“కవీ! నాలుగు దోశెలు వేసి పెట్టవే!” అడిగింది లలిత. మౌనంగా లలిత పారాయణం చేసుకుంటున్న కవిత సైగలతో టేబుల్ మీద హాట్‌బాక్స్ చూపించింది.
“చట్నీ ఎక్కడ పెట్టావే?” మళ్ళీ అడిగింది లలిత. రుసరుసలాడుతూ వచ్చి టేబుల్ మీద గిన్నె మూత తీసి చూపించి, వంటింట్లోకి వెళ్ళిపోయింది.
దోశె తిన్న ప్లేట్ సింక్‌లో పడేసి పక్కనే బియ్యం కడుగుతున్న కవితతో లలిత చెప్పింది, “నాకు ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్, వంట చేసేసి పెట్టి వెళ్ళవా ప్లీజ్!” అంటూ గారాలుపోయింది.
పారయణం అయిపోవడంతో, “ఎన్నిసార్లు చెప్పాను నేను లలిత చదువుతున్నప్పుడు మధ్యలో మాట్లాడించకని! నాకు తెలియదా! తమరికి దోశెలు పోయడం రాదని. పైగా నిన్ననే చెప్పావుగా ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ అని, చట్నీ ఎక్కడ ఉంటుందే… మరీ తయారవుతున్నావు? టేబుల్ మీద చూసుకునే పని లేదా!” అంటూ లలితతో దెబ్బలాటకి దిగింది కవిత.
“కాబోయే ఆడపడుచునన్న మర్యాద లేకుండా ఏంటే నీ జులుం?” అంతే ధీటుగా అడిగింది లలిత.
”ఇంత గయ్యాళి ఆడపడుచని తెలియక ఒప్పుకున్నాను సంబంధం. తెలిసుంటే ఒప్పుకునే దాన్ని కాదు ఈ పెళ్ళికి!” అంది కవిత.
ఇంతలో లలిత అన్నయ్య పవన్ వీళ్ళ అల్లరి విని రూమ్‌లో నుండి వస్తూ, “సరిపోయింది! మీ గొడవతో నా పెళ్ళికి ఎసరు పెట్టెలా ఉన్నారు. ఏంటి లల్లీ! మా కవిని అప్పుడే కాల్చుకు తింటున్నావా?”
“అంతేలేరా, ముందొచ్చిన చెవుల కన్న వెనకొచ్చిన కొమ్ములు వాడి అని” ఏడుపు నటించింది లలిత.
“నా దోస్త్ నన్ను ఏమైనా అంటది. మధ్యలో నీకేంటి?” పవన్‌ని అడిగింది కవిత.
“బానే ఉంది. నీ తరపున మాట్లాడటానికి వచ్చాను చూడు, నన్ననుకోవాలి” అని మూతి ముడుచుకున్న పవన్ని కవిత, లలితలు బుజ్జగించారు.
లలిత, కవిత స్నేహితులు. అమెరికాలో ఎమ్.ఎస్. చేయడానికి ఒకే యూనివర్శిటీలో సీట్ రావడంతో, తెలిసిన స్నేహితుల ద్వారా వీరికి పరిచయం కలిగింది. కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. వారి స్నేహంలో లలిత అన్నయ్యతో, కవిత పరిచయం ప్రేమగా మారి పెళ్ళి వరకు వెళ్ళింది.
కారణం లలితే. కవితలాంటి మంచి వదిన దొరకదని, కవితనే తన అన్నయ్యకి చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేసింది.
లలిత తల్లి జానకికి జాతకాలు, ప్రాంతం, కులము అంటూ పట్టింపులు ఎక్కువ. జాతకాలు కలవడంతో లలిత పని కాస్త సులువైంది. కాని, రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన దగ్గరనుండి జానకికి, ఈ ప్రాంతాల పట్టింపు రెట్టింపైంది.
ఒకరి పద్ధతులు ఒకరి తేడాగా అనిపించినా కూడా, మనకి తెలియని కొత్త పద్ధతులు, సాంప్రదాయాలు తెలుసుకునే వీలు ఉంటుందని లలిత వాళ్ళ అమ్మని ఒప్పించింది. పిల్లలు అంతగా ఒకరికొకరు అంత దగ్గరవడంతో జానకి కాదనలేకపోయింది.
అప్పటికే లలితకి చిన్ననాటి నుండి అనుకున్న దగ్గర బంధువుల సంబంధమే కుదిరి ఉంది. అబ్బాయిది కెనడాలో ఉద్యోగం. లలిత – కుమార్, పవన్ – కవితల పెళ్ళి వారం తేడాతో కుదుర్చుకొని, మాఘమాసంలో హడావిడిగా పెళ్ళి కానిచ్చారు. కాస్త సాంప్రదాయాల తేడా వల్ల కవిత తల్లి తలుపులమ్మ జానకిని అన్నీ అడిగి వివరంతో వాళ్ళ పద్ధతిలో జరిపించింది.
పిల్లలు నలుగురూ సెలవులు లేవని వెంటనే వెళ్ళిపోయారు. ఈ హడావిడి పెళ్ళి వల్ల వియ్యాలవారికి తరుచుగా కలవడం కుదరలేదు. పెద్దగా స్నేహం ఏర్పడలేదు. కవిత పుట్టిల్లు హైదరాబాద్ కాకపోవడం, జానకి హైదరాబాద్ విడిచి బయటి ఊరికి ఎప్పుడు వెళ్ళకపోవడంతో ఒకరిళ్ళకు ఒకరు వెళ్ళటం తక్కువే.
కూతురికి పిల్లలు పుట్టేవరకూ, కూతురి మెట్టిన ఇంట్లో భోజనం చేయకూడదనే నియమం వల్ల కవిత తల్లిదండ్రులు కూడా ఎప్పుడు వియ్యాలవారింటికి వెళ్ళినా, భోజనం చేయకుండా, కాసేపు కూర్చుని వచ్చేసేవారు. పిల్లల్ల మధ్య ఉన్న స్నేహం, అనుబంధం పెద్దల మధ్య లేకపోయింది.
హడావిడి పెళ్ళివల్ల తిరుపతి మొక్కు, ముచ్చట్లు సరిగ్గా జరగలేదని పెద్దలు బాధపడుతుంటే, రెండు జంటలు రెండు నెలలు సెలవులు పెట్టి ఇండియా వచ్చారు.
కవిత, లలిత ఇద్దరూ వారి అత్తగారింట్లోనే దిగి కొంతకాలం ఉన్నారు. దసరా పండగకని ఎవరి పుట్టింటికి వారు వచ్చారు.
లలిత పుట్టిల్లు, అత్తగారిల్లు ఒకే అపార్ట్‌మెంట్ కావడం చాలా చక్కగా వేడుకలన్నీ ఒక పూట ఇక్కడ, ఒక పూట అక్కడ తీర్చుకుంది.
కవిత మాత్రం బతకమ్మ మొదటిరోజు వాళ్ళ పుట్టింట్లో చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేసింది. మళ్ళీ సద్దుల బతకమ్మనాటికి పోవచ్చునని. తనకీ పండగ రెండు చోట్ల చేసుకున్న తృప్తి ఉంటుందని తలుపులమ్మ ఇచ్చిన సలహా. సద్దుల బతకమ్మనాటికి అందరూ రావాలని తలుపులమ్మ కవిత అత్తగారికి ఫోన్ చేసింది. దానికి జానకమ్మ గారు దశమి నాడు ఉదయం త్వరగా వచ్చేయాలనీ, నవమి నాడు ప్రయాణం వద్దనీ మాటల్లో చెప్పింది.
దానికి కవిత “లేదు అత్తమ్మ, మా ఊళ్ళ సద్దులు, దుర్గాష్టమి నాడు చేయము. పండగ మరునాడు చేస్తాం” అంది.
“అదేంటి? ఎనిమిదో రోజు చేస్తారు కదా?” అడిగింది జానకి. “లేదత్తమ్మ! మా ఊర్ల బతకమ్మ పండగైనంక మర్నాడు శుక్రవారం, మంగాళారం కాకుండ చూసుకొని, సద్దుల బతకమ్మ చేస్తం.”
“ఎప్పుడు వినలేదే, ఎందుకలాగా?” అడిగింది లలిత.
“బతుకమ్మ అంటే ఇంటి ఆడపిల్ల లెక్క. పండగ ముందు ఎవరైన ఆడపిల్లని పంపేస్తరా? పండగైనంక, ఒడిబియ్యం బోసి సాగనంపుతరు. మా ఊళ్ళ బతకమ్మ శాన బాగుంటది. ఈ హైదరబాద్‌ల మాకు ఆ సంబురం అనిపించది.”
“అయితే నువ్వు దుర్గాష్టమి నాడు వెళ్ళి పండగనాటికి వచ్చేస్తావు అనుకున్నానమ్మా!” అంది జానకి.
“అమ్మా నాకు కవి వాళ్ళ ఊళ్ళో బతకమ్మకి వెళ్ళాలని ఉంది” అంది లలిత.
“ఓహో! అందుకేనా, మీ అమ్మగారు పండగకి మీ అల్లుడుగారు వస్తారు కదా వదినా, సద్దుల బతుకమ్మకైనా నన్ను మా వదినగారిని తీసుకోని తప్పకుండా రమ్మని చెప్పారు.”
“అవునత్తమ్మ, ఈసారి పండగ గురువారం అయింది కదా, సద్దులు శనివారం అయితది. మీరు తప్పకుండా రండి లల్లీ” చెప్పింది కవిత.
“అయ్యో తప్పకుండా అమ్మ, మీ అమ్మగారు మరీ మరీ పిలిచారు, నాకేమో దుర్గాష్టమి నాడు బతకమ్మకి మీ ఊరు వెళ్ళి, నవమి నాడు ప్రయాణం ఎలా అని తెగ బాధపడ్డాను. మీరు ముందు వెళ్ళండి. మేమంతా ఆ రోజుకి వచ్చేస్తాము” చెప్పింది జానకి.
కొత్త అల్లుళ్ళతో ఇద్దరి ఇళ్ళలో పండగ ఘనంగా జరిగింది.
శనివారం ఉదయమే వచ్చేయమని, బతుకమ్మ చేయడం చూడవచ్చునని కవిత చెప్పడంతో, లలిత పోరుపడలేక ఉదయమే బయల్దేరారు కవిత ఇంటికి వియ్యాలవారు, వారి వియ్యాలవారు కూడా.
“బత్తకమ్మ తయారు చేసేసారా?” అని అడిగింది లలిత ఇంట్లో అడుగుపెడుతూనే.
“హా! మరీ మేడం గారొచ్చేవరకు వరకు ఆగుతామా? ఎప్పుడో అయిపోయింది. నువ్వు మేకప్ ఏసుకొని, సెంటు కొట్టుకొని వచ్చేవరకు ఆగుతానా మరీ?” ఉడికించింది కవిత.
అంతలో కవిత నానమ్మ, “ఏందే పిల్ల గా మాటలు? ఆడబిడ్డని నువ్వు అనబడితివి? గదీ, మీ అత్తమ్మ ముందు? అమెరిక పోయి నేర్చింది ఇదేనా? రాక రాక ఇయ్యలవారు, వాళ్ళ ఇయ్యాలవాళ్ళొస్తే ఇట్లనేనా మాట్లాడేది! పో లోపలికి పోయి ఫలహారాలు, చాయ్ తే పో!” తిట్టింది. పెద్దావిడ అరుపులకి అంతా ఆగిపోయారు.
కవిత నానమ్మ, జానకి గారి దగ్గరకి పోయి చేయిపట్టుకొని, “తప్పైందమ్మ! పిల్లకి ఇవరం తెలవది. మీ ఇంట్ల కుడా ఇట్లనే జేస్తాందా? నా మొకం చూసి మన్నించమ్మ, నేను నచ్చజెప్త” అని బతిమాలుకుంది.
“అయ్యో మామ్మగారు, అదేంలేదండి. చాలా కలిసిపోయింది మా ఇంట్లో. పిల్లలు స్నేహితులు కదా ఆ చనువు, అంతే” సర్దిచెప్పింది జానకి.
మురుకులు, సకినాలు, మక్కసత్తు, జొన్నసత్తు అని ఏవేవో కొత్త తినుబండారాలతో వచ్చింది కవిత. తలుపులమ్మ గారు ఒక్కో పదార్థం పేరు, అది చేసే విధానం చెప్పి మరీ రుచి చూపించారు.
“అన్నాలు తిన్నంక బతకమ్మ పేర్చాలా. పోయి గుమ్మడి పువ్వు, పొట్టలోకి ఆకు కొంచకరమ్మని ఈరిగానికి చెప్పి, పక్కింటి మేడ మీద పున్నాగ పూలు తెంపుకొని రా కవిత!” పురమాయించింది నానమ్మ.
“రావే లల్లీ! అలా వెళ్ళొద్దాం” పిలిచింది కవిత.
“వదినా అనాలే, రావే పోవే ఏంది? ఏనాడైనా మీ అమ్మ, మీ అత్తని గట్ల పిలుచుడు జూషినవ?”
“సర్లే! అట్లనే పిలుస్త తీ” సమాధానం చెప్తూ అక్కడనుండి వెళ్ళిపోయింది.
భోజనాలు అయ్యాక, బతకమ్మ పేర్చడానికి కూర్చున్నారు ఆడవారంతా. అటక మీద నుండి ఒక చాప తీయించి ఉదయం తెంపుకొచ్చిన పూలు పోసారు. గరుడవర్థనం పూలు మాలలు కడుతున్నారు. రంగులద్ది ఆరపెట్టిన రైలు కట్ట పూలు తీసుకొచ్చారు. రైలుబంతి పూలకి మందారలకి పుల్లలు గుచ్చారు. మూడు రంగుల గన్నేరు పూలు మాలలు కట్టారు. శంఖుపూలకి కూడా పుల్లలు గుచ్చారు.
“ఇవి ఏం పూలు?” టేకుపువ్వుని చూపిస్తూ లలిత. “అవి టేకుపువ్వమ్మ!” చెప్పింది తలుపులమ్మ.
పెద్ద మూట నిండా ఉన్న తంగేడుపూలని అందంగా పేర్చడం మొదలేట్టారు.
తలుపులమ్మగారు, కవిత, వాళ్ళ అమ్మ, పిన్నమ్మ అందరు దణ్ణం పెట్టుకోవడం చూసి, లలిత వాళ్ళ అమ్మ, అత్తగారు కూడ దణ్ణం పెట్టుకున్నారు. పెద్ద స్తాంబాళంలో, విస్తరి ఏసి, గుమ్మడి ఆకు వేసి, టేకు పువ్వు పేర్చి, పైన తంగేడు పువ్వు తరువాత బంతిమాలలు, పేరుస్తూ మధ్యలో చింతాకు పోస్తున్నారు.
“పొట్ట వస్తుందే అమ్మాయిలు, మంచిగ శ్రీచక్రం ఆకారంలో రావాలి. చూసుకోండి! చూసుకోండి!” అంటూ చెప్తోంది కవిత నానమ్మ.
సీతమ్మజడలు, పైన గులాబీలు, గన్నేరు, పున్నాగపూలు, చామంతులు ఒక్కొక్కటిగా పేర్చారు.
“ఈ పూల పేర్లని వినడమే కానీ ఎప్పుడూ చూడలేదండీ” ముచ్చటగా అన్నారు లలిత అత్తగారు.
చూస్తూనే బతకమ్మ శ్రీ చక్రం ఆకారంలో చక్కని రూపుతో కుదిరింది. అటు పక్కనే, ఇంకో పిల్ల బతకమ్మని పేర్చింది కవిత. అది కాస్త చిన్నదిగా ఉంది. బతకమ్మ పేర్చడం అయ్యాక, అంతా స్నానం చేసి దేవుడి గూట్లో ఉన్న గౌరమ్మను దెచ్చి బతకమ్మ మీద ఉంచారు. దీపారాధన చేసి, పసుపు కుంకుమలు వేసి గాజులు కట్టారు. అగరబత్తిలు అలంకరణగా చుట్టు గుచ్చి పెట్టారు.
లలిత మొత్తం బతకమ్మ పేర్చే విధానాన్ని వీడియోలు తీస్తూ, ఫోటోలు తీస్తూ తెగ సంబరపడిపోయింది.
“అమ్మాయిలు, ఒడిబియ్యం పొయ్యుండ్రి. రిక్షవాడు వచ్చేవరకు జేస్తారా ఏందీ? కానియ్యండి, కానియ్యండి!” అని తొందరచేసింది కవిత నానమ్మ.
ఒక రవికల గుడ్డలో ముత్తయిదువలు అందరూ బియ్యం పోసారు. అది బతుకమ్మకి కట్టారు.
“మామ్మగారు! మీరు ఒడిబియ్యం అని పోస్తారు కదా, అది ఎందుకు చేస్తారు? ఇప్పటి దాకా నాకు మీలా చెప్పే పెద్దవారు దొరకలేదు” అడిగింది జానకి.
“పసుపు బట్టలతో పెళ్లికూతురిగా అత్తవారింటికి పంపించిన బిడ్డకు ఒడి బియ్యం పోసుడు అంటే, నీకు ఏ కష్టమొచ్చినా ‘నేనున్నాను బిడ్డా!’ అని పుట్టింటివారు దీవించి ఇచ్చే విలువ కట్టలేని కానుక. ఆ ఒడి బియ్యాన్ని వండి, పదిమందినీ పిలిచి, భోజనం పెట్టి, పుట్టింటి వారిచ్చిన ఐశ్వర్యాన్ని పదిమందికీ పంచి మురిసిపోతారు. పుట్టింటివారు లేని ఆడపిల్లలకు అత్తింటివారు కూడా ఈ వేడుక జరపొచ్చు.
ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు ఉంటాయి. ఈ నాడులను వెన్నెముకను రక్షిస్తాయి. ఈ నాడులు కలిసే ప్రతి చోట, ఒక చక్రం ఉంటుంది. ఇలాంటి చక్రాలు శరీరంలో 7 ఉంటాయి. వీటిలో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది.
ఈ మణిపూర చక్రంలో, మధ్యబాగంలో ‘ఒడ్డియాన పీఠం’ ఉంటుంది. అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణాన్ని అందుకే ‘ఒడ్డియాణం’ అంటారు. వాడుకలో అది వడ్డాణం అయింది.
ఏడు చక్రాలలో శక్తి (గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందని చెబుతారు. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థం. ఇలా బియ్యం పోయడమంటే తాను మెట్టిన ఇల్లు వర్ధిల్లాలి అని కోరుకోవడం. అదీ కాక, అక్కడే కదా ఆడపిల్లకి గర్భసంచి ఉంటది. ఇప్పుడంటే ఒకళ్ళు, ఇద్దరూ! గప్పట్ల పదేసిమందిని కంటుండే కదా! అందుకే గర్భసంచిల ఉన్న గౌరిదేవి! ప్రసవం సమయంలో, నా బిడ్డని సల్లంగసూడు’ అని మొక్కేటందుకు కూడ అనుకోవచ్చు. ఇది మహాలక్ష్మీ సమానురాలైన ఆడబిడ్డకు ఇచ్చే గౌరవం” అని చెప్పింది తలుపులమ్మ. కొత్త విషయాన్ని ఎంతో శ్రద్ధగా విన్నారు ఇంట్లో ఉన్న ఆడవారంతా.
“చక్కగా వివరించారు అమ్మా! మన సాంప్రదాయలలో ఎంత నిగూఢమైన విలువలు ఉన్నాయో కదా వదినగారూ!” అంది జానకి, లలిత అత్తగారితో.
బతుకమ్మ ఎత్తుకొని కూతురు నిల్చుంటే తల్లి, కూతురి కడుపుకి గడప బైటనుండి చల్ల రాసి గడప దాటాలట. కవిత, లలిత ఇద్దరు చెరో బతుకమ్మ పట్టుకుని నిల్చుంటే వారి తల్లులు కడుపుకి చల్ల రాసి బతుకమ్మని బయటకి తీసుకొచ్చారు.
ఈలోపు మేళాలతో రిక్ష రావడంతో అందరూ రామాలయంలో బతకమ్మ ఆడటానికి వెళ్ళారు. పాటలు కూడా మైకులో కాకుండా పెద్దవారు, పిల్లలు పోటిలు పడి పాడారు. ఆ పాటల్లో కూడా ఎంత గొప్ప పురాణగాథలో!
కోలాటం ఆడారు, బిస్తీ గీసారు. తరువాత అందరూ బతుకమ్మల మీద పెట్టిన గౌరమ్మలను ఒక పెద్ద స్తాంబాళంలో పెట్టి ఓలలాడించి, “మాయమ్మ లక్ష్మీదేవి పోయిరావమ్మ! మా తల్లీ లక్ష్మీ దేవి పోయిరావమ్మ! పోయి నీ అత్తింట్లో బుద్ధి కలిగుండు! అత్త ఏమన్నను ఎదురాడబోకు! మామ ఏమన్ననూ మాటాడబోకు! పుట్టిన ఇంటికి కీర్తి తెస్తే, ప్రేమా సారే నీకే పెడుదుము! మాయమ్మ లక్ష్మీదేవి పోయిరావమ్మ!” అంటూ ఆడపిల్లకి సుద్దులు చెప్పి అత్తారింటికి పంపినట్టు పంపారు.
ఆ గౌరమ్మ పసుపుని ఆడవారంతా పుస్తెలకి రాసుకొని మురిసిపోయారు. ఆ పై వచ్చిన వారందరికీ పసుపు బొట్లు ఇచ్చుకొని, తెచ్చుకున్న వివిధ రకాల ఫలహారాలు అందరికి పంచి, అందరూ ఇచ్చిన ప్రసాదాలని ఆరగించి, ఇళ్లకు చేరారు.
“జానకొదిన! నీ కోడలు కవిత పుణ్యమా అని, ఈరోజు మనం ఎన్ని మంచి విషయాలు, కొత్త సాంప్రదాయాలు తెలుసుకున్నామో కదా!” లలిత అత్తగారు అన్నది జానకితో.
“ఇక నుండి మేము ప్రతి యేడు, సద్దుల బతకమ్మకి మీ ఇంటికి మీరు పిలవకున్న వస్తాము” అని లలిత అత్తగారు తలుపులమ్మతో అన్నది.
“ఎంత భాగ్యం! తప్పకుండ రండి అక్క” అన్నది తలుపులమ్మ.
“ఉదయమే మేము బయల్దేరుతాము. నువ్వు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా! షాపింగ్ అయిపోయింది కదా, లగేజ్ నేను సర్దేస్తాను వదిన!” అంది లలిత కవితతో.
“ఏంటే ఈ కొత్త పిలుపు? అమ్మో! మీ నాన్నమ్మ వింటే, ‘అన్న భార్యనీ వదిన అని పిలవాలని తెలీదా?’ అని నీకు-నాకు కలిపి వాయించేస్తుంది ఎందుకులే” అని నవ్వేసుకున్నారు ఇద్దరూ.
“రెండు రోజులాగి, ఒడిబియ్యం పోసి పంపుతం వదిన కవితని” అని కవిత తల్లి జానకితో అన్నది.
“వదినగారు! నేను కూడా మా లల్లికి ఒడి బియ్యం పొద్దామనుకుంటున్నాను, మీరు తప్పకుండా వచ్చి, ఆ శుభకార్యం మీ చేతుల మీద జరిపించాలి. ఏమంటావ్ వదిన?” అంటూ లలిత అత్తగారిని అడిగింది.
“భలే చెప్పారు వదిన మీరు! సరిగ్గా నా మనసులోనూ అదే అనుకున్నాను” అని అంది లలిత అత్తగారు.
“అయ్యో దానిదేముంది వదిన, మా పిల్లకి ఆడబిడ్డ అంటే మాకు ఆడబిడ్డనే, ఏ రోజు చేద్దామో చెప్పండి, ముందురోజే వచ్చేస్తా” అంది తలుపులమ్మ. అటుపైన, ఆ మూడు కుటుంబాల మధ్య రాకపోకలతో, బంధం బలపడింది.