‘మనుస్మృతి’ రచనాకాలం నాటి సామాజిక స్థితి
వేదకాలంలో మానవుల ఆలోచనలు వాస్తవానికి అతి దగ్గరగా ఉండేవి. వాస్తవిక దృష్టి కలిగిన వారు కనుకనే ఆనాటి మానవులు తాము నూరేళ్ళ పాటు మాత్రమే సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు. అందుకే వైదిక ఋషులు సైతం తమ ప్రార్ధనాగీతాలలో ‘జీవేమా శరదశ్శతం’ అని మాత్రమే ప్రార్థించారు. తాము వంద శరత్తుల పాటు ఆరోగ్యంగా జీవించాలనీ, జగచ్ఛక్షువైన సూర్యుడిని నూరు శరదృతువుల పాటు తాము చూడగలగాలని మాత్రమే వారు అభిలషించారు. అప్పట్లో మానవులంతా సమానులేననే భావన ఉండేది. పుట్టుకతో ఎవరూ గొప్పవారు కారని వైదిక ఋషులు భావించారు. ఆ కారణంగానే వారు వేదవిద్యలను అందరికీ బోధించారు. నేను లోగడ పేర్కొన్న యజుర్వేద మంత్రాన్నిబట్టి వేదవిద్యలు సమాజంలోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకే కాక బయటినుంచి వచ్చిన దేశద్రిమ్మరులకు కూడా అందుబాటులో ఉండేవని మనం గ్రహించవచ్చు. అందుకే అవనీశ చంద్రబోస్ వంటి విఖ్యాత వేదపండితులు ‘అప్పట్లో వేదవిద్యలు సమస్త జనుల కళ్యాణానికి ఉద్దేశించినవే తప్ప ఏ ఒక్క సమూహానికో, జాతికో పరిమితమైనట్టివి కావ’ ని వివరించారు. ఆ కాలంలో స్త్రీలకు కూడా వేదవిద్యలు అందుబాటులో ఉండేవనడానికి గార్గి, మైత్రేయి, లోపాముద్ర వంటి వేదవిద్యలలో ఆరితేరిన విదుషీమణులే ఉదాహరణలుగా నిలుస్తారు. అప్పట్లో శూద్రులుగా జన్మించిన వాల్మీకి, వ్యాసుడు ధర్మవ్యాధుడు, కపిలమహర్షి, విదురుడు వంటి అనేకులు కూడా వేదవిద్యలు, ధర్మశాస్త్రాలు క్షుణ్ణంగా అభ్యసించినవారిగా పేరొందారు. నాటి సమాజంచే బ్రహ్మజ్ఞానులుగా, బ్రాహ్మణులుగా వారు గుర్తించబడ్డారు. అప్పట్లో పుట్టుకతో అందరూ సమానులేననీ, వేదవిద్యలు ఎవరైనా అభ్యసించవచ్చుననీ, బ్రహ్మజ్ఞానులెవరైనా బ్రాహ్మణులేననే భావన ఉండేది. వైదిక ఋషులకు లోక కళ్యాణమే ధ్యేయంగా ఉండేది. వారు సమస్తలోక కళ్యాణాన్నీ కోరుతూ ప్రార్థనాగీతాలు రాసేవారు. ‘లోకాస్సమస్తాస్సుఖినో భవన్తు’ (ఎల్ల లోకాలూ సుఖంగా ఉండాలి), ‘సర్వేజనాస్సుఖినో భవన్తు’ (సకల జనులూ సుఖంగా ఉండాలి) ‘సర్వే సంతు నిరామయా:’ (ఎల్లరూ రోగములు లేనివారై యుందురుగాక) వంటి వైదిక ప్రార్థనలు సకలలోక కళ్యాణాన్నీ ఉద్దేశించినవి.
సామాజిక పరిణామంలో క్రమంగా వ్యక్తుల విద్యలు, మేధాసంపద, గుణగణాల కంటే జాతికి (పుట్టుకకు) ప్రాధాన్యం ఏర్పడింది. సమాజంలోని వ్యక్తులకు స్వార్థం పెరిగిపోయింది. అందుకే వారు తమ తరువాత తమ సంతానానికే తమ జీవితకాలంలో తాము ఆర్జించిన సంపద, విజ్ఞానం వారసత్వంగా దక్కాలని కోరుకోవడం మొదలైంది. దాంతో వర్ణవ్యవస్థ ఘనీభవించింది. సకలలోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ చేసే ప్రార్థనల స్థానంలో తనకూ, తన కుటుంబానికీ మేలు చేకూరాలని కోరుకుంటూ చేసే స్వార్థపూరితమైన క్రతువులు పెరిగాయి. నాటి సమాజం ‘బీజప్రాధాన్య సిద్ధాంతం’ పాటించిన కారణంగా సమాజంలో పురుషుడి ప్రాధాన్యం క్రమంగా పెరిగిపోయింది. పున్నామ నరకం నుంచి తప్పుకునేందుకు అందరూ పురుష సంతానం కోసం అర్రులుచాచారు. అందుకోసం ‘పుం సవనాలు’ (మగబిడ్డ పుట్టాలనికోరుతూ చేసే యజ్ఞాలు) చేసేవారు. సమాజంలో స్త్రీ స్థానం కేవలం పిల్లల్ని కనే యంత్రం స్థాయికి దిగజారిపోయింది. ‘వీరమాతలు’, ‘వీరపత్నులు’ గా మాత్రమే వారు గౌరవం పొందేవారుగానీ, వారికంటూ ప్రత్యేకమైన గౌరవాలు ఏవీ లేవు. యజ్ఞయాగాదుల నిర్వహణ, అధ్యాపనం, యుద్ధాలు, రాజ్యపాలన, వ్యవసాయం వంటి వాటిలో స్త్రీలకు దాదాపు స్థానం లేకుండా చేయబడింది. వారిని కేవలం గృహాలకే పరిమితం చేశారు. స్త్రీలపై ఎన్నో ఆంక్షలు విధించి, వారిని మానసికంగా పురుషులకు బానిసలుగా మార్చివేశారు. స్త్రీలకు వేదవిద్యలు నిషేధించారు. ఈ క్రమంలోనే ఒకప్పటి పని విభజనలో సౌలభ్యం రీత్యా ఏర్పడిన వర్ణవ్యవస్థ కొందరు తెలివైనవారి ప్రయోజనాలు కాపాడే ఉపకరణంగా మారింది. స్వార్థపర శక్తులు బలహీనుల్ని దోపిడీ చేసేందుకు వర్ణవ్యవస్థ ఒక సాధనమైపోయింది. బలవంతులు దుర్బలులను బానిసలను చేసుకున్నారు. బానిసలకు, వారి సంతానానికి సమాజంలోని మిగిలిన ప్రజలకున్న ఎలాంటి హక్కులు ఉండేవి కావు. ఎడతెగని యుద్ధాలలో ఓడిన విజాతీయులందరినీ కూడా బానిసలుగానే మార్చేసేవారు. శకులు, పహ్లవులు, కుషాణులు మొదలైన విజాతీయ విజేతలు భారతీయ వర్ణవ్యవస్థలో క్షత్రియులుగా కలుపుకోబడ్డారు. జాతుల సమాగమంలో ఆ యా జాతులలోని వివిధ వృత్తులవారు భారతీయ వర్ణ వ్యవస్థలోని సమాంతర వృత్తులను స్వీకరించారు. గత సమాజంలోని నాలుగు వర్ణాలు సంకరమై, ఆ వర్ణ సంకరం కారణంగా కులం అనే ఒక నూతన సామాజిక వర్గం తలెత్తింది. వర్ణ సాంకర్యం ఫలితంగా పలు కొత్త కొత్త కులాలు పుట్టుకొచ్చాయి. సామాజికంగా బలహీనులైనవారికి ధర్మశాస్త్రాలు సేవా వృత్తిని కేటాయించాయి. ‘శూద్రం తు కారయేద్దాస్యమ్’ అంటూ ధర్మశాస్త్రాలు శూద్రులకు పై మూడు వర్ణాలవారికి నోరు మెదపకుండా సేవ చేసే బాధ్యతను అంటగట్టాయి. అయితే అంతటితో ఆగక సామాజికంగా శూద్రుడి స్థాయిని మరింత దిగజార్చడం కూడా జరిగింది. వేదకాలంలో లభించిన శూద్రుల శ్రమకు గౌరవం (Dignity of Labour) మటుమాయమైంది. సేవలు చేసి కూడా ఛీత్కారాలు పొందడం శూద్రుల వంతయింది. సమాజంలో శూద్రుడి స్థాయిని దిగాజార్చడానికి పలు కొత్త సిద్ధాంతాలు కనిపెట్టారు. వాటిలో అంటరానితనం ఒకటి. శూద్రుడు ముట్టుకున్న నీరు పై మూడు వర్ణాల ప్రజలు తాగేందుకు, వాడుకునేందుకు పనికిరానిదిగా నిర్ణయించారు. అపవిత్రమైన ఆ నీటికి ‘శూద్రోదకమ్’ అని పేరుపెట్టి దానిని తాకితే పాతకాలు చుట్టుకుంటాయని ప్రచారం చేశారు. ‘శూద్ర సంస్పర్శ’ అంటే శూద్రుడిని ముట్టుకున్నా పాతకం చుట్టుకుంటుందనే భావనను వ్యాపింపజేశారు. బ్రాహ్మణ శవాన్ని శూద్రుడు మోసినా, అది శూద్రస్పర్శ కారణంగా అపవిత్రమైపోయి, ఆ మృతునికి స్వర్గప్రాప్తి దక్కదని ప్రచారం చేశారు. మరొకపక్క స్త్రీలను అణగదొక్కడానికి కూడా పలు సిద్ధాంతాలు మొదలయ్యాయి. స్త్రీలకు సహజమైన ఋతుధర్మాన్ని ఒక అశౌచమని ప్రచారం చేసి, వారి పట్ల వివక్షాపూరితమైన వైఖరిని అవలంబించారు. వారిది చంచల స్వభావమని నిర్ధారణ చేసి, అన్ని దశలలో వారిపై పురుషాధిపత్యం ఉండితీరాలనే సిద్ధాంతం చేశారు. విధవ అయిన స్త్రీ ఎదురొస్తే పురుషుడికి కార్యసాఫాల్యం చేకూరదని ప్రచారంచేసి, వారిని కేవలం ఇంటికే పరిమితమైన ‘అసూర్యంపశ్య’ లుగా (ఎండ కన్నెరుగని వారిగా) మార్చివేశారు.
ఈ దశలో తామరతంపరగా ఏర్పడిన పలు కులాలవారికి తగిన వృత్తులను కేటాయించడం, వారి మధ్య సామాజికంగా ఎలాంటి ఒరిపిడి లేకుండా చూసేందుకు అందరికీ ఎవరి నియమాలు వారికి ఏర్పరచడం అవసరమైంది. అలాగే పనిలో పనిగా అగ్రవర్ణాలు తమ సామాజిక పెత్తనాన్ని కాపాడుకుంటూ, తాము సమాజంలో అన్ని విధాలుగా లాభపడే వర్గంగా కొనసాగేందుకు కూడా శ్రమజీవులను అలా నియమనిబంధనలలో బంధించడం అవసరమైంది. అప్పటికే సామాన్య ప్రజలలో ప్రశ్నించే తత్త్వం, హేతుదృష్టి, శాస్త్రీయ దృక్పథం వీలైన మేరకు తలెత్తకుండా సామాజిక పెత్తందార్లు జాగ్రత్త పడ్డారు. దానిలో భాగంగానే గతంలో అందరికీ అందుబాటులో ఉండిన వేదవిద్యలను స్త్రీలకూ, శూద్రులకూ అందకుండా చేశారు. చదువు మనోవికాసాన్ని కలిగించి, ఎప్పటికైనా అన్యాయాన్ని ప్రశ్నించే తత్త్వానికి తప్పక దారితీస్తుందని వారికి తెలుసు. అందుకే వారు గృహ నిర్వహణకు అవసరమైన మేరకే స్త్రీవిద్యను పరిమితం చేశారు. వేదం విన్న పాపానికి శూద్రుల చెవులలో సీసం కరగించి పోశారు. అపట్లో ధనుర్వేదం అనే విలువిద్య నేర్చుకొనడం బ్రాహ్మణ, క్షత్రియులకు మాత్రమే ఉన్నట్టి గుత్తాధికారం. పరశురాముడి నుంచి విలువిద్యను అభ్యసించడానికి సూతపుత్రుడైన కర్ణుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో, ద్రోణాచార్యుడు కౌరవపాండవులకు ధనుర్విద్యాబోధన చేస్తూ ఉండగా చాటునుంచి విన్న నేరానికి ఎరుకలవాడయిన ఏకలవ్యుడికి ఏ గతి సంప్రాప్తించిందో భారతం చదివినవారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. విద్యలు అధ్యయనం చేయడంలో కూడా క్రమంగా వివేచన స్థానంలో భట్టీయం (Learning by Rote) ప్రాముఖ్యం పెరిగింది. ప్రశ్నించే తత్త్వం స్థానంలో మౌనంగా అనుసరించడం మొదలైంది. వేదయుగంలో నూరేళ్ళుగా ఉన్న మానవుడి సగటు ఆయుర్దాయం పురాణేతిహాసాలలో అమాంతం వేల ఏళ్ళకు పెరిగిపోయింది. దశరథుడు, రాముడు, జటాయువు, సంపాతి మొదలైన వారంతా వేల సంవత్సరాలు జీవించినట్లు అశాస్త్రీయమైన కథలు అల్లారు. ‘రామాయణమ్’ లో వర్ణించినదాని ప్రకారం మతంగ మహర్షి శిష్యురాలైన శబరి అనే ఆటవిక స్త్రీ కిష్కింధలోని పంపా సరోవరం సమీపంలోని తన ఆశ్రమంలో పది వేల సంవత్సరాలపాటు రాముడి రాక కోసం ఎదురుతెన్నులు చూసిందట. అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు - ఈ ఏడుగురూ మరణం లేని చిరంజీవులట(అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః | కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః ||). మృకండు మహర్షికీ, మనస్వినికీ పుట్టిన మార్కండేయుడు, శివుడి కంటి చిచ్చుకి భస్మమైన మన్మథుడు తరువాత ఈ చిరంజీవుల జాబితాకెక్కారు. ఈ అశాస్త్రీయత అంతటితో ఆగలేదు. ఒకరు సప్తసముద్రాలనూ ఆపోసన పట్టారనీ, మరొకరు భూమిని చాపగా చుట్టారనీ కథలు పుట్టుకొచ్చాయి. కొండలకు ఒకప్పుడు రెక్కలుండేవనీ, వాటిని ఇంద్రుడు తన వజ్రాయుధంతో నరికాడనీ కథలు కల్పించారు. రావణుడికి పది తలలు, ఋష్యశృంగుడికి నెత్తిన మనుబోతు కొమ్ము ఉన్నాయనే నమ్మకాలు మొదలయ్యాయి. మాండూక్య ముని ఆడకప్పకూ, శుకయోగి ఆడ చిలుకకూ, శౌనక మునీంద్రుడు ఆడ కుక్కకూ పుట్టారంటూ పుక్కిటి కథలు పుట్టుకొచ్చాయి. ప్రజలలో హేతుదృష్టి లోపించిన కారణంగా, వారు అంతులేని అంధ విశ్వాసాల పాలైన కారణంగా నాటి ఆధిపత్య వర్గాలు అభివృద్ధి ఫలాలు కష్టజీవులకు దక్కకుండా చేయడం చాలా సులువైంది. ఇదండీ ‘మనుస్మృతి’ రూపొందే కాలంనాటి సామాజిక స్థితి.
Muttevi రవీంద్రనాథ్ garu బాగా చెప్పరనిపిస్తుంది. ఈ సనాతన ధర్మాలు ఒక వర్గం పెత్తనం చేయడానికి వక్రీకారించేబడినవి. కానీ ‘manusrumti’ యే మొట్టమొదటిదా ఇంకా ముందున్నాయా! ఎందుకంటే vasistudu త్రేతాయుగంలో కూడా చెప్పాడన్నారు. ఏమైనా సర్వమానవ సమానత్వం universal brotherhood కి ఇప్పుడు కృషి చేయడం హర్షణీయo.