Menu Close
VSRao
మహాత్మా గాంధి
డా. వల్లూరుపల్లి శివాజీరావు
Mahatma-Gandhi
Image by WikiImages from Pixabay

దక్షిణ ఆఫ్రికా భారత కూలీల ఎడల తెల్లవారి ప్రవర్తన, పోలీస్ నుంచి గాంధీజీకి జరిగిన అవమానం

1888 లో చేసిన చట్టం ప్రకారం దక్షిణ ఆఫ్రికాలోని ‘Orange Free State’ లో ప్రవాస భారతీయులకు ఉన్న మానవ హక్కులు రద్దు చేయబడ్డాయి. వారు ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేయాలనుకుంటే హోటళ్లలో సేవకులు (waiters), ఇళ్లల్లో నౌకరు లాంటి వాటికి మాత్రమే పరిమితం అవ్వాలి. వర్తక, వ్యాపారం చేసే వారికి నామమాత్రపు పరిహారం ఇచ్చి తరిమివేసేవారు. వీరు ఈ అన్యాయాన్ని నిరసిస్తూ ఎన్నో సార్లు నివేదనలు సమర్పించినా, అది వృధా ప్రయాసే అయింది.

1885 లో Transvaal లో అతి కఠినమైన చట్టాన్ని ప్రవేశపెట్టటం జరిగింది. మరుసటి సంవత్సరం ఈ చట్టంలో కొన్ని మార్పులు చేయబడ్డాయి. వాటి ప్రకారం Transvaal లో ప్రవేశించటానికి ప్రతి భారతీయుడు 3 పౌండ్లు సుంకం చెల్లించాలి; అది చెల్లించి ప్రవేశించినా, ప్రభుత్వం నిర్ధేశించిన ప్రాంతంలో భూమి కొనగూడదు. ఒక వేళ కొన్నా, వారికి పూర్తి హక్కు ఉండదు; ప్రజలు నడిచే కాలి బాటల (foot paths) మీద వీరు నడవ కూడదు; రాత్రి 9 గంటలు దాటిన తరువాత వీధులలో నడవటం నిషిద్ధం. నీగ్రో జాతీయులకు ఉద్దేశించిన ఈ నిబంధనలు భారతీయులకు కూడా అన్వయించటం జరిగింది. వీరిలో ఆరబ్బులు (Arabs) గా గుర్తించబడిన వారికి మాత్రం వీటినుంచి మినహాయింపు ఉంది. కాని ఈ మినహాయింపు పోలీసుల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి ఉంది.

ఈ విషయాలు గాంధీజీ ఈ విధంగా వివరించారు.

“ఈ నియమాల ఫలితం నేను కూడా అనుభవించవలసి వచ్చింది. నేను తరచు క్రైస్తవ పెద్ద Mr. Coates తో కలిసి రాత్రి వేళల్లో బయటకు వెళ్లి నడుస్తూ ఉండేవాడిని. మేము సాధారణంగా ఇంటికి రాత్రి 10 గంటల లోపు తిరిగి వెళ్ళేవాళ్ళం కాము. ఒక వేళ పోలీసు నన్ను ఆపి నిర్బంధిస్తే ఎలా? దీనిని గురించి నా కంటే Mr. Coates ఎక్కువగా కలవరపడేవాడు. అతను కొంతమంది నీగ్రో సేవకులకు అనుమతి పత్రాలు ఇచ్చేవాడు. కాని బారిష్టర్ అయిన నాకు అతను ఎలా ఇవ్వగలడు? ఒక అధికారి మాత్రమే నాకు ఇవ్వగలడు? నేను కావాలంటే అతను ఒక పత్రం ఇవ్వటానికి సిద్ధమే. కాని అది నా దృష్టిలో పక్షపాతం, మోసం అవుతుంది కాబట్టి నాకు ఇష్టం లేదు.”

ఈ సంకట స్థితిలో అతను నన్ను ఒక ప్రభుత్వ న్యాయవాది Dr. Krause (Frederick Edward Traugott Krause: 1868-1959) వద్దకు తీసుకువెళ్లాడు. ఆయన ఇంగ్లాండ్ లో నేను బారిష్టర్ చదివిన Inner Temple లోనే బారిష్టర్ అయ్యాడు. ఆయన నామీద సానుభూతితో పోలీసులు నాజోలికి రాకుండా ఏ సమయంలోనైనా స్వేచ్ఛగా సంచరించవచ్చని ఒక అధికార పత్రం ఇచ్చాడు. నేను బయటకు వెళ్ళినప్పుడు దీనిని నేను వెంట తీసుకువెళ్ళేవాడిని.

కొన్నాళ్ళకు Dr. Krause నన్ను తన ఇంటికి ఆహ్వానించి ఆతిధ్యమిచ్చాడు. మేము మిత్రులయిన తరువాత ఆయన తన సోదరుడికి నన్ను పరిచయం చేశాడు. ఈయన (సోదరుడు) మొదటి Boer War (1880-81) సమయంలో ఒక ఇంగ్లీషు అధికారి హత్య కేసులో ముద్దాయిగా ధృవీకరించబడి 7 ఏళ్ళు జైలుశిక్ష అనుభవించాడు. ఈ కారణంగా ఈయన న్యాయవాదుల సంఘం నుంచి వెలివేయబడ్డాడు. ఈయన, తరువాత నిర్ధోషి అని తెలిసి విడుదలచేయబడి న్యాయ వృత్తిని కొనసాగించాడు. ఆ అన్నదమ్ములతో నాకు ఉన్న స్నేహం తరువాతి కాలంలో చాలా ఉపయోగపడి, నా పనులు సులభంగా నెరవేర్చటానికి వీలయింది.

రాత్రి వేళ వీధులలో కాలి బాటలమీద నడిచే విషయంలో ఉన్న నియమాలు నాకు ఆందోళన కలిగించే సమస్యగా తయారయింది. నేను నిత్యం ‘President Street’ లో నడిచే అలవాటు ఉంది. Orange Free State అధ్యక్షుడు ‘Paul Kruger’ నివాసం ప్రిటోరియాలో ఈ వీధిలోనే ఉంది. అది చాలా నిరాడంబరంగా ఉన్న చిన్న ఇల్లు. ఆ ఇంటి ముందు పోలీసులు కాపలా కాస్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక అధికారి నివాసమని తెలుస్తుంది. నేను ప్రతిరాత్రీ ఆ ఇంటిని దాటుకుంటూ వెళ్తుంటాను.

ఒక రోజు రాత్రి ఆ ఇంటి ప్రక్కన ఉన్న కాలిబాట మీద నడుస్తున్నప్పుడు ఒక పోలీస్ అకారణంగా, హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా నన్ను పట్టుకుని క్రిందకు తోసి కాలితో తన్నుతూ వీధిలోకి పడవేశాడు. నేను ఆశ్చర్యంతో, భీతితో ప్రశ్నించే లోపే అటువైపు అటువైపునుంచి గుర్రం మీద వస్తున్న Mr. Coates ఇది గమనించి ‘మిస్టర్ గాంధి, నేను జరిగినదంతా చూశాను. ఇతని మీద నీవు కేసు పెట్టినప్పుడు నీతరఫు సాక్షిగా నేను కోర్టులో జరిగినదంతా చెపుతాను. నిన్ను అంత దారుణంగా కొట్టటం నాకు విచారం కలుగజేసింది’ అని నన్ను స్వాంతన పరిచాడు.

నేను అందుకు సమాధానంగా ‘నీవు విచారపడవద్దు. ఈ నిర్భాగ్యుడికి ఏమి తెలుసు? ఇతనికి శ్వేతజాతేతులందరు ఒక్కటే. ఇతను నీగ్రో జాతి ప్రజలను అవమానపరచినట్లే నన్ను కూడా అవమాన పరిచాడు. నాకు జరిగిన అవమానానికి కేవలం ఒక వ్యక్తిని శిక్షించటానికి నేను న్యాయస్థానానికి వెళ్ళకూడదని నా నియమం. ఈ తప్పు అసలు ఈ ఆంక్షలు విధించిన ప్రభుత్వానిదే. దానిని వ్యతిరేకించాలి’ అని సమాధానమిచ్చాను.

‘ఇది నీ వ్యక్తిత్వం అని నాకు తెలుసు. కాని మరొక్కసారి ఆలోచించు. ఇటువంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పటం అవసరం’ అని నాతో చెప్పి పోలీస్ కు చివాట్లు పెట్టాడు. వారు మాట్లాడింది డచ్ భాష; వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. అతను నా వద్దకుకు వచ్చి క్షమాపణ కోరాడు. అతనిని అంతకు ముందే క్షమించివేశాను.

ఈ సంఘటన జరిగిన తరువాత నేను రోడ్డుమీద నడవలేదు. కాని ఇచ్చట ఉన్న భారతీయుల గురించి ఆలోచించటానికి ఒక కారణమయింది. అప్పటినుంచి దుర్భరమైన వీరి జీవన పరిస్థితులు ఎలా మెరుగుపరచాలా అనే తపనతో ఆలోచన మొదలుపెట్టాను. కాని ప్రస్తుతం నా విధ్యుక్త ధర్మం నా కక్షిదారు (client) ‘దాదా సేథ్ అబ్దుల్లా’ కు న్యాయం చేకూర్చటం.”

సేథ్ అబ్దుల్లా కేసులో ఆయనకు న్యాయం చేకూర్చటం

ప్రిటోరియాలో ఉన్న కాలం గాంధీజీకి జీవితంలో వెలకట్టలేనంత అనుభవం సమకూర్చింది. ఇచ్చటే ఆయన ప్రజలకు ఉపయోగపడే అవకాశాల గురించి తెలుసుకోటానికి, దీనితో పాటు వీటిని పరిష్కరించ గలిగే నైపుణ్యం పెంపొందించుకోటానికి వీలయింది. మతం జీవితానికి కావలసిన ధైర్యం, శక్తిని ఇస్తుందని కూడా అనుభవమయింది. అలాగే, ఇచ్చటే ఒక న్యాయవాదికి అవసరమయిన నైపుణ్యం, అనుభవం సంపాదించుకోవటంతో పాటు ఒక పరిణితి చెందిన న్యాయవాదిగా మారటం సాధ్యమయింది.

ఈ కేసులో కక్షిదారుడు (client) ‘దాదా సేథ్ అబ్దుల్లా’, ప్రతివాది (defendent) ‘సేథ్ త్యేబ్’ (Tyeb Haji Khan Muhammad) దగ్గర బంధువులే. నాటాల్ లో సేథ్ అబ్దుల్లా కు ఎటువంటి స్థానం ఉందో, ప్రిటోరియాలో సేథ్ త్యబ్ కు అటువంటి స్థానం ఉంది. వీరిరువురి మధ్య ఉన్న వివాదం చిన్నదేమీకాదు. ఇది 40,000 పౌండ్లకు సంబంధించినది. ఇందులో చాలా చిక్కుముడులున్నాయి. ఇరు పక్షాల మధ్య ఉన్న వైరం లావాదేవీలకు సంబంధించిన ప్రామిసరీ (promissory) పత్రాల గురించి. ప్రతివాది సేథ్ త్యేబ్ తన వద్దనుంచి వాది సేథ్ అబ్దుల్లా ఈ ప్రామిసరీ పత్రాలు వంచనతో వ్రాయించుకున్నాడని ప్రధాన ఆరోపణ. ఈ ఇద్దరు మంచి న్యాయవాదులను, సలహాదారులను నియమించుకున్నారు. ఈ క్లిష్టమైన కేసులో వాస్తవాలను వెలికితీసి, వాటిని సమర్ధవంతంగా కావలసిన సాక్ష్యాలు, బలం చేకూర్చటం సాక్ష్యాలు, బలం చేకూర్చటం ఈ 24 ఏళ్ల బారిష్టర్ ముఖ్య కర్తవ్యం.

ఈ కేసు గురించి బారిష్టర్ గాంధీజీ మాటలలోనే తెలుసుకుందాము.

“ఈ కేసు ఎడల నాకు ఎంతో ఆసక్తి కలిగి అందులో పూర్తిగా నిమగ్నమయ్యాను. ఈ ఇరువురి మధ్య జరిగిన లావాదేవీలు క్షుణ్ణంగా పరిశీలించాను. నా కక్షిదారు ‘సేథ్ అబ్దుల్లా’ దక్షత గల వ్యక్తి. నా మీద ఆయనకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఈ పనిని సులువుగా నిర్వర్తించటానికి వీలయింది. నేను అకౌంట్ పుస్తకాలలో ఉన్న జమ-ఖర్చు వివరాలు పూర్తిగా చదివి ఆకళింపుచేసుకున్నాను. దీనికి సంబంధిచిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఎక్కువ గుజరాతులో జరిగాయి కాబట్టి, వీటిని ఇంగ్లీషులోకి అనువదించాను.

నేను ప్రజా సంబంధిత, మత సంసర్గ విషయాలమీద దృష్టి పెట్టినా, ఎక్కువ సమయం న్యాయ శాస్త్ర పుస్తకాలను చదవటానికి వెచ్చించాను. తద్వారా, ఈ కేసు వాస్తవాలు వాది, ప్రతివాది కంటే ఎక్కువ అర్ధం చేసుకోగలిగాను. ప్రముఖ న్యాయకోవిదుడు Frederick Pincutt దృష్టిలో వాస్తవాల మీదనే ముప్పాతిక పాళ్ళు న్యాయం ఆధారపడివుంటుంది. న్యాయం (justice) నా కక్షిదారుని పక్షాన ఉన్నా న్యాయసూత్రం (law) ఆయనకు వ్యతిరేకంగా ఉండవచ్చు. దీనిని గురించి ‘సేథ్ అబ్దుల్లా’ న్యాయవాది Mr. Leonard ను సంప్రదించగా ఆయన ‘Mr. Gandhi, నీవు వాస్తవాలమీద కేంద్రీకరిస్తే న్యాయసూత్రం నీ పక్షానే ఉంటుంది. అందువల్ల మరికొన్ని వాస్తవాలను వెలికి తీసి, వాటిని క్రోడీకరించు’ అని సలహా ఇచ్చాడు.

వాస్తవాల గురించి మరింత లోతుగా పరిశోధనచేస్తే ఒక ముఖ్యమైన అంశం బయటకు వచ్చింది. దీనిని Mr. Leonard కు చూపిస్తే ‘దీనిని ఆధారంగా చేసుకుని కేసు వాదిస్తే మనం తప్పని సరిగా గెలుస్తాం’ అని భరోసా ఇచ్చాడు. వాస్తవాలు (అంటే నిజాలు, న్యాయం) ఎప్పుడూ నిజం పక్షానే ఉంటాయి. ఈ నిజాలు, న్యాయం సేథ్ అబ్దుల్లా వైపున ఉన్న ఈ వ్యాజ్యం (litigation) వాయిదాలతో పొడిగిస్తే ఎక్కువ కాలం వాది, ప్రతివాదులు ఇద్దరూ ఆర్ధికంగా నష్టపోతారు. ఇది ఎంతకాలం కోర్టులోనే ఉంటుందో తెలియదు. అందువల్ల ఈ కేసు ఎంత త్వరగా ముగిస్తే అంత లాభదాయకం.

నేను వెంటనే ‘సేథ్ త్యేబ్’ ను కలిసి మధ్యవర్తి సూచించిన విధంగా ఒడంబడిక చేసుకుంటే మంచిదని సూచిస్తూ, ఆయన సలహాదారును సంప్రదించమని కోరాను. ఇరుపక్షాలకు నమ్మకమైన వ్యక్తి మధ్యవర్తిత్వం నిర్వహిస్తే, ఈ కేసును వెంటనే ముగించవచ్చు; ఇది ఇంకా కొనసాగిస్తే న్యాయవాదుల ఖర్చులు విపరీతంగా పెరిగి ఇరు పార్టీల ఆర్ధిక బలాన్ని కృంగతీస్తాయి. ఇదిగాక బంధువులు గుజరాత్ లో ఒకే ఊరినుంచి వచ్చిన ఈ ఇరువురి మధ్య శత్రుత్వం పెరుగుతూనే ఉంటుంది; ఒకవేళ వాది కేసు గెలిచినా ఇంతవరకు పెట్టిన ఖర్చులు వెనక్కి రావు; వీటికి తోడు గెలిచినా పార్టీనుంచి కోర్టువారు కూడా తమ ఖర్చులు వసూలు చేస్తారు.

ఈ విషయాలన్నీ ‘సేథ్ త్యేబ్’ ను కలిసి విపులంగా విశదీకరించాను. చివరకు ఆయన మధ్యవర్తి ఒడంబడికకు అంగీకరించాడు. వెంటనే ఒక  వ్యక్తిని మధ్యవర్తిగా ఎన్నుకుని ఆయన ఎదుట కేసు గురించిన వాదోపవాదాలు జరిగాయి. చివరకు నా కక్షిదారు సేథ్ అబ్దుల్లా గెలిచాడు.

ఈ దశలో గెలుపు నాకు పూర్తి సంతృప్తి ఇవ్వలేదు. ‘సేథ్ అబ్దుల్లా’ తనకు రావలసిన పైకం అంతా ఒక్కసారిగా ఇవ్వమంటే సేథ్ త్యేబ్ అంగీకరించడు. చివరకు అంగీకరించబడిన ప్రత్యామ్నాయ మార్గంగా రెండు సంవత్సరాలపాటు చిన్న చిన్న మొత్తాలుగా 37,000 పౌండ్లు సేథ్ త్యేబ్ ‘సేథ్ అబ్దుల్లా’ కు ఇచ్చేటట్లుగా అంగీకారం కుదిరింది. దీనికి బంధువులిరువురు అమితానందం పొందారు.

ఈ కేసు ద్వారా నిజమైన న్యాయవాది వృత్తి ఎలా ఉంటుందో అర్ధమయింది. ఈ ప్రయత్నంలో మానవ హృదయాలను అర్ధం చేసుకునే సత్తువ, వీటిని గెలవగల నైపుణ్యం నాలో సంతరించుకున్నాయి. తద్వారా నేను ఆర్ధికంగా నష్టంపోలేదు, ముఖ్యంగా ఆత్మసాక్షి (మనసాక్షి) విషయంలో. ఇది నా భవిష్యత్తుకు గట్టి పునాది అయింది.”

Mahatma-Gandhi-24Years
23 సంవత్సరాల, 5 నెలల, 24 రోజుల వయస్సులో దక్షిణ ఆఫ్రికా డర్బన్ లో తలపాగా ధరించిన యువ న్యాయవాది (‘కూలీ బారిష్టర్’), మోహన్ దాస్ గాంధి

****సశేషం****

Posted in March 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *