తామర పువ్వు
తామర పువ్వును లేక పద్మమును ఆంగ్లం లో ‘లోటస్’ అంటారు. హృదయకమలము అని ఆధ్యాత్మికంగా వాడుతారు.
దీనికి దీని అందమైన పూరేకుల్లా చాలా పేర్లే ఉన్నాయి. కమలము, తమ్మికంటి, తమ్మికెంపు, అంబుజము, అంభోరుహము, అరవిందము, ఇందీవరము, కంజాతము, కుటపము, కుముదము, జలజము, జలేజాతము, తమ్మి, తామరసము, తోయజము, తోయరుహము, నలినము, నళిని, నాళీకము, నీటిపుట్టువు, నీరజము, నీరుపుట్టువ, నీరేరుహము, పంకజము, పంకరుహము, పద్మము, మబ్బుపూపుట్టువు, రాజీవము, వనజము, వారిజము, శతపత్రము, శృంగము, సరసిజము, సరసీరుహము, సరోజము, సరోజని, సరోరుహము, సహస్రపత్రము, సారంగము, సారసము, సుజలము అనీ తమిళములో తామరై, కన్నడములో తామ రెహువ్వు, హుళకడ్డి, గజకర్ణ అనీ అంటారు. ఈపేర్లు మనం కూడ అపెట్టుకుంటాంకదా!
చాలా అందమైనదీ, మనస్సును దోచుకునేదీ ఈ పూవు. తామరాకులు గుండ్రంగా, కాడలపై చిన్న చిన్న ముళ్ళతో ఉంటాయి. ఆకుల పైభాగం నీటిలో ఉన్నా తడవక పోడం విశేషం. తామర మొక్కలు ముఖ్యంగా కోస్తా తీర గ్రామాల్లో ఉండే మంచినీటి చెరువుల్లోనూ, ఆలయాల ముందున్న సరస్సుల్లోనూ, పార్కుల్లోని నీటి గుండాల్లోనూ కనిపిస్తాయి. వీటి ఆకుల్లో పూలుకట్టి ఇచ్చేవారు. తామర పువ్వుల్లో తెలుపు, లేత గులాబీ రంగు ఇంకా చాలా రకాలున్నాయి. ముద్ద లేత గులాబీ రంగు తామర పువ్వు భారత దేశ జాతీయ పుష్పం. సీతామాత తొమ్మిదిరకాల పూలతో పారవ్తీమాతను పూజించిందని రామాయణం లో చెప్పడం జరిగింది.
కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.
ఏ వస్తువైనా సరే తమ తమ స్థానములలో ఉన్నప్పుడే వాటి మద్య స్నేహం సాగుతుంది. ఎపుడైతే ఆ స్థానాలు మారిపోతాయో తమ మిత్రులే శత్రువులుగా మారతారు. కమలము నీటిలో ఉన్నంతవరకే సూర్యకాంతికి వికసిస్తుంది నీటి నుంచి బయటపడిపోతే
ఆ సూర్యకాంతికే వాడిపోతాయి అనే నీతి పద్యం ద్వారా మానవాళికి ఎంతో హితం చెప్పారు సుమతి శతకకారుడు బద్దెన కవి.
తామర పువ్వులు సువాసన కలిగి ఎంతో అందముగా, పెద్దవిగా ఉండడం వలన పూజలలో ఉపయోగిస్తాం. పంచ పుష్పాల్లో తామర ఒకటి. దీన్నే మనం కమలం అంటాం కూడా.
వందే పద్మాకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం-
హస్తాభ్యామభయ ప్రదాం మణిగణైర్నానా విధైర్భూషితాం -
భక్తా భీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మదిఖి: సేవితాం -
పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభి:-
వాచం పద్మాలయాం పద్మాంశుచిం స్వాహాం స్వధాం సుధాం--
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్ష్మీం పద్మ సుందరీం
పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం ..
అంటూ లక్ష్మిమాతను నిత్యం దారిద్య విమోచనంకోసం పఠించే స్తోత్రం పద్మంతోనే మొదలవుతుంది. దేవతలంతా పద్మం మీదేకూర్చుని ఉండటం మనం గమనిస్తాం. ఈ పుష్పాలకు వైద్యంలో స్థానం ఉంది. ఆయుర్వేదంలో కేసరాలనూ, కాడలనూ అతిసార వ్యాధికి, కామెర్లకు, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు. దీని పూల రసం దగ్గు నివారణకు, మూలవ్యాధి, రక్తస్రావం తగ్గించనూ వాడుతారు. ఆయుర్వేద వైద్యంలో చర్మ వ్యాధులకు, కుష్ఠువ్యాధి నివారణకు ఉపయోగిస్తారు.
బ్రహ్మ, విష్ణు భగవానుని నాభిస్థానం నుండి అయోనిజునిగా ప్రభవిల్లడం మనకు శాస్త్రాల ఆధారంగ తెలుస్తున్నది. అందుకే బ్రహ్మను అంబుజగర్భుడు, అంబుజాసనుడు, అంబురుహగర్భకుడు, అంభోజజని, అంభోజజన్ముడు, అంభోజజుడు అని పిలుస్తాం.
తెల్లకమలం మీద వాగ్దేవి సరస్వతీమాత ఆశీనురాలై కోరిన వారికి చక్కని విజ్ఞానాన్నీ విద్యనూ ప్రసాదిస్తూ ఉంటుంది. సర్వస్వతీ మాత వాహనమైన హంస తామరతూడుల్లోని గుజ్జును మాత్రమే తింటుందని మనకు తెల్సు. అంత స్వచ్చమైన ఆహారం సేవించే హంసకు అందుకే అంత గుర్తింపు. గొప్ప తపస్సంపన్నులను పరమ హంస అని గౌరవంగా పిలుస్తాం. మరి కమలం యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలిసింది కదా!
ఏవి నీటిలో ములుగుతాయ ? మట్టం పెరిగితే కాడ త్రెంచుకొని తేలుతుంది అన్నది వాస్తవమా ?
హైమవతి గారు,మేము చాలా విషయాలు నేర్చుకున్నాము.