సముద్రపు ఒడ్డున
నడుస్తున్నాను.
ఆలోచనలు
ముసురుకుంటున్నాయి.
ప్రాణప్రదంగా
ఒకటనుకున్న
నా ప్రాణప్రియ
వీడ్కోలు చెప్పేసింది
నవ్వుతూ.
కష్టాలన్నీ నావే.
అందరూ
సుఖంగానే ఉన్నారు.
ఈ నిరాశతో
నాకు బ్రతకాలని లేదు.
అందుకే వచ్చానిక్కడకు.
నీలిరంగులో ఆకాశం
నిర్మలంగా ఉంది
జవరాలి మోములా
అబ్బా! గాయం
మళ్ళా రేగుతోంది
తూర్పు నుంచి
నల్లని చీకటి వ్యాపిస్తోంది
నా మనసుకి
ప్రతిరూపంలా ఉంది.
నీలిరంగులోంచి
నలుపు రంగులోకి
మారుతున్న
కడలి కెరటాలు చూశా
నల్లని కెరటాలు
ఉవ్వెత్తున ఎగసి
ఒడ్డుకు చేరాయి
హోరుమని శబ్దంతో
తెల్లని నురుగులా
విరుచుకుపడి
మళ్ళీ సాగరంలో
చేరిపోతున్నాయి.
మళ్ళీ కెరటాలు వస్తున్నాయి.
ఒకటా? రెండా?
అనంతం !!
ఆది ఎప్పుడూ?
అంతమెప్పుడు?
మరి నేనేమిటిలా??
ప్రియురాలి కోసం
అమ్మ కడుపున చిచ్చు
పెడదామనుకున్నాను?
రెండడుగులు
ముందుకు వేసి
అనంతంగా వ్యాపించిన
సాగరానికి
రెండు చేతులెత్తి
నమస్కరించా!
వంగి సాగరజలాలు
తీసుకుని
తలపై అభిషేకించుకున్నా
నోటిలో పోసుకున్నా
ఉప్పగా ఉన్నాయి
నా కన్నీళ్ళలాగే
అయినా
నాకు గురువులైన
ఆ అలలకు
వందనమిడుతూ
వెనుతిరిగా.
జననీ!
కెరటాలు నా ఆదర్శం
పడిలేచినందుకా??
కాదు కాదు
పడినా లేచి
మరో ప్రయత్నం
చేస్తున్నందుకు
అనంతకాలంగా!
(ఆత్మహత్యలు చేసుకునే వారిని ఆపడానికి రాసిన కవిత)