ఆరని మంట

అదొక … చిన్న నిప్పు కణిక
తనకి తనే మొలకెత్తిన ఓ నిప్పుక
విత్తెవరు నాటారో వివరంగా తెలియదు
…చిన్నదైనా చిర చిర లాడుతోంది
పరుల సాయం లేకనే
ఇంతింతై వటుడింతై అన్నట్లు
ఎదుగుతున్న అర్చి ఇది
కట్టె… పిడుక… మంటచమురు
మద్దతు వలదంది
వీవనలవసరం లేదంది
పిల్ల తెమ్మెరల పనిలేదంది
మిన్ను విరిగి మీద పడ్డా
మండుతునే ఉంటుంది
మబ్బులనే సవాలు చేస్తుంది
అక్కసు కక్కుతున్న అనలం ఇది
ఆపలేని ఆరిపోని ……….
అసూయ ఆగ్రహం అహం
ఆవేశం అక్కసం తన ఊపిరంది
అప్పుడప్పుడు అడపదడప
ప్రతి జీవిలో ప్రజ్వరిల్లే
పెనుమంటనంది…!
జ్ఞాపకాలు

సెలయేటి గట్టున సవ్వడి చేయని గులక రాళ్ళు
మెదలక ఉన్నాయి తెలుసా! ఎన్ని నాళ్ళు!
చల్లని నీరు తనువు తాకగనే చెంగునెగిరి
చిలిపి కథలు చెవిన వేయు! విను వెళ్ళు!
ఊరిబయట ఒంటరి కొండల బారులు
ఊపిరి తీయక ఉగ్గుతున్న బండరాళ్ళు
మనిషి కనబడితే చాలు మొగ్గలు వేసి
కొండలెక్కిన వీరుల కథలు చెవిన వేయు!
శతాబ్ధాల తరబడి శౌర్యంగా నిలబడ్డ
పేరు ఊరు లేని పెక్కు ఊడల చెట్లు
గాలి సోకినంతనే గల గల నవ్వి
నవ్వుల నేనెరుగని గాధలు వెదజల్లు!
ఏటి వొడ్డిన నున్నని ఇసుక తిన్నెలు
చిన్ననాటి నా చిక్కని నేస్తాలు
ఒక్క క్షణం ఆగి కూర్చుంటే చాలు
తలపుకు తెచ్చు నే కట్టిన పిచ్చిక గూళ్ళు!
ఈ వంకర రోడ్లు ఆ టింకర గోడలు
మరపురాని మధుర సృతులు
ఎన్నిమార్లు అడిగినా విసుగు లేక వినిపించే
ఎదను కోసి మురిపించే నును మెత్తని జ్ఞాపకాలు !