Menu Close
కామెర్లు
-- శర్మ దంతుర్తి --

1995 నవంబర్. డాకర్, సెనెగల్, ఆఫ్రికా.

“జుమైరా నబియుల్లా, జుమైరా నబియుల్లా,” శరణార్ధులని ఇంటర్వ్యూకి పిలిచే ఆయన బయటకి వచ్చి పేరు పిలిచేడు. గత పది నెలలనుంచీ శరణార్ధుల గుడారంలో తల దాచుకుంటున్న ఇరవై ఎనిమిదేళ్ళ హసన్ లేచి రెండు చేతుల్తో మొహం తుడుచుకుని ముందుకి నడిచేడు తన దగ్గిర ఉన్న ఫైల్లో కాయితాలు సర్దుకుంటూ.

బయట కాలే ఎండలోంచి లోపలకి వెళ్ళగానే చల్లగా తగిలింది ఎయిర్ కండిషన్. ఆ కాస్త సంతోషం వెంఠనే పోగొట్టడానికా అన్నట్టూ కౌంటర్లో అటు పక్క కూర్చున్న పెద్దాయన కోపంగా అరిచాడు, “ఇది మూడోసారి పిలవడం పొద్దున్న నుండీ. పిలవగానే రావాలని తెలియదా?”

“సారీ సర్, ఇంతకు ముందు పిలిచినట్టు నాకు తెలియదు, బయట అంతమంది జనంలో మాట వినపడడమే బాగా కష్టంగా ఉంది.”

“ఈ జనం, మీ దరిద్రం ఎప్పుడూ ఉండేదే, ఇలా వచ్చి సమాధానాలు చెప్పు, పేరు, పుట్టిన రోజు, వృత్తి?”

“అల్ జుమైరా హన్రాసన్ అబ్దల్ మాసి నబియుల్లా, ఆగస్ట్ 20, 1967, మెడికల్ డాక్టర్”

“ఏమిటీ, నువ్వు డాక్టర్ వా? నీ అవతారం చూస్తే అడుక్కునేవాళ్ళా ఉన్నావే?”

“ఏం చేయమంటారు? నెలల తరబడి శరణార్ధుల గుడారంలో ఉండడం వల్ల సరైన బట్టలూ, తిండీ అవీ కుదరక పాతబట్టలే వేసుకుంటున్నాను.”

“ఇలాంటి కేసులు చాలా చూసానులే, అసలు నువ్వు మెడికల్ కాలేజీలో చదువుకున్నావో లేదో?”

“అలా అంటారేంటి సార్, నేను మెడికల్ కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్ ని.”

“ఆ, సర్లే ఈ దేశంలో గోల్డ్ మెడల్ వస్తే ఎంత రాకపోతే ఎంత? నీ మతం?”

కాసేపు మౌనంగా ఉన్నాక చెప్పాడు జుమైరా, “ముస్లిం, ఇస్లాం.”

కాసేపు నిశ్శబ్దం. కాయితాల మీద ఏదో రాసుకున్నాక చేసి తలెత్తి కోపంగా చెప్పాడు కౌంటర్ అటువైపు కూర్చున్నపెద్దమనిషి, “మీకు అమెరికా రావడానికి రూల్స్ ఒప్పుకోవు, వెళ్లవచ్చు.”

అసలే నల్లగా ఉన్న జుమైరా మొహం ఈ మాటకి మరింత నల్లబడింది. తానేం తప్పు చేసాడు ఈ ఇంటర్వ్యూలో? అన్నింటికీ సరిగ్గా సమాధానం చెప్పాడు కదా? తన వంటి రంగు, జుట్టూ నల్లగా ఉండడం, తనో ఆఫ్రికన్ అయితే తన తప్పేమిటి ఇందులో? తాను ముస్లిం గా పుట్టడం తప్పా? మెల్లగా లేచి బయటకి రాబోతూ కౌంటర్లో అటు వైపు కూర్చున్న పెద్దమనిషికేసీ, ఆయన చొక్కాకి ఉన్న నేమ్ ప్లేట్ కేసీ చూసాడు, “జెఫర్సన్ కె. ఆర్నాల్డ్.”

మరో నాలుగువారాలు గుడారంలో గడిపాక మరోసారి పిలుపు. ఈసారి జుమైరా లోపలకి వచ్చాక తనతో మాట్లాడబోయే ఆయన పేరు చూసాడు. అదే పేరు - జెఫర్సన్ కె. ఆర్నాల్డ్. మళ్ళీ ఈయనే? పెద్దాయన మామూలు ప్రశ్నలన్నీ సంధించడం అయ్యేక చెప్పాడు చిన్న గొంతుతో అయినా కర్కశంగా.

“క్రితం సారి వచ్చినప్పుడు చెప్పాను. నేను ఇక్కడ కూర్చుని ఉండగా నీకు ఎటువంటి పతిస్థితులలోనూ వీసా కాయితాలు ఇవ్వను, రానివ్వను; అమెరికా మిమ్మల్ని రానివ్వదు. దిక్కున్న చోట చెప్పుకోవచ్చు, ఫో!”

తమ దేశంలోకి రానిచ్చే ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లకి ఈ శరణార్ధుల తతంగం రోజువారీ తలనెప్పి అయితే శరణార్ధులకి ఇవన్నీ ఎన్నటికీ మర్చిపోలేని క్షణాలని కౌంటర్ అటువేపున కూర్చున్నవాళ్లకి తెలియదా? తనని నల్లవాడనీ, బానిస బతుకు అనీ ఎన్ని మాటలు అన్నా, తాను మెడికల్ కాలేజీలో గోల్డ్ మెడల్ సంపాదించాడని తెలియగానే తనకేసి వాళ్ళు చూసిన గౌరవమైన చూపు వల్ల జుమైరాకి మనసులో పిసరంత ఆనందం. ఆ ఆనందం ఒక్క క్షణం దాటనివ్వడం లేదు ఈ జెఫర్సన్ ఆర్నాల్డ్ గారు; ఎందుకంటే ఏ కారణం చేతో తనని శరణార్ధిగా అమెరికా వెళ్ళడానికి ఈ తెల్లాయన ఎప్పటికీ ఒప్పుకోవడం లేదు.

ఆరేడు సార్లు ఇలా తిరగ్గొట్టేసాక ఇంక జీవితం అంటే విరక్తి కలిగే రోజుకి మరోసారి పిలుపు. ఈసారి మొహంలో ఏమీ భావం లేకుండా లోపలకి నడిచాడు జుమైరా నబియుల్లా. ఆశ్చర్యంగా ఈ సారి ఇంటర్వ్యూ చేసేది, చొక్కా మీద పేరు బట్టి, శ్రీని వంగా అనే నలుపూ తెలుపూ కాని వేరే ఆయనెవరో; పెద్దమనిషి తరహాలోనే మాట్లాడాడు. మామూలు ప్రశ్నలు అయ్యాక అడిగాడు, “అసలు మీరు ఈ శరణార్ధుల గుడారంలో ఎలా తేలారు?”

“బాంబుల దాడిలో నా కుటుంబం అంతా పోయాక ఏం చేయాలో తెలియలేదు. ఇల్లూ వాకిలీ పోయాక కొంతకాలం పిచ్చి ఎక్కినట్టైంది. ఏమీ లేని స్థితిలో ఇలా రోడ్డుమీద శరణార్ధుడిగా తేలాను. అదో పెద్ద కథ.”

“ఇక్కడే ఈ దేశంలో మరోచోట ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు కదా?”

“ఈ దేశంలో నన్ను సర్వనాశనం చేయబోయారు బాంబు దాడిలో. ఇక్కడున్నంత కాలం నా కుటుంబం నాశనం అయిన ఆ ఇల్లూ, విషయం, రోజూ మనసులో ముల్లులాగా మెదులుతూ బతకనివ్వదు. అందుకే…”

“మీకు కనక అమెరికా వెళ్ళడానికి వీలు కలిపిస్తే ఏం చేద్దామనుకుంటున్నారు అక్కడ?”

“మొదటగా అమెరికాలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేయాలంటే ఒక టెస్ట్ పాస్ అవ్వాలి కదా. అది పాసయ్యాక ఏదైనా స్పెషలైజేషన్ చేద్దామని అనుకుంటున్నానండి.”

“అమెరికా వెళ్ళడానికి ప్లేన్ టికెట్ కీ దానికీ డబ్బులున్నాయా? ఇల్లూ వాకిలీ అన్నీ పోయాయని అంటున్నారు కదా?”

“కట్టుకోవడానికి ఈ వంటి మీద బట్టలు తప్ప మరోటి లేవు. ప్లేన్ టికెట్ ఎక్కడి సంగతి? శరణార్ధులకి ఇచ్చే అప్పులాంటిది ఏదో ఉందని విన్నాను, ఇస్తే రెండేళ్లలో తీర్చగలనని అనుకుంటున్నాను.”

కాసేపు ఏదో రాసుకుంటున్నట్టూ ఉన్న పెద్దమనిషి మొహంలో ఏ భావం లేకుండా చెప్పాడు, “మిమ్మల్ని ఇంతకుముందు అన్ని సార్లు ఎందుకు రిజెక్ట్ చేసారు అనేది ఇక్కడ రాసి ఉంది. మిమ్మల్ని నేను మరోసారి రిజెక్ట్ చేయగలను కానీ మీ కేస్ చాలా జాలి గొలుపుతూ ఉండడం వల్ల ఈ సారి మీకు పేపర్స్ ఇవ్వడానికి నిశ్చయించుకున్నాను. ఈ కాయితం తీసుకుని పక్క గదిలోకి వెళ్లండి, అక్కడ మీకు అప్పు ఇచ్చే సంగతి, అమెరికాలో ఎక్కడ ఉండవచ్చు ఎలా అనేవి చెప్తారు. వెల్ కం టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా! గుడ్ లక్ ఇన్ యువర్ కెరీర్!!”

హమ్మయ్య, ఒక్కసారి మబ్బులన్నీ విడిపోయాక పూర్ణచంద్రుణ్ణి చూసినంత ఆనందం. మెల్లిగా నడుచుకుంటూ పక్కగదిలోకి వెళ్ళాడు అల్ జుమైరా. అయితే అమెరికాలో తెలుగు తల్లితండ్రులకి పుట్టిన రెండో తరం ఇండియన్ అమెరికన్ అయిన శ్రీని వంగా కి అక్కడ డాక్టర్ల కి ఉన్న కొరత బాగా తెల్సు కనక తనకి అమెరికా వెళ్ళడానికి కాయితాలు ఇచ్చాడనీ, అలా ఇచ్చినందుకు జెఫర్సన్ ఆర్నాల్డ్ నుంచీ, ఆ పైనుంచీ అక్షింతలు పడి, అతన్ని వేరే దూర దేశానికి బదిలీ చేసారనీ జుమైరాకి ఎన్నటికీ తెలియలేదు.

తనకి వీసా ఇచ్చి జీవితాన్ని ఆదుకున్న శ్రీని వంగా అనే పేరు, అతని వంటి గోధుమ రంగూ మాత్రం జుమైరా నబియుల్లా ఏనాడూ మర్చిపోలేదు.

******* ******* *******

జూన్ 2020, హూస్టన్, టెక్సాస్.

కుడి మోకాలికి మొత్తం రిప్లేస్ మెంట్ సర్జరీ అయ్యాక మామూలు వార్డ్ లోకి మార్చబడ్డాడు అరవై ఏడేళ్ల జెఫ్. పదేళ్ల క్రితం విడాకులయ్యాక ఓ అయిదారేళ్లనుంచి ఈ మోకాలు నెప్పి ఎక్కువ అవడంతో వాయిదా వేసుకుంటూ వచ్చిన ఈ సర్జరీ ఇంక తప్పలేదు క్రితం ఏడాదే రిటైరైన జెఫ్ కి. రిటైర్ అయ్యాడు కనక మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉన్నా సర్జరీకి పూర్తిగా డబ్బులివ్వరు. అందువల్ల హాస్పిటల్ వారిచ్చిన సలహాతో అప్పుడే సర్జరీ నేర్చుకుంటున్న రెసిడెన్సీ చేసే కుర్రాడితో సర్జరీ చేయించుకుంటే చవకగా అవుతుందని ఆ కుర్రాడితోటే చేయించుకున్నాడు సర్జరీ. అయినా కంగారు ఏవుంది? కుర్రాడు సర్జరీ చేసేటపుడు పక్కన పేరున్న మరో సర్జన్ ఉండనే ఉంటాడు. అందువల్ల పెద్ద ప్రోబ్లెం రాకపోవచ్చు.

వార్డ్ లో తెలివి వచ్చాక సర్జరీ చేసిన కుర్ర సర్జన్ లోపలకి వచ్చి చెప్పాడు, “మీ సర్జరీ బాగానే అయింది. అయితే ఒక్కొక్కప్పుడు సర్జరీ వల్ల రక్తం గడ్డకట్టి ఏదైనా సమస్య రావచ్చు. అలా రాదనే అనుకుందాం. మరో రెండు వారాలు ఇక్కడే అబ్జర్వేషన్ లోఉన్నాక వెళ్దురుగాని,” తాను సర్జరీ చేసినప్పుడు చేసిన ఏంటీరియర్ లిగమెంట్ అమర్చడంలో చేసిన తప్పూ, పక్కనే ఉన్న పెద్ద పేరున్న సర్జన్ దాన్ని గమనించకపోవడం, దానివల్ల రక్తం గడ్డకట్టడం అనేవి కప్పి పెట్టి విగతా విషయాలు చెప్పాడు రెసిడెన్స్ సర్జరీ కుర్రాడు.

మూడు రోజులు పోయాక హాస్పిటల్ వారు వేరే ఊరిలో ఉన్న జెఫ్ కూతురికి ఫోన్ చేసారు, “మీ నాన్నగారికి హార్ట్ ఎటాక్ వచ్చింది వచ్చి చూస్తారా?”

“మరీ అంత ప్రమాదమా? ఇప్పుడెలా ఉంది?”

“అమ్మా, హార్ట్ ఎటాక్ అంటే ప్రమాదం కాదా? ఏమిటా అడగడం?”

“సరే రెండు గంటల్లో బయల్దేరుతున్నా”

హాస్పిటల్ కి వచ్చిన జెఫ్ కూతురితో కుర్ర సర్జన్ చెప్పాడు, “మోకాలుకి చేసిన సర్జరీ వల్ల రక్తంలో ఓ చోట గడ్డకట్టింది. రక్తం గడ్డకట్టుకోకుండా ఉండడానికి ఇచ్చిన మందు పనిచేయలేదేమో. చూడబోతే ఆ క్లాట్ శరీరంలో మరో చోటకి పాకినట్టుంది. హార్ట్ ఎటాక్ వచ్చినది దానిమూలానే అని కార్డియాక్ సర్జన్ అన్నారు. ప్రస్తుతానికి మరీ అంత డేంజర్ లేదు కానీ ఓ స్కాన్ తీయబోతున్నాం, తలలోకి కానీ ఆ క్లాట్ చేరిందేమో చూడ్డానికి. అక్కడకి పాకితే …”

“నేను సాయంత్రం వరకూ ఇక్కడ వెయిట్ చేసి చూడగలను. ఈ లోపున చెప్పగలరా?”

“ఓ తప్పకుండా, స్కాన్ కి రెండు, మూడు గంటలు చాలు.”

మరో ఐదు గంటలు గడిచాక చెప్పారు అసలు విషయం. జెఫ్ కి తెలివి ఉంది, మాట్లాడ గలుగుతున్నాడు కానీ అనుమానించినట్టే బ్లడ్ క్లాట్ తలలోకి పాకింది. ఆ క్లాట్ పెద్దదై మిగతా మెదడు అంతా విస్తరించినా, మరో చోటకి వెళ్ళినా పక్షవాతం, కోమా, హెమొరేజ్ లాంటివి జరుగుతాయి. వెంఠనే బ్రెయిన్ సర్జరీకి హెన్రీ నోబుల్ అనే న్యూరో సర్జన్ ని పిలవాల్సి ఉంది. ఆయన ఉండేది అదృష్టవశాత్తూ దగ్గిరలోనే ఆస్టిన్, టెక్సాస్ లోనే. అయితే ఆయన ఆఫ్రికన్ అమెరికన్ అవడం వల్ల ప్రస్తుతం దేశంలో ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ అనే గొడవలు అవుతున్నాయి కనక వస్తారా రారా అనేది తెలియదు. ఆయనొక్కడే జెఫ్ ని రక్షించగలిగేది ప్రస్తుతానికి.

ఆఫ్రికన్ అనే మాట వినగానే జెఫ్ అడిగేడు కాస్త అసహనంగా, “మరెవరూ లేరా ఇక్కడ? అసలే 9/11 గొడవల తర్వాత ఈ ఆఫ్రికన్ లూ, ముస్లింలూ వీళ్ళందరికీ నా లాంటి తెల్లవాళ్ళంటే పడదు. సర్జరీ పేరుతో నన్ను కావాలని చంపేయవచ్చు, కేసు పెట్టడానిక్కూడా ఆస్కారం ఉండదు.”

“న్యూరోసర్జరీ చేయడానికి అమెరికన్ సర్జన్స్ లో ఉన్న టాప్ టెన్ లో ఒకడు హెన్రీ నోబుల్,” జెఫ్ మొహంలో అసహనం గుర్తుపెట్టుకుని చెప్పాడు, కుర్ర సర్జన్, “డాక్టర్లూ, సర్జన్లూ అయిన మేము మెడికల్ కాలేజీలో శపథం చేస్తాం డిగ్రీ చేతికిచ్చేముందు ఎప్పుడూ ప్రాణాలు కాపాడతాం అని. అసలు మీకు ఇటువంటి దారుణమైన ఊహ ఎలా వచ్చింది? డాక్టర్ హెన్రీ నోబుల్ వంటి స్పెషలిస్ట్ సర్జన్ అసలు ఈ పరిస్థితుల్లో అంత దూరం నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి సర్జరీ చేయడానికి ఒప్పుకోవడమే కష్టం. డాక్టర్ కీత్ బ్లాక్ అనే ఆయన దగ్గిర శిష్యరికం చేసాడు ఈ డాక్టర్ నోబుల్. వీళ్ల గురించి తెలిస్తే మీ నోటమ్మట అటువంటి మాట వచ్చి ఉండేది కాదు.”

జెఫ్ ఏదో అనబోతూంటే చేత్తో ఆయన్ని వారించి కూతురు చెప్పింది, “మా నాన్న అంతే, ఆయన్ని పట్టించుకోకండి. వెంఠనే సర్జరీకి ఏర్పాట్లు చేయగలరా?”

ఫోన్ చేసాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చిన హెన్రీ నోబుల్ సర్జరీ చేసాక బయటకి వచ్చి మొదట్లో జెఫ్ మోకాలికి సర్జరీ చేసిన రెసిడెంట్ కుర్ర సర్జన్ తో మాట్లాడాడు, ఈ జెఫ్ అనే పేషెంట్ కధాకమామీషు, వివరాలూ, తాను ఆఫ్రికన్ అంటే జెఫ్ మొహంలో చూపించిన అసహనం, అసలేమైంది అనేవన్నీ చాలా వివరంగా.

మొహంలో చెక్కు చెదరని నవ్వుతో మాట్లాడుతుంటే కుర్ర సర్జన్ మోకాలి సర్జరీలో తాను చేసిన తప్పు ఒప్పుకున్నాడు. అన్నీ చెప్పాక కుర్ర రెసిడెంట్ సర్జన్ భుజం తట్టి చెప్పాడు డాక్టర్ నోబుల్, “రెసిడెన్సీలో కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి, ప్రస్తుతానికి ఈయనకి ప్రాణాపాయం లేదు ఈ క్లాట్ వల్ల. కానీ విషయం అర్ధమైంది కదా, మనం చేసే అతి చిన్న తప్పే, ప్రాణం పోవడానికి కారణం కావచ్చు. అందుకే ఏ సర్జరీ అయినా సరే అతి జాగ్రత్త అవసరం. ముందు ముందు మరింత జాగ్రత్తగా ఉండండి. ఎక్కడెలా ఉన్నా, మెడిసిన్ లో, మానవ జీవితాన్ని కాపాడే మనం చేసే పనిలో మాత్రం అతి జాగ్రత్త పనికిరాకపోవడం అనేది వర్తించదు.”

******* ******* *******

జెఫ్ బాగా కోలుకున్నాక న్యూరో సర్జన్ హెన్రీ నోబుల్ వచ్చి ఓ సారి పేషెంట్ ని పలకరించబోయేడు. తన ఆరోగ్యం మీద అన్నీ మాట్లాడ్డం అయ్యాక జెఫ్ అన్నాడు కాస్త విచారంగా, “ఏమనుకోనంటే మీతో ఒకమాట చెప్పాలి. మీరు ఆఫ్రికన్ అమెరికన్ అంటే మీరు ఇటువంటి క్లిష్టమైన సర్జరీలు చేయలేరనీ, నాకు చావు ఎలాగా తప్పదనీ అనుకున్నాను, కానీ మీరు ఇంత తెలివైనవాళ్లనీ, మంచి సర్జన్ అనీ తెలియలేదు. నిజంగా నేను మీకు సారీ చెప్పాలి మీ ఆఫ్రికన్ ల గురించి నాకున్న ఆపోహ వల్ల.”

న్యూరో సర్జన్ హెన్రీ నోబుల్ చెప్పేడు, “మీకూ మాకూ అదే తేడా. మీకు మనుషులని చూస్తే కనిపించేది, మా వంటిమీద నల్లటి రంగూ, మీ వంటిమీద తెల్లని రంగూ మాత్రమే. మేము బానిసలమనీ ఏ పనీ చేతకాదనీ మీకు నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది ఎందువల్లో. డాక్టర్లమైన మాకు మనుషులని చూస్తే శరీరంలో కదిలే ప్రాణం, కళ్ళలో తొణికిసలాడే ప్రేమా, ప్రతీ అవయవానికి క్రమం తప్పకుండా ఆక్సిజన్ అందించే – ఏ మనిషిలోనైనా ఉండే ఒకే రంగుతో ఉండే - ఎర్రటి రక్తం మాత్రమే కనిపిస్తాయి. అందువల్ల మేము ఆ కళ్లలో తొణీకిసలాడే ప్రేమనీ, శరీరంలో ప్రాణాన్నీ కాపాడ్డం కోసం మా ప్రాణాలు అడ్డువేయడానికీ, రాత్రీ పగలూ అనకుండా సేవ చేయడానికీ ప్రయత్నం చేస్తాం. మీకు కనిపించేది శరీరం మీద తోలు, అది ఎంత తెల్లగా ఉందా అనే కామెర్లు కప్పేసిన మీ మనసూను. పచ్చకామెర్లు వచ్చినవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్టూ, అలాగే మీకున్న జబ్బు తెల్లకామెర్లు. మరో రంగు మనిషి బాగుపడినా, పైకి వస్తున్నా మీరు సహించలేరు. మీ తెల్లకామెర్లే మీకు ముఖ్యం. దానికోసం మీరు తుపాకులూ, కత్తులూ, కఠార్లూ వాడి ఇతర రంగులవారిని శారీరకంగా, మానసికంగా చంపుతూ అమితానందం పొందుతూ ఉంటారు….”

“అది కాదు డాక్టర్, నేను అలాటివాణ్ణి కాదు. రేసిస్ట్ ని అసలే కాదు, ఏమైందంటే…” ఏదో చెప్పబోయేడు జెఫ్.

జెఫ్ చెప్పేది మధ్యలో ఆపి సర్జన్ అన్నాడు, “ ‘నేను అసలు రేసిస్ట్ ని కాదు నేను మంచివాణ్ణే’ అనే మనిషి అందరికన్నా దరిద్రమైన రేసిస్ట్. మనసులో రేసిజం అనే ఊహ లేనినాడు, మాటల్లో అటువంటి పదాలు రావు. ఒకసారి ఇష్టం వచ్చినట్టూ అనేసి, ఆ తర్వాత ‘మాట జారింది, అసలు నేను రేసిస్ట్ ని కాదు’ అనేవాడు అందరికన్నా నీచుడు. మీ జీవితాలు అంతే. ప్రపంచం ఎప్పుడో ఓ రోజు మారుతుంది. ఏదో ఒక రోజుకి మనిషి అంటే వాడి వంటి మీద చర్మం రంగు కాదనీ, వాడి మనసులో ఉండే ప్రేమ అనీ గ్రహిస్తారు. ఇప్పటికీ మీరు ఏమీ సిగ్గులేకుండా చేసే పని ఏమిటో తెలుసా? మీ తెల్ల రంగు మీకే నచ్చదు. దాన్ని వేరే పసుపు రంగులోకీ, గోధుమ రంగులోకీ మార్చుకోవడానికి నానా తంటాలు పడుతూ ఎండలో కూర్చునీ, టానింగ్ అంటూ బ్యూటీ క్లినిక్ లకీ డబ్బులు ధారపోస్తూ ఉంటారు. కానీ వేరే రంగు మనిషి మీకు కనిపిస్తే వంటిమీద తేళ్ళూ జెర్రెలూ పాకుతున్నట్టూ మమ్మల్ని వెలివేయడానికి సిద్ధం. ఏమి జీవితం మీది? నేను భగవంతుణ్ణి నమ్ముకుని మీకు ప్రాణాపాయం లేకుండా సర్జరీ చేసాను. ఇప్పటివరకూ ఒక్కరి ప్రాణం తీయలేదు నేను. అయితే ఇప్పటికీ నేను చేయలేని పని ఒకటి ఉంది. అది మీవంటి వాళ్ల తెల్లకామెర్లు పోగొట్టలేకపోవడం. ఆ పని మీరు మాత్రమే చేయగలరు కానీ ఇందులో ఉన్న కష్టం ఏమిటంటే మీరెవరూ ఆఖరికి ప్రయత్నం కూడా చేయడం లేదు ఏ మందూ తగ్గించలేని ఆ జబ్బు కుదుర్చుకోవడానికి.”

జెఫ్ తలవంచుకుని ఏమీ మాట్లాడలేక కళ్ళు తుడుచుకుంటూంటే సర్జన్ దగ్గిరకి వచ్చి భుజం తట్టి చెప్పాడు, “ఏమీ బాధపడకండి, నాకు చేతనైంది నేను చేసాను. నా కోరిక ఒక్కటే. ఈ రేసిజం అనేదో దారుణమైన జబ్బు. దానికి మందు మీ చేతిలోనే ఉంది. అందువల్ల అది కుదుర్చుకోవడానికి మీకు చేతనైంది మీరు చేయండి. నేను శరీరానికి చికిత్స చేయగలను కానీ మనసులో ఉండే రేసిజానిక్కాదు. ఇంతకీ నన్ను మీరు గుర్తు పట్టారా?”

నోటమ్మట మాటరాని జెఫ్ ఆశ్చర్యంగా సర్జన్ కేసి చూసి లేదన్నట్టూ తల అడ్డంగా ఆడించాడు.

“ఒకప్పుడు శరణార్దిగా డాకర్, సెనెగల్ లో నా అప్లికేషన్ తిరగ్గొట్టేసి, నన్ను ఏనాటికీ అమెరికా వెళ్లనివ్వనని చెప్పిన ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ మీరే. నా లాంటి వాళ్లని ఎంతమందిని మీరు పైకి రానివ్వకుండా చేసారో? మీకు నేను గుర్తు లేకపోయినా ఒకప్పుడు నా జీవితంతో అతి హీనంగా ఆటాడుకున్న జెఫర్సన్ కె. ఆర్నాల్డ్ అనే మిమ్మల్ని, నాకు అమెరికా రావడానికి కాయితాలు ఇచ్చిన మరో శ్రీని వంగా అనే ఆయన్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేదు. అయితే విచిత్రం ఏమిటంటే తెలుపూ నలుపూ అయిన మన ఇద్దరం ఇలా మళ్ళీ కలవడానికి కారణం మాత్రం తెలుపూ నలుపూ కాని గోధుమరంగు ఇండియన్,” చిన్నగా నవ్వుతూ తెల్లకోటు సర్దుకుని వెళ్ళడానికి లేచాడు అమెరికా వచ్చాక పేషెంట్లకీ, హాస్పిటల్ వారికీ నోరు తిరగడం కోసం డాక్టర్ హెన్రీ నోబుల్ గా పిలవబడే ఒకప్పటి నల్ల ముస్లిం శరణార్ధి అల్ జుమైరా హన్రాసన్ అబ్దల్ మాసి నబియుల్లా.

(సమాప్తం)

Posted in June 2021, కథలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!