పంచతంత్రం కథలు
- దినవహి సత్యవతి
హంస – కాకి
అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద రావి చెట్టు. ఆ చెట్టు పైన ఒక హంస, కాకి నివసిస్తుండేవి. వాటి మధ్య ఎంతో స్నేహం ఉండేది.
కాకి ది అల్పబుధ్ధి. ఎప్పుడూ ఎదుటివారి గురించి చులకనగా మాట్లాడుతుండేది. కానీ హంస మాత్రం గొప్ప బుధ్ధిగలది. ప్రతి మాటా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడేది. పరోపకారానికి ఎప్పుడూ ముందే ఉండేది.
ఒకనాడు ఒక వేటగాడు బాగా అలిసిపోయి వచ్చి రావి చెట్టు క్రింద విశ్రమించాడు. వేసవి కాలం కావడాన బాగా ఎండగా ఉంది. గాలి అసలు వీచట్లేదు. దాంతో వేటగాడికి శరీరమంతా చెమటలు పట్టాయి.
అది చూసి జాలిపడి ఉపకార బుధ్ధి కలిగిన హంస తన విశాలమైన రెక్కలతో అతడికి గాలి వీచసాగింది.
ఆహారం కోసం వెళ్ళిన కాకి తిరిగి వచ్చి హంస చేస్తున్నపని చూసి ‘అదేమిటి మిత్రమా! ఏం చేస్తున్నావు? వాడు వేటగాడు. పశుపక్ష్యాదులని వేటాడి చంపడం వాడి వృత్తి. అటువంటి వాడికి సేవలు చేస్తున్నావా? ఎంత వెర్రిదానవు?’ ఎగతాళిగా అని పోతూ పోతూ వేటగాడి పై రెట్ట వేసి మరీ ఎగిరిపోయింది.
ఏదో మీద పడినట్లై వేటగాడికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి చూడగా అది ఒక పక్షి రెట్ట అని తెలిసింది. తలెత్తి పైకి చూసాడు. అక్కడ చెట్టుపై కూర్చుని హంస కనిపించింది. అదే తన పై రెట్ట వేసిందనుకున్నవేటగాడికి హంస పై విపరీతమైన కోపం వచ్చింది.
తనకి నిద్రా భంగం కలిగించినందుకు హంసపై బాణం సంధించాడు వేటగాడు. బాణం దెబ్బకి బాధతో గిలగిలా తన్నుకుని హంస నేలకూలింది.