Menu Close
Kadambam Page Title
కన్నీళ్ళ పంటనూర్పు
గవిడి శ్రీనివాస్

ఈ పొలం పై నిలిచే వరి దిబ్బలు
కాసేపైనా ఆనందాన్ని ఎగరనీయటం లేదు

వర్షం లో మునిగిన పంట మాదిరి
అప్పుల్లో తడిసిన బతుకు మాదిరి
ఆదుకోని ధరలతో పతనమైన చిరునవ్వు మాదిరి

రైతు కళ్ళల్లో మిరప మంటలు రేపుతూ
ఉల్లికోసి కన్నీళ్ళ ను తోడుతున్నవి.

పంట నూర్పు పసిడి కల అనుకుంటే
పొరపాటైపోలా

మద్దతు ధర ముంచిపోయాక
తేరుకోవటం తెల్ల ముఖం వేయటం
అలవాటైపోయింది.

పైరు ఎండిపోతే తడబడ్డాం
పురుగు కొరుకు తుంటే దిగులు పడ్డాం
వర్షం ముంచిపోతే
కన్నీళ్ళ లో కొట్టుకు పోయాం

బీమా లేని బతుకుల్లో
ధీమా చూడమంటే ఎట్లా

దళారులు పన్నే పన్నాగం లో
దగాకోరులు విసిరే వలలో

విలవిలలాడే రైతులు

ఇప్పుడు జీవన సంక్రాంతులు
ఎలా చేసుకోవాలో తెలియదు…

వెన్నెముక కు ఊతమిచ్చే
రాజ్యాధికారం బలంగా నిలబడే వరకూ

పంట నూర్పులు నిట్టూర్పులు గానే
మిగులు తున్నాయి.

********

Posted in March 2026, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *