేశాకనే భార్యలు భోజనం చేసేవారు. అందుకే ‘భార్యా భోజనకాలం’ అనేది కూడా అప్పట్లో ప్రత్యేకంగా పాటించేవారు. ప్రాచీనకాలంలో భర్త తినగా మిగిలిన అన్నాన్ని అదే ఎంగిలి పళ్లెంలోనే తినడాన్ని స్త్రీలు పాతివ్రత్య లక్షణాలలో ఒకటిగా భావించేవారు. ఇలా స్త్రీలకు సంబంధించిన పలు విషయాలలో నాటి పురుషాధిక్య సమాజం వివక్షాపూర్వకంగా ప్రవర్తించినా, సువాసినులకూ (పేరంటాళ్లకూ), కొత్త పెళ్ళికూతుళ్లకూ, రోగులకూ, గర్భిణులకూ అతిథులకంటే ముందే భోజనం పెట్టాలని మనువు విధించిన నియమం మెచ్చుకోదగినదే. అతిథిపూజ అయ్యేవరకు భోజనం పెట్టకుండా రోగులను ఇబ్బంది పెట్టకూడదనీ, తనతో పాటు గర్భస్థ శిశువుకూ ఆకలి ఎక్కువగా ఉండే కారణంగా గర్భిణులకు కూడా అతిథులకంటే ముందుగానే భోజనం పెట్టాలనీ విధించిన నియమాలు కూడా హర్షణీయమే. పేరంటాళ్ళు త్వరగా ఇంటికి వెళ్లి తమ సంసారాన్నీ, పిల్లల్నీ చూసుకోవాలి. ఇంకా భర్తకు సేవలు చేసుకోవాలి. అందుకే ముత్తైదువలకు కూడా ప్రాధాన్యం ఇవ్వబడింది. ఇక కొత్త పెళ్లికూతుళ్ళకు ప్రాథమ్యం ఇవ్వాల్సిందే కదా? వారు మరింతగా పతిసేవ చేయాలి కదా మరి ? ఈ తరహా నియమాలు మనువు స్త్రీలకిచ్చిన వెసులుబాట్లలాగా పైకి కనిపించినా, అంతిమంగా అవి పురుషులకు ప్రయోజనం చేకూర్చేవేననడంలో సందేహంలేదు.

అతిథుల మొదలు సేవకుల వరకు అందరికీ భోజనం పెట్టకుండా ఒక గృహస్థు తానే ముందుగా భుజిస్తే, అట్టివాడి శవాన్ని శ్వ (కుక్కలు), గృధ్రములు (గద్దలు) పీక్కుతిని తమ ఆకలి తీర్చుకుంటాయని ఆ గృహస్థుకు తెలియదు. విప్రులు, అతిథులు, భృత్యులు భోజనం చేయగా మిగిలిందే దంపతులు తినాలి. దేవతలను, ఋషులను, మనుష్యులను, పితరులను, గృహదేవతలను అన్నము, మొదలైనవాటితో సంతృప్తి పరచి, ఆ తరువాతనే మిగిలిన అన్నాన్ని గృహస్థు భుజించాలి. ఏ గృహస్థు తన నిమిత్తం మాత్రమే అన్నం వండుకు తిని భుజిస్తాడో, అతడు అఘమును (పాపాన్ని) భుజిస్తున్నట్లే. కనుక గృహస్థు తాను రోజూ చేయాల్సిన పంచ యజ్ఞాలను పూర్తి చేసిన మీదటనే యజ్ఞ శిష్టాశనము (పంచయజ్ఞములలో అవశిష్టముగా మిగిలిన ఆహారము) ను తినుటయే ఉత్తమము.

ఒక గృహస్థు ఇంటికి రాజు, ఋత్విజుడు, స్నాతకుడు, గురువు, మిత్రులు, మామగారు, మేనమామ - వీరు ఒక సంవత్సర కాలానికి లేక అంతకంటే ఎక్కువ కాలం తరువాత వస్తే వారిని మధుపర్కంతో పూజించాలి.

ఒక రాజు, శ్రోత్రియుడు యజ్ఞం జరిగే సందర్భంగా ఒక గృహస్థు ఇంటికి వస్తే వారిని ఆ గృహస్థు మధుపర్కంతో సత్కరించాలి. ఒక గృహస్థు ఇంటికి ఆ ఇంటి అల్లుడు ఒక సంవత్సరము తరువాత వస్తే, అప్పుడు యజ్ఞం జరగకున్నా అతడిని మధుపర్కంతో సత్కరించాలి. ఒక సంవత్సరంలోపు వచ్చే అతిథులను  యజ్ఞం, వివాహం వంటి సందర్భాలలో మాత్రమే మధుపర్కంతో సత్కరించాలి. మిగిలిన సందర్భాలలో మధుపర్కంతో పనిలేదు.

సాయం సమయాలలో ఒక గృహస్థు భార్య ఉడికించిన అన్నాన్ని పశువులకు ఎలాంటి మంత్రాలు చదవకుండా బలిహరణం (అమంత్రక బలి హరణం) గా వేయాలి. దీనిని సాయం ప్రాతః కాలాలలో చేయబడే వైశ్వదేవము అంటారు.

***సశేషం***

Posted in October 2021, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!