Menu Close
ఘాలి లలిత ప్రవల్లిక
కొలిమి (ధారావాహిక)
ఘాలి లలిత ప్రవల్లిక

రాజన్! బయట హాస్పిటల్ స్టాఫ్ తో మాట్లాడుతూ ఉన్నా… కళ్ళూ రెండు వీళ్ళ మిదే ఉన్నాయి. లోపల నుంచి మూర్తి నవ్వుతూ వచ్చి, చెల్లెలు తో ఏదో చెప్పడం గమనించాడు. లోపల ఏం జరిగి ఉంటుందో ఊహించాడు. అతని మనసు అసూయతో కుతకుత లాడింది. ‘ఏంటి వీడు! వీళ్ళతో ఏకమైపోయాడా?’ అనే సంశయం కలిగింది.

‘ఏంటి వీడు నేను చెప్పింది ఫాలో అవటం లేదా! నా మాటలని పెడచెవిన పెట్టాడా!?! అదే జరిగితే నాకు విలువ ఏమి ఉంటుంది? నా భార్య దగ్గర నేను తలెత్తుకోగలనా!’ అని అనిపించ గానే, అతనిలోకి తెలియని భయం ఆవహించింది.

తనని తాను సంబాళించుకుని, హాస్పిటల్ స్టాఫ్ తో మాట్లాడటం త్వరగా ముగించుకొని, ఆదుర్దాగా మూర్తి దగ్గరికి వచ్చి, తనలోని భావాలను పైకి కనబడనీయకుండా, నవ్వుతూ…

“ఏం మూర్తి? మీ బావగారుతో మాట్లాడావా?” అంటూ అడిగాడు రాజన్.

“మాట్లాడాను బావగారు,” పొడిగా చెప్పాడు మూర్తి.

ఆ జవాబు అతనికి తృప్తి కలిగించలేదు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ పూర్తిగా తెలుసు కోవాలనుకున్నాడు రాజన్.

“ఎలా మాట్లాడాడు? కూల్ గానే మాట్లాడాడు కదా! మీరు ఏమీ వాడ్ని రెచ్చగొట్టి నట్లు మాట్లాడ లేదు కదా?” అంటూ ఆరాగా అడిగాడు.

పూర్వం అయితే, అతని కడుపులో ఉన్న కపటాన్ని కనిపెట్టలేక, ఆప్యాయంగా అడుగుతున్నాడనుకొని అమాయకంగా అన్నీ చెప్పేవాడు.

కానీ అతని నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్థం అవుతూ ఉండటంతో…

“ఏదో మాట్లాడారు. నేను దేనికి ఎదురు చెప్పలేదు. ఆమాత్రం కోపం ఉంటుంది కదా!” రాజన్ ను తృప్తి పరచాలి అన్నట్టుగా చెప్పాడు మూర్తి.

“ఇది వెళ్ళి చాలా సేపు అయింది. అయినా బయటకు రాలేదు, అంటే ఇద్దరూ లోపల కొట్లాడుకుంటున్నారో…? మాట్లాడుకుంటున్నారు…? చూసొద్దాం పద,” అన్నాడు రాజన్.

“ఏదో వాళ్ల పాట్లు వాళ్ళు పడతారు లేండి. మధ్యలో మనం వెళ్ళడం దేనికి?” ఎక్కడ వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెడతాడో! నన్న భయంతో అన్నాడు మూర్తి.

“అలా వదిలేయకూడదు. వాళ్లని వదిలేసినట్టుగా ఉంటూ… ఓ కంట కనిపెట్టాలి.
ఏమో! కోపతాపాలలో… ఎవరిని ఎవరు ఏం చేసుకుంటారో! ఎవరికి తెలుసు? పిల్లల్ని కూడా పంపించేసావు. మధ్యలో వాళ్లకి ఏమన్నా దెబ్బలు తగిలితే.‌‌.. అందరూ కలిసి నన్ను అంటారు,” అంటూ గబా గబా జంబేష్ ఉన్న రూం వైపు బయలుదేరాడు రాజన్.

‘అంటే వాళ్ళిద్దరూ కొట్టుకోవాలి అని ప్లాన్ చేశాడు. అయ్యా! అనవసరంగా దాన్ని ఒంటరిగా పంపించానే!’ అనుకుంటా రాజన్ ను అనుసరించాడు మూర్తి.

రూమ్ లో ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కనపడ్డారు.

“చూడు… ఇద్దరూ ఎంచక్కా! చిలుకా, గోరింకల్లా మాట్లాడుకుంటున్నారో! ఇంత జరిగినా.‌‌..ఏమీ జరిగినట్లు…! పోనీలే అలా ఉండటమే కావాలి. మనసుకి తగిలిన గాయాలని మర్చిపోగలగాలి.
మనల్ని చూడకపోయినా పర్వాలేదు. వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే అదే పది వేలు,” అన్నాడు రాజన్.

రాజన్ గొంతు వినగానే ఎలర్ట్ అయ్యాడు జంబేష్.

“రేపు నన్ను డిశ్చార్జ్ చేస్తారు. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మాట్లాడుకోవటానికి ఎక్కువ సేపు అనుమతించరు. రేపు మనం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. మీ తమ్ముడ్ని ఇబ్బంది పెట్టాము.
అతనికి ఏం పనులు ఉంటాయో ఏమో! ఇంటికి వెళ్లిపోమని చెప్పేసి పంపించేయి,” అంటూ చెప్పాడు జంబేష్.

మూర్తి కూడా వీళ్ళతో పాటు రెండు రోజులు ఇక్కడే ఉంటే బాగుండు అని అనిపించింది ప్రణవికి. కానీ ఆ మాట అంటే…! ‘మొగుడి మాటకి ఎదురు చెప్పింది… అంటారు. ఎందుకు వచ్చింది కర్మ… అతను చెప్పినట్టు చెప్తే పోతుంది,’ అనుకొని, ఏమి ఎదురు చెప్పకుండా సరే అని తల ఊపి, పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చింది ప్రణవి.

బయటకు వచ్చి మూర్తి వంక తిరిగి,

“తమ్ముడూ! ఇంటి దగ్గర అమ్మ ఒక్కతే ఉంటుంది. నువ్వు వెళ్ళిపో! ఇక్కడ నాకేం భయం లేదు. రేపు ఆయనను డిస్చార్జ్ చేస్తారుట. అందరం కలిసి రేపు వెళ్ళిపోతాము,” అంటూ చెప్పింది.

“పర్వాలేదు లే అక్కా! అమ్మకి అక్కడ ఏం భయం లేదు. నేను ఏర్పాట్లు చేశాను కదా! నేను ఓ రెండు రోజులు ఉండి వెళతాను. ఇక్కడ బావగారికి ఏమన్నా సహాయం చేయవలసి ఉంటుందేమో!” అన్నాడు.

రాజన్ మధ్యలో కల్పించుకుంటూ, “అదే నీలో ఉన్న దుర్గుణం. నేను ఉంటాను, నువ్వు వెళ్ళు అని, అది ధైర్యంగా చెప్పినప్పుడు… నువ్వు వెళ్ళిపోవాలి గాని, నేను ఉంటాను అని పట్టు పట్టడం దేనికి?
ఇలా చెప్పిన మాట వినకుండానే, ఇంత దాకా తెచ్చుకున్నారు మీరు. ఇకనైనా మారండి. వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యే కదా! నీకు చెప్పి ఉంటారు. మళ్లీ నువ్వు ఇలా అంటే… అది వెళ్లి వాడితో చెప్తే! వాడి మాట వినలేదని, వాడికి దీని మీద కోపం రాదా! మళ్లీ వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలవ్వవా? ఇదంతా మనకు అవసరమా! వాళ్ళిద్దరూ బానే ఉన్నారు కదా!
ఇంకెందుకు నువ్వు ఇక్కడ? ఇక్కడే ఉండి నువ్వు ఏం చేస్తావ్? మళ్లీ వాళ్ళ మధ్య గొడవలు రావడానికి …నువ్వు అవకాశం ఇచ్చినవాడివి అవుతావు,” అన్నాడు.

‘వీడేదో మధ్యలో మళ్ళీ పెంట పెట్టెట్టున్నాడు,’ అని మనసులో అనుకొని…
ఏం మాట్లాడితే! ఏం తప్పు పడతారో…! అన్నట్లు మౌనంగా ఉండిపోయాడు మూర్తి.

“నువ్వు తప్పుగా అనుకోబాక… నువ్వు ఉండటం వల్ల నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. కాకపోతే మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. నేను అందుకనే వాళ్ళ విషయాల్లో కల్పించు కోవడం లేదు. వాడు ఎలా చెప్తే అలా వినడమే… మనం వాళ్లకు దగ్గర్లో ఉంటే ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నం చేస్తాము. మనం వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పడుతూ లేస్తూ వాళ్లే కలిసిమెలిసి ఉంటారు,” అన్నాడు రాజన్.

‘వీళ్లను కాదని తను అక్కడ ఉన్నా… ఏదో రకంగా పెంట పెడతాడు. తను ఇక్కడ ఉండి మాత్రం ఏం చేయగలుగుతాడు? ఫోన్ సీక్రెట్ గా ఇచ్చాం కదా! ఏదైనా ఇబ్బంది అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసిన వెంటనే రావచ్చు,’ అని అనుకుని…
“సరే బావగారు! మీరు ఎలా అంటే అలా కానివ్వండి, పెద్దవాళ్లు మీ మాటను మేము ఎప్పుడూ తోసి బుచ్చలేదు,” అన్నాడు మూర్తి.

“నాదేం లేదు. నేను నిమిత్తమాత్రుడను. మీ అక్క, మీ బావ డెసిషన్ అది. వాళ్లు నన్ను పొమ్మన్నా! నేను ఇక్కడ నుంచి పోవాలి,” అన్నాడు రాజన్ నవ్వుతూ.

‘బాలు మీ కోర్ట్ లో ఉంది కాబట్టి ఎన్నైనా మాట్లాడతావ్’ అని మనసులో అనుకుని,
“సరే అక్కా! నువ్వు అంత ధైర్యంగా చెప్పేటప్పుడు, నాకేం భయం ఉంటుంది? ఎప్పుడూ మీ ఇద్దరూ అన్యోన్యంగా… సంతోషంగా ఉండటమే కావాలి. నువ్వు పిల్లలు జాగ్రత్తగా ఉండండి. నేను రాత్రి ట్రైన్ కి బయలుదేరుతున్నాను,” అని చెప్పి, రాజన్ కి కూడా బయలుదేరుతున్నట్టు చెప్పి, లోపలికి వెళ్లి, జంబేష్ తో కూడా చెప్పి, అక్కని జాగ్రత్తగా చూసుకోండి అని, ప్రణవి చేతులని తీసి జంబేష్ చేతులలో పెట్టాడు.

“నువ్వేం దిగులు పడక మూర్తీ. ఇప్పటి నుంచీ బానే ఉంటుంది. మా గురించి ఏం ఆలోచించ వద్దు. హ్యాపీ గా ఉండు. భయపడవద్దని అమ్మకి కూడా చెప్పు. ఈ సారి మా ఇంటికి వచ్చినప్పుడు, నెల రోజులు సెలవు పెట్టుకుని రా! మాతో ఉందువు గాని,” అని చెప్పాడు.

అతని మాటలకి మనసు తేలిక పడింది, ‘కానీ అన్న అడుగు జాడల్లో నడిచే తమ్ముడు అతను. అతని ఒరిజినాలిటీ ని అన్న మీద ఉన్న ప్రేమ బయట పడకుండా కప్పేస్తుంది. అన్న స్విచ్ వెస్తే వెలిగే బల్బు ఇతను. స్వయం ప్రకాశం ఉంటేనే నమ్మగలం. ఇప్పుడు వెలిగాడని ఆనంద పడడానికి లేదు. ఆ వెలుగు శాశ్వతంగా ఉండాలి,’ అనుకుని బరువైన గుండెతో అక్కడి నుంచి, బయలు దేరాడు మూర్తి.

ప్రణవి కి అతను వెళ్ళడం ఇష్టం లేదు. పోనీ అతనిని ఆపే శక్తి, ఆమెకు లేదు. ఏ ఆడపిల్లకి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు, అని అనుకుంది.

పిల్లలు,”మామయ్యా! మేమూ నీతో వస్తాం,” అంటూ వెంట పడ్డారు.

“మీరు డాడీ, మమ్మీ తో ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండండి,” అన్నాడు మూర్తి.

“ఊహూ మేము మీ దగ్గరే ఉంటాం…” అంటూ పేచీ పెట్టారు.

“అలా ఏడవ కూడదు. అమ్మ ఎక్కడుంటే అక్కడే పిల్లలు ఉండాలి. అమ్మమ్మని తీసుకుని నాలుగు రోజుల్లో వస్తాను,” అని నచ్చ చెప్పా డు మూర్తి.

“ఎక్కువ రోజులు స్కూల్ కి డుమ్మా కొడితే టీచర్ కొడుతుంది. నువ్వు తొందరగా వచ్చేసేయ్…” అంది. ఊహ వస్తూ ఉన్న ప్రణవి కూతురు.

“ఇక్కడ మంచి స్కూల్లో చేర్పిస్తాము. టీచర్ కొట్టదు,” అంటూ చెప్పింది ప్రణవి.

“నిజంగా టీచర్ కొట్టదా…! హోంవర్క్ చేయకపోయినా కొట్టదా…!” కళ్ళు పెద్దవి చేసి, మూతి సున్నాల చుట్టి, ముద్దుముద్దుగా అడిగింది.

ఆ పిల్ల అలా మాట్లాడుతూ ఉంటే… తను మొహం కనపడలేదు… ముసి ముసిగా నవ్వుకున్నాడు జంబేష్.

అది చూడనే చూసాడు రాజన్.

“పెద్దలు చెప్పినది వినాలి గాని, ఇలా పెద్దలు ఎదురకుండా మాట్లాడకూడదు. పిల్లలను పెంచుకోవడం తెలిస్తే గా! తల్లి దగ్గర ఉండి ఏడిస్తే గా… పిల్లలకు మంచి లక్షణాలు రావటానికైనా నేర్పటానికి అయినా! పిల్లలు బ్రష్టు పట్టిపోయారు,” అన్నాడు మనసులో ఉన్న అక్కసును వెళ్ళ గ్రక్కుతూ రాజన్.

‘మళ్ళీ పిల్లల మీద పడ్డట్టుంది చూపు. నోరు విప్పి, ఏదైనా మాట్లాడితే పెద్ద పెద్ద పెంటలు చేస్తాడు. నోరు మెదప కుండా ఉన్నంత ఉత్తమం లేదు,’ అనుకుని కామ్ గా ఉన్నాడు మూర్తి.

అన్నకి ఎందుకో కోపం వచ్చిందన్న విషయం గ్రహించిన జంబేష్,
“వీళ్ళకు అన్నీ నేర్పించుకొని, మన దార్లో పెట్టుకోడానికి చాలా టైం పడుతుంది అన్నయ్యా. చెడిపోయి ఉన్నారు,” అన్నాడు.

జంబేష్ అలా అనేసరికి శాంత పడ్డాడు రాజేష్.

ఇప్పటి దాకా బాగానే ఉన్న జంబేష్ సడెన్ గా ఎందుకు ఇలా మాట్లాడాడో అర్థం కాలేదు మూర్తికి.

తెల్లబోయి చూస్తున్న మూర్తిని ఉద్దేశించి, రాజన్, “మూర్తి! నీకు ట్రైన్ టైం అవుతోంది. మళ్ళీ దారిలో భోజనం చేయాలి కదా! చిన్న పిల్లలు అలాగే అంటారు లే! ఇక నువ్వు బయలుదేరు,” అన్నాడు.

కాసేపు అక్కడే ఉంటే, మళ్ళీ పొమ్మని చెప్తారు ఏమో! నని, వాళ్లను వదిలి వెళ్ళలేక… వెళ్లక తప్పక, బరువైన గుండెతో, వెళ్ళిపోయాడు మూర్తి.

**

“ఏమే రాణి! అది వచ్చిందటనా!” అంటూ అడిగింది సుందరి.

“ఆ… వచ్చిందంట అత్తా! దాని తమ్ముడిని పంపించేశారుట. ఇదీ, పిల్లలూ హాస్పిటల్ దగ్గరే ఉన్నారుట,” అంటూ చెప్పింది రాణి.

“హాస్పటల్లో నా! అక్కడ ఎక్కడ ఉంటుంది? అయినా ఆ మూర్తి గాడు! లాడ్జ్ ఏదైనా తీసుకుని, తల్లి పిల్లల్ని అందులో ఉంచి, ఓ రెండు రోజులు ఉండి, డిశ్చార్జ్ అయ్యాక వెళ్లొచ్చు కదా! కొంపలేవో మునిగిపోయినట్లు ముందే వెళ్లిపోయాడు,” అంది సుందరి.

“అతనికేం పనులున్నాయో! వెళ్తే వెళ్ళనీలే అత్తా! అక్కడ బావ ఉన్నాడుగా! చూసుకుంటాడు లే,” అంది రాణి.

“ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నాం. మళ్లీ ఏం గొడవలు మొదలవుతాయో!” అంది సుందరి.

“ఎలా ఉన్నా! తప్పదు కదా అత్తా! మనకి, భరించాలి,” అంది రాణి.

“దాని మొహం చూడాలంటే నాకు అసహ్యం. దాన్ని అలా ఆ ఊరు పంపేయమను. అన్నెం పున్నెం ఎరుగని, నీ మీద అది కేసు పెట్టింది. నాకు దానిమీద కచ్చగా ఉంది. పాపం పిచ్చినాయన… దానితో వేగక తప్పదు!” అంది ప్రణవి మీద ద్వేషం, వీళ్ళమీద ప్రేమతో సుందరి.

“అబ్బా! నువ్వు ఇలా మాట్లాడకు అత్తా! మళ్ళీ సమస్యలు వస్తాయి. ఎలా జరిగేది అలా జరుగుతుంది. వదిలేసేయి,” అంటూ చిరాకుగా అంది రాణి.

****సశేషం****

రచయిత్రి పరిచయం ..

Ghali-Lalitha-Pravallika పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక

రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)

పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.

బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి ‘సాహితీ విశారద’ బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.

సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.

ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.

Posted in March 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *