మహాభినిష్క్రమణ
- డా. బి. బాలకృష్ణ
నింగి నుంచి చినుకొకటి విసురుగా వచ్చి
నేలను తాకుతుంది
పుడమి తనువులో ప్రవేశించి
అది మమతల బంధాన్ని అల్లుకుంటుంది
మట్టి ఆకర్షణలో పడ్డ నీటిబొట్టు
తన అస్తిత్వాన్ని కోల్పోయి
ప్రాణుల్లో ప్రాణమై వెలుగుతుంది
మట్టి ఒక బంధం, మట్టి ఒక ఆకర్షణ,
మట్టి ఒక జీవితం, ఇవి ఎంత నిజమో!
మట్టి వొట్టి మాయ అన్నది
అంతే వాస్తవమని గ్రహించిన చినుకు
ఆ నేలగుండె పొరల్లోంచే
పరివ్రాజకునిలా ప్రపంచమంతా తిరుగుతుంది
సత్యార్థం కోసం ఒక గూటికి చేరిన సన్యాసుల్లా
తనలాంటి బిందువులెన్నో సింధువులలో కన్పిస్తుంటే
సంతోషం ఉప్పొంగి సాగుతుంది.
జలప్రపంచంలో ఎన్ని నీరువులో, ఎన్ని విన్యాసాలో
కొన్ని మంటలను రగిలిస్తాయి, కొన్ని ఆర్పుతాయి
కొన్ని దాహాన్ని తీరుస్తాయి, కొన్ని పెంచుతాయి
దేని పోకడ దానిది, దేని అస్తిత్వం దానిది.
అన్ని నీరువులలో కలసి పోయి కూడా
ఆ నీటిచుక్క తన మూలాల కోసం
ఆలోచిస్తుంది, ఆరాటపడుతుంది
తనలో మట్టి, గాలి, నిప్పు, నీరు కానిదేదో
ఉందని అనుమానపడి మేఘాలను అడుగుతుంది.
తన పుట్టుక ఒక చట్రమని తెలిసాక
ఆ చక్రాన్ని వహించే శక్తి కోసం అన్వేషిస్తుంది
కాలలయాతీతమై వెలుగొందే కాంతిపుంజానికై కదులుతుంది,
అనంతశక్తి చైతన్య రూపానికి అడుగులేసే క్రమంలో
మట్టి ఆకర్షణను తెంచుకొన్న నీటి చుక్క
ఆవిరై, ఊర్థ్వాభిముఖంగా మహాభినిష్క్రమణ చేస్తుంది.