Menu Close
balyam_main

మన్మథా... నవ మన్మథా...

- డా. రావి రంగారావు

మనవడితో రైలు ప్రయాణం

పండగ సెలవులు
ఊరకనే అయిపోయాయి,
ఇక తప్పక వాణ్ని
వాళ్ళింట్లో వదిలిపెట్టి రావాలిగా...
రైల్లో ఇద్దరం బయలుదేరాం...

వాడికి కనిపించిన వన్నీ
వా డడుగుతుంటాడు,
నా క్కావల్సినవి
నే నడుగుతుంటాను...

పాపిడీ కొనిపెట్ట మంటాడు,
వాడి ముఖం  మీద
ఓ ముద్దడుగుతా న్నేను...

మషాలా కావాలంటాడు,
ఓ సారి వాణ్ని
వాటేసుకుంటా నంటాను...

వేరుశనగ కాయలు తింటా నంటాడు,
వాడి బుగ్గ  మీద
చిటికె లేస్తా నంటాను...

 కనిపించే వన్నీ కావాలని వాడి కోరిక,
అందిన చోటల్లా
ముద్దులు పెట్టుకోవాలని నా తపన...

నా జేబులు ఖాళీ చేస్తుంటాడు వాడు,
అయితే నేం-
నా జేబు వెనకున్న నా గుండెను
అమృతంతో నింపుతుంటాడు...

ప్రియురాలి కన్నా తియ్యనిది
ఈ ప్రపంచంలో లేదనే వాళ్ళు నూతిలోని చేపలు,
మనవడిలోని మధురిమ
త్రిమూర్తుల దర్సనం కన్నా మిన్న...

దేవతలు కట్టిపడేసుకున్నా రనే
అపవాదుకు భయపడి అమృతం
స్థావరాలు మార్చుకుంటోంది,
ప్రేయసీ ప్రియుల పెదవులపై కొంతకాలం,
తాతామనవళ్ల మధ్య అనంతకాలం...

రైల్లో విండో సీటు కోసం
వాడికీ నాకూ పోటీ,
ప్రకృతిని చూడాలని వాడికి...
వాడి ప్రకృతితో పోటీ పడాలని నాకు...

బండరునుంచి బయలుదేరి
బెజవాడలో వాణ్ని వదిలొచ్చే టప్పుడు
వాడు కుండపోత వర్ష మవుతాడు,
చూస్తూ వాడి అమ్మ
నవ్వుతున్న మెరు పవుతుంది,
గంభీరంగా వాడి నాన్న
ఉరుముతున్న పిడు గవుతాడు...

నడుస్తున్న రైలు “కాలం”,
అందులో నా “జీవితం” ఓ ప్రయాణం...
వాళ్ళింటిలోంచి మెల్లగా
ఖాళీ గుండెతో
తిరిగి రైలు స్టేషనుకు  చేరుకుంటాను,
నా బయలుదేరిన స్టేషనుకు
రైలంత బరువుతో తిరిగి పోతాను.

 

Posted in November 2018, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!