Menu Close
గోవింద గీత
-- గుదిమళ్ళ వాత్సల్య --

సమయం ఉదయం పదిన్నర కావొస్తోంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భార్యకి కూరలు తరిగి ఇస్తున్న గోవిందరావు గారు సెల్‌ఫోను మ్రోగడంతో ఫోను చేతిలోకి తీసుకున్నారు. పరిచయం ఉన్న నంబర్ కాకపోవడంతో, ప్రొద్దున్నే తయారయ్యారు ఈ మార్కెటింగు వాళ్ళు అని విసుక్కుంటూనే "హలో" అన్నారు.

"గోవిందం మాస్టారేనా మాట్లాడేది?" అని అడిగింది అవతలి గొంతు.

"పార్ధూ..." అన్నారు ఆయన ఆ గొంతు వినగానే సంభ్రమాశ్చార్యలతో.

"గోవిందం మాస్టారు నన్ను ఇంకా గుర్తు పెట్టుకున్నారు, అది చాలు నాకు" అన్నాడు పార్ధు అవతలి నుండి.

"మన జిల్లాకి కలెక్టరుగా నాకు ఆర్డర్లు వచ్చాయి గోవిందం మాస్టారూ. రేపే జాయిన్ అవ్వాలి, ఆఫీసుకి వెళ్ళే ముందు ఒకసారి మీ ఆశీర్వాదం తీసుకుని వెళ్తాను, సాయంత్రం వచ్చి మిమ్మల్ని కలవచ్చా?" అని వినమ్రంగా అడిగాడు.

"ఎప్పుడైనా రావచ్చు పార్ధూ..కానీ నేను ఇప్పుడు పాత ఇంట్లో ఉండట్లేదు.." అని ఇంకా ఆయన చెప్పబోతుండగానే, పార్ధూ అందుకుని,

"నాకు తెలుసు మాస్టారూ, ఆ ఇంటిని స్కూలుకి రాసిచ్చి రామాలయం ప్రక్క సందులో రెండు గదులు వేసుకుని ఉంటున్నారు. ఆరింటికల్లా మీ ముందు ఉంటాను" అనగానే ఆశ్చర్యపోయారు గోవిందరావు గారు.

ఫోను పెట్టేసి పార్ధూ వస్తున్న విషయాన్ని వరలక్ష్మి గారికి చెప్పాలని "ఏమోయ్..సాయంత్రం ఎవరు వస్తున్నారో తెలుసా?" అని ఆనందంగా కేకపెట్టారు.

"ఇదేమీ లంకంత ఇల్లు కాదు ఆ మూల మాట్లాడినది ఈ మూల వినపడకపోవడానికి. మీ మాటలు వింటూనే ఉన్నాను. త్వరగా కూరలు తరిగి ఇస్తే వంట పూర్తి చేసి వాడి కోసం చేగోడీలు చేస్తాను" అందావిడ నవ్వుతూ.

భోజనం చేసి నడుము వాల్చగానే గోవిందరావు గారి మనసు గతంలోకి జారుకుంది.

%%%%

స్కూలుకి తయారవుతున్న గోవిందరావుగారి కోసం మేస్త్రీ రాజయ్య వచ్చాడని కొడుకు చెప్పగానే బయటకొచ్చి "రాజయ్యా బాగున్నావా! నీ డబ్బుల విషయం హెడ్మాస్టారికి చెప్పాను. రేపో ఎల్లుండో స్కూలుకి వచ్చి తీసుకెళ్ళు" అని చెప్పి లోపలకి వెళ్లబోయి రాజయ్య ఏదో చెప్పడానికి సందేహిస్తున్నాడని చూసి "ఏమిటి రాజయ్యా?" అన్నారు నవ్వుతూ.

"బాబూ..మా రెండో వాడు నా పని నేర్చుకోమంటే నేర్చుకోనంటున్నాడండీ. వాడు చదువుకుంటాడుట. ఆ ఫీజులు నేను కట్టలేను అంటే వినట్లేదు. వాడిని సాయంత్రం మీ దగ్గరకి తీసుకొస్తాను, వాడికి అర్ధమయ్యేటట్లు చెప్పండి కాస్త" అన్నాడు వినయంగా.

సాయంత్రం అరుగు మీద పిల్లలకి ట్యూషన్ చెప్తున్న గోవిందరావు గారికి ఎదురుగా రాజయ్య కొడుకుతో నిలబడి ఉండటం చూసి కొడుకుని వదిలి వెళ్ళమని సైగ చేసి ట్యూషన్ పిల్లలు వెళ్ళాకా పిల్లవాడిని దగ్గరకి రమ్మని పిలిచారు. వాడికి దాదాపు పన్నెండేళ్ళుంటాయి.

బట్టలు అవీ మురికిగా ఉన్నా కానీ చదువుకోబోతున్నానన్న సంతోషముతో మెరుస్తున్న వాడి కళ్ళు ఆయన దృష్టి దాటిపోలేదు.

"నీ పేరు ఏమిటి?" అని అడిగారాయన మృదువుగా.

"నా పేరు పార్ధ సారధి గోవిందం మాస్టారూ, పార్ధు అని పిలవండి చాలు" అన్నాడు ఉత్సాహంగా.

"చదువుకుంటావా?" అని అడిగారు పిల్లవాడిని గమనిస్తూ.

"బాగా చదువుకుంటానండీ, మీరు పిల్లలకి ఇందాకా చెప్పిన పూర్ణ సంఖ్యల గుణకార, భాగాహారాలు కూడా నేర్చేసుకున్నానండీ. నన్ను వీళ్ళందరితో పాటు రేపటి నుండి ఏడో తరగతిలో కూర్చోబెడతారా?" అడిగాడు ఆ కుర్రాడుఆశగా.

గోవిందరావు గారు వాడి ఆతృత చూసి నవ్వి "సరే, రేపటి నుండి నువ్వు ఏడో తరగతిలో కూర్చుందువుగాని, నేను హెడ్మాస్టారు గారికి చెప్తాలే. అయితే నీకు పాఠాలు వంటబట్టకపోతే మాత్రం ఆరో తరగతిలోనో ఐదో తరగతిలోనో వెయ్యాల్సి ఉంటుంది. ఇంకా చదవకపోతే మీ నాన్న చెప్పినట్లు వినాలి మరి" అనగానే

"మీరే చూద్దురుగాని ఎలా చదువుకుంటానో గోవిందం మాస్టారూ, కానీ..నాకు కొంచెం ఇంగ్లీషు అంటే భయం. నాకు నేర్పిస్తారా?" అని బేలగా అడుగుతున్న ఆ కుర్రాడిని చూసి ముచ్చటేసింది ఆయనకి.

"అన్నీ నేర్పిస్తాను కానీ నువ్వు మాత్రం కష్టపడాలి" అని ఆ పిల్లవాడికి చెప్పి రాజయ్య రాగానే పిల్లవాడిని చదువుకోనివ్వమనీ, ప్రభుత్వ పాఠశాలే కాబట్టి ఫీజు గురించి బెంగ పెట్టుకోక్కర్లేదని భరోసా ఇచ్చారు.

"మాస్టారూ..రేప్రొద్దున్న కాలేజీకి వెడితే?..."

"అవన్నీ నేను చూసుకుంటాను" అని గోవిందరావుగారు అనడంతో ఆయన మీద గౌరవం కొద్దీ రాజయ్య ఇంక ఏమీ మాట్లాడలేదు.

ప్రొద్దున్న స్కూల్లో పాఠాలు వినడం, సాయంత్రం ట్యూషన్ పిల్లలతో పాటు కూర్చుని శ్రద్ధగా ఇంగ్లీషు, ఇతర సబ్జెక్టులు నేర్చుకోవడం, వరలక్ష్మి గారికి ఇంటి పనుల్లో వద్దంటున్నా సాయపడటం, గోవిందరావు గారి ఇద్దరు కొడుకులని అన్నయ్యా అంటూ వాళ్ళతో ఆడుకోవడం, "గోవిందం మాస్టారూ" అంటూ గోవిందరావు గారి చుట్టూ తిరగడం పార్ధూ దినచర్య అయిపోయింది.

అందరూ మాస్టారూ అంటుంటే పార్ధూ ఒక్కడే మాత్రం "గోవిందం మాస్టారు" అంటుంటే వీడికి ఈ "గోవింద" సహస్రం పిచ్చి ఏమిటో అని వరలక్ష్మి గారు నవ్వుతూ విసుక్కునేది.

జిల్లాలో మారుమూల ఉన్న ఆ గ్రామానికి ఉపాధ్యాయులెవ్వరూ వచ్చేవారు కాదు. వచ్చినా శలవు పెట్టి వెళ్ళిపోయి నానా కష్టాలూ పడి ట్రాన్స్ఫర్ చేయించుకునేవారే తప్ప గోవిందరావు గారిలా ఆ ఊళ్ళోనే ఉండి పిల్లలకి శ్రద్ధగా పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులెవ్వరూ లేకపోవడంతో ఈయన వచ్చాకే మొట్టమొదటిసారి ఆ ఊరిలో పిల్లలు పదో తరగతి పాసయ్యారు.

పార్ధూ అనతికాలంలోనే చదువులో చురుకుగా తయారయ్యాడు. పదో తరగతిలో జిల్లాలోనే ప్రధముడిగా నిలవడముతో మొట్టమొదటి సారి ఈ ఊరు గురించీ, గోవిందరావు మాస్టారి గురించీ జిల్లా అంతటా తెలిసింది.

గోవిందరావు గారికి విద్యాశాఖాధికారులు సన్మానం చెయ్యబోతే ఆయన సున్నితముగా తిరస్కరించి, తన కర్తవ్యం తాను చేసినందుకు సన్మానం అక్కర్లేదనీ, పార్ధూకి ఏదైనా కాలేజీలో ఉచితంగా సీటు ఇప్పిస్తే తనని సన్మానించినట్లేనని జిల్లా విద్యాశాఖాధికారికి విన్నవించారు.

అలా పార్ధూకి టవునులో ఉచితముగా జూనియర్ కాలేజీలో సీటు దొరకడముతో రాజయ్య కూడా ఏమీ అడ్డు చెప్పలేదు. ఇంటర్మీడియట్ కూడా మంచి మార్కులతో పాసయ్యి ఎంసెట్ రాసి ఇంటికొచ్చిన పార్ధూని చూసి ఎంతో సంతోషించారు గోవిందరావు గారు.

ఒకరోజు సాయంత్రం గోవిందరావు గారు బజారుకెళ్ళి వస్తుంటే రాజయ్య కనిపించి, పార్ధూ కంప్యూటరు ఇంజనీరింగు చదువుతానంటున్నాడనీ, సీటు ఉచితముగా వచ్చినా, పుస్తకాలు ఇతర ఖర్చులూ తాను భరించలేననీ వాడు చదివినది ఇక చాలని, పార్ధూ మనసు మార్చమని ప్రాధేయపడ్డాడు.

"రాజయ్యా, వాడి పై చదువు కూడా కాణీ ఖర్చు లేకుండా చదవగలిగితే నీకు సమ్మతమేగా?" అని అడిగారు.

"మాస్టారూ,అది ఎలా సాధ్యమండీ. కనీసం వాడికి కంప్యూటరు కొనాలన్నా డబ్బులు కావాలి కదా. నాకేమో ఈ మధ్య పని అంతంత మాత్రం దొరుకుతోంది. అందరం పట్టణం వెళ్ళిపోదామనుకుంటున్నాము, వాడు కూడా వస్తే ఏదో ఒక పని చేసుకుంటాము" అన్నాడు రాజయ్య.

"నేను వాడితో మాట్లాడతాలే రాజయ్యా" అని చెప్పి ఒక ఆదివారం పార్ధూతో కలిసి ఊరి చివర చెరువు గట్టున కూర్చున్నారు.

"పార్ధూ! కంప్యూటరు ఇంజనీరింగు ఎందుకు చదవాలనుకుంటున్నావు?" అని పార్ధూ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగారాయన.

"నేనూ అన్నయ్యల్లాగ అమెరికా వెళ్ళి బోలెడు డబ్బు సంపాదిస్తా గోవిందం మాస్టారూ" అన్నాడు ఉత్సాహం ఉరకలేసే ఆ టీనేజి కుర్రాడు.

"డబ్బు సంపాదిస్తే?" తిరిగి ప్రశ్నించారాయన.

"ధనం మూలం ఇదం జగత్ కదండీ, డబ్బుంటే మనకి దొరకనిది ఏముంటుంది?" అన్నాడు పార్ధు మాస్టారి వంక ఆశ్చర్యంగా చూస్తూ.

"డబ్బుంటే తృప్తి దొరుకుతుందా?" మరొక ప్రశ్న గోవిందరావు గారి నోటి నుండి దూసుకొచ్చింది.

"మనకి కావాల్సినవన్నీ దొరికితే తృప్తి అదే వస్తుంది కదా గోవిందం మాస్టారూ, కాదంటారా?" అన్నాడు పార్ధు మొహంలో సందేహం తొణికిసలాడుతుండగా.

“డబ్బు సంపాదించాలంటే కంప్యూటరు ఇంజనీరింగే చదవక్కర్లేదు. తృప్తి దొరకాలంటే ఆ మెరకకి పరిగెత్తక్కర్లేదోయ్” అన్నారు గోవిందరావు గారు పార్ధూ భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి.

పార్ధూ కి ఏమీ అర్ధం కావట్లేదు. గోవిందరావుగారు చెప్పడం మొదలుపెట్టారు.

"కంప్యూటరు ఇంజనీరింగు చదవడం, విదేశాలకి వెళ్ళడం ఏ మాత్రం తప్పు కాదు పార్ధూ కానీ డబ్బు సంపాదించాలంటే మాత్రం అదొక్కటే మార్గం కాదు, అదే జీవితాశయం కాకూడదు అని నా ఉద్దేశ్యం.

మనకి ఇతర జీవులకీ ఉన్న తేడా ఏమిటంటే, మనిషికి "బుద్ధి" అనే పరమోత్కృష్టమైన వరం ఉంది. జంతువులని చూడు, అవి వాటి మందలో దేనికి చిన్న కష్టం వచ్చినా అన్నీ కలిసి ఆదుకుంటాయి. అలాంటిది బుద్ధి, ఆలోచించగలిగే జ్ఞ్ఞానం ఉన్న మనం మాత్రం ప్రక్కవాడు ఏమైపోతే ఏమిటి, నేను,నా కుటుంబ మనుగడే ముఖ్యం అని పరిగెడుతూ, సంఘములో డబ్బుతో వచ్చేదే అసలైన గుర్తింపు అనుకుంటున్నాము.

కానీ మనిషిగా పుట్టినందుకు ఏరోజయితే అవసరములో ఉన్నవాడికి సాయం చెయ్యమో, ఆరోజు మనం బ్రతికి ఉన్నా కానీ  ప్రేతం క్రిందే లెక్క. సాయం చెయ్యడానికి పెద్ద పెద్ద పనులే చెయ్యక్కర్లేదు, నీ ఇంటి ప్రక్కన మామ్మగారు నీళ్ళు తెచ్చుకోలేకపోతే ఎదురుగుండా వీధి కుళాయిలోంచి నీరు తెచ్చివ్వడం కూడా సాయమే.

కానీ మన చేతిలో అధికారం ఉంటే అవసరములో ఉన్న వారికి సాయాన్ని త్వరితగతిన మరియూ ఎక్కువమందికి అందించవచ్చు. నీకు అర్ధమయ్యేటట్టు చెప్పాలంటే చేతిలో అధికారం ఉంటే "కవరేజ్" ఎక్కువ ఉండి అది ఎక్కువ మందికి చేరుతుందన్నమాట.

నువ్వు కంప్యూటరు ఇంజనీరయితే కేవలం నీకూ, నీ కుటుంబానికే లాభం. మహా అయితే కొంత డబ్బు దానం చెయ్యగలవు. కానీ జిల్లాలో అభివృధ్హి కార్యకలాపాలన్నింటినీ పర్యవేక్షించే అధికారం నీ చేతిలో ఉంటే? అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో భాగస్వామి అయితే ఎలా ఉంటుందో ఆలోచించు" అన్నారాయన.

పార్ధూకి కొంచెం కొంచెం అర్ధమవ్వసాగింది. వాడి మొహంలో సందేహాన్ని కనిపెట్టి చిన్నగా నవ్వారు గోవిందరావుగారు.

“ఈ నీతులు నా పిల్లలకి చెప్పలేదు అనుకోకు. వాళ్ళకీ చెప్పాను కానీ వారు వారికి నచ్చిన మార్గం ఎంచుకున్నారు. నువ్వు కూడా కంప్యూటరు ఇంజనీరింగే చదవాలి అనుకుంటే ఉపకార వేతనానికి దరఖాస్తు చేద్దాము లేదా ఎవరైనా దాతలని సంప్రదిస్తే నీ మార్కులు చూసి నీకు సహాయపడకపోరు కానీ సమాజానికి నువ్వు ఏదైనా చేసినప్పుడు కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను, ఇక నీ ఇష్టం,ఆలోచించుకో" అని ఆగారు గోవిందరావు గారు.

ఇద్దరి మధ్యా నిశ్శబ్దం. కాసేపటికి పార్ధూ,

"గోవిందం మాస్టారూ, అర్ధమయ్యింది. మీరు చెప్పేది జిల్లా కలెక్టరు అవ్వమనే కదా? కలెక్టరు అవ్వాలంటే ఏమి చదవాలి?" అని అడిగాడు.

"కలెక్టరవ్వాలంటే మూడంచెల్లో ఉండే సివిల్ సర్వీసెస్ పరీక్ష పాసవ్వాలి పార్ధూ. ముందు నువ్వు మన ప్రక్కన టవునులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరితే ఫీజు బహు తక్కువ కాబట్టి మీ నాన్నకి భారం కాదు. డిగ్రీ చదువుతూనే సివిల్ సర్వీసెస్ పరీక్షకి సన్నద్ధం అవుదువుగాని. దానిలో వచ్చే మార్కులని బట్టి జిల్లా పరిపాలన, పోలీసు, రెవెన్యూ ఇలా రకరకాల్ల విభాగాల్లో పనిచేయవచ్చు" అని చెప్పారాయన.

“ఆ పరీక్షకి కోచింగుకి మళ్ళీ వేలల్లో ఖర్చేమో కదండీ” అని అడిగాడు దిగులుగా పార్ధూ.

అన్నయ్యల పాత కంప్యూటరు ఒకటి ఇంట్లో ఉంది. అది ఉపయోగించుకుని ఇంటర్నెట్ ద్వారా సన్నద్ధమవుదుగాని అని ఆయన చెప్పేసరికి వాడికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.

ఇక అప్పటినుండీ కలెక్టరు అవ్వడమే లక్ష్యంగా రాత్రింబవళ్ళు శ్రమించాడు పార్ధు. పేద పిల్లలకి ట్యూషన్లు చెప్తే వారికి ఉపయోగకరముగా ఉండటముతో పాటు తన సబ్జెక్టు కూడా మెరుగుపడుతుంది అన్న మాస్టారి సూచన అనుసరించి తన సబ్జెక్టుల మీద పట్టు సాధించాడు.

స్వతాహాగా తెలివైనవాడవడంతో డిగ్రీ పూర్తవ్వగానే సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు మొదటి ప్రయత్నంలోనే గట్టెక్కాడు.

ఇంటర్వ్యూ సమయానికి గోవిందరావు గారు తన స్నేహితుడితో మాట్లాడి క్రితం సంవత్సరం ఐఎఎస్ సాధించిన ఆయన కొడుకు ద్వారా పార్ధూకి ఇంటర్వ్యూ మీద అవగాహన ఏర్పడేటట్లు చేశారు.

ఇంటర్వ్యూ ఫలితాలు వచ్చే ముందు రాజయ్య కుటుంబముతో సహా పట్టణానికి వలస వెళ్ళడముతో ఎవరి ద్వారానో పార్ధూ ఎంపికయ్యాడు అని తెలిసింది తప్ప మరే ఇతర వివరాలూ తెలియలేదాయనకి.

గోవిందరావు గారు రిటైర్ అయినా కూడా ఆ ఊళ్ళోనే ఉంటూ తాను పేద పిల్లలకి ఉచితంగా చెప్పే ట్యూషన్లని నిరాఘాటంగా సాగిస్తూనే ఉన్నారు.

%%%%

సాయంత్రం గేటు తీసుకుని లోపలికొస్తున్న పార్ధూని చూడగానే నోట మాట రాలేదాయనకి. ఒకరినొకరు కౌగిలించుకుని కళ్ళు వర్షిస్తుండగా గొంతు గాద్గతమవ్వడముతో మాట పెగల్లేదు ఇద్దరికీ.

“కలెక్టరు గారికి కేవలం ఆనందభాష్పాలతో అభిషేకమేనా, లేకా కాస్త ఎంగిలి పడనిస్తారా” అంటూ ప్లేటు నిండా చేగోడీలతో వచ్చిన వరలక్ష్మి గారి మాట విని ఇద్దరూ కళ్ళు తుడుచుకున్నారు. వరలక్ష్మి గారి పాదాలకి వంగి నమస్కరించాడు పార్ధు.

"గోవిందం మాస్టారూ" అంటూ ఆయన వెనక వెనకే తిరిగేవాడివి. కలెక్టరయ్యాకా కనీసం ఫోను చేసి చెప్పడానికి కూడా తీరికలేకపోయిందా అని నిష్టూరమాడిందావిడ.

"నువ్వూరుకో లక్ష్మీ! వాడు పాపం ఎంత బిజీగా ఉండి ఉంటాడో కోచింగు, ట్రైనింగులతో" అని ఆవిడతో అని పార్ధూ వైపు తిరిగి "చెప్పు పార్ధూ, ఏమిటి విశేషాలు" అని అడిగారాయన.

"గోవిందం మాస్టారూ! అమ్మ అన్నది నిజమే. నేను మీకు కనీసం ఫోను కూడా చేసి చెప్పలేదు. నేను కలెక్టరయ్యాకే వచ్చి మీ ముందు నిలబడాలని ఫోనులోనైనా కూడా మీతో  మాట్లాడలేదు. కానీ మీ సమాచారం మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను.

మా ట్రైనింగులో భాగంగా మౌలిక వసతుల లేమి మీద అవగాహన కోసం నన్ను మరికొంత మందిని మన జిల్లాకే అధ్యయనం కోసం పంపించారు. నా చిన్నప్పటి నుండీ ఇప్పటి వరకూ మన జిల్లాలో పల్లెలు ఏమీ అభివృద్ధి చెందలేదు. ఉపాధ్యాయుల కొరత విద్యార్ధులని ఇంకా వేధిస్తోంది. ఎవ్వరూ ఈ పల్లెల్లో పని చెయ్యకపోవడానికి ఇష్టపడకపోవడమే ఒక కారణం. కానీ అందరికీ నాకు దొరికినట్లు గోవిందం మాస్టారు దొరికే అదృష్టం ఉండదు కదా అందుకే ఇలాంటి పల్లెల కోసం ఆయా ఊర్లలో విద్యార్ధుల సంఖ్యని బట్టి పంచాయితీ కేంద్రాల్లో లేదా పాఠశాలల్లోనే కంప్యూటర్లు, టీవీలూ ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా ఉపాధ్యాయులు బోధన సాగించేటట్లు "ఆన్లైన్ గురు" అని ఒక కార్యక్రమాన్ని రూపొందించాము. ఏమైనా టెక్నికల్ సమస్యలు వస్తే పరిష్కరించడానికి ఐటీఐల్లో శిక్షణ పొందిన విద్యార్ధులని టెక్నీషియన్లుగా నియమిస్తాము. దీనివల్ల సొంత ఊరిలోనే వారికి ఉపాధి దొరుకుతుంది.

దీనిని ప్రయోగాత్మకముగా మొదట మన జిల్లాలో అమలుపరుస్తున్నాము. దానికి గౌరవ సలహాదారుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీ గోవింద రావు గారిని నియమించడానికి మన ముఖ్యమంత్రి గారు సంతకం చేసిన ఆర్డర్ ఇదిగో అని చేతిలో ఉన్న ఫైల్లోంచి కాగితాన్ని తీసి మాస్టారి చేతిలో పెట్టి, మీరు ఒక్కసారి జిల్లా కేంద్రానికి వచ్చి అధికారులని కలిస్తే చాలు, ఆ తరువాత నుండీ మీరు మన ఊరి నుండే పని చెయ్యవచ్చు” అన్నాడు పార్ధు.

తాను నాటిన చిన్న విత్తు, పెద్ద వృక్షమై సమాజ శ్రేయస్సుకోసం ఉత్సాహంతో ఉరకలెయ్యడాన్ని చూసి ఎంతో సంతోషించారు గోవిందరావు గారు.

"పార్ధూ! నిన్ను ఎలా అభినందించాలో తెలియట్లేదురా, ఎంత ఎదిగిపోయావు." అన్నారాయన ఆప్యాయంగా.

"ఇది మీరు పెట్టిన భిక్షే గోవిందం మాస్టారూ, మీరు ఆ రోజు చెరువు గట్టు దగ్గర పరోపకారం చెయ్యని రోజున మనం బ్రతికీ చచ్చినవాడితో సమానం అని చెప్పిన మాట నా ఆలోచనల దశ, దిశ మార్చింది. రణరంగములో పార్ధుడికి భగవద్గీత ఉపదేశం చేసి కర్తవ్యం బోధించిన పరమాత్మలా మీరు చెప్పిన ఆ మాటలు నాకు "గోవింద గీత" అయి నా కర్తవ్యాన్ని నాకు స్పష్టంగా బోధపరిచాయి. ఉత్సాహం, పట్టుదల ఉన్న యువత చదువు కేవలం పేదరికం వల్ల ఆగిపోకూడదని ప్రతీ ఆదివారం నేను డిగ్రీ విద్యార్ధులకి ఉచితముగా క్లాసులు తీసుకుంటున్నాను. నా ట్రైనింగులో వీలు దొరికినప్పుడల్లా వీడియో పాఠాలు రూపొందించి యూట్యూబులో అప్లోడ్ చేశాను. దీని వల్ల కనీసం ఒక్క విద్యార్ధి లాభపడినా నా కర్తవ్యం నేను నెరవేర్చినట్లే” అంటున్న పార్ధూని చూస్తే, మురికి బట్టలతో, కళ్ళల్లో మెరుపుతో తన ముందు నిలబడ్డ పన్నెండేళ్ళ పార్ధు గుర్తుకు వచ్చి సంభ్రమాశ్చర్యాలతో కలెక్టర్ పార్ధ సారధిని చూస్తుండిపోయారు గోవిందరావుగారు.

(సమాప్తం)

Posted in October 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!